November 21, 2024
SGSTV NEWS
Spiritualsripada charitamrutam

sripada charitamrutam Telugu
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -10

                అధ్యాయము – 10

          నరసింహ మూర్తుల వర్ణనము

నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కురువపురం దిశగా ప్రయాణము కొనసాగించితిని. శ్రీపాదుల వారి లీలలను మనసున తలచుకొనుకొలదిని నాకు రోమాంచితమవసాగినది. ప్రయానమార్గామందు అల్లంత దూరమున అశ్వత్థవృక్షము కానవచ్చినది. అది అపరాహ్ణ సమయము. నాకు ఆకలి మిక్కుటముగా నున్నది. దరిదాపులలో ఏదయినా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మాధూకరమును తెచ్చుకోవలయును. ప్రయాణమునందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థవృక్షమున్నది గదాయని ఆలోచించ సాగితిని. అశ్వత్థ వృక్షచ్ఛాయయందు ఎవరో విశ్రాంతి తీసుకొనుచున్నట్లు కానవచ్చినది. కొంచెము దూరము పోవుసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతమున్నట్లు కనిపించినది.



నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చితిని. ఆ నూతనవ్యక్తి నన్ను సాదరముగా ఆహ్వానించి కూర్చొనమనెను. అతని కన్నులయందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగిడీ ఒకటుండెను. దానియందు ఆహారపదార్థములు ఏమియునూ లేవు. ఒక రాగిపాత్ర మాత్రముండెను. అతడు శ్రీపాదవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతనిని, “అయ్యా! మీరు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణాశ్రితులా? మీరు ఆ మహాపుణ్యపురుషుని దర్శించితిరా!” అని ఆతురతతో ప్రశ్నించితిని.

అంతట అతదిట్లు పలికెను. “అయ్యా! నేను సద్వైశ్యకులమునందు జనించినవాడను. నన్ను సుబ్బయ్యశ్రేష్ఠి అని అందురు. నాకు చిన్నతనముననే మాతాపితృవియోగము సంభవించినది. మా యింట వలసినంత ధనరాశులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురమునకు పోవుచుండెడివాడను. అచ్చట చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయమేర్పడినది.



నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చుపెట్టితిని. మళయాళదేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారార్థియై వచ్చేదివాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశములవారికి అమ్మి వారినుండి రత్నరాశులను, గుఱ్ఱములను అతడు స్వీకరించెడివాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురమునూ కలిసి వర్తకవాణిజ్యములను చేసెడివారము. మా వద్ద మేలుజాతి గుఱ్ఱములను రాజులు, మహారాజులు కొనుచుండెడివారు. దుష్కర్మవశమున మేమిరువురమూ కూడా వేశ్యా సాంగత్యమున భ్రష్ఠులమైతిమి.

అరబ్బుదేశములవారితో మేమిరువురమునూ చేయు క్రయవిక్రయములు కొంతకాలము ఉత్సాహ భరితముగానే సాగెను. తదుపరి వారు మా యొద్దనుండి విశేషధనమును స్వీకరించి మేలుజాతి గుఱ్ఱములనీయక బహు నాశిరకము గుఱ్ఱముల నిచ్చిరి. మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారములో నష్టమువచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతి స్థిమితము లేని ఒక కుమారుడుండెను. వాడును అకాలమరణము చెందెను.

నాయనా! తీర్థములలోకెల్లా శ్రేష్ఠమని పిలువదగిన పాదగయా తీర్థరాజమును కలిగిన శ్రీ పీఠికాపురము మా స్వగ్రామము. నేను నా అజ్ఞానదశవలన దేవ బ్రాహ్మణ నిండా చేసెడివాడను. బాకీలు వసూలు చేయుటయందు కాఠిన్యమును ప్రదర్శించెడివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రిగారయిన అప్పలరాజశర్మ గారింటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజనభాజనములనేర్పాటు చేయుటకు అప్పలరాజు గారివద్ద రోఖ్ఖము లేకుండెను. శ్రేష్ఠిగారి వద్దకు వెచ్చములకు వెళ్ళినచో, శ్రేష్ఠి గారు వారి కుల పోరోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రోఖ్ఖమును స్వీకరింపక వెచ్చములను ఉచితముగా యిచ్చెదరు. అప్పుడది దానముగా అగును. కాని అప్పలరాజశర్మ గారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితిలో వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చములను నా దుకాణము నుండి తీసుకొనివెళ్ళిరి. బంధుగణములు వెళ్లిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లి గవ్వ అయిననూ లేదనియూ, తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించెదననియూ రాజశర్మ బదులిచ్చెను.



నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడునేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీ కి వడ్డీ లెక్కవేసి దొంగ లెఖ్ఖలేసి పది వరహాలు యివ్వవలెనని తేల్చితిని. అంత ధనమును నాకీయ వలెనన్న రాజశర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న ధరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకొని ఒకటి, రెండు వరహాలు వారికిచ్చిన సరిపోవును. యీ విషయమును పదుగురెదుట చెప్పుచుండెడివాడను. రాజశర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. నా దూరాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి “ఓరీ! దురాత్ముడా! ధనమదాంధముతో యిష్టము వచ్చినట్లు వదురుచున్నావు. మా కులపురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే! నీ పద్ధతులను మార్చుకొననిచో నీవు తీవ్రముగా నష్టపోయెదవు. అగ్ని హోత్రము కంటెను పవిత్రుడైన రాజశర్మను నీవు యీ విధముగా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయెదవు. ” అనెను.

ఒక పర్యాయము శ్రీపాదులవారు వెంకటప్పయ్య శ్రేష్ఠి యింటివద్ద నుండిరి. నేను శ్రేష్ఠి గారితో వెటకారముగా, “రాజశర్మ నా బాకీని తీర్చలేనిచో వాని కుమారులలో ఎవరినయిననూ నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలయును, లేదా తానే ఊడిగము చేయవలయును. ఒక కొడుకు గ్రుడ్డివాడును, రెండవ కొడుకు కుంటివాడును, మూడవ కొడుకైన శ్రీపాదుడు మూడు సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు?” అంటిని.


వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నులవెంట నీరు దారాపతముగా వర్షించుచుండెను. శ్రీపాదులవారు తమ దివ్య హస్తములతో వారి కన్నీటిని తుడిచి, “తాతా! నేనుండగా భయమెందులకు? హిరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల సంహరించిన వాడను నేనే! సుబ్బయ్య బాకీ తీర్చుట నాకేమంత కష్టము?” అనిరి. శ్రీపాదుడు నా వైపు చూచి “ఓయీ! నీ బాకీని నేను తీర్చెదను. పద! నీ దుకాణమునకు. నేను నీ దుకాణములో సేవచేసి నా బాకీ నివృత్తి చేసెదను. బాకీ తీరిన తరువాత లక్ష్మి మాత్రము నీ యింట నివసింపదు. ఆలోచించుకొనుము.” అనెను.

గర్వాంధుడను, దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదుల వారి నెత్తుకొని నా దుకాణమునకు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు వచ్చి, “సుబ్బయ్యా! నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పని చేసెదను. నీకు సమ్మతమేనా?” అనిరి. నేను వల్లెయంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి యొకడు నా యొద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణమెక్కడ? అని అడిగెను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని. ఇదే నా దుకాణము అని అంటిని. అంతట అతడు “అయ్యా! నాకు అత్యవసరముగా ఒక రాగిపాత్ర కావలయును. వేల ఎక్కువయిననూ పరవాలేదు. daya యుంచి నాకు అత్యవసరముగా రాగిపాత్రనిచ్చినచో తీసుకొని వెళ్లిపోయెదను.” అనెను. నా వద్ద 32 రాగిపాత్రలున్నవి. కాని నేను నా వద్ద ఒకే ఒక రాగిపాత్ర ఉన్నాడని, 10 వరహాలు ఇవ్వగలిగిన యెడల దానిని యిచ్చెదనంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రము విధించెను. వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలో నున్న శ్రీపాదుల వారు తమ స్వహస్తములతో ఆ రాగిపాత్రను యీయవలెను. దానికి శ్రీపాదులవారు అంగీకరించిరి. శ్రీపాదులవారి హస్తముల నుండి జటాధారి రాగిపాత్రను అందుకొనెను. శ్రీపాదులవారు నవ్వు చుండిరి. జటాధారి కూడా నవ్వసాగిరి. శ్రీపాదులవారు జటాధారితో, “ఓయీ! నీ కోరిక తీరినది. నీ యింట లక్ష్మి స్థిర నివాసముండును. నీవు నీ సన్యాసదీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము. నీ భార్యాబిడ్డలు నీ కోసము  ఎదురు చూచుచున్నారు.” అనెను. జటాధారి ఆనంద భరితుడై వెడలిపోయెను.



నాకు వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అప్పలరాజశర్మని అవమానించవలెననెడి కోరిక ఉండెడిది. నా కోరిక ఈ నాటికి తీరినది.నేను గర్వముతో, “యీ రోజున రాగిపాత్ర విక్రయముతో నాకు విశేషధనము సంప్రాప్తించినది. అప్పలరాజశర్మ నాకు యీయవలసిన 10 వరహాల అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధవిముక్తుడు.” అని పలికితిని. అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఈ మాటను గాయత్రిసాక్షిగా చెప్పమనిరి. మందభాగ్యుడను నేనట్లే చెప్పితిని.
నాయనా! శంకరభట్టూ! అవధూతలనుండిగాని, సిద్ధపురుషులనుండిగాని అనుగ్రహప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న శకలమైనను గ్రహించిన యెడల దానగ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీదత్తుల వారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా!



నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండియే నా శరీరములోను, మనస్సులోను ఆత్మలోనూ అంతర్లీనమైయున్న లక్ష్మీ అంశ క్షీనించసాగెను. శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు. అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమైతీరును. 32 రాగిపాత్రలుండగా ఒక్కటియే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదులవారు సత్యమును చేసిరి. వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు, శ్రీపాదులవారు వెళ్లిపోయిన తరువాత నా దుకాణములో పరిశీలించగా మిగిలిన 31 రాగిపాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలియున్నది. నాకు అప్పలరాజుశర్మ నుండి పదివరహాలు రావలెనని దొంగ లెఖ్ఖలు చూపితిని. దానికి అనుగుణముగా వారు ఆ పది వరహాలు నాకు యీ విధముగా లభించునట్లు చేసిరి. యీ లీలద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదులవారు దూరము చేసిరి. సూర్యోదయమునకు ముందు, సూర్యాస్తామయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్య యందును, సాయంసంధ్యయందును, అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతఃసంధ్యయందు సూర్యభగవానుని సమస్త శక్తులును విజ్రుంభించుటకు సిద్ధముగా నుండును. సాయంసంధ్య యందు సూర్యభగవానుని సమస్త శక్తులును తిరోగమన దిశయందు వారిని చేరును.

అంతట నేనిట్లంటిని. “అయ్యా! దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటినే కాని, స్వీకరించక పోవుట చేత పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయము అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదులవారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచూ వారే నరసింహావతారమని, శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివునియందు అనసూయాతత్త్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థము కాలేదు. దయయుంచి సవివరముగా తెలియజేయవలసినది.”



అంతట సుబ్బయ్య శ్రేష్ఠి, “అయ్యా! మీరు ఆకలిగొని యున్నారు. నీ యింటికి అన్నార్థియై వచ్చినవానికి త్రాగుటకు మంచినీరు, తినుటకు ఆహారమును, జాతికుల భేదముల నెంచక యీయవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసినది. నేను యింతలో ఆ కనిపించెడి అరటిచెట్ల వద్దకు పోయి రెండరిటాకులను తెచ్చెదను. అన్నములోనికి సంభారము బీరకాయపప్పు. అది అమృత తుల్యముగా నుండును. ” అని పలికెను.

నాకు ఆశ్చర్యము వేసినది. ఆ జంగిడీలో ఒక రాగిపాత్ర మినహా మరేమియూ లేవు. ఆహారపదార్థములుగాని, ఫలములుగాని, కందమూలములు గాని ఏమియూ లేవు. పైగా అన్నములోనికి ఆధరువుగా బీరకాయపప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమయిననూ తటాకమునకు పోయి కాళ్ళుచేతులు కడుగుకొని వచ్చెదను అని అనుకొంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటిచెట్లు వైపునకు వెడలినాడు.

నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడనై వచ్చితిని. సుబ్బయ్య శ్రేష్ఠి రెండు అరిటాకులను తెచ్చెను. దాపులనున్న చిన్న తాడిచెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను యీ వింతను ఆశ్చర్యముగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలము ధ్యానము చేసెను. ఆ తరువాత తనవద్దనున్న రాగిపాత్రను తీసుకొని రెండు దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగిపాత్రనుంది జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తరువాత అదే రాగిపాత్ర నుండి బీరకాయపప్పు వడ్డించెను. తదుపరి అన్నమును వడ్డించెను. మేమిరువురమునూ సమృద్ధియును, అమృతోపమానమును అయిన ఆ అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనములయిన తదుపరి ఆ రాగిపాత్ర ఎప్పటివలెనే ఖాళీగా నుండెను.


శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము

శనైశ్చ్వరుడు కర్మకారుడు, గ్రహములయందు ఛాయాగ్రహములైన రాహుకేతువులలో రాహువు శనైశ్చ్వరునివలెనే ఫలితములిచ్చును. కేతువు అంగారకుని వలెనే ఫలితములనిచ్చును. కర్మకారకుడైన శనైశ్చ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయంసంధ్య మహాశక్తిమంతము, చతుర్థీ తిథియు, త్రయోదశీ తిథియు, రాహుగ్రహమునకు బలమైన తిథులు. శనిత్రయోదశీ మహాపర్వమునందు సాయంసంధ్యలో శివారాధనము చేయు మానవునకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదులవారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రమునందు అవతరించుట చేత ఆ నక్షత్రమునందు శ్రీపాదులవారిని అర్చించిన యెడల సర్వగ్రహదోషములు శమించును. యుద్ధములకును, ఆపదలకును, శస్త్రాస్త్రములవలన కలుగు అకాలమృత్యువులకును, ఋణగ్రస్తులై యీతిబాధలతో కూడిన జీవితమును గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము. అరుణమనగా పాపము లేనిది. చిత్తానక్షత్రమునాడుగాని, మంగళవారమునాడుగాని శ్రీపాదులవారు అరుణ వర్ణముతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహ వర్మయును, బాపనార్యులవారును శనిప్రదోషమున చేయు శివారాధానము నందు పాలుపంచుకొనెడివారు. ఆ రోజున అప్పలరాజుశర్మకూడా మహానిష్ఠతో నుండెడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతియగు సుమాతీమహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమైయున్న అనసూయా మహాతత్త్వమును ధ్యానించెడివారు. ఆ మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదుల వారి ఆవిర్భావము జరిగినది.


అందువలన వెంకటప్పయ్య శ్రేష్ఠి వారినున్దిగాని, నరసింహవర్మ వారినుండి గాని, బాపనార్యుల వారినుండిగాని ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియూ, వారినుండి ధనమును స్వీకరించక పోవుటయే మహాపాపమనియూ శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనముగా బోధించదలచిరి. శంకరభట్టూ! శ్రీపాదులవారు సకలదేవతాస్వరూపులు. సర్వదేవతాస్వరూపులకునూ అతీతమైన మహాతత్త్వము వారిది. వారి దర్శన, స్పర్శన, సంభాషణ భాగ్యములను పొందగలిగినవారు ధన్యులు.

సుబ్బయ్య శ్రేష్ఠి యిట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులవారు ఈ వింత పధ్ధతి ద్వారా తన తండ్రిని ఋణవిముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలమువలె వ్యాపించెను. శ్రీపాదుడు మూడు సంవత్సరముల బాలుడు. అప్పలరాజుశర్మ కనులనుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతీ మహారాణి తన ముద్దులకుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మగారి యింటికి వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహవర్మయును, బాపనార్యులును వచ్చిరి. తండ్రిని ఋణవిముక్తుని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానిన్చిరి. నేను సమావిష్టులయిన పెద్దల సమక్షములో రాజశర్మగారి బాకీ తీరెనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారివచ్చి పది వరహాలు యిచ్చి రాగిపాత్రను కొనుక్కొని వెళ్ళిన యెడల ఋణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతట ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను.

బాపనార్యులు శ్రీపాదునిట్లు ప్రశ్నించిరి. “ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా?” అంతట శ్రీపాదులు వారు, “ఆ జటాధారియే కాదు. అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియును.” అని జవాబిచ్చిరి.

శ్రీపాదుల వారి స్వరూపము

బాపనార్యులు: “నీవు మూడు సంవత్సరముల బాలుడవు. వయస్సుకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవు ఏమయినా సర్వజ్ఞుడవా ?”



శ్రీపాదులు: “నా వయస్సు మూడు సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు గాని నేననుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను. ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందునూ ఉందును. నేను లేనిదే సృష్టి స్థితి లయములు జరుగనేరవు. నేను సాక్షీ భూతుడనై వీటన్నింటిని గమనించుచుందును.”

బాపనార్యులు: “శ్రీపాదా! చిన్నపిల్లవాడు తాను చంద్రమండలము నందున్నట్లు తలంచిన మాత్రమున చంద్ర మండలము నందున్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవముండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు.”

శ్రీపాదులు: “నేను సర్వే సర్వత్ర స్థితమై ఉండు ఆదితత్త్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తము కానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనైయున్నాను. నా ఉనికివలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోశము నందున్నట్లు నీకు అనుభవమునిచ్చినచో ఆ కోశమునందు నేనున్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోశాములలో లేనని కాదు దానర్థము. నేను సర్వే సర్వత్ర ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములును నా పాదపీఠిక కడనున్నవి. నా సంకల్పమాత్రము చేతనే ఈ సృష్టి అంతయునూ ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేమున్నది?”

అప్పలరాజశర్మ: “నాయనా! చిన్ననాటి నుండియు నీవు మాకు సమస్యాత్మకముగా నున్నావు. నీవు పదే పదే దత్తప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరియొక అవతారముగా వచ్చెదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు. వారు యిదంతయునూ నాటకమనియూ, బూటకమనియూ మనస్చాంచల్యము వలన కలిగిన తెలివిమాలినతనమనియూ రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మకర్మలనాచరించుట మంచిది. అంతకు మించి దైవాంశ సంభవులమని, అవతారపురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును.”

