అధ్యాయము 11
సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణి, బిల్వమంగళుల వృత్తాంతము
దత్తారాధన వలన సకల దేవతారాధన ఫలము.
శ్రీపాదుల జన్మము- అత్యద్భుత జ్యోతిర్మయము.
శ్రీ సుబ్బయ్య శ్రేష్ఠి ఆ మరునాడు యీ విధముగా సెలవిచ్చెను. “శ్రీ దత్తప్రభువు సర్వ దేవతా స్వరూపులు. దత్తుని ఆరాధించిన యెడల సకల దేవతారాధన ఫలితము లభించును. సర్వ దేవతలలోను అంతర్లీనముగా శ్రీ దత్తులే ఉన్నారు. శ్రీ సుమతీమాత శని ప్రదోష సమయమున అనసూయా తత్త్వము నందలి పరమశివుని ఆరాదిన్చేదివారు. అందువలన శ్రీ దత్తప్రభువులోని శివ తత్త్వము అనసూయా తత్త్వము నందు ప్రతిబింబించి, అనసూయా మాతతో సమానమైన స్థితి నందున్న సుమతీమాత యొక్క గృహమునందు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఇది ఒకానొక అద్భుత యోగప్రక్రియ. వారు మాతా పితృ సంయోగము వలన గాక యోగానిష్ఠులైయున్న అప్పలరాజశర్మ, సుమతీమాతల నేత్రములనుండి యోగాజ్యోతులు ప్రభవించి, అవి సంయోగము చెంది సుమతీమాత గర్భమునందు నిల్చి నవమాసములు నిండిన తదుపరి కేవలము సంవత్సరమునుండి కొన్ని వింతశక్తులను ప్రకటించసాగిరి.
శ్రీపాదుల వారి తరువాత వారికి శ్రీవిద్యాధరి, రాధ, సురేఖ అను ముగ్గురు సోదరీమణులు జన్మించిరి. శ్రీవిద్యాధరి జననమందిన రోజున బాపనార్యుల దూరపు బంధువు మల్లాది రామకృష్ణావధాన్లు అను మహాపండితుడు వారియింటికి వచ్చెను. వారికి చంద్రశేఖరుడను కుమారుడుండెను. ఘండికోట వారింట మహాలక్ష్మియే జనించెను, ఆమె మల్లాదివారి కోడలయిన బాగుండునని బంధువులు ముక్తకంఠముతో పలికిరి. శ్రీపాడులవారు కూడా తమ సోదరి శ్రీవిద్యాధరిని చంద్రశేఖరునకిచ్చి వివాహము చేసిన బాగుండుననిరి. శ్రీపాడులవారు సిద్ధ సంకల్పులు. వజ్రసంకల్పులు. వారి వచనానుసారమే తదుపరి కాలమునందు శ్రీవిద్యాధరికిని, చంద్రశేఖరావధాన్లునకును రంగరంగ వైభవముగా పీఠికాపురమున వివాహమాఎను. రాధయను సోదరిని విజయవాటికా నివాసులైన విశ్వనాధ మురళీకృష్ణావధాన్లగారికిని, సురేఖయను సోదరిని మంగళగిరి నివాసులైన తాడేపల్లి దత్తాత్రేయ అవధాన్లగారికిని ఇచ్చి వివాహము చేసిరి.
నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు. ఆ లీలలను స్మరించువారికి పాపములు నశించును. గోదావరీ మండలమునందు తాటంకపురము (తణుకు) అను గ్రామము కలదు. అందు అనేక వాజపేయములను, పౌండరీకములను, మహాయాగములను ఆచరించిన పరమపవిత్రమైన వంశము ఒకటి కలదు. వారే వాజపేయయాజులవారు. పీఠికాపురమునందలి మల్లాదివారికిని, తణుకు నందలి వాజపేయయాజుల వారికిని సన్నిహితబంధములు కలవు. అయితే వాజపేయయాజుల వారు ఇదంబ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అను సిద్ధాంతము నందు విశ్వాసము కలవారు. వారు వశిష్ఠ శక్తి, పరాశరత్రయాఋషి ప్రవరాన్విత పరాశర గోత్ర సంభవులు. వారు ఋగ్వేదులు, మల్లాది వారు యజుర్వేదులు. కర్ణాటదేశమున ఋగ్వేదము పఠిoచు బాలకులకు సరియయిన బోధకులు లేకుండిరి. ఆ సందర్భమున తణుకు నందున్న వాజపేయ యాజుల మాయణాచార్యుల వారిని వారాహ్వానింప కర్ణాట దేశమునందున్న హోయసాలకు వారు వలసవెడలిరి. అప్పటినుండి వారిని హోయసాల బ్రాహ్మనులని పిలువసాగిరి. వారు బ్రాహ్మణవృత్తిని, క్షాత్ర వృత్తిని సమముగా స్వీకరించిరి. సనాతన ధర్మమును సంరక్షించు నిమిత్తము వారు ఎన్నియో పడరాని పాట్లు పడిరి. మాయణాచార్యులకు యిద్దరు కుమారులు. ఒకరు మాధవాచార్యులు, రెండవవారు సాయణాచార్యులు. వీరిరువురును ఉద్ధండపండితులే! సాయణాచార్యుల వారు వేదములకు భాష్యమును వ్రాసిరి. మాధవాచార్యులు మహాలక్ష్మి అనుగ్రహమునకై తీవ్ర తపమాచరించిరి. మహాలక్ష్మి ప్రసన్నము కాగా వారు తమకు విశేషమైన లక్ష్మీ కటాక్షము కావలెననిరి. అంతట శ్రీదేవి “నాయనా! అది నీకు ప్రస్తుత జన్మమున సాధ్యము కాదు.” అనెను. వారు వెంటనే “అమ్మా! నేను సన్యసించుచున్నాను. నాకు యిప్పుడు రెండవ జన్మయే కదా!” అనిరి. శ్రీదేవి అనుగ్రహించెను. వారు లోహమును ముట్టుకొన్న అది బంగారముగా మారుచుండెడిది. వారే విద్యారణ్య మహర్షులు. వారిని శ్రీపాదుల వారు అనుగ్రహించిరి. వారికి మూడవ తరముగా సన్యాసాశ్రమ పరంపరలో శ్రీకృష్ణసరస్వతిగా జన్మించునది వారే! శ్రీపాదులు భవిష్యత్తులో నృసింహసరస్వతిగా అవతరించునపుడు వారికి శ్రీకృష్ణసరస్వతి సన్యాసాశ్రమ గురువులుగా నుందురు. వారికి భోగముల యందు కాంక్ష నశింపలేదు గనుక తదుపరి శతాబ్దములలో సాయణాచార్యుల వంశములో గోవింద దీక్షితులుగా జన్మించి తంజావూరు ప్రభువులకు మహామంత్రియై రాజర్షిగా వేనోళ్ళ కొనియాడబడెదరు. ఇది అంతయును భవిష్యవాణి. ఇది శ్రీపాదులవారే స్వయముగా నిర్ణయించిన విధి విధానము. వారు సత్యసంకల్పులు. కనుక విధిగా ఈ భవిష్యద్వాణి జరిగితీరును.
అనేక దేవతారాధనలు చేయునపుడు ఆయా దేవతలలో దత్తప్రభువు చైతన్యము ప్రతిబింబించి, నూతన చైతన్యముగా మార్పునొంది సాధకుల అభీష్టములను నెరవేర్చును. దత్తప్రభువునే ఆశ్రయించినచో ఏ దేవతాంశము వలన ఎంతమేరకు ఏ పని నిర్వర్తింపబడవలెనో దత్తప్రభువే నిర్ణయించి కంటికి రెప్పవలె కాపాడుదురు. ధ్రువుడు కఠోర తపమాచరించెను. అతనికి శ్రీ మహావిష్ణువు తన అపారమైన అనంతమైన పితృవాత్సల్యమును పంచి యిచ్చెను. శ్రీదత్తప్రభువు సగుణ తత్త్వమునకు, నిర్గుణ తత్త్వమునకు అతీతమును ఆదారమును అయిన పరమతత్త్వము, అదియే చరమతత్త్వము, అదియే ఆదితత్త్వము, అదియే ఆద్యంత రహిత తత్త్వమును దత్తతత్వముకు కేవలము అనుభవ పూర్వకముగా తెలుసుకొనవలెనే గాని అది యీ విధముగా ఉండునని మనము తర్కబుద్ధితో యోచించుట కేవలము నిష్ఫలము. ఒకపని జరుగుటకు గాని, జరగకుండుటకు గాని, వేరొక విధముగా జరుగుటకు గాని గల సర్వసామర్థ్యమే శ్రీపాద శ్రీవల్లభ అవతార రహస్యము.
