October 16, 2024
SGSTV NEWS
Spiritualsripada charitamrutam

sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -13

              అధ్యాయము 13

           ఆనందశర్మ వృత్తాంతము

నేను సుబ్బయ్యశ్రేష్ఠి నుండి అనుమతి తీసుకొని కురువపురం దిశగా ప్రయాణమును సాగించితిని. రాత్రి సమయమునకొక గ్రామమును చేరుకొంటిని. మాధూకరమునకు ఎవరింటికి పోవలెనాయని ఆలోచించు చుంటిని. తన వీధి అరుగు మీద సుఖాసీనుడయి ప్రక్కనున్న వారితో సంభాషణ చేయుచున్న బ్రాహ్మణుని చూచితిని. అతని కన్నులు తేజస్వంతములైయుండెను. కనులనిండుగా కరుణారసము చిప్పిలుచుండెను. అతడు నన్ను సాదరముగా లోనికి ఆహ్వానించి భోజనమిడెను. భోజనానంతరము అతడు యిట్లు చెప్పనారంభించెను. “నాయనా! నన్ను ఆనందశర్మ అని అందురు. నేను గాయత్రీ మంత్రమును అనుష్టించుచుందును. గాయత్రిమాత కొలదిసేపటి ముందు నా అంతర్నేత్రమునకు గోచరించి, దత్తభక్తుడొకడు వచ్చుచున్నాడు, అతనికి కడుపారా భోజనమిడుము. దత్తప్రభువును దర్శించినంత నీకు పుణ్యము లభించును అని చెప్పినది. ఆమె చెప్పిన ప్రకారమే జరిగినది. కడున్గాడు సంతసము.”


అంతట నేనిట్లంటిని. “అయ్యా! నేను దత్తభక్తుడనే! దత్తప్రభువుల వారు ప్రస్తుతము భూలోకములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో వ్యవహరించుచున్నారని విని వారి దర్శనార్థము కురువపురమునకు పోవుచుంటిని. నా పేరు శంకరభట్టు. నేను కర్ణాటక బ్రాహ్మణుడను.”

కణ్వమహర్షి ఆశ్రమ వివరణ

నా మాటలను విని ఆనందశర్మ నవ్వుకొనెను. “అయ్యా! మా నాయన నాకు ఉపనయనము చేయు సమయమున మా యింటికి అవధూత ఒకరు వచ్చిరి. మా యింటివారు అతనికి సకల పరిచర్యలను చేసిరి. అతడు గాయత్రి మంత్రానుష్ఠానమునకు సంబంధించిన అనేక విషయములను తెలియజేసెను. బృహత్ శిలకోన(పెంచలకోన)లో గల నృసింహదేవుని దర్శించమని ఆదేశించెను. మా నాయన నన్ను పెంచలకోనకు తీసుకొనిపోయెను. అచ్చట నృసింహ దేవుని దర్శనానంతరము తలవని తలంపుగా మా నాయన ధ్యానస్థుడయ్యెను. ఆ ధ్యానము రేయింబవలు సాగెను. నాకు భయము వేసినది. ఆకలి వేసినది. ఎవరో ఆగంతకుడు నాకు భోజనమిడెను.



నన్ను తీసుకొని దుర్గమములైన అడవి దారివెంట కొండ గుహల లోనికి తీసుకొనిపోయెను. తరువాత అతడు అంతర్హితుడయ్యెను. ఆ గుహలో ఒకానొక వృద్ధ తపస్విని చూచితిని. అతని కన్నులు ప్రచండ అగ్ని గోళములవలె నుండెను. అతడు 101 మంది ఋషులచే సేవింపబడుచుండెను. ఆ వృద్ధ తపస్వి తాను స్వయముగా కణ్వమహర్షిననియూ, యిది తన తపోభూమి అనియూ, తన శిష్యులందరునూ యువకులుగా కన్పించిననూ, అనేక వేల సంవత్సరముల వయస్సు కలవారనియూ, అవధూతరూపమున శ్రీదత్తప్రభువు దర్శనమువలన మహా పుణ్యము పొందిన కారణమున యీ తపోభూమికి రాగలుగుట సంభవించెననియూ తెలిపెను. నాకు సంభ్రమాశ్చర్యములు కలిగి నోటమాట రాదాయెను. శరీరము వణుకుచుండెను. అంతట కణ్వయోగీంద్రులిట్లనిరి. ప్రస్తుతము దత్తప్రభువులు పీఠికాపురమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున నున్నారు. మమ్ములను దయతో కనిపెట్టి చూడవలసినదని ప్రభువునకు మా విన్నపముగా తెలియజేయుము. నీకు శీఘ్రముగా శ్రీపాద శ్రీవల్లభ పాదుకా దర్శనము కలుగును గాక! అని, ఆశీర్వదించి నా శిరస్సుపై తమ దివ్యహస్తమునుంచిరి. నేను క్షణ కాలములో మా నాయన వద్ద నుంటిని. మా నాయన ప్రకృతిస్థుడైన తదుపరి మేమిర్వురమునూ మా స్వగ్రామమునకు విచ్చేసితిమి. నాకు కణ్వమహర్షి ఆశ్రమములో కలిగిన అనుభవమునూ, దత్తప్రభువు యొక్క నవావతారము పీఠికాపురములో ఉన్నదనెడి విషయమునూ మా నాయనకు కూడా తెలియజేయలేదు.