శ్రీపాదులు: “తండ్రీ! నీవు చెప్పునది నేను కాదనుట లేదు. సత్యమునే వచిన్చావలెను గదా! నా పాలబాకీ విషయము వచ్చినపుడు నాకు వినోదముగా నున్నది. పంచభూతముల చేత సాక్ష్యమిప్పించబడినపుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా? నభోమండలమునందు ప్రకాశించు సూర్యుని జూచి నీవు సూర్యుడవు కాదు అన్నంతమాత్రమున సూర్యుడు, సూర్యుడు కాకపోవునా? సత్యము దేశకాలాబాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరధారులమనియు, మనుష్యులమనియు భావించి మానవతత్త్వమునేవిధమున అనుభవించుచున్నారో, అదే విధమున నేనునూ సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనేననియెడి తత్త్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును. అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కాని సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు?”

బాపనార్యులు: “శ్రీపాదా! జతాదారి కనుమరుగయిన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద నుండవలసిన రాగిపాత్రలు 31 లో ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదయినా చమత్కారము జేసి వాటిని మాయము చేసినావా?”

శ్రీపాదులు: “సర్వమునూ కాలకర్మవశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతమునందు గల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్తదర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీ వాంఛ వెఱ్ఱితలలు వేసినది. కాంతాలోలుడయిన యితడు పురాతన కాలమునుండి పూర్వీకులచే ఆరాధించబడెడి ఆ పెద్ద తామ్ర దత్తవిగ్రహమును అమ్మివేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడుకత్తెకిచ్చెను. లోకులతో దత్తవిగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారియై వచ్చినవాడు లౌకిక బంధనములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనమునకాశపడి ఆ దత్తవిగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మములో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్తవిగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవజేసిన పుణ్యమున సుబ్బయ్య శ్రేష్ఠి యీ జన్మములో శ్రీమంతుల యింట జనించెను. పూర్వ జన్మమున వీరిద్దరూ చేరి కరిగించిన దత్తవిగ్రహము 32  రాగిపాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి యింట నరసింహదేవుని ఆరాధించువారు. కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగిపాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పమువలన నృశింహుని 32 అవతారముల అంశలు ఆ రాగిపాత్రలలో ప్రవేశించెను.

యీ జన్మములో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు, నా చేతులమీదుగా రాగిపాత్రను స్వీకరించవలసినదనియు, దానికి గాను పదివరహాల సొమ్మును శ్రేష్ఠి కిచ్చి నన్ను బంధవిముక్తిని చేయవలసినదనియూ చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయెను. అతని ఆర్ధికసమస్యలు అనూహ్యమయిన రీతిలో తీరిపోవునట్లు నేనతనిని అనుగ్రహించితిని. అతడు అప్పులవారి బాధనుండి తప్పించుకొనుటకు జటాధారియై మారువేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమునూ తెలిసినట్లే గదా!

యీ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా పదివరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి పదివరహాలు లభించునట్లు చేసితిని. అయితే దీనికి ప్రతిగా యితని పూర్వజన్మ కృత పుణ్యఫల మంతయూ హరించివేసితిని. ఓయీ! సుబ్బయ్య శ్రేష్ఠి ! చింతామణితో నీవు జరిపిన శృంగారము, నీ వేకిలిచేష్టలన్నియునూ నాకు తెలియును. నీ గాధ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగిడీ పుచ్చుకొని నా వంటి పసిబాలురకు కావలసిన తినుబండారములను అమ్ముకొనుచూ జీవించెదవు. నీ నుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటు చేసిరి. నీ కంటెను కూడా నాకు కోమటి లెక్కలు తెలియును. నీవిచ్చిన ధనము భోజనమునందు అన్నము, పప్పు, బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండిన రాగిపాత్ర నుండి జలము, అన్నము, బీరకాయపప్పు మాత్రమే లభించును. నీవు తిని, ఎవరికైననూ పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును.” అని తీక్షణముగా పలికెను.





శ్రీపాదులవారి ముఖమండలము దివ్య వర్చస్సుతో తీక్షణముగా నుండెను. వారి కన్నులు అగ్ని గోళములుగా నుండెను. మరల వారు “ఓయీ సుబ్బయ్యశ్రేష్ఠి! యీ రాత్రి నీ యింటి దక్షిణద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో నున్నదని తెలుపుటకు యమధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము, పప్పు, బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడుబీదవాడవగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చుచుండును. నీవు జంగిడీ పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినపుడు నేను అనుగ్రహించిన విధమున రాగిపాత్ర అనుగ్రహించును.” అని కఠిన స్వరముతో పలికిరి.

వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అట్లు కోపోద్రిక్తులయిన శ్రీపాదులవారిని చూచి భయభ్రాంతులయిరి. అంతట శ్రీపాదులు యిట్లనిరి. “తాతా! భయపడుచున్నావా? నేను నరసింహ మూర్తినే ! సందేహము వలదు. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను అయిన తత్త్వముగదా! వైశ్య కులమునకు శాపమిచ్చెదనని అనుకొనుచున్నావు. వాసవీమాత, తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువగా నుండునట్లు శాపమిచ్చినట్లే, వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చెదనేమోయని నీవు ఆందోళన పాడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతి కులభేదములుండవు. అట్లే భక్తునకు కూడా జాతి కులభేదములుండవు. ఆర్య వైశ్యులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యుల పూర్వయుగములలోని లాభాద మహర్షి కాదా! నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయిననూ, బాపనార్యులు వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను. నీకు నేనిచ్చు జంగిడీ వేరుగా నున్నది. దానిలో దత్త మిఠాయి నిండుగానుండును. ఎంతయిచ్చిననూ తరిగెడిది కాదు. ఎవరికినీ కంటికి కనిపించెడిది కాదు. నృశింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నా యందే ఉన్నవి గనుక నాది 33 వ అవతారము. అందువలన నీ వంశము నందు 33 వ తరము నడుచుచుండగా, బాపనార్యులు 33 వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మ గారి 33 వ తరము నడుచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల యింట, అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్టింపబడును. వత్సవాయివారికి, మల్లాదివారికి, వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి యిదే నా అభయము! మీ వంశస్థులలో ఎవరయినా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్యభావ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేనయినా సరే ఆరాధించిన యెడల దత్త శునకములు అదృశ్య రూపమున కాపలా కాయుచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్యరూపములలో, అదృశ్య శునకరూపమున సదా రక్షగా నుండును.

అంతట వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదులవారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నులనుండి ఆనందబాష్పములు రాలుచుండెను. బాపనార్యుల నోట మాటరాలేదు. సుమతీ మాత ఇదంతా కలా? వైష్ణవమాయయా? అని సందేహములో పడెను. అప్పలరాజుశర్మ మనస్సు మూగపోయెను. శ్రీపాదులవారి అన్నలిద్దరునూ శ్రీపాదుల వంక భయముభయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా? లేక దత్తప్రభువా? ఏమిటి ఈ వింత? అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు హేళనబుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేనిట్లంటిని. “శ్రీపాదా! ఆయా స్పందన శక్తులు మానవరూపము పొందినపుడు భార్యలుగా ఉన్నవి గదా మరి. ఇది స్త్రీ లంపటత్వము గాక మరేమిటి? అవతారపురుషుల విషయములో యిదిలీల. మరి మాబోటి వారి విషయములలో స్త్రీ లంపటత్వము? ఏమి పక్షపాతవైఖరి?”



శ్రీపాదులిట్లనిరి, “శ్రీకృష్ణునకు అష్టభార్యలు, పదహారువేల గోపికలున్ననూ అతడు నిత్య బ్రహ్మచారియే! అంతేగాని నీవనుకొనునట్లు స్త్రీ లంపటుడు కాడు, అది దేహసంబంధము ఎంతమాత్రమునూ కాదు. కేవలము ఆత్మా సంబంధ రీత్యా భార్యలు. భరించబడు ఆత్మ భార్య. భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడే మానవత్వము పొందునట్లు శపించబడినపుడు శచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడు అయిదు రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది పంచభర్తృక అయిననూ శయన సుఖము పొందినది కేవలము అర్జునునితో మాత్రమే! ధర్మమూ వేరు, ధర్మసూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకొనేది అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే! మత్స్య యంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి ఆరు లక్షణములుండును.



రూపము లక్ష్మిని పోలి యుండవలెను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగా నున్నది. క్షమాగుణములో భూదేవిని పోలి యుండవలెను. సహదేవునికి భవిష్యత్తులో జరుగబోవు విషయములన్నియునూ తెలియును. కౌరవ, పాండవ యుద్ధము జరిగితీరునని తెలియును. అయితే అది జరుగుటకు ముందు ఎన్నియో సంఘటనలు జరుగవలసినవి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నియునూ తలంచుకొన్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా నుండెడిది. అందువలన సహదేవునితో వ్యవహరించునపుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించెడిది. భీముడు తిండిపోతు. భోజనము మిక్కుటముగా చేయుటవలన మహాబద్దకస్తునిగా తయారయినాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకొనుటయందు కూడా బద్ధకము వహించెడివాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించునపుడు దాసివలెనే ప్రవర్తించెడిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సును వేధించెడివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకి మంత్రివలె చక్కటి సలహాలనిచ్చేడిది. నకులుడు రెండు వానచినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పరి. అంతటి సునిశిత యుద్ధవిద్యా నైపుణ్యమునకు సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసెడిది. భోజన పదార్థములను రుచికరముగా, అతని మనస్సునకు సంతుష్టినిచ్చెడివి, అతని యుద్ధ విద్యాసాధనకు అనుగుణమయినవి తయారు చేసి ద్రౌపది అందించెడిది. తల్లి, బిడ్డ మనసు తెలుసుకొని అడుగకుండగనే భక్ష్య భోజ్యముల నందించునట్లు, ద్రౌపది నకులునితో వ్యవహరించెడిది. శయ్యా సుఖమునందించుటలో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించెడిది. ధర్మభంగము కాకుండ పంచభర్తృక అయిననూ శయ్యాసుఖమును యిచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే!

