October 17, 2024
SGSTV NEWS
Spiritualsripada charitamrutam

sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -15


 
                          అధ్యాయము 15

      బంగారప్ప, సుందరరామశర్మల వృత్తాంతము

నేను శ్రీ దత్తానందులస్వామి వారినుండి శెలవు తీసుకొని నా ప్రయాణాన్ని కొనసాగించుచున్నాను. దారిలో దప్పిక అగుటవలన అక్కడకు దగ్గరనే ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళితిని. అచట నీరు చేదుకొనుటకు ఒక చేద కూడా కలదు. నేను నూతిలోపలికి తొంగిచూద్దును గదా! ఒక వింత దృశ్యం కంట పడినది. నూతి ఒరల మధ్య భాగము నుంచి మొలిచిన ఒక చెట్టు కొమ్మను ఆధారముగా చేసుకొని తలక్రిందులుగా ఒక వ్యక్తి వేలాడుచుండెను. ఆ అపరిచిత వ్యక్తి నన్ను ప్రేమతో, శంకరభట్టూ! అని పిలిచెను. ఆశ్చర్యముతో నా పేరు మీకెట్లు తెలిసిందని అడిగితిని. అందులకతడు, “నీ పేరు మాత్రమే కాదు, నీవు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు కురుంగడ్డ వెడుతున్న విషయం కూడా నాకు తెలియును. నిన్ను కలుసుకునే నిమిత్తమై మాత్రమే నేను వేచియున్నాను.” అని చెప్పెను.


అతడిని నూతిలోనుండి బైటకు తీయుట ఎట్లా అని నేను ఆలోచించసాగితిని. చేదకున్న త్రాడు బలహీనమైనది. నా ఆలోచనను పసిగట్టిన ఆ పుణ్యపురుషుడు “ప్రాపంచిక బంధములతో సంసార కూపమున బడిన మానవుడవు నీవు. బంధరహితుడనై యీ విచిత్ర యోగప్రక్రియలో ఆత్మానందమున ఉన్నవాడను నేను. నన్ను నీవేమి లేవనెత్తగలవు? నా యంతట నేనే లేచేడను. మనకు శక్తి చాలనపుడు శ్రీపాదులవారు దయతో శక్తి ననుగ్రహించెదరు.” అని అనెను. అట్లనుటయే తడవుగా కనురెప్ప పాటులో నా ప్రక్కన ఉండెను. నేను సంభ్రమాశ్చర్యములకు లోనయితిని. అతడిట్లు చెప్పసాగెను. “నా పేరు బంగారప్ప. నీవు దాహము గొనినట్లున్నావు. నేను నీ దప్పిక తీర్చెదను.” అని పలికి తక్షణమే చేదతో నీతిని తోడి తానూ గడగడ త్రాగుచుండెను. విచిత్రముగా నా దాహము కట్టబడెను. నేను ఆశ్చర్యపోయితిని.

అంతట మేమిద్దరమును కలిసి ప్రయాణము చేయసాగితిమి. అతడిట్లు చెప్పసాగెను. “నేను స్వర్ణకార కుటుంబమునకు చెందినవాడను. మంత్ర తంత్రములలో ప్రావీణ్యమును సంపాదించినవాడను. నాకు అయిష్టులయిన వారిని మంత్ర తంత్ర ప్రయోగాములతో చేతబడి చేసి చంపగల సామర్థ్యమును సంపాదించితిని. భూత ప్రేత పిశాచములతో సన్నిహితత్వమును కూడా పొందితిని. శ్మశానములలో వివిధములయిన కార్య కలాపములను చేసెడివాడను. నా పేరు వినినంతనే జనులు గడగడలాడెడివారు. నేను ఏ గ్రామమునకు పోయిననూ, అచ్చటి జనులు నేను భూతప్రేతములను ప్రయోగించుటద్వారా వారికి ఏ విధమైన కష్ట నష్టములను కలిగించెదనో అను భయముతో నాకు విశేషముగా ధనము నిచ్చెడివారు. వారొసంగిన ధనములో ఎక్కువ భాగము సదా నన్ను ఆశ్రయించి యుండు భూతప్రేతముల బలులకు ఉపయోగింపబడెడిది. సకాలములో బలులు సమర్పింపని యెడల ఆ భూతములు నాకే తీవ్ర హానిని కలిగింపగలవు. నా ముఖములో సాధారణ మనుష్యులకుండవలసిన ప్రసన్నత్వము లోపించి భూతప్రేతములకుండు వికృత కళలను, క్రూర స్వభావ లక్షణములను పెంపొందినవి. నా సంచారములలో ఒకసారి పూర్వ పుణ్యవశమున పీఠికాపురమునకు వచ్చితిని.


దత్తప్రభువుల అవతారముచే పవిత్రమైన యీ నగరమందు క్షుద్రములయిన కుతంత్రములకును, పరస్పర కలహములకును కూడ లోటులేదు. నేను శ్రీ బాపనార్యులవారి గురించి, శ్రీపాదులవారి గురించి కర్ణాకర్ణిగా చిత్రవిచిత్రములయిన విషయములను వింటిని. మునుముందుగా నేను బాపనార్యులవారిని సంహరింపదలచితిని. నేనొక కొలను వద్దకుపోయి దోసిళ్ళకు దోసిళ్ళు నీటిని త్రాగుచుంటిని. నేను ఎవరినయినా చంపదలచుకొన్నపుడు నా వద్ద అనేక రకములయిన ప్రక్రియలుండెడివి. అందులో ఒకటి నేను చంపదలచుకున్న మనుష్యుని రూపమును ధ్యానించుచూ నీటిని త్రాగినచో, నేను త్రాగిన నీరంతయునూ ఆ మనుష్యుని పొట్టలో చేరును. నీటితో పొట్ట నిండిపోగా ఆ వ్యక్తి పొట్టపగిలి చచ్చును. శ్రీపాదుల వారి లీలావిశేషములు అనూహ్యములు. నేను కొలనులో నీరు త్రాగు సమయమున బాపనార్యుల వద్ద శ్రీపాదులుండిరి. శ్రీపాదుల వారు ప్రేమతో బాపనార్యుల పొట్టను నిమిరిరి. నేను ఎంత నీరు త్రాగుచుండిననూ అది శ్రీపాదుల వారి మహిమ వలన ఆవిరియై పోవుచున్నది. నీటిని త్రాగి త్రాగి నేనే అలసిపోయితిని. కాని బాపనార్యులవారు మాత్రము నిక్షేపముగా నుండిరి. నా యీ క్షుద్రవిద్య ఎందులకు యీ రోజున విఫలమయ్యెనాయని ఆవేదన చెందితిని. కారణము తెలియరాకుండెను.