రాజమహేంద్రవరము దగ్గర పట్టసాచల పుణ్యక్షేత్రము

కాలము గడచుచుండెను. కణ్వమహర్షి ఆశీర్వాద ప్రభావము వలన నాకు ధ్యానములో తరచు పాదుకా దర్శనము అగుచుండెను. ఒక పర్యాయము మా యింటికి కొందరు బంధువులు వచ్చిరి. వారికి పుణ్య నదులందు స్నానములాచరించి పుణ్యక్షేత్రములు సందర్శింప అభిలాష కలిగెను. వారు మా నాయనను కూడా తమతో రమ్మనిరి. అప్పటికి నా వయస్సు పది సంవత్సరములు. మా నాయనకు నా యందు ప్రీతి మెండు. తనతో నన్ను కూడా రమ్మనెను. నేను వల్లెయంటిని. రాణ్మహేంద్రవరము గోదావరీనది యోడ్డున గల పట్టణము. మహాపుణ్యక్షేత్రము. రాణ్మహేంద్రవరమునకు ఉత్తర దిశలో నుండిన కొండలమీద ఋషులు కొందరు తపస్సు చేసుకొనువారు. తూర్పుదిశలో నుండిన కొండలమీద మరికొంతమంది ఋషులు తపస్సు చేసుకొనువారు. రాణ్మహేంద్రవరమునకు ఆనతి దూరముననున్న పట్టసాచల పుణ్యక్షేత్రము గోదావరీనదీ మధ్యస్థమై యున్నది. మహాశివరాత్రికి ఈ ఋషీశ్వరులలో కొంతమంది పట్టసాచలములోను, మరికొంతమంది ఋషీశ్వరులు రాణ్మహేంద్రవరమునందలి కోటిలింగక్షేత్రము నందును వేదస్వస్తి చెప్పువారు. ఈ ఋషీశ్వరులు పరస్పరము మధ్యేమార్గముగా తూర్పు నుండి వచ్చువారు, పశ్చిమము నుండి వచ్చువారు, ఉత్తరము నుండి వచ్చువారు, దక్షిణమునుండి వచ్చువారు “ఎదురులపల్లి” యను గ్రామమున కలుసుకొనువారు. ఈ ఎదురులపల్లి గ్రామమునకు అత్యంత సామీప్యమైయున్న మునికూడలి గ్రామమున విశ్రమించి పరస్పరము చర్చలు చేసుకొనువారు. నా అదృష్టవశమున మా నాయనతో కలిసి నేను మునికూడలి గ్రామమును దర్శించగలిగితిని. ఇది అంతయును శ్రీదత్త ప్రభువుల లీల.



కలియుగములో శ్రీదత్తాత్రేయుల వారి ప్రప్రథమ అవతరణ శ్రీపాద శ్రీవల్లభులు

అత్యంత గహనములయిన వేదాంత విషయములు, యోగశాస్త్ర రహస్యములు, జ్యోతిశ్శాస్త్ర విషయములు చర్చకు వచ్చినవి. ఈ చర్చలలో పాల్గొన్న మహామునులందరునూ ముక్తకంఠముతో శ్రీదత్త ప్రభువుల వారు శ్రీపాద శ్రీవల్లభ నామమున పీఠికాపురములో అవతరించియున్నరనియూ, కలియుగములో వారిది ప్రప్రథమ సంపూర్ణ దత్తవతారమనియూ చెప్పిరి. భౌతికముగా వారి దర్శనము పొందుటకు వీలులేని వారు ధ్యాన ప్రక్రియల వలన తమ తమ హృదయములలోనే దర్శించగలరనియూ, యీ అవతారము అత్యంత శాంతమయ, కరుణారస పరిపూర్ణము అనియూ చెప్పిరి.అంతట మా నాయన నన్ను పీఠికాపురమునకు తీసుకొని వెళ్ళినారు. మాతో వచ్చిన పండిత బృందము పాదగయా తీర్థమునందు స్నానమాచరించి కుక్కుటేశ్వర దేవాలయము నందలి వివిధ దేవతలను దర్శించి, అర్చించి అచ్చటనుండి వేదస్వస్తి చెప్పుచూ శ్రీ బాపనార్యుల వారింటికి బయలుదేరిరి. శ్రీ బాపనార్యులవారు, శ్రీ అప్పలరాజుశర్మగారు, తమ పండిత బృందముతో వేదస్వస్తి చెప్పుచూ మమ్ములను కలసికొనిరి. అది ఎంతయో మనోహరమైన దృశ్యము. అటువంటి దివ్య, భవ్య దృశ్యములను చూచుట కూడా పూర్వజన్మలలోని సుకృత విశేషమున గాని పొందలేని విషయము.



శ్రీపాదుల వారి దివ్యమంగళ స్వరూప వర్ణన

మాకు అందరకునూ శ్రీ బాపనార్యుల యింట విందు భోజనములు ఏర్పాటు చేయబడినవి. అప్పటికి శ్రీపాద శ్రీవల్లభుల వారి వయస్సు అయిదు సంవత్సరములు మించిలేదు. పాలుగారు పసివయస్సు నందున్న ఆ దివ్యశిశువు అత్యంత తేజోవంతుడు, వర్చస్వి, బహురూపసి, ఆజానుబాహుడు. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ, కరుణ మహాప్రవాహముగా బయల్వెడలుచుండెను. నేను వారి శ్రీపాదములను స్పృశించగా వారు తమ అభయహస్తమును నా తలపై నుంచిరి. “జన్మ జన్మాంతరములందుననూ నా అనుగ్రహము నీపై ఉండును. నీవు కడపటి జన్మము నందు వెంకయ్య నామముతో అవధూతవై, నిత్యాగ్ని హోత్రివై , అకాలము సంభవించినపుడు వర్శములను కురిపింప సమర్థుడవై, సాంసారికజనుల ఈతిబాధలను తీర్ప సమర్థుడవై, వెలుగొందుదువు గాక!” అని ఆశీర్వదించిరి.

అంతట వారిని నేనిట్లంటిని. “శ్రీపాదుల వారి లీలలు ఆలకించు కొలదిని చిత్రవిచిత్రములుగా నున్నవి. గాయత్రీమంత్ర సాధనలలోని రహస్యములను ఎరిగింప ప్రార్థన.”

గాయత్రీ మంత్ర సర్వాక్షర మహిమా వర్ణన

ఆనందశర్మ యిట్లు వివరించెను. “గాయత్రీ శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తి తో సంబంధమును స్థాపించుకొనిన యెడల సూక్ష్మ ప్రకృతి స్వాదీనమగును. దానివలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రములలోని అన్ని సంపత్తులను పొంద వీలు కలుగును. శరీరమునందలి విభిన్న అంగముల నుండి నాడులు శరీరమందంతటను వ్యాపించియుండును. కొన్ని నాడులు కలిసిన యెడల గ్రంథియని పిలువబడును. మానవ శరీరము నందలి వివిధ గ్రంథులయందు వివిధ శక్తులు నిబిడీకృతమై యుండును. జపయోగము నందు నిష్ఠులయినవారు ఆయా మంత్రములను ఉచ్ఛరించుట వలన ఆయా గ్రంథుల యందు నిబిడీకృతమైన శక్తులు వ్యక్తీకరించబడుచుండును.

‘ఓం’  అనుదానిని ఉచ్ఛరించినపుడు శిరస్సుపైన ఆరు అంగుళముల ప్రాంతము నందును,

‘భూ:’ అనుదానిని ఉచ్ఛరించినపుడు కుడికన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతము నందును

‘భువ’ అనుదానిని ఉచ్ఛరించినపుడు మానవుని త్రినేత్రము పైన మూడు అంగుళముల ప్రాంతము నందును,

‘స్వః’ అనుదానిని ఉచ్ఛరించినపుడు ఎదమకన్నునకు పైన నాలుగు అంగుళముల ప్రాంతము నందును శక్తి జాగృతమగును.