సుబ్బయ్య శ్రేష్ఠి! నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖము నందివ్వలేదు. బిల్వమంగళుడు, ఇంకా మరెందరో ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాలస్వామిని దర్శించునపుడు కాలకర్మ కారణ వశమున చింతామణియు, బిల్వమంగళుడును నీకు అచట తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురమునకు తీసుకువచ్చెదవు. అపుడు మీకు ధర్మబోధ చేసెదను.



అంతట నరసింహవర్మగారు శ్రీపాదుని తమ ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో యిట్లనిరి. “తాతా! మనమిద్దరమునూ రేపు గుఱ్ఱపుబండిలో మన భూములను చూచుటకు పోయెదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడి భూమాత నన్ను శ్రీపాదప్రభూ! నీ పాదస్పర్శతో నన్ను పునీతుని చేయవా? అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదు గదా!” అని అనెను. అంతట వర్మగారు “నాయనా! శ్రీపాదా! నాదొక చిన్న మనవి. మనకు శ్రీ పీఠికాపురమునకు సమీపముననే కదా భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లెనేర్పరచి వారిచేత మన భూములను సాగు చేయించ దలచితిని. పల్లెప్రజలకు భూములను తక్కువ కౌలునకిచ్చి, జమిందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకమునకు నియోగించిన బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదు గదా!” అనిరి. శ్రీపాదులు నవ్వుచూ, “తాతా! నీవు నీ జమిందారీ విషయమునే ఆలోచించితివి గాని నా జమిందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారిని కరిణీకము చేయమందువు, ఆ తరువాత శ్రీపాదా! నీవు ఈ కరిణీకము చేయవలసినది అని అందువు. ఘండికోట శ్రీపాద శ్రీవల్లభరాజ శర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేను చేయబోయే కరిణీకము విశ్వవ్యాప్తమయినది. నా లెక్కలు నాకున్నవి. ప్రతీరోజు కోట్లకొలది పుణ్యరాశులు, మణులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలినిని కదిలించుట. మనుష్యులకున్నట్లే గ్రామములకు, పట్టణములకు, పుణ్య క్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్రసింధువేదము తెలిసినవారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగరహస్యము. పీఠికాపుర కుండలినిని బాపనార్యులగారి, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి 33 వ తరములో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్ట వశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశము నందలి ప్రతీ క్షణమును సద్వినియోగము చేసుకొనుడు.” అని చెప్పిరి. నాయనా! శంకరభట్టూ! నరసింహవర్మగారు శ్రీపాడులవారిని పీఠికాపురములో శాశ్వతముగా నుండునట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి.

శ్రీపాదుల వైభవము





నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులో నున్నది. శ్రీపాదులవారు తామే స్వయముగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదముగా అజ్ఞానముతో ప్రశ్నించితిని. “శ్రీపాదా! నీవు శ్రీకృష్ణుడననుచున్నావు. మరి అష్టభార్యలు, పదునారు వేల గోపికలు ఈ అవతారమున కూడా కలరా?” అంతట శ్రీపాదులు మందహాసముతో “నా యొక్క అష్టవిధ ప్రకృతియే అష్టభార్యలు. నాది షోడశకళాపరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరమునుండి, నా మనస్సునుండి, శ్రీపాద శ్రీవల్లభ అవతారమనెడి ఈ దివ్యాత్మ నుండి దశదిశలలోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతీ క్షణమునూ వెలువడుచుండును. ఈ విధముగా ప్రతీ క్షణమునూ ఒక్కొక్క కళకూ శరీర, మనో, ఆత్మతత్త్వముల నుండి 10 * 10 *10 = 1000 స్పందనలు వెలువడుచుండును. ఈ రకముగా పదునారు కళల నుండి 16 ,౦౦౦ స్పందనలు వెలువడుచుండును. ఇవన్నియూ నా పదహారు వేల గోపికలే! పూర్వావతారమున అవి మానవరూపములో ఆవిర్భవించినవి. ఈ అవతారమునవన్నియునూ నిరాకారముగా స్పందనశీలముగా నున్నవి.
నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించిననూ తప్పేమియూ లేదు. అవి అన్నియూ నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివ స్వరూపమును, విష్ణు స్వరూపమును, బ్రహ్మ స్వరూపమును ఆరాధించవచ్చును. అదే విధముగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకులయొక్క రకరకముల సాధనావస్థలు, కాల కర్మ కారణములు ఎన్నియో జీవపరిణామముపై ప్రభావము చూపును.” అని వివరించిరి.