శ్రీపాదులు క్షుద్రోపాసకుల పీడ తొలగించుట

నా వద్ద సర్పమంత్రమొకటుండెడిది. అది పఠిoచినచో వెంటనే నేను మనస్సులో ధ్యానించిన వ్యక్తి యింటివద్దకు ఎక్కడెక్కడి సర్పములు వచ్చిచేరి వానిని కాటు వేయును. నేను బాపనార్యులను ధ్యానించి ఆ సర్పమంత్రమును పఠించితిని. అపుడు అనేక సర్పములు బాపనార్యుల యింట చేరినవి. అయితే అవి ఆ యింటనున్న ఒక పందిరిపైకి ఎగబ్రాకి పొట్లకాయలవలె వ్రేలాడినవి. రెండు ముహూర్తముల కాలము గతించిన తరువాత ఆ సర్పములు ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి తిరిగి వెళ్లిపోయినవి. ఈ విధముగా నా రెండవ ప్రయత్నము కూడా విఫలమైనది. నా వద్ద నున్న భూతప్రేతములు బాపనార్యుల యింటి దరిదాపులకు కూడా పోలేమని నిష్కర్షగా చెప్పినవి. ఇదంతయునూ శ్రీపాదుల వారి చమత్కారమని లీలగా నాకు అర్థమైనది. నాలో యింకనూ రాక్షస ప్రవృత్తి అంతరించని కారణమున శ్మశానమునకు పోయి శ్రీపాదులవారి పిండిబొమ్మను చేసి, దానికి 32 స్థానములలో 32 సూదులను గ్రుచ్చితిని. ఈ మారణప్రక్రియ వలన శ్రీపాదులవారి శరీరములో ఆయా స్థానములలో రుగ్మతలు కలిగితీరవలెను. అంతేగాక ఆ సూదులు ద్రవరూపమును పొంది శ్రీపాదుల వారి శరీరములోకి యింకిపోయి శరీరమంతయును విషపూరితమై మరణము కలిగితీరవలెను. నా యీ ప్రయత్నము కూడా విఫలమయ్యెను. విచిత్రముగా ఒకానొక అర్థరాత్రి సమయమున నా పొట్టలో నీరు అధికముగా చేరుచున్నదను అనుభవము కలిగెను. నాకు ప్రాణాంతకముగా నుండెను. నా సర్పమంత్ర ప్రభావమునకు బాపనార్యుల యింట చేరిన సర్పములన్నియును పీఠికాపురములోని నా యొక్క తాత్కాలిక నివాస స్థానమునకు వచ్చి నన్ను కాటువేసినవి. శ్రీపాదులవారి పిండిబొమ్మకు ఎక్కడయితే నేను సూదులను గుచ్చితినో నా శరీరమునందు సరిగా అదే ప్రదేశములలో బాధ కలుగజొచ్చెను. ఈ విధముగా నా దుష్ట చర్యల యొక్క ప్రతిచర్యలను నా శరీరమునందే అనుభవింప సాగితిని. నరకయాతననుభవించితిని. చనిపోయిన బాగుండునని తోచినది. అయితే నాకు చావు రాకుండెను. నరకబాధలు ఎట్లుండునో చనిపోయిన గాని తెలియవు. కాని నేను ఆ రాత్రి బ్రతికుండగనే నరకబాధాలను చవిచూసితిని. భరించలేని బాధలు కలిగినపుడు ఏ మానవుడైననూ దైవము వైపునకు తిరుగక మానడు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని నేను నా మనస్సులోనే శరణుజొచ్చితిని.



నా మనోనేత్రమునకు శ్రేపాదుల వారి రూపము గోచరించి, “బంగారప్పా! నీవొనరించిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు యిహలోకములో బాధలు అనుభవించిన తదుపరి నరకములో కూడా బాధలను అనుభవింప వలసియున్నది. అయితే నీయందు కృప వహించి యీ ఒక్క రాత్రిలో నీవు పడెడి యాతనలద్వారా నీ పాపకర్మను ధ్వంసము చేయుచున్నాను. నీ యొక్క క్షుద్రవిద్యలు అన్నియూ నశించును. అయితే ఎవరయినా దాహము గొనియున్నవారు నీ మనోనేత్రములకు గోచరించినపుడు నీవు నీరుత్రాగి దప్పిక తీర్చుకున్నయెడల వారెంతటి దూరములో నున్నను వారు దాహార్తి తీరినవారగుదురు. తలక్రిందులుగా వ్రేలాడుట అను ఒకానొక యోగప్రక్రియ కలదు. దానిని అభ్యసించినచోనీవు ఆనందప్రాప్తిని పొందగలవు. నేటినుండి సాత్వికప్రవృత్తి ననుసరించి జీవింపుము. మా మాతాపితరుల గృహమునందు గాని, బాపనార్యుల వారి గృహమునందు గాని అడుగిడుటకు ఎన్నియో జన్మల పుణ్యము కావలెను. నీకు యీ జన్మమునందు అంతటి అదృష్టము లేదు. అదృష్టమనునది ఆకస్మాత్తుగా లభించునది కాదు. దురదృష్టమనునది విచక్షణారహితముగా యివ్వబడునది కాదు. పూర్వజన్మములోని పుణ్యకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు అదృష్టమని అందురు. పాపకర్మములు ఒక్కసారిగా ఫలితమిచ్చునపుడు దురదృష్టమని అందురు. ప్రాణము నొసంగునది పరమేశ్వరుడు గనుక ప్రాణము తీయు అధికారము కూడా పరమేశ్వరునికి మాత్రమే కలదు. మాతాపితలు జన్మదాతలు గనుక వారు పరమపూజ్యులు. వారిని వృద్ధాప్యములో అనాదరము చేసినవారి యందు నా కటాక్షము ఉండదు. నీవు క్షుద్రవిద్యలతో ఎందరో అమాయకులను అకాలమరణమునకు గురిచేసినావు. ఆ పాపఫలము నీకు శంకరభట్టు అను కన్నడ బ్రాహ్మణుడు కనుపించునంతవరకు ఉండును. అతడు దప్పిగొనియున్నపుడు నీవు నీ విద్యనుపయోగించి అతని దప్పికను తీర్చుము. అప్పుడు నీ పాపము నిశ్శేషమగును. ఆ శంకరభట్టు అనునతడు నా చరిత్రమును వ్రాయును.” అని చెప్పిరి. ఈ సంఘటన జరుగునాటికి శ్రీపాదులవారి వయస్సు ఏడెనిమిది సంవత్సరములుండును. నాయనా! శంకరభట్టూ! ఆ రోజు నుండి నీ కోసమే నేను వేచియున్నాను. నేడు నాకెంతయో సుదినము! అని బంగారప్ప అనెను. నాకు యీ గాధ అంతయునూ అయోమయముగా నుండెను.