ఆజ్ఞాచక్రము ప్రాంతము నందున్న ‘తాపిని’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘సాఫల్య’ శక్తిని జాగృతము చేయుటకు ‘తత్’

ఎడమకన్ను యందున్న ‘సఫలత’ అను గ్రంథియందు నిబిడీకృతమైయున్న ‘పరాక్రమము’ అను శక్తిని జాగృతము చేయుటకు  ‘స’

కుడికన్ను యందున్న ‘విశ్వ’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘పాలన’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘వి’

ఎడమ చెవి యందున్న ‘తుష్టి’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘మంగళకరము’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘తు:’

కుడి చెవి యందున్న ‘వరద’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘యోగము’ అను శక్తి యొక్క సిద్ధి కొరకు ‘వ’

నాసికా మూలము నందున్న ‘రేవతి’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘ప్రేమ’ అను శక్తి యొక్క సిద్ధి కొరకు ‘రే’

పై పెదవి యందున్న ‘సూక్ష్మ’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘ఘన’ అను సంజ్ఞ గల శక్తిని జాగృతము చేయుటకు ‘ణి’

క్రింది పెదవి యందున్న ‘జ్ఞాన’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘తేజము’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘యం’

కంఠము నందున్న ‘భర్గ’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘రక్షణ’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘భర్’

కంఠకూపము నందున్న ‘గోమతి’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘బుద్ధి’ అను శక్తి యొక్క సిద్ధి కొరకు ‘గో’

ఎడమవైపు ఛాతియొక్క అగ్రభాగము నందున్న ‘దేవిక’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘దమనము’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘దే’

కుడివైపు ఛాతియొక్క అగ్రభాగమునందున్న ‘వారాహి’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘నిష్ఠ’ అను శక్తి యొక్క సిద్ధి కొరకు ‘వ’

ఉదరమునకు పైభాగమున చివరి ప్రక్కటెముకలు కలియు స్థానమందున్న ‘సింహిని’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘ధారణా’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘స్య’

కాలేయము నందున్న ‘ధ్యాన’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘ప్రాణ’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘ధీ’

ప్లీహము నందున్న ‘మర్యాద’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘సంయమ’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘మ’

నాభి యందున్న ‘స్ఫుట’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘తపో’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘హి’

వేనుబాము చివరిభాగము నందున్న ‘మేధా’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘దూరదర్శితా’ అని శక్తిని జాగృతము చేయుటకు ‘ధి’

ఎడమ భుజము నందున్న ‘యోగమాయా’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘అంతర్నిహితము’ అను శక్తిని  జాగృతము చేయుటకు ‘యో’

కుడి భుజము నందున్న ‘యోగిని’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘ఉత్పాదన’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘యో’

కుడి మోచేయి యందున్న ‘ధారిణి’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘సరసతా’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘నః’

ఎడమ మోచేయి యందున్న ‘ప్రభవ’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘ఆదర్శ’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘ప్ర’

కుడిమణికట్టు నందున్న ‘ఊష్మా’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘సాహసము’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘చో’

కుడి అరచేతి యందున్న ‘దృశ్య’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘వివేకము’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘ద’

ఎడమ అరచేతి యందున్న ‘నిరంజన’ అను గ్రంథి యందు నిబిడీకృతమైయున్న ‘సేవ’ అను శక్తిని జాగృతము చేయుటకు ‘యాత్’

అను వానిని ఉచ్ఛరింపవలెను.





ఈ విధముగా గాయత్రీమంత్రము నందలి 24 అక్షరములకునూ, మన శరీరమునందు వివిధ ప్రాంతములందు గల 24  గ్రంథులకునూ, ఆ గ్రంథులందు నిబిడీకృతమైన 24 రకములయిన శక్తులకును సన్నిహిత సంబంధము కలదు. 9 అను సంఖ్యా మార్పులకు లోనుగాని బ్రహ్మ తత్త్వమును సూచించును. 8 అను సంఖ్యా మాయాతత్త్వమును సూచించును.

దో చౌపాతీ దేవ్ లక్ష్మి అను వాక్యమునకు వివరణ

శ్రీపాదులవారు తమకిష్టమైనవారి గృహము నుండి రెండు చపాతీలను స్వీకరించువారు. వారు ‘దో చపాతీ దేవ్ లక్ష్మీ’ అని పిలుచుటకు బదులు ‘దో చౌపాతీదేవ్ లక్ష్మీ’ అని పిలుచువారు. “దో” అనునది రెండు సంఖ్యను, “చౌ” అనునది నాలుగు సంఖ్యను, “పతిదేవ్” శబ్దము జగత్ప్రభువైన పరమేశ్వరుని తొమ్మిది సంఖ్యను సూచింపగా, ‘ లక్ష్మీ’ శబ్దము మాయాస్వరూపమైన ఎనిమిది సంఖ్యను సూచించుచున్నది. అందువలన 2498 అను సంఖ్య ఒక వింత సంఖ్య అయి ఉన్నది. తను గాయత్రీ స్వరూపమనియు, పరమాత్మననియు, పరాశక్తిని కూడా తానేననియూ సూచించుటకు యీ సంఖ్యను శ్రీపాదుల వారు యీ విధముగా అన్వయించిరి.

అంతట నేనిట్లంటిని. “అయ్యా! గాయత్రీ మంత్రములోని 24 అక్షరముల గురించి మీరు చెప్పినది కొంత అవగతమైనది. అయితే 9 అను సంఖ్యా పరమాత్మ స్వరూపమంటిరి. 8 అనునది మాయాస్వరూపమంటిరి. ఇది నాకంతగా అవగతము కాలేదు.”

నవమ సంఖ్య వివరణ





అంతట ఆనందశర్మ యిట్లు నుడివెను. “నాయనా! శంకరభట్టూ! పరమాత్మ యీ విశ్వమునకు అతీతుడు. అతడు ఎటువంటి మార్పులకునూ లోనుగానివాడు. తొమ్మిది అనునది ఒక విచిత్ర సంఖ్య. తొమ్మిదిని ఒకటి చేత గుణింపగా తొమ్మిది వచ్చును. తొమ్మిదిని రెండు చేత గుణింపగా పదునెనిమిది వచ్చును. ఆ పదునెనిమిదిలోని ఒకటిని, ఎనిమిదిని కలిపిననూ తిరిగి తొమ్మిదియే వచ్చును. తొమ్మిదిని మూడు చేత గుణించిన ఇరువది ఏడు వచ్చును. దీనిలో రెండును, ఏడును కలుపగా తిరిగి తొమ్మిదియే వచ్చును. ఈ విధముగా తొమ్మిదిని ఏ సంఖ్య చేత గుణించిననూ వచ్చిన సంఖ్యలోని విడివిడి అంకెలను కలుపగా వచ్చునది తొమ్మిదియే అగుచున్నది. అందుచేత తొమ్మిది అనునది బ్రహ్మ తత్త్వమును సూచించుచున్నది.