నరసింహరాజ వర్మకు ఆ రాత్రి నృశింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. అవి (1 ) కుందపాద నరసింహమూర్తి (2 ) కోప నరసింహమూర్తి (3 ) దివ్య నరసింహ మూర్తి (4 ) బ్రహ్మాండ నరసింహమూర్తి (5 ) సముద్ర నరసింహమూర్తి (6 ) విశ్వరూప నరసింహమూర్తి (7 ) వీర నరసింహ మూర్తి (8 ) క్రూర నరసింహ మూర్తి (9 ) భీభత్స నరసింహమూర్తి (10 ) రౌద్ర నరసింహమూర్తి (11 ) ధూమ్ర నరసింహమూర్తి (12 ) వహ్ని నరసింహమూర్తి (13 ) వ్యాఘ్ర నరసింహమూర్తి  (14 ) బిడాల నరసింహమూర్తి (15 ) భీమ నరసింహమూర్తి (16 ) పాతాళ నరసింహమూర్తి (17 ) ఆకాశ నరసింహమూర్తి (18 ) వక్ర నరసింహమూర్తి (19 ) చక్ర నరసింహమూర్తి (20 ) శంఖ నరసింహమూర్తి (21 ) సత్త్వ నరసింహమూర్తి (22 ) అద్భుత నరసింహమూర్తి (23 ) వేగ నరసింహమూర్తి (24 ) విదారణ నరసింహమూర్తి (25 ) యోగానంద నరసింహమూర్తి (26 ) లక్ష్మీ నరసింహమూర్తి (27 ) భద్ర నరసింహమూర్తి (28 ) రాజ నరసింహమూర్తి (29 ) వల్లభ నరసింహమూర్తి మిగతా (30 ) వ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభులవారిని చూచెను. (31 )వ నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతీ అవతారమును చూచెను. (32 ) వ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురమున నివసించెడి స్వామిసమర్ధునిగా చూచెను.

శ్రీనివాసుని వృత్తాంతము



నాయనా! రేపు పరమపవిత్రమైన రోజు. కన్యామాసమునందు శ్రవణా నక్షత్రము, ద్వాదశి నాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీ వేంకటేశ్వరుడు అర్చారూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమినాడు, విళంబినామ సంవత్సరములో కుబేరుని నుండి ధనసహాయము పొంది అప్పు పత్రము వ్రాసియిచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిరా నక్షత్రము నందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణా నక్షత్రమునందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథి యందు ఉత్తరఫల్గుణీ నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణము జరిగినది. శ్రీనివాస ప్రభువు కూడా భారద్వాజస గోత్రమునందు అవతరించినాడు. పాండవుల వంశములోని సుధన్వుడికి నాగకన్యక ద్వారా జన్మించినవాడు ఆకాశమహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుధానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాసప్రభువు అగస్త్యమహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము, తొండమానుడికి సగము పంచినాడు.

సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో, “నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయునూ మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిశ్శాస్త్ర రీత్యా పరమపవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి బిల్వమంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకొని రాబడిరో, వారిని శ్రీగురుడు ఏ విధముగా కటాక్షించినది, నరసింహవర్మగారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియు, రాబోవు కాలమునందు ఎంతటి చిత్రవిచిత్ర విషయములు జరుగుచున్నదియూ, శ్రీవారి ఆఖరి అవతారముగా కల్క్యావతారమునకు ముందు జరుగబోవు లీలలను వివరించు చెప్పెదను.” అని వచించి నన్ను దాపులనే యున్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచట రెండు ఈతాకుల చాపలుండెను. నాలుగు మేలుజాతి కుక్కలు ఆ కుటీరమును కాపు కాయుచుండెను.

శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము

శ్రీపాదులవారి లీలలు అనితరసాధ్యములు. అత్యంత హృదయంగమములు. వారి స్మరణ మాత్రమున అనేక జన్మములనుండి పేరుకొని యున్న పాపరాశులు భస్మీపటలమగును.

శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.

ఇవి కూడ చదవండి : శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1 | sripada srivallabha charitamrutam sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -2 sripada charitamrutam Chapter-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -3   sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -4 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -5 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -6 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.. అధ్యాయం -7  

Related posts

Share via