అంతట నేనిట్లంటిని. అయ్యా! మీరు నీరు త్రాగిన యెడల మరియొకరి దప్పిక ఎట్లు తీరును? ఇందలి మర్మమును నాకు విశదపరచవలసినదంటిని. దానికి బంగారప్ప, “నాయనా! అన్నమయకోశము నందుండు జీవులు భౌతిక సంస్కారములను కలిగి భౌతిక ప్రపంచములో అనుభవములను పొందుదురు. ప్రాణమయకోశము నందలి జీవులు సూక్ష్మ శరీర చైతన్యమును కలిగియుందురు. మనోమయకోశము నందలి జీవులు మానసిక ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. విజ్ఞానమయకోశము నందలి జీవులు దానికి సంబంధించిన ప్రపంచముతో సంబంధమును కలిగియుందురు. ఆనందమయ కోశము నందలి జీవులకు ఆనందానుభవముండును. ప్రాణమయశక్తిని ఒకానొక యోగప్రక్రియ ద్వారా నేను ఇతర జీవుల ప్రాణమయశక్తితో అనుసంధానమొనరించెదను. తద్వారా, యీ తాదాత్మ్యభావము వలన యిది సాధ్యమగును. ఒకానొక యోగ ప్రక్రియ ద్వారా పూర్వకాలమున వాలి, తన ఎదురుగానున్న వానికంటె రెట్టింపు బలమును, శక్తిని పొందుచుండెను. అందువలననే రాముడు వాలిని చెట్టు చాటు నుండి వధించెను. విశ్వామిత్రమహర్షి రామ లక్ష్మణులకు బల అతిబల అను రెండు పవిత్ర మంత్రములనుపదేశించెను. ఈ మంత్రముల స్పందనలకు అనుగుణముగా ప్రాణశక్తిని సిద్ధపరచుకొనినయెడల విశ్వాంతరాళమునందున్న విశ్వశక్తిని తనలోనికి ఆకర్షించుకొన వీలుకలుగును. శరీరము పరిశుద్ధమైనది గానిచో, ఆ శక్తి మన శరీరములోనికి ప్రవేశించునపుడు విపరీతమైన బాధ కలుగుటయే గాక ఆ శక్తిని నిలుపుకొనలేక మరణము కూడా సంభవించును. పరిశుద్ధతాక్రమములో మానవ శరీరములు 12 దశలలో కలవు. శ్రీరాముని శరీరము 12 వ దశకు చెందినది. శ్రీదత్తుని శరీరము 12 వ దశకు కూడా అతీతమైనది. అందువలన దత్తావతారులయిన శ్రీపాదులవారియందు అనంతశక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము సహజ సిద్ధముగా నుండును.” అని చెప్పెను. అంతట నేను “అయ్యో! గౌతమమహర్షి శాపము వలన అహల్య శిలారూపమును పొందెననియూ, శ్రీరాముని పాదధూళి సోకినంతనే శాప విమోచనమయ్యెనని అందురు గదా! ఆమె నిజముగా శిలారూపమును పొందెనా? లేక యిందులో ఏదయినా రహస్యార్థమున్నదా?” అని ప్రశ్నించితిని.



అంతట బంగారప్ప, “మంచి ప్రశ్ననే అడిగితివి. అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడు సంబంధమును కలిగియుండెను. ఈ విషయమును తెలియక క్రోధావేశముతో గౌతముడు అహల్యను ‘శిల’కమ్మని శపించెను. అంతట అహల్య గౌతముని, ఓ తెలివిమాలిన మునీ! ఎంతపని చేసితివి? అనెను. గౌతమునిలోని తెలివి నశించి పిచ్చివాడై అనేక దివ్యస్థలములను దర్శించుచూ శివానుగ్రహమున స్వస్థత నందెను. చైతన్య పరిణామక్రమములో ‘శిల’ ప్రథమ స్థానము లోనిది. దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో నుండును. శిలలలో కూడా అనేక జాతులున్నవి. ఒకానొక శిలలోని ఆత్మ ఆ శిలలో కొన్ని సంస్కారములను పొందుచున్నది. ఆ అనుభవముల తర్వాతా మరియొక జాతి శిలలో ఆ ఆత్మ ప్రవేశించును. ఖాళీగానున్న ప్రథమశిలలో మరియొక ఆత్మ ప్రవేశించును. ఏ ఆత్మ ఏ శిలలో ఎంత కాలము ఉన్నదనుట కేవలము యోగదృష్టి కలవారికి మాత్రమే తెలుసుకొన వీలు కలుగును. ఒకానొక శిలలో ఒక ఆత్మ ఉండగా, ఆ శిల రెండుగా ఖండించబడెననుకొనుము. ఖండించబడిన శిలలో ఒక ఆత్మ ఉండగా, మరియొక ఖండములో మరియొక ఆత్మ ఉండి కొన్ని అనుభవములను పొందును. అవి ఏ రకమయిన అనుభవములు పొందుచున్నవో వాటికే తెలియదు. అయితే శిలాస్థితిలో ఉన్నపుడు ఆ ఆత్మ అపరిమితమైన బాధను అనుభవించును. వాటికి జీవము లేదు గాని బాధా అనుభవము మాత్రముండును.” వివరించెను.

జీవులకు వివిధ యోనుల యందు కలుగు యాతనల వివరణ

అంతట నేను “అయ్యా! జీవమున్నప్పుడే కదా బాధగాని, సుఖముగాని అనుభవమయ్యేది? అటువంటప్పుడు నిర్జీవమైన పదార్థముగా ఉన్నప్పుడు అపరిమిత వేదన ఉండుట ఎట్లు సాధ్యపడును?” అని ప్రశ్నించితిని. అంతట బంగారప్ప, “జీవాత్మ, పరమాత్మలో కలిసియున్నప్పుడు బ్రహ్మానందమును అనుభవించును. అది వాక్కులో వివరించుటకు వీలుకానిది, మనస్సులో తెలియరానిది. అదే విధముగా జీవాత్మ, శిలలో ఉన్నప్పుడు బ్రహ్మానందమునకు పూర్తి విరుద్ధమైన మహా దుఃఖమును అనుభవించును. అది కూడా వాక్కులో వివరించుటకు సాధ్యము కానిది, మనస్సులో తెలియరానిది,