గాయత్రి వివరణ

అంతేగాక గాయత్రీ మంత్రము కల్పవృక్షము వంటిది. దీనిలోని “ఓం” కారము భూమినుండి పైకి వచ్చెడి మూలకాండమని గ్రహింపుము. భగవంతుడున్నాడనెడి జ్ఞానమును, పరమేశ్వరుని యందు నిష్ఠను ‘ఓం’కారోచ్ఛరణము వలన పొందవచ్చును. మూలకాండము యొక్క మూడు శాఖలుగా ‘భూ:’ , ‘భువః’, ‘స్వః’ అనునవి వర్ధిల్లినవి. “భూ:” అనునది ఆత్మజ్ఞానమును కలిగించుటకు సమర్థము. “భువః” అనునది జీవుడు శరీరధారిగా నుండగా అనుష్ఠింపదగిన కర్మయోగామును సూచించును. “స్వః” అనునది సమస్త ద్వంద్వములందును స్థిరత్వమును కలిగియుండి సమాధి స్థితిని పొందుటకు సహకరించును.

‘భూ:’ అను శాఖ నుండి ‘తత్’, ‘సవితు:’, ‘వరేణ్యం’ అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. ‘తత్’ అనునది శరీరధారికి జీవన విజ్ఞానము కలిగించుటకును, ‘సవితు:’ అనునది శరీరధారికి శక్తిని సముపార్జనము చేయుటకును, ‘వరేణ్యం’ అనునది మానవుడు తన జంతుధర్మములను అతిక్రమించి దివ్యుడుగా మార్పునొందుటకును సహకరించును.

‘భువః’ అను శాఖ నుండి ‘భర్గో:’, ‘దేవస్య’, ‘ధీమహి’ అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. ‘భర్గో’ అనునది నిర్మలత్వము పెంపొందించును. ‘దేవస్య’ అనునది దేవతలకు మాత్రమే సాధ్యమైన దివ్యదృష్టిని కలిగించును. ‘ధీమహి’ అనునది సద్గుణములను పెంపొందించును.

‘స్వః’ అను శాఖనుండి ‘ధియో’ , ‘యోనః’, ‘ప్రచోదయాత్’ అను మూడు ఉపశాఖలు ఉద్భవించినవి. ‘ధియో’ అనునది వివేకమును, ‘యోనః’ అనునది సంయమమును, ‘ప్రచోదయాత్’ అనునది సేవాభావమును సమస్త జీవరాశుల యందును పెంపొందుటకు సహకరించును.

అందుచేత గాయత్రీ కల్పవ్రుక్షమునకు మూడు శాఖలను, ఒక్కొక్క శాఖకు మూడు ఉపశాఖలును, కలవని నీకు అవగతమైనది గదా! అందుచేత 2498 అనునది శ్రీపాదుల వారిని సూచించే సంఖ్య. దానిలో 9 అను దాని గురించి నీకు వివరించితిని.

అష్టమ సంఖ్య వివరణ

ఎనిమిది అను సంఖ్య మాయాస్వరూపము. ఇదియే అనఘామాత తత్త్వము. ఎనిమిదిని ఒకటి గుణించిన ఎనిమిది వచ్చును. ఎనిమిదిని రెండు చేత గుణించిన 16 వచ్చును. దీనిలోని ఒకటిని, ఆరును కలిపిన ఏడు వచ్చును. ఇది ఎనిమిది కంటె తక్కువ. ఎనిమిదిని మూడు చేత గుణించిన 24 వచ్చును. దీనిలోని రెండును, నాలుగును కలిపిన ఆరు వచ్చును. ఇది ఏడు కంటెను తక్కువ. ఈ రకముగా సృష్టిలోని సమస్త జీవరాశులలోని శక్తులను హరింపజేయు తత్త్వము జగన్మాత యందు కలదు. ఎవడు ఎంతగొప్ప వాడయిననూ వానిని తక్కువగా  చేసి చూపగల శక్తి మాయాస్వరూపమునకున్నది. శ్రీపాద శ్రీవల్లభులు గాయత్రీమాత స్వరూపము. వారు అనఘాదేవీ సమేత శ్రీదత్తులు. వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభీష్టములు సిద్ధించును.





గాయత్రీమాత యందు ప్రాతఃకాలమున హంసారూఢ అయిన బ్రాహ్మీశక్తి, మధ్యాహ్న కాలమందు గరుడారూఢ అయిన వైష్ణవీశక్తి, సాయంసమయము నందు వృషభారూఢ అయిన శాంభవీశక్తియు నుండును. గాయత్రీ మంత్రాధిష్ఠాన దేవత సవితాదేవి. త్రేతాయుగములో శ్రీ పీఠికాపురమందు భరద్వాజ మహర్షి సావిత్రుకాఠక చయనము చేసిన ఫలితముగా శ్రీపాద శ్రీవల్లభులు పీఠికాపురమున అవతరించిరి. సవితాదేవత ప్రాతఃకాలమందు ఋగ్వేదరూపముగా నుండును. మధ్యాహ్న కాలమందు యజుర్వేదరూపముగా నుండును. సాయంకాలమందు సామవేదరూపముగా నుండును. రాత్రికాలమందు అధర్వణవేదరూపముగా నుండును. మనకు కంటికి కనిపించు సూర్యుడు కేవలం ఒక ప్రతీక మాత్రమే. యోగులు మహోన్నత స్థితిని పొందునపుడు త్రికోణాకారమున మహాజాజ్వల్యమానముగా ప్రకాశించు బ్రహ్మయోనిని దర్శింపగలరు. దీని నుండియే కోటానుకోట్ల బ్రహ్మాండములు ప్రతీక్షణము ఉద్భవించుచుండును. ప్రతీక్షణము నందును సంరక్షింపబడుచుండును. ప్రతీక్షణమందును విద్వంసము కావించబడుచుండును. ఈ విధముగా ప్రతీక్షణమందును సృష్టి స్థితి లయములు కావిన్ప బడుచుండును. అసంఖ్యాకమైన యీ ఖగోళములనన్నింటిని సృష్టి స్థితి లయముల గావించు సవితాశక్తికే సావిత్రియని పేరు. అయితే గాయత్రియు, సావిత్రియు అభిన్న స్వరూపములు. శవములను కాల్చుటకుపయోగించు అగ్నిని లోహిత అని పిలిచెదరు. భోజన పదార్థములను తయారు చేసుకొనుటకు ఉపయోగించు అగ్నిని రోహిత అని పిలిచెదరు. అదే విధముగా పరాస్థాయిలో గాయత్రిగా, అపరాస్థాయిలో సావిత్రిగా ఒకే మహాశక్తి వ్యవహరించుచున్నది.