శ్రీపాదతత్త్వము
తాను స్వయముగా దత్తాత్రేయుడనని వచించిన శ్రీపాదులు తమ యింట నుండెడి కాలాగ్నిశమనదత్తుని ఆరాధించువారు. ఒక పర్యాయము బాపనార్యులు యీ విషయమున మధనపడి శ్రీపాదులవారినే “నాయనా! శ్రీపాదా! నీవు దత్తుడవా! లేక దత్తఉపాసకుడువా ?” అని ప్రశ్నించిరి. అంతట వారినిట్లనిరి. “నేను దత్తుడనని చెప్పునపుడు నేను దత్తుడనే అగుచున్నాను. నేను దత్త ఉపాసకుడనని చెప్పునపుడు దత్తోపాసకుడనే అగుచున్నాను. నేను శ్రీపాద శ్రీవల్లభుడనని చెప్పునపుడు శ్రీపాద శ్రీవల్లభుడనే అగుచున్నాను. నేను ఏది సంకల్పించిన అదే జరుగును. నేను ఏ విధముగా అనుకొనిన అదే అగుచున్నాను. ఇదే నా తత్త్వము.”
తాతగారికి యిదంతయునూ అయోమయముగా నుండెను. అంతట శ్రీపాదులిట్లనిరి. “తాతా! నీవు నేను ఒకటే! రాబోవు జన్మలో ముమ్మూర్తులా నిన్నుపోలిన శరీరముతో మాత్రమే అవతరింప నున్నాను. నీలో సన్యాసాశ్రమము స్వీకరించవలెననెడి కోరిక ప్రబలముగా ఉన్నది. నీవు యీ జన్మలోగాని, వచ్చే జన్మలోగాని సన్యాసిగా ఉండుట నా సంకల్పములో లేదు. ముమ్మూర్తులా నీ రూపములో అవతరించి నీ కర్మబంధములను వాసనా విశేషములను ధ్వంసము చేయదలచినాను, అని గోముగా తాతగారి భ్రూమధ్యమును తాకెను. అది కూటస్థ చైతన్యమునకు ఆవాసము. వారు కొద్ది క్షణములపాటు హిమాలయములలో నిశ్చల తపోసమాధిలోనున్న బాబాజీని చూచిరి. వారు ప్రయాగ మహాక్షేత్రములోని త్రివేణి సంగమములో స్నానము చేయుటను గాంచిరి. ఆ తదుపరి శ్రీపాదవల్లభ రూపమును గాంచిరి. ఆ స్వరూపము కుక్కుటేశ్వరాలయము నందలి స్వయంభూ దత్తునిలో అంతర్లీనమాయెను. దానిలో నుండి అవధూత స్వరూపము వెడలెను. తన కుమార్తెయగు అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి ఒడిలో పసిబిడ్డగా నుండుటను చూచిరి.