అనగా ప్రాణమనునది లేనపుడు అనుభవింపబడే మహాదుఃఖమది. అనేక శిలలలో ఈ ఆత్మ పరిభ్రమించుచూ, తెలియరాని, ఊహించరాని, ప్రాణరహితమైన మహాదుఃఖములను అనుభావిన్చుచూ లోహములో ప్రవేశించును. నానావిధ లోహములలో అది సంచరించుచూ నిద్రాణస్థితిలోనున్న ప్రాణమును అనుభవించును. ఒకానొక లోహముపై, దాని సరిపడని విషపూరిత పదార్థమును పోసినావనుకొనుము. దానిలో నున్న ప్రాణము నిద్రాణస్థితిలోనే బాధననుభవించి ఆ లోహమును విడచి మరియొక లోహములోనికి ప్రయాణించును. లోహజాతులలో తాదాత్మ్యము నొందిన ఆత్మ పరిణామక్రమములో వృక్షములో ప్రవేశించును. ఇదివరకు నిర్జీవ పదార్థముగా నున్నపుడు నిద్రాణమైయున్న ప్రాణము యిప్పుడు చైతన్యవంతమై నితారుగానో, వాలుగానో ఉండవలెననెడి సంకల్పమును కలిగి యుండును. అయితే ధృడత్వమునకు ఏర్పాటైన వేళ్ళు భూమిలోనికి చొచ్చుకొనిపోయి దాని పరిణామమునకు వీలు కలిగించును. ఆత్మ ఈ విధముగా అనేక రకముల వృక్ష జాతులలో ప్రవేశించి అనేక అనుభవములను పొందుచూ సగము జీవనసహితముగను, సగము జీవనరహితముగను ఉండెడి స్థితి నుండి వెలువడి క్రిమికీటకములుగా పరిణతి చెందును. ఈ దశలో చలనము కావలెననెడి దాని సంకల్పము నెరవేరును. ఈ విధముగా అనేక క్రిమికీటకాదులుగా అనేక సంస్కారములను పొందుచూ మత్స్య రూపమును పొందును.

ఆ తర్వాత పక్షిరూపమును పొందును. అనేక రకముల పక్షుల రూపములలో అనుభవము పొందిన తదుపరి నాలుగు కాళ్ళు కలిగిన జంతువులుగా జన్మించును. జంతువులలో పరమ పవిత్రమైన గోజన్మను పొందును. మానవులకు తల్లివలె క్షీరమునొసంగుట చేత తనకు తెలియకుండగనే పుణ్యమును సంపాదించును. వృషభ రూపములో ఆహారధాన్యముల ఉత్పత్తిలో సహకరించుటచే పుణ్యము సముపార్జితమగును. తరువాత జన్మమునందు మానవ శరీరమును పొందును. సంస్కారముల వలన ఆలోచనలు కలుగును. అవి చేతలుగా మారును. ఈ విధముగా పుణ్య కర్మలు, పాపకర్మలు చేయబడుచుండును.

సాధన పథమున సప్తభూమికల విచారణ

మానవుడు తన పరిణామక్రమములో సప్తభూమికలందుండును. మొదటి భూమికయందు స్థూల దేహేంద్రియములు, సూక్ష్మ దేహేంద్రియములు ఏకకాలములో ఉపయోగించబడును. రెండవ భూమికయందు సూక్ష్మ శరీరేంద్రియములతో సూక్ష్మ ప్రపంచానుభవమును పొందుచూ చిన్న చిన్న మహిమలను చేయగల సామర్థ్యమును పొందును. మూడవ భూమిక యందు సూక్ష్మ శరీరముతో సుదూర ప్రాంతములకు ప్రయాణము చేయగల శక్తిని పొందును. మూడు, నాలుగు భూమికల మధ్య వశీకరణ కేంద్రమొకటి ఉన్నది. వశీకరణకు లోనయినప్పుడు ఏ స్థితిలో ఉంటే అదే స్థితిలో ఉండిపోవడం జరుగుతుంది. గౌతముడు అహల్యను శపించినప్పుడు చాల దిగ్భ్రాంతికి లోనయింది. అపుడు ఆమె తాను శిలా చైతన్యములో నున్నట్లు భావించుకొన్నది. ఆమె శ్రీరామ దర్శన పర్యంతము వరకు అదే స్థితిలో ఉండిపోయినది. అహల్య శరీరము శిలాస్థితిని పొందలేదు. ఆమె మనస్సు మాత్రమే ఆ స్థితిని పొందినది. అంటే మూడు, నాలుగు భూమికల మధ్యనున్న వశీకరణ కేంద్రములో ఉండిపోయినది. శ్రీరాముని పాదధూళి సోకగనే ఆమె మనోపుష్పము వికసించనారంభించినది. ఆమె తిరిగి తన సహజస్థితిని పొందినది.



నాలుగవ భూమికకు చేరిన ఆత్మకు అత్యంత విస్తారమైన యోగాశాక్తులు లభించును. తమ యోగశక్తులను లోకకళ్యాణార్థము అంతరాత్మ ప్రబోధానుసారం వినియోగిస్తే పై స్థితిలోనికి పోయే వీలుంటుంది. అట్లుగాక పాపకార్యముల నిమిత్తము, తుచ్చమైన స్వార్థ ప్రయోజనాల కోసం యీ శక్తులను వాడితే పతనావస్థను చెంది శిలాచైతన్యములోనికి పడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత అనేక వేల జన్మలనెత్తిన గాని మానవజన్మలోనికి అడుగు పెట్టే అవకాశం ఉండదు. అయిదవ భూమికలో నున్నవారు సంకల్పజ్ఞానులు. ఆరవ భూమికలో నున్నవారు భావజ్ఞానులు. సంకల్పజ్ఞానులు దైవ సాక్షాత్కారం కోరుతూనే ప్రాపంచిక కార్యకలాపములను కూడా సాగిస్తారు. భావజ్ఞానులకు ప్రాపంచిక కార్యకలాపముల ధ్యాస చాల తక్కువగా ఉంటుంది. ఏడవభూమికలో నున్నవారు పరమాత్మ యందుండే అనంత స్థితి యొక్క జ్ఞానమును పొందగలుగుతారు.” అని తెలియపరచెను.

అవతార పురుషులకు, సాధకులకు గల వ్యత్యాసము

బంగారప్ప చెప్పిన మాటలను ఆలకించిన తదుపరి నా మనస్సులో కొన్ని సందేహములు కలిగినవి. వాటిని తీర్చుకొను నిమిత్తం యిట్లు ప్రశ్నించితిని. “అయ్యా! జీవులకు మాత్రమే పరిణామ క్రమముండునా? లేక అవతారములకు కూడా యివి వర్తించునా? ” అంతట బంగారప్ప “అవతారములు కాలానుగుణ్యముగా వచ్చుచుండును. మానవుడు భగవంతుడైన యెడల సమర్థ సద్గురువని పిలువబడును. దైవము మానవుడిగా వచ్చిన యెడల అవతారమనబడును.