జీవరాశుల పరిణామక్రమములో యిహలోకసంబంధమైన అవసరములు ఎన్నో కలవు. అవి అన్నియు సావిత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. జీవరాశులకు అధ్యాత్మికోన్నతి గాయత్రీమాత అనుగ్రహము వలన సిద్ధించును. ఇహలోకమునందు సకల సుఖభోగములను అనుభవించుటకునూ, పరలోకమునందు విముక్త స్థితి యందు దివ్యానందమును అనుభవించుటకునూ సమన్వయము కావలసి ఉన్నది. శ్రీపాదుల శ్రీచరణాశ్రితులకు ఇహపరలాభములు రెండునూ సిద్ధించును. తక్కిన దేవతారాధనలకునూ, శ్రీ దత్తారాధనమునకునూ గల వ్యత్యాసము యిదియే!

నాకు శ్రీ ఆనందశర్మ మహాశయులు సెలవిచ్చినది ఎంతయో అపూర్వముగా నుండెను. అంతట నేనిట్లంటిని. “మహాభాగా! మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారు శ్రీ నృసింహసరస్వతీ అవతారము ధరించెదరని వింటిని. ఆ అవతారములో శ్రీ కృష్ణసరస్వతి యనువారిని గురువులుగా స్వీకరించెదరని వింటిని. ఇది ఏమి విచిత్రము?”

శ్రీ ఆనందశర్మ యిట్లు చెప్పసాగెను. “భగవంతుని అవతారము వచ్చునదే భక్తులకొరకు. మానవ రూపమును ధరించి వచ్చినపుడు ఉత్కృష్ఠ మానవుడు ఏ విధముగా నుండవలెనో ఆచరించి బోధించును. సన్యాసాశ్రమమును ఉద్ధరింపవలసియున్నది. తను సన్యాసి కావలెనన్న తనకు కూడా ఒక గురువు కావలెను. ఆ గురువు బహుయోగ్యుడై యుండవలెను. సాక్షాత్తు అవతారపురుషునికి గురువు కాగల యోగ్యత కోటిలో ఏ ఒక్కరికో ఉండును. అవతార పురుషుడు జన్మించిన వంశములో 80 తరముల వారు అవతరించేదారు. ఆ వంశమునందు విశేష పుణ్యము రాశులు రాశులుగా పదియుండవలెను. అదే విధముగా అవతార పురుషునకు గురువుగా నుండెడి వ్యక్తీ వంశము కూడా పరమపవిత్రముగా నుండవలెను. తాటంకపురమున (తణుకు) వాజపేయయాజుల వారి వంశము నందు మాయణాచార్యుడను మహనీయుడు జన్మించెను. అతని భార్య పేరు శ్రీమతి. వారు పుణ్య దంపతులు. వారు దరిమిలా నందికొట్కూరు ప్రాంతములందలి మంగళాపురమునందు జీవించసాగిరి. వారికి మాధవుడు, సాయణుడు, భోగినాథుడను వారు జన్మించిరి. సనాతన ధర్మము నుద్ధరించుటకు మాధవుడు విద్యారణ్యుడైనాడు. మహాతపస్సంపన్నులైన బాపనార్యులు సూర్యమండలము నుండి శ్రీశైల మల్లిఖార్జున లింగామునండు శక్తిపాతమొనరించిరి. వాస్తవమునకు శ్రీదత్తుల వారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించినవి. శ్రీపాదులవారి శ్రీచరణములు శ్రీపర్వతముపై అవతరించుట ఎంతయో అద్భుతమైన విషయము. పర్వతము పేరు “శ్రీ” దత్తప్రభువు చరణములు శ్రీచరణములు. ఈ నవావతారమునకు శ్రీపాద శ్రీవల్లభ నామము ఎంతయో తగియున్నది.”


బాపనార్యులవారి వంశమునకునూ, మాయణాచార్యులవారి వంశమునకునూ ఎన్నియో తరముల నుండి సంబంధబాంధవ్యములు కలవు. మల్లాది వారింట ఆడపడుచు జన్మించిన వాయపేయయాజుల వారి కోడలనియు, వాజపేయయాజుల వారింట ఆడపడుచు జన్మించిన మల్లాది వారి కోడలనియు చమత్కారముగా అనుకొనెడివారు. అయితే బాపనార్యులు తమ కుమార్తె సకల సౌభాగ్యవతి సుమతీ మహారాణిని వాజపేయయాజుల వారింటి కోడలిగా చేయలేదు. విధిప్రేరితులై, అగోచరమైన దివ్య సంకల్పము వలన ఘండికోట అప్పలరాజశర్మగారికిచ్చి వివాహము చేసిరి.
సాక్షాత్తు దత్తప్రభువులు శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించి తమ మాతామహులతో రక్త సంబంధము కలిగిన వాజపేయయాజులవారిని కూడా తరింపజేయదలచి మాధవాచార్యుని తనవద్దకు ఆకర్షించిరి. మాధవాచార్యులవారికి శ్రీపాదులవారియందు వాత్సల్యభావము పెల్లుబికినది. మాధవాచార్యులు విద్యారణ్య మహర్షిగా పరిణామము చెందిరి. వారి శిష్యులు మలయానందులు. వారి శిష్యులు దేవ తీర్థులు. వారి శిష్యులు యాదవేంద్రసరస్వతులు. వారి శిష్యులు కృష్ణసరస్వతులు. శ్రీ విద్యారణ్యులకును, కృష్ణసరస్వతులకును మధ్య ముగ్గురు కలరు. శ్రీ విద్యారణ్యులే కృష్ణసరస్వతిగా అవతరించి శ్రీపాదులవారి తరువాత అవతారము నందు గురువులుగా నుందురు. శ్రీ విద్యారణ్యులు భవిష్యత్తులో తన సోదరుడైన సాయణాచార్యుని వంశమందు గోవిందదీక్షితనామమున జన్మించి రాజర్షియై తంజావూరు మహామంత్రి కాగలరు. ఇది శ్రీపాదుల వారి దివ్యవచనము.