ఆమె ఒడినుంచి విడివడి 16 సంవత్సరముల యువకునిగా మారుతాను గమనించిరి. ఆ నవయువకుడు తనవంక గంభీర దృక్కులను ప్రసరించి ముమ్మూర్తులా తన స్వరూపమును పొందెను. అయితే ఆ మూర్తి సన్యాసిగా నుండెను. ఏదో రెండు పవిత్రనదుల సంగమ స్థలములో స్నానము చేసి తన శిష్య బృందముతో ఠీవిగా నడుచుచుండెను. ఆ సన్యాసి తనవంక చూసి యిట్లు పలికెను. ఓహో!నేను ఎవరా? అని విచికిత్సలో ఉన్నట్లున్నావు. నన్ను నృసింహ సరస్వతి యందురు. ఇది గంధర్వపురము. ఈ మాటలు పలికిన కొద్ది క్షణములలోనే తన అంగవస్త్రమును నదిలో వైచి దానిమీద కూర్చొని శ్రీశైలమును చేరెను. అచ్చట కదళీవనము నందలి మహాపురుషులు, మహాయోగులు సాష్టాంగ ప్రణామములు చేసిరి. వారందరూ, “మహాప్రభూ! మీ రాకకోసం అనేక వందల సంవత్సరముల నుండి తపమాచరించుచున్నాము. మమ్ముల ధన్యులజేయవలసినదని” ప్రార్థించిరి. అనేక సంవత్సరములు అచట తపమాచరించిన మీదట కేవలము కౌపీనధారియై వృద్ధరూపమును పొందునట్లు కనిపించెను. అత్యంత తీక్షణ దృక్కులను బాపనార్యుల యెడల ప్రసరింపజేయుచూ ఈ నా స్వరూపమును స్వామీ సమర్థుడని అందురు అని వచించెను. కొంతసేపటికి శరీర త్యాగాముచేసి తన ప్రాణశక్తిని ఒకానొక వటవృక్షము నందును, తన దివ్యాత్మను శ్రీశైలము నందలి మల్లిఖార్జున శివలింగమునందును విలీనము కావిన్చినట్లు గాంచెను. మహాపవిత్రమును, అత్యంత శక్తిమంతమునయిన ఆ శివలింగము నుండి మేఘ గంభీర స్వరముతో “బాపనార్యా! నీవు ధన్యుడవు. అగ్రాహ్యమును, అవాంగ్మానస గోచరమును, అనంతమును, కేవల జ్ఞాన స్వరూపమును, అనాద్యంతమును అయిన నన్ను, నీవు నీయొక్క క్రియాయోగ శక్తివలన సూర్యమండలము నుండి శక్తిపాతమొనరించి ఈ జ్యోతిర్లింగమునందు ఆకర్షించితివి. 18 వేలమంది దివ్యపురుషులు ఈ జ్యోతిర్లింగము నందు విలీనుడనైయున్న నన్ను సదా సేవించెదరు. ఈ జ్యోతిర్లింగా దర్శనము చేయువారికి సదా ఆ దివ్యపురుషులు భౌతిక, ఆధ్యాత్మిక ప్రగతి యందు దోహదపడెదరు. త్రిమూర్తి స్వరూపుడనైన నేను శ్రీపాద శ్రీవల్లభ, నృసింహ సరస్వతి, స్వామీ సమర్థ స్వరూపములలో నిన్ను అనుగ్రహించుచున్నాను.” అను మాటలు వినిపించెను.
నాయనా! శంకరభట్టూ! శ్రీగురుని లీలలు అనూహ్యములు. కొంతసేపటికి బాపనార్యులు ప్రకృతిస్థులయిరి. తమకు ఎదురుగా అమాయకమయిన ముఖముతో చిరునవ్వులు చిన్దిన్చుచూ మూడు సంవత్సరముల ప్రాయములో ఉన్న శ్రీపాదుల వారిని చూచిరి. ఈ వింత అనుభవము వారికి దివ్యమధురముగా నుండెను. శ్రీపాదులవారిని తమ గుండెలకు హత్తుకోనిరి. కొంతసేపు వారు దివ్య తన్మయావస్థలో నుండిరి. ఆ తన్మయావస్థనుండి స్వస్థులై అగ్నిహోత్ర కార్యక్రమమునకు పూనుకొనిరి. వారు అగ్నిహోత్రము చేయుకార్యము వింత గొల్పునదిగా ఉండును. జమ్మికర్రను, రావికర్రను ఉపయోగించి సాధారణముగా అగ్నిని పుట్టించెదరు. కాని బాపనార్యులు మాత్రము సమిధలను అగ్నికుండము నందుంచి వేద మంత్రోచ్చారణ చేయుదురు. వెంటనే అగ్ని సృష్టి అయి ప్రజ్వలించును. అప్పలరాజు శర్మగారు కూడా యిదే విధముగా చేయుదురు. వారి వంశము నందు అగ్నిపూజ కలదు. ప్రజ్వలించుచున్న అగ్నికుండము నందు దిగి ఆహుతులను వ్రేల్చుదురు. ఇది సాధారణముగా విశేష పర్వములందు చేయువారు. ఈ విధమైన అగ్నిపూజయందు వారి శరీరమునకు గాని, వస్త్రములకు గాని అగ్నివలన ఏ విధమైన యిబ్బందియు కలుగదు. ఇది ఆశ్చర్యములలో కెల్లా ఆశ్చర్యము.