మత్స్యము నీటిలో వడిగా పరిగెత్తగలదు. కూర్మము నీటిలోనూ, భూమిమీద వాడిగా ఉండగలదు. వరాహము అనగా ఖడ్గమృగము, భూమిమీద వాడిగా పరిగెత్తగల జంతువు. నారసింహము, మృగములలో శ్రేష్ఠమైన సింహపు ముఖాకృతితోను, మిగిలిన భాగము మనుష్య రూపముతోను ఉన్న అవతారము. యాచనాప్రవృత్తిని గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారము. రజోగుణ ప్రధానముగా వచ్చినది పరశురామావతారము. సత్త్వగుణ ప్రధానముగా వచ్చినది రామావతారము. త్రిగుణములకు అతీతమైన నిర్గుణ తత్త్వ ప్రధానముగా వచ్చినది శ్రీకృష్ణావతారము. కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారము. సమస్త సృష్టిలోని ఏకత్వము నందలి అనేకత్వమును, అనేకత్వము నందలి ఏకత్వమును తన యందె నిలుపుకొనివచ్చిన అత్యంత అద్భుతమైన, అత్యంత విలక్షణమైన యుగావతారము శ్రీపాద శ్రీవల్లభావతారము. శ్రీపాదుల వారికి ఋణానుబంధము లేని యోగసంప్రదాయములు గాని, మతములు గాని, ధర్మములు గాని సృష్టిలో లేనేలేవు. శ్రీపాదులవారి స్థితి ఎంతటి ధీమంతులకైనను గోచరము కానిది. వారికి వారే సాటి. అన్ని సిద్ధాంతములునూ, అన్ని సంప్రదాయములును వారి యందు సమన్వయము చెందును. ఈ సృష్టికంతటికినీ ఆది బిందువు, అన్త్యబిండువు వారే. స్పందనశీలమైన ఈ జగద్వ్యాపారము నంతయునూ పర్యవేక్షించునది, సంకల్పించునది, గతి నొందించునది వారే. ఇది నిగూఢమైన దైవ రహస్యము. సప్త ఋషులకే అంతు పట్టని వారి స్థితిని నేనేమని వర్ణించగలను? నాయనా! శంకరభట్టూ! నీవు ధన్యుడవు! వారి అవ్యాజ కారుణ్యమును పొందగలిగిన వారే ధన్యజీవులు, అన్యజీవులు వ్యర్థజీవులు.” అని చెప్పెను.

సత్కర్మ, దుష్కర్మల ఫల వివరణ

“అయ్యా! నాకొక సందేహము కలదు. సమస్త కర్మలకును ప్రబోధకులు వారే అయినపుడు లోకములో కొందరిని మంచివారు గానూ, మరికొందరిని చెడ్డవారుగాను పుట్టించనేల? అని నేనడిగితిని.


దానికి బంగారప్ప పెద్దగా నవ్వి, “నాయనా! నీవు మంచి ప్రశ్ననే అడిగిటివి. సృష్టి యంతయునూ ద్వంద్వముల సాయము చేతనే ఏర్పడినది. మృత్యు భయము లేకపోతే కన్నతల్లి కూడా బిడ్డను ప్రేమించజాలదు. వేదములలో పురుష శబ్దము ఆత్మ అనే అర్థములో వాడబడినది. అంతేగాని పురుషాధిక్యతను సూచించు అర్థములో కాదు. మానవధర్మములకు, జంతుధర్మములకు ఎంతటి వ్యత్యాసము కలదో మానవ ధర్మములకు, దేవతా ధర్మములకు కూడా అంతటి వ్యత్యాసముండును. ద్వంద్వములే లేకున్న వికాసముగాని, పరిణామముగాని సాధ్యము కాదు. భగవంతుడు సర్వశక్తిమంతుడనిన యెడల, అన్నియునూ మంచిశక్తులు మాత్రమే వారియందు కలవని అర్థము కాదు. నీవు యీ ప్రపంచములో చూచేది మోసము, దగా, దౌర్జన్యము వంటివి కూడా ఆ సర్వశక్తులలో ఒక భాగమే. దుఃఖము ఉన్నది కనుకనే సుఖము కోరుచున్నాము. దుఃఖము గురించిన జ్ఞానము లేనిదే సుఖానుభవము అనునది తెలియరాదు. మనము చూచెడి యీ కోటానుకోట్ల నక్షత్ర రాశులన్నియు మొట్టమొదట అస్త్యవ్యస్తముగా ఏర్పడినవే! అవి పరస్పరము డీకొని మరికొన్ని నక్షత్ర రాశులేర్పడినవి. ఈ విధముగా అనేక సార్లు ఏర్పడిన తరువాత ప్రస్తుతము మనకు దృగ్గోచరమగుచున్న సువ్యవస్థితమైన నక్షత్రరాశులు ఏర్పడినవి. మన సౌర కుటుంబమునందలి గ్రహములు సువ్యవస్థితమైన కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరుగుచున్నవి. ఆ సూర్యునకు ధృవుడు ఆధారము. ఈ రకముగా పరస్పర ఆకర్షణ వికర్షణలలో సృష్టి నడుచుచున్నది. పరమాత్మ యందు ఆకర్షణ కలిగినవాడు ఆస్తికుడై, సత్కర్ముడగుచున్నాడు. వికర్షణ కలిగినవాడు నాస్తికుడై, దుష్కర్ముడగుచున్నాడు. ఆస్తికులకునూ, నాస్తికులకునూ వారే ఆధారము. సత్కర్ములకునూ, దుష్కర్ములకునూ వారే ఆధారము. ఈ సృష్టిలీలలో ఏదియునూ స్థిరము కాదు. నీవు యీనాడు ఎవరిని సత్కర్ములుగా ననుకొనుచున్నావో వారు కొన్ని జన్మలలో దుష్కర్మలనాచరించిన వారే! అందువలననే యీ జన్మలో ధర్మతత్పరులైయున్నను వారికి దుఖములు తప్పుటలేదు. అటులనే దుర్మార్గులు సుఖములను అనుభవించుట కూడా వారి పూర్వజన్మకృత పుణ్యఫలానుభవము కాని వేరు కాదు. సామాన్య పాపముకాని, పుణ్యము కాని వెంటనే ఫలితముల నీయవు. అయితే తీవ్రమైన పాపముగాని, మహాపుణ్యముగాని చేసిన యెడల శీఘ్రముగనే ఫలించును. మానవుడు ఏ విధముగా నడుచుకొన్నయెడల సుఖముగా జీవింపవచ్చునో సద్గ్రంథములు తెలియజేయుచున్నవి. మంచి పని చేయుటకుగాని, చెడుపని చేయుటకుగాని వానికి పరిమితమైన స్వేచ్ఛ యీయబడినది. అధర్మము మితిమీరి ధార్మికులు దిక్కు తోచని స్థితిలో నున్నపుడు పరమాత్మ తన మాయచేత అవతరించుచున్నాడు. చావు, పుట్టుకలు లేని దైవము అవతారము ధరించి మానవుడిగా మన మధ్యనుండుట అద్భుతమైన విషయము.” అని చెప్పిరి.  