శ్రీపాదులవారు నిత్యసత్యవచనులు. ఒక పర్యాయము సుమతీ మహారాణి శ్రీపాడులవారికి స్నానము చేయించుచుండెను. ఇంతలో వెంకటప్పయ్యశ్రేష్ఠిగారు అచ్చటకు విచ్చేసిరి. వారిని చూచి శ్రీపాదులవారు, “తాతా! మనది మార్కండేయ గోత్రమా?” అని ప్రశ్నించిరి. వారు బదులివ్వక శ్రీపాదుల వారి ముద్దుగొలుపు మాటలకు, శ్లేశార్థమునకు నవ్వుకొనిరి. వాస్తవమునకు శ్రీపాదుల వారు భారద్వాజ గోత్రీకులు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిది మార్కండేయ గోత్రము. తను భావనాపరముగా వెంకటప్పయ్యశ్రేష్ఠిగారికి కూడా దౌహిత్రుడనే అను విషయమును నర్మగర్భితముగా చెప్పిరి. ఇంతలోనే సుమతీ మాత స్నానానంతరము “మార్కండేయునంతటి ఆయుష్మంతుడవు కావలె”నని నీళ్ళను గుండ్రముగా త్రిప్పి ఆశీర్వదించినది. మార్కండేయుడు 16 సంవత్సరముల వరకు మాత్రమే ఆయుషు గలవాడు. శివానుగ్రహమున చిరంజీవి అయినాడు. తను పదునారు వర్షముల పర్యంతము మాత్రమే తల్లిదండ్రుల వద్ద నుండెదనని నర్మగర్భితముగా సూచించెను. 16 సంవత్సరముల వయస్సు తరువాత మార్కండేయుడు మహర్షియై గృహత్యాగము చేసి చిరంజీవి అయినాది. శ్రీపాదులవారు కూడా 16 సంవత్సరముల వరకు మాత్రమే తల్లిదండ్రుల వద్దనుండి తరువాత జగద్గురువైనారు. తాను తన శరీరమును గుప్త మొనరించెదననియు, తన యీ శరీరమునకు చిరంజీవిత్వముండుననియు, ఇపుడు మనము చూచు శ్రీపాద శ్రీవల్లభ రూపమేదైతే ఉన్నదో అదే స్వరూపములో అత్రి అనసూయలకు కుమారుడుగా గతములో అవతరించితిననియూ పదే పదే చెప్పియున్నారు.

శ్రీపాదుల వారి వివిధ రూపములు


శ్రీపాదులవారు తమ యోగశక్తిని బహిర్ముఖముగావించి స్త్రీరూపముననున్న తమ యోగశక్తితో సహా దర్శనమిచ్చెడివారు. ఇది ఎంతయో అపూర్వమైన విషయము. కుండలినీశక్తిని యీ విధముగా స్త్రీ స్వరూపముగా బహిర్ముఖమొనర్చుట కేవలము శ్రీదత్త ప్రభువులకే చెల్లును. 16 సంవత్సరముల వయస్సులో నుండు ఆ నవయౌవన దంపతీరూపమును బాపనార్యులును, రాజమాంబయును, శ్రీపాదుల వారి జననీజనకులును, నరసింహవర్మ దంపతులును, వెంకటప్పయ్యశ్రేష్ఠి దంపతులును, మరికొంతమంది దర్శించిరి. వారిరువురికి వివాహము చేయసంకల్పించిన తల్లిదండ్రులకు కేవలము నిరాశ మాత్రమే ఎదురయ్యెను. తాము భవిష్యత్తులో దివ్య దంపతీ రూపమున దర్శనమీయ సంకల్పించిరనుటకు ప్రప్రథమమున వారు అవధూత రూపమున సుమతీ మాతకు దర్శనమిచ్చినపుడే సూచించిరి. అవధూత సుమతీమాతతో యిట్లనిరి. “అమ్మా! నీ కుమారుడు 16 సంవత్సరములవరకు మీ వద్ద నుండును. వానికి వివాహము చేయ సంకల్పించిన వినడు సరిగదా గృహత్యాగము చేసి వెడలిపోవును. అందుచేత అతని మనోభీష్టము ననుసరించి నడుచుకొనవలసినది.” శ్రీ అనఘాదత్తులు ఆదిదంపతులు. వారికి చావు పుట్టుకలు లేవు. వారు సదా లీలావిహారులు. వారు శ్రీపాద శ్రీవల్లభరూపమునను, శ్రీ నరసింహసరస్వతి రూపమునను, స్వామి సమర్థుల రూపమునను అర్థనారీశ్వరులై యుందురు. ఇది దైవ రహస్యము. 

మండల కాల అర్చన మరియు శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పారాయణవల్ల కలుగు ఫలము