మహారాజునకు గర్వభంగము

పీఠికాపురము సంస్థానమునేలు రాజు ఒక్కొక్క పర్యాయము మారువేషములో తిరిగి ప్రజల స్థితిగతులను తెలుసుకొనెడివారు. ఒకసారి ఆ మహారాజునకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము చేసుకొనవలెననెడి కోరిక కలిగినది. వెంటనే తన భటులను అప్పలరాజుశర్మ యింటికి పంపెను. ఆ తాఖీదు సారాంశమేమనగా, ‘శీఘ్రముగా శ్రీపాదులవారిని తీసుకొని అప్పలరాజుశర్మయు, బాపనార్యులును కోటలోనికి మహారాజు వారి సముఖమునకు రావలసినదని.’ అవమానకరమైన యీ ఆహ్వానమును శ్రీపాదులవారు తిరస్కరించిరి. అప్పలరాజుశర్మకు కోటలోనికి వెళ్ళుటకు యిష్టము లేదు. బాపనార్యులు వంటి మహాపురుషులు అంతరాత్మ ప్రేరణ ఉన్నగాని ఎటువంటి చోటికిని పోరు. బాపనార్యులు శ్రీపాదుల వారితో, “నాయనా! బంగారూ! కోటలోనికి వెళ్ళుటకు నీకు అభ్యంతరమా!” అని ప్రశ్నించిరి. దానికి శ్రీపాదులు “తాతా! మహారాజునకు భక్తిలేదు. నా దర్శనము అంత సులభమైనది కాదు.” అనెను. శ్రీపాదులవారు భటులతో “మీ మహారాజునకు నన్ను చూడవలెనన్న స్వయముగా యిచ్చటకు రావచ్చును. అతడు కేవలము యీ సంస్థానమునకు మాత్రమే రాజు. నేను యీ సృష్టికంతకునూ రారాజును, చక్రవర్తిని. నేను సమస్త భువనములకు సార్వభౌముడను. కనుక నా వద్దకు వచ్చునపుడు వట్టి చేతులతో రారాదు. నజరానా కూడా తీసుకురావలెను. రాజు నన్ను గురువుగా భావించిన యెడల గురుదక్షిణ కూడా తీసుకురావలయును.” అని కరాఖండీగా చెప్పిరి.



శ్రీపాద శ్రీవల్లభులు సమస్యలను సృష్టించుటలో బహునేర్పరి. అదే విధముగా సమస్యలను పరిష్కరించుటలో కూడా బహుచతురులు. మహారాజునకు ఆగ్రహము కలిగినచో రాగల పరిణామములను గూర్చి బాపనార్యులు, అప్పలరాజుశర్మ, వెంకటప్పయ్య శ్రేష్ఠి, నరసింహ వర్మ యోచన చేయుచుండిరి. భటులు తెచ్చిన యీ వార్తను విన్న మహారాజు క్రోధనతో ఊగిపోవుచుండెను. ‘నేను తలచుకున్న ఆ బుడుగు బాపనయ్యల బ్రతుకులేమగునో తెలియజెప్పెదగాక! నేనెంతటి శక్తిమంతుడనో వారికి ఎరుకలేదు.’ అని రాజు బిగ్గరగా అరచెను. ఆ అరుపు అరచిన వెంటనే అతనిలోని శక్తి యావత్తు బయల్వెడలి నిర్వీర్యుడయ్యెను. శోషవచ్చి క్రింద పడిపోయెను. పరిచారకులు సేవలు చేసిరి. అయిననూ అతడు నీరసముగా నుండెను.

ఇంతలో అతని మనోనేత్రమునకు వికారస్వరూపము గల స్త్రీమూర్తి గోచరించెను. ‘నేనే శక్తిని! నీలోనికి ఉరుకుచున్నాను.’ అని అరచుచూ అతనిలోనికి బలవంతముగా ప్రవేశించెను. ఆ శక్తిధాటికి తట్టుకొనలేక అతని ఎముకలు చూర్ణము అయినట్లు అనుభూతి కలిగెను. ‘వెంటనే నాలో నుండి వెళ్ళిపో!’ అని అతడు హీనస్వరముతో అరచెను. ‘ఇదిగో! వెళ్లిపోవుచున్నాను!’ అని అరచుచూ ఆ శక్తి మహాధాటితో బయటకుపోయెను. ఆ రకముగా పోవునపుడు రాజు నరకయాతనను అనుభవించెను. ఈ రకముగా శక్తి ప్రవేశించుటయూ, శక్తి బయల్వెడలుటయూ జరుగుచుండెను. ఈ రెండు ప్రక్రియల ద్వారా అతనికి నరకయాతన అనుభవమగుచుండెను. రాజ పురోహితులయిన  సుందరరామశర్మకు భటుల ద్వారా వర్తమానము అందించబడెను. వారు స్వయంభూదత్తునికి అర్చన చేసి తీర్థమునిచ్చిరి. దత్త విభూతిని నొసట పెట్టుకొనిన తదుపరి శరీరములోనికి శక్తి రాకపోకలు నిలచిపోయెను. అంతట శర్మ యిట్లనిరి. “మహారాజా! చూచినారా! మా అర్చన యొక్క శీఘ్ర ఫలము. మీరు శ్రీపాదుని దర్శనము కోరిరి. అది మీకు వ్యర్థము. వారి యింట కాలాగ్నిశమన దత్తమూర్తి ఉన్నాడు. ఆ పూజావిశేషమున అప్పలరాజుశర్మకు చిన్న చిన్న శక్తులు సిద్ధించినవి. బాపనార్యులు మంత్రానుష్ఠానమున ఏవో కొన్ని శక్తులను పొందియున్నారు. ఇంకా వెంకటప్పయ్య శ్రేష్ఠి వైశ్యుడు. మంచి వస్తువును నకిలీ వస్తువుగా తర్కము చేసి చవుకగా కొనగలడు. నకిలీ వస్తువును మంచి వస్తువుగా నమ్మించి విక్రయము చేయగలడు. అభూత కల్పనలతో అద్భుత శక్తులను శ్రీపాదునకు అన్వయించి భజన చేయుచున్నాడు. నరసింహవర్మ సుక్షత్రియుడైననూ మూర్ఖుడై శ్రీపాదుని దత్తవతారమని స్తుతించుచున్నాడు. మీరెంతమాత్రము చింతన పొందవలదు. మా అనుష్ఠానము చాల గొప్పది. మహారాజంతటి వారు ఆజ్ఞాపించిన రాననుటకు ఎన్ని గుండెలు? ప్రభువుల వారు బలవంతముగనయిననూ శ్రీపాదుని యిచ్చటకు తీసుకురాగలరు ?” ఈ మాటలు, ముఖస్తుతులు విన్న రాజు నీరసముగా, బలవంతముగా వారిని యిచ్చటకు రప్పించిన యెడల నాకు కలుగు లాభమేమి? పై పెచ్చు నాకు అపకీర్తియే మిగులును. శ్రీపాదులవారి వద్ద కొన్ని క్షుద్రవిద్యలున్నట్లు, నాకు అనుమానముగా ఉన్నది. నాపైన శ్రీపాడుడు శక్తి ప్రయోగము చేసినాడు. లేకపోయిన, యీ శక్తి నా శరీరమున రాకపోకలు సాగించనేల? దీనికి మీరు తరుణోపాయము చూపవలెను. మీరు మా కులపురోహితులు. మా శ్రేయస్సును కాంక్షించువారు.” అని పలికెను.

అంతట శర్మ యిట్లనెను. “మహారాజా! దత్తపురాణమును బ్రాహ్మణులచేత పారాయణము చేయించవలెను. స్వయంభూదత్తునికి అర్చనలు చేయించవలెను. బ్రాహ్మణ సమారాధానము చేయవలెను. భూరిదక్షిణల నొసంగవలెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్నదానము చేయవలెను. ఆ విధముగా చేసిన యెడల దత్తుడు ప్రసన్నుడగును. శ్రీపాదుని ఆట కట్టును. క్షుద్రశక్తుల బాధ నివారణమగును.”

రాజపురోహితుని కోరిక మేరకు రాజు కావలసిన ఏర్పాట్లను అన్నింటినీ చేయించెను. పీఠికాపుర ప్రాంతమునందు చాల అడవులు కలవు. పీఠికాపురమున చోరభయము జాస్తి. దత్తపురాణమును పారాయణ చేసెడి రోజునుండి నగరములో దొంగతనములు విస్తారముగా జరుగుచుండును. రాజు వాటిని అరికట్టుటలో వ్యర్థుడాయెను. రాజునకు పీడకలలు కూడా జాస్తి అయ్యెను. కొండనాలుకకు మందువేసిన ఉన్ననాలుక ఊడిపోయెనను విధముగ బాధలు మిక్కుటమవసాగెను. రాజునకు తన పితరులు స్వప్న దర్శనమీయసాగిరి. బక్కచిక్కిన దేహములతో, ఆవురావురని అన్నము కోసము పడిగాపులు పడు బిచ్చగాళ్ళవలె నుండిరి. ఏమిరా! మాకు శ్రాద్ధభోజనము పెట్టుటలేదేమి? మేము యీ ప్రేతదేహములోనే ఉండవలెనా? మాకింకా సద్గతులు లేవా ? అని ప్రశ్నించిరి. మీకు శాస్త్రోక్తముగా శ్రాద్ధకలాపములను చేయుచున్నానని రాజనెను. “నీవు చేయుచున్నావు సరే! కాని అవి మాకు అందుత లేదు. అనుష్ఠానవంతుడైన బ్రాహ్మణుడు మంత్రపూర్వకముగా కర్మ కలాపమును నిర్వర్తించినపుడును, అదే విధముగా శ్రాద్ధము పెట్టువాడు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధమును పెట్టినపుడు మాత్రమే అవి పితరులకు సద్గతిని కలిగించును.” అని పితరులు రాజుతో ననిరి. కనులు మూసినాను, తెరచిననూ పితరుల యొక్క యీ గోలతో ఆర్త నాదములతో రాజునకు రాత్రి సమయమందు నిద్రయే లేకుండెను. పులిమీద పుట్ర అనునట్లు రాజుగారి పెండ్లి కావలసిన కుమార్తెకు భూతబాధ కలిగెను. జుట్టు విరియబోసుకొని వికటాట్టహాసము చేయుచూ, యింటిలోని వస్తువులను అవతల పారవైచుచుండును. భోజనమునకు కూర్చున్నపుడు అన్నములో పురుగులు ధారాళముగా కనిపించుచుండెను. ఉన్నట్టుండి వస్త్రములకు నిప్పంటుకొనుచుండెను. అన్నదానము జరుగుచోటుకి రాజు వచ్చి వీక్షించినపుడు – దీనముగా, హీనముగా, కృశించిన శరీరములతో, ప్రేతకళతో నున్న తన వంశములోని గతించిన స్త్రీ పురుషులు దృగ్గోచరమై, రాజు పరిస్థితి చాల దయనీయముగా నుండెను.



సుందరరామశర్మ యింట కూడా పరిస్థితులు బాగుండలేదు. సౌమ్య మనస్క అయిన అతని ఇల్లాలు ఉన్నట్టుండి వంటపాత్రలతో అతని నెత్తిని మోదుచుండెను. శర్మ కుమారుడు త్రాడు నొకదానిని తెచ్చి తన తండ్రిని స్థంభమునకు కట్టివేయుచుండెను. శర్మ కుమార్తె తన తండ్రిమీద ఉమ్మివేసి, తన పాదరక్షలతో ముఖము వాయగొట్టుచుండెను. శర్మ భోజనము కోరినపుడు ఎండుగడ్డిని తెచ్చి తినమని పెట్టుచున్దిరి. తినకపోయినా వాతలు కూడా పెట్టబడునని బెదిరించుచుండిరి. శర్మ నియోగించిన బ్రాహ్మణులు మాత్రము దత్తపురాణము పారాయణ చేయుచుండిరి. పారాయణానంతరము వారు భోజనము చేసిన తదుపరి భూతప్రేత పిశాచములు యధేచ్చగా యింట తిరగాడుచూ భయభ్రాంతులను చేయుచుండెను. కొందరు స్త్రీలు విక్రుతముగా నవ్వుచూ నీవు ఏ రాజునకు పౌరోహిత్యము చేయుచున్నావో ఆ వంశములోని పైతరములవారు పరాయి స్త్రీలను మాతృసమానులుగా ఎంచక బలవంతముగా అనుభవించిరి. ఆ స్త్రీలు ఎవరో కాదు? మేమే! మా భర్తలతో మమ్ము సుఖముగా సంసారము చేసుకోనీయక మహాపరాధములు చేసిరి. మేము ఈ రాజవంశము మీద పగ తీర్చుకోదలచితిమి. మీరు మాకు పిండప్రదానము చేసినంత మాత్రమున మాకు సద్గతులు ఏమియునూ కలుగవు. రాజద్రవ్యమును పొంది భూరిదక్షిణల పొంది, ద్రవ్యశుద్ధి లేని ఆ ద్రవ్యమునకు అధికారులయినవారు గనుక మేము మీ కుటుంబములను కూడా వేదించ దలచితిమి.” అని పలుకుచుండిరి.