శ్రీపాదులవారు గణేశచతుర్థిన అవతరించుటలో ఒక గొప్ప విశేషమున్నది. లాభుడు శ్రీ గణేశుని పుత్రుడు. ఒకానొక కల్పములో, ఒకానొక యుగమున అతడే లాభాదమహర్షి యని పెరుగాంచెను. అతడే శ్రీ కృష్ణావతార సమయమున నందుడై జన్మించెను. లాభుడే శ్రీపాద శ్రీవల్లభావతారమున శ్రీపాదుల వారికి మాతామహుడై జన్మించెను. తన భక్తుల యొక్క సమస్త విఘ్నములను పోగొట్ట దలంచి తమ చైతన్యములో విఘ్నేశతత్త్వమును స్థిరముగా నిలుపుకొని శ్రీపాదులు అవతరించిరి. వారు చిత్తానక్షత్రమందు అవతరించిరి. దీనికి 27 వ నక్షత్రమైన హస్తా నక్షత్రమందు కురువపురమున వారు అదృశ్యులయిరి. తమ జాతకము ప్రకారము 27 నక్షత్రములందును సంచరించు నవగ్రహముల వలన కలుగు అనిష్టఫలములు తొలగిపోవుటకు శ్రీపాదుల వారి భక్తులు మండలదీక్షను వహించవలెను. ఒక మండలము శ్రద్ధాభక్తులతో శ్రీపాదులవారిని అర్చించిన లేదా వారి దివ్య చరిత్రను పారాయణము చేసిననూ సర్వాభీష్టములు సిద్ధించును. మనోబుద్ధి చిట్టాహన్కారములు ఒక్కొక్కటి దశదిశలలో తమ స్పందనలను, ప్రకంపనలను వెలువరించు చుండును. అనగా వాటి ప్రకంపనలు విడివిడిగా 40 దిశలలో వెలువడుచుండును. ఈ నలభై దిశలలోని ప్రకంపనలను అరికట్టి శ్రీపాదులవారి వైపు మళ్లించిన అవి శ్రీపాద శ్రీవల్లభ చైతన్యమున చేరును. అచ్చట అవి తగురీతిన సంస్కరింపబడి యోగమైన స్పందనలుగా మార్పునొంది తిరిగి సాధకుని చేరును. అపుడు సాధకుని ధర్మబద్ధమైన అన్ని కోరికలును సిద్ధించును. నాయనా! శంకరభట్టూ! “నీవు శ్రీపాదులవారి చరితమును లిఖింపగలవని అంతర్దృష్టితో తెలుసుకొంటిని. లోకములో వ్యవహారములోనున్న పారాయణ గ్రంథములలో రచయిత యొక్క వంశావళి, వివిధ స్తోత్రములు వగైరా ఉండును. నీవు వ్రాయు ప్రభు చరిత్రమున నీ వంశావళి వర్ణనము అనవసరము. ప్రభువులను ధ్యానించి, నీ అంతర్నేత్రములో శ్రీపాదులవారిని నిలుపుకొని అందరికినీ సులభముగా అర్థమగు రీతిలో రచింపుము. అపుడు శ్రీపాదులవారి చైతన్యము నీ లేఖిని నుండి ఏది వెలువరించిన అది మాత్రమే సత్యము కాగలదు. ఆ రకమయిన స్పూర్తిలో వ్రాయబడు గ్రంథములకుగాని, ఉచ్చరింపబడు మంత్రములకు గాని ఛందోబద్ధత ఉండవలసిన అవసరము లేదు. కొంతమంది మహాభక్తులు తమకు దైవ సాక్షాత్కారమైనపుడు వారి వారి స్థానికభాషలో, వ్యావహారికములలోని పదములలో స్తోత్రము చేసిరి. వారు సాధారణ వ్యాకరణ నిబంధనలను కూడా అతిక్రమించిరి. అయిననూ ఆ స్తోత్రములను ఆ విధముగానే  పఠి౦ప వలెను. ఛందోబద్ధముగా నుండవలెను గదా యని మార్పు చేసినచో అనుకున్న ఫలము లభింపదు. భక్తుని యొక్క ఏ పదజాలములో భగవానుడు సంతుష్టుడై వరములనిచ్చెనో ఆ పదములలో భగవానుని అనుగ్రహశక్తి యుండును. ఆయా పదములతో కూడిన స్తోత్రములను మనము పఠి౦చునపుడు మన చైతన్యము తొందరగా భగవచ్చైతన్యమునకు సామీప్యములో నుండును. భగవానుడు భావప్రియుడు గాని బాహ్యప్రియుడు గాడు. భావన అనునది శాశ్వతమైన శక్తి. ఈ విషయమును గమనింపుము”. అని చెప్పెను.

అంతట నేనిట్లంటిని. “అయ్యా! భోజనానంతరము సద్గురుని గూర్చిన గోష్ఠి ఎంతయో ముదావహము. ఇంకనూ శ్రీపాదులవారి అవతార విశేషములను తెలియజేసి నన్ను కృతార్థుని చేయ ప్రార్థన.”


ఆనంద శర్మ యిట్లు పలికెను. “శ్రీపాదుల వారు మల్లాది వారికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికిని, వత్సవాయి వారికిని కూడా చాలా సన్నిహితమై, భాషచేత వెల్లడి చేయుటకు వీలుగాని ఋణానుబంధము కలవారు. ఆ మూడు కుటుంబముల వారికిని పుణ్యబలమెంతో యున్నది. అందువలననే తన తండ్రి ఆ మూడు కుటుంబములవారు యిచ్చు ద్రవ్యమును గాని, వస్తువులను గాని స్వీకరించక పోవుట అనర్థ హేతువని శ్రీపాదులు అభిప్రాయపడిరి. శ్రీపాదుని అభీష్టము మేరకు పండగ, పబ్బములందే గాక, యితర సమయములందు కూడా అప్పలరాజుశర్మ దంపతులు, తమ సంతానముతో సహా మల్లాది వారింటికిని, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికిని, వత్సవాయి వారింటికిని  యథేచ్చముగా పోయెడివారు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఒకానొక పండుగ రోజున అప్పలరాజు శర్మ దంపతులను తమ యింటికి ఆహ్వానించిరి. శ్రీపాడులవారిని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని తూగుటుయ్యాలలో శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఊగుచుండిరి. ఆ రోజున శ్రేష్ఠి గారెంతయో గంభీరముగా నుండిరి. దానికి కారణమున్నది. పీఠికాపురములో ఒక ప్రసిద్ధుడైన జ్యోతిష్కుడు ఉండేవాడు. అతడు ఓఢ్రదేశమునకు పోయి జ్యోతిషమునభ్యసించెను. అతడు చెప్పిన జ్యోతిషము పొల్లు అయిన దాఖలాలు లేవు. అతడు అతి ఖచ్చితముగా ప్రాణ ప్రయాణ సమయమును సూచించగలడు. అతడు ఫలానారోజున యిన్ని ఘడియల యిన్ని విఘడియలకు హృదయ సంబంధ రోగముచే శ్రేష్ఠి పంచత్వము నొందునని చెప్పెను. కొన్ని ఔషధ మొక్కలకు, గ్రహములకు, నక్షత్రములకు, కొన్ని పవిత్ర వృక్షములకు, యోగ ప్రక్రియలకు సన్నిహిత సంబంధము కలదనియూ తానొక ఔషధరాజమును, తాయెత్తును యిచ్చేదననియూ దాని వలన అపమృత్యు దోషము హరించుననియూ, అప్పలరాజుశర్మను వదలి తనను తమ కులపురోహితునిగా చేసుకొనవలసినదియూ చెప్పెను. ఈ విధానమునకు శ్రేష్ఠి నిరాకరించెను. నా జ్యోతిషము తప్పిన యెడల నేను శిరోముండనము చేయించుకొని గార్దభముపై ఊరేగెదననియూ ఆ జ్యోతిష్కుడు ప్రతిజ్ఞ చేసెను. విషయము అప్పలరాజుశర్మకును, బాపనార్యులకును నివేదింపబడెను. బాపనార్యులు జటిలమైన గణితము చేసి దైవిక శక్తి పని చేసి వాని అపమృత్యువు పరిహరింపబడునని సూచించెను. అప్పలరాజుశర్మ కాలాగ్నిశమనుని పూజించి తీర్థమును ప్రసాదముగా నిచ్చెను. సుమతీ మాత ప్రసంనవదనయై తన చిన్ననాయనగా భావించు శ్రేష్ఠి వద్దకు వచ్చెను. ఇంతలో శ్రేష్ఠికి హృదయమునందు బాధ కలిగి అమ్మా! అని పిలిచెను. దగ్గరనేయున్న సుమతీ మాత నాయనా! నన్ను పిలిచితివా? యని పరుగున వచ్చి దివ్య మంగళ స్వరూపమైన శ్రీ హస్తముతో శ్రేష్ఠి హృదయమును స్పృశించెను. శ్రేష్ఠి ఓడిలోనున్న శ్రీపాదులవారు ‘పో’ అని గట్టిగా అరచిరి. శ్రేష్ఠి యింట ఒక ఆబోతు ఉండెను. వెంటనే అది గిలగిలా తన్నుకొని కొన్ని క్షణములలో అసువులు బాసెను. శ్రేష్ఠి రక్షింపబడెను.