పారాయణ చేయు బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును కూడా భయభ్రాంతులై, “దత్తపురాణము పారాయణచేసిన శుభఫలములు సిద్ధించునని విన్నాము కాని యిది ఏమి విపరీతము? ఈ పురాణ పఠనమువలన శంకరుడు ప్రసన్నుడై, తన భూత ప్రేత పిశాచ గణములతో సహా కరాళనృత్యము చేయుచున్నాడు. దత్తపురాణ పఠనమున విష్ణువు ప్రసన్నుడై తమకు మాత్రము భోజన సదుపాయము లేకుండా చేసిన అన్నార్థులై వచ్చిన బిచ్చగాళ్ళకు అనుగ్రహమును ప్రసాదించుచున్నాడు. బ్రహ్మదేవుడు ప్రసన్నుడై అశ్లీలములు, నింద్యములయిన వాక్కులతో తమను వేధించువారిని సృష్టించినాడు. ఆహా! దత్తపురాణ పఠనము వలన యీ పద్ధతిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నులై, వాక్కులచేత హింసించి, చావటానికి కూడా వీలు లేకుండా విష్ణుతత్త్వముతో రక్షించి, భూత ప్రేత పిశాచములకు ఆనందమును కలిగించెడి నాట్యకళలతో జీవచ్ఛవములుగా చేసెడి యెడల అటువంటి దత్తభక్తి మాకు జన్మజన్మలకు వలదు మహాప్రభో.” అని పరితపించుచుండిరి.



సృష్టిలో మానవుడు కూలియే. కూలి ఇచ్చువాడు శ్రీపాదుడు

వెంటనే బ్రాహ్మణులను, సుందరరామశర్మయును, మహారాజును, శ్రీపాదుల వారిని శరణు జొచ్చిరి. అంతట శ్రీపాదులువారు “ఈ సృష్టిలోని ప్రతీ మానవుడును కూలియే. నేనే యజమానిని. నేను ప్రసన్నుడనయిన యెడల నీకు రావలసిన దానికంటే ఎక్కువ కూలీ యిచ్చెదను. అప్రసన్నుడనయిన యెడల నీ దుష్కృత్యమునకు ఎంత కూలీ తగ్గించవలెనో అంతా తగ్గించియే యిచ్చెదను. ఆలయములో స్వయంభూదత్తుడుగా నున్నది నేనే! కాలాగ్నిశమన దత్తరూపములో నున్నది నేనే! జీవులయందు కరుణతో శ్రీపాద శ్రీవల్లభ రూపములో వచ్చియున్నాను.


నాకు ముఖమునకు మంగళ హారతినిచ్చి పాదములను మేకులతో దిగగొట్టినయెడల మీకు ఫలమేమి చిక్కును? నా తల్లిదండ్రులు ఎవరనుకున్నారు? ఈ దత్తపురాణములోని విష్ణుదత్తుడును, అతని భార్యయును, యీ కలియుగములో అప్పలరాజుశర్మగాను, సుమతీ మహారాణిగాను జన్మించిరి. ఒకానొక కల్పమందు శ్రీ విఘ్నేశ్వరుని కుమారులైన లాభుడు, మరియొక కల్పమందు లాభాదమహర్షి, బృహత్ శిలానగరమందు భాస్కరాచార్యులుగా వచ్చినది కూడ బాపనార్యులు వారే! వారి గోత్రము వైశ్యకులమున జనించిన వారికి గౌరవపాత్రమైనది. నేను గణేశచతుర్థి నవతరించుట కూడా దివ్యసంకల్పములో భాగము. వాసవీ కన్యకాపరమేశ్వరీ అవతారము నుండియూ వెంకటప్పయ్య  శ్రేష్ఠిగారితో ఋణానుబంధము, సింహాచల క్షేత్రమునందలి నృశింహరూపములో ఋణానుబంధము కలిగిన నరసింహవర్మ, నిజంగా పుణ్యాత్ములు గనుకనే వారికి నాతో యీ అవతారములో సంబంధము కలిగినది. వారి ప్రేమ, వారి వాత్సల్యము నన్ను జన్మజన్మలకు కట్టివేయుచుండును. నేను నృశింహసరస్వతిగా అవతరించునపుడు సాక్షాత్తు బాపనార్యుల పోలికతోనే జన్మించెదను. వారి రాగిపాత్ర నుండి జలమును గ్రహించి ప్రోక్షించి యిచ్చటనున్న భూతప్రేతములకు విముక్తి కలిగించినట్లే. నృశింహ సరస్వతిగా అవతరించునపుడు నా గంధర్వనగరమునకు వచ్చిన భక్తుల నావహించిన భూతప్రేతములను పారద్రోలి, ఆ భూత ప్రేతములకు సద్గతిని కలిగించెదను. సంపద ఉన్నంతమాత్రమున గర్వింపరాదు. నీ వద్దనున్న సొత్తుకు ద్రవ్యశుద్ధి ఉండవలెను. లేకున్నచో దుఃఖములు కలుగును. నీవు పుణ్యవంతుడని గర్వించిన యెడల నీవు ఎంతమాత్రము పుణ్యవంతుడవు కావు. నీ చిట్టా ఆవర్జా నా వద్దనే ఉన్నవి. దయతో వాటిలో పాపకర్మ ఫలములను రద్దు చేసితినని చెప్పుచున్నాను. నేను పాపాత్ముడనని నీవు నిరుత్సాహపడిన యెడల, నన్ను శరణుజొచ్చి ప్రేమతో శ్రీపాదా దత్తా! శ్రీవల్లభా! దిగంబరా! అని పిలిచినచో క్షణములో నీ పాపములన్నింటిని దహించివేసి పుణ్యవంతుని చేసెదను. సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భావించుటవలన మీకిట్టి సంకటములు కలిగినవి. శ్రీపాద శ్రీవల్లభుని నిందించిన కారణమున, మీరు దత్తపురాణమును పారాయణ చేసియున్ననూ, మీకు దాని ఫలితము లేకపోగా, వింత వింత చిక్కులలో పడితిరి. దత్తుడే స్వయముగా శ్రీపాద శ్రీవల్లభునిగా వచ్చియున్నాడు. ఇది సత్యము.” అని తెలిపిరి.

     శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము

ఇవి కూడ చదవండి : sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -9 sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -10 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -11 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -12 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -13 sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం , అధ్యాయం -14

Related posts

Share via