ఈ విషయము జ్యోతిష్కునకు తెలిసెను. అతడు శ్రేష్ఠి యింటికి పరుగు పరుగున వచ్చెను. తృటిలో తన అమోఘ జోశ్యము తప్పి పోయినండులకు అతడు లోలోన ఎంతో దుఃఖించెను.

జ్యోతిష్కునితో శ్రీపాదులవారు, “నీవు జ్యోతిష్కుడవే! చాలా గొప్ప పరిశ్రమ చేసిన వాడవే! కాదనను! జ్యోతులన్నిటికీ జ్యోతినైన నేనుండగా శ్రేష్ఠికి మృత్యుభయమేల? నీవు శిరో ముండనము చేయించుకొని గార్దభముపై ఊరేగనక్కరలేదు. నీవు పశ్చాత్తప్తుడవయిన చాలును. నీ తండ్రి తను జీవించి యుండగా శ్రేష్ఠి వద్ద అప్పు తీసుకొనెను. అతడు ఆ అప్పును తీర్చి వేసితినని అబద్ధమాడెను. ఆ అబద్ధము కూడా గాయత్రీ సాక్షిగా చెప్పెను. దాని ఫలితముగా మీ తండ్రి శ్రేష్ఠి యింట ఆబోతుగా జన్మించెను. శ్రేష్ఠి ధర్మాత్ముడు గనుక ఆ ఆబోతునకు సమృద్ధిగా మేత పెట్టుచుండెను. హీన జన్మనొందిన నీ తండ్రికి ఉత్తమజన్మను నేను ప్రసాదించితిని. అపమృత్యువాత పడనున్న శ్రేష్ఠి యొక్క కర్మఫలమును ఆబోతునకు బదలాయించితిని. నీవు యీ ఆబోతునకు దహన సంస్కారములోనరించి అన్నదానము చేయుము. నీ తండ్రికున్న కర్మఫలము నశించును. ఉత్తమగతి కల్గును.” అని పలికిరి. శ్రీపాదుల వారి యీ వచనముల ప్రకారమే ఆ జ్యోతిష్కుడు నడచుకొనెను.



నాయనా! శంకరభట్టు! శ్రీపాదులవారు అనేక పద్ధతులలో ప్రాణరక్షణ చేసెదరు. ఒక్కొక్క పర్యాయము రాబోవు జన్మలోని కొంత ఆయుష్షును తగ్గించి యీ జన్మలో ఆయుష్షును పెంచగలరు. లేదా కర్మ ఫలితములను బదలాయించు పద్ధతిలో శ్రేష్ఠికి జరిగినట్లు చేయగలరు. శ్రేయోభిలాషి అయిన ఒకని ఆయుష్షు నుండి ఆ వ్యక్తికి ఆయుష్షు పెంచగలరు. అసాధారణ పద్ధతిలో మృత్యువునే శాసించి ఆయుర్దాయము నీయగలరు. శరీరములో తరుగుదలనూ, పెరుగుదలనూ నిలుపుదల చేసి యోగి ప్రాణశక్తిని తన అదుపులో ఉంచుకొనును. శ్రీపాదులు యోగ సంపూర్ణ అవతారులు. వారికి అసాధ్యమనునది లేదు. ఉచ్చ్వాస నిశ్వాసముల గతిని విచ్చేదనం చేయుట వలన ముక్తిని సాధించుట సులభతరము. క్రియాయోగి తన ప్రాణ శక్తిని ఆజ్ఞా, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్టాన, మూలాధార చక్రములను చుట్టి పై నుంచి క్రిందికి, క్రింది నుంచి పైకి పరిభ్రమించునట్లు చేస్తాడు. ఒక్క క్రియకు పట్టే కాలము ఒక సంవత్సరంలో జరిగే ప్రకృతిసహజమైన ఆధ్యాత్మిక వికాసమునకు సమానమౌతుంది. నాయనా! ఆహోరాత్రములోని మూడోవంతు సమయంలో వెయ్యి క్రియలు జరిగితే కేవలం మూడు సంవత్సరకాలంలో సహజ ప్రకృతి ద్వారా పది లక్షల సంవత్సరములలో వచ్చే పరిణామం వస్తుంది. పురాణములలో అనేక వేల సంవత్సరములు తపస్సు చేసిన యోగుల గురించి చెప్పేటప్పుడు ఆ కాలం సహజంగా ప్రకృతికి పట్టే పరిణామ కాలమని అర్థం చేసుకోవాలి. అంటే ఆయా యోగులకి పట్టే వాస్తవకాలం వేరుగాను, ఆ పరిణామం ప్రకృతి సిద్ధంగా రావడానికి పట్టేకాలం వేరుగాను అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ప్రతీ జీవికి ఆయుర్దాయాన్ని యిచ్చి శ్వాస ప్రశ్వాసలని నిర్ధారిస్తాడు. అంతేగాని యిన్ని సంవత్సరాలుగా నిర్ణయించాడు. క్రోధం, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చవుతుంది. తద్వారా ఆయుర్దాయం తగ్గుతుంది. మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువగా శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసలలో ఎనిమిదో వంతు మాత్రమే తీసుకుంటుంది.

ఆనంద శర్మ సద్గోష్ఠి వలన నేనెంతో జ్ఞానవంతుడను అయినాను. ఉదయాన్నే కాలకృత్యాలను తీర్చుకుని ఆనంద శర్మ అనుజ్ఞ తీస్కుని శ్రీపాద శ్రీవల్లభుల దర్శనార్థం కురువపురం వైపుకు బయలుదేరితిని.

   శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!

 

ఇవి కూడ చదవండి : శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1  sripada srivallabha charitamrutam sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -2 sripada charitamrutam Chapter-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -3   sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -4 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -5 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -6 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.. అధ్యాయం -7   sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -8 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -9 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -10 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -11 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -12

Related posts

Share via