శ్రీపాదుల ఘటనాఘటన సామర్థ్యము
బాపనార్యుల అగ్నిహోత్రము సల్పు కార్యమును ఆనాడు ఎన్నిమార్లు వేదమంత్రములను ఉచ్చరించుచున్ననూ అగ్ని సృష్టి జరుగలేదు. శ్రీపాడులవారు తమ తాతగారి దురవస్థను చూచి లీలగా నవ్వుకొనుచుండిరి. తాతగారికి ముచ్చెమటలు పోయుచుండెను. అంతట శ్రీపాదులవారు అగ్ని కుండమువైపు చూచి “ఓయీ! అగ్నిదేవా! నిన్ను అజ్ఞాపించుచున్నాను. తాతగారి దైవకార్యమునకు ఆటంకము కలిగింపకుము.” అనిరి. వెంటనే అగ్ని సృష్టి జరిగి ప్రజ్వలింపసాగెను. శ్రీపాదులవారు తాతగారి కలశము నందలి నీటిని గైకొని అగ్ని గుండములో పోసేను. అగ్ని ఆరిపోవుటకు బదులు మరింతగా ప్రజ్వలిమ్పసాగెను. తాతగారు ఈ వింతను చూచి మరింత ఆశ్చర్యపోయిరి. శ్రీపాదుల వారిట్లనిరి. “తాతా! నా ఈ అవతరణమునకు నీవునూ, వెంకటప్పయ్య శ్రేష్ఠియును, నరసింహ వర్మయును కారకులు. అందువలన నీవుగాని, మా నాయనగాని, వెంకటప్పయ్య శ్రేష్ఠి నుండిగాని, ధనసహాయముగాని, ధనేతర సహాయముగాని స్వీకరించిన అది దానము క్రింద లెక్కకు రాదు. ఆ రకముగా సహాయమును స్వీకరించకపోవుట దైవద్రోహము కూడా కాగలదు. అటువంటి సహాయమును పరమేశ్వరానుగ్రహముగా భావింపవలెను. నాకు జన్మనిచ్చిన మాతృమూర్తి సుమతీ మహారాణి మల్లాది వారికే కాదు, వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి, వత్సవాయి వారి కుటుంబమునకు కూడా ఆడపడుచుగా భావింపబడవలెను. ఇది నా శాసనము.” అనిరి. శ్రీపాదులు ఈ మాటలను పలుకు సమయమున అప్పలరాజు యాదృచ్ఛికముగా అచ్చటనే యుండిరి.
శ్రీపాదుల వారిట్లనిరి. “నా సంకల్పము లేనిదే బాపనార్యులవంటి మహా తపస్వి కూడా అగ్ని సృష్టి కావింపలేడు. మా నాయన కూడా అగ్నిగుండము నందు దిగిన యెడల అగ్నిహోత్రుడు తన ప్రతాపమును చూపించితీరును. నా సంకల్పము నందు మార్పు జరిగినచో వెంకటప్పయ్య శ్రేష్ఠి నిరుపెడగా మారిపోవును. పుట్లకొలది భూములున్న నరసింహవర్మ నిలువనీడలేనివాడగును. మీరందరునూ నా సంకల్పము ననుసరించియే ఆయాస్థితులలో నున్నారు. నేను బిచ్చమెత్తుకొను వానిని మహారాజుగా చేయగలను. మహారాజును బిచ్చగానిగా మార్చగలను. నన్ను ఆశ్రయించిన నా భక్తునికి వాడు ఏది కోరినా యివ్వగలను. అయితే యిచ్చుటకు ముందు అంతటి ఉన్నతశక్తిని ఆ భక్తుడు నిలుపుకొనగలడా? తన శక్తి సామర్థ్యములను లోకోపకారము కొరకు ఉపయోగించునా? లేదా? అని వారిని పరీక్షింతును. నాకు అవసరమని తోచినపుడు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను మార్చివేయగలను. బాపనార్యులు కృతయుగములో లాభాదమహర్షిగా ఉండగా వారికి మంగళ మహర్షి అను శిష్యుడొకడు ఉండెడివాడు. మంగళ మహర్షి దర్భలు కోయుచుండగా పొరపాటున చేతికి గాయమై రక్తము స్రవించెను. ఆ రజతము గడ్డకట్టి సుగంధభరితమైన విభూతిగా మారెను. ఆహా! నేను ఎంతటి గొప్పసిద్ధిని పొందితిని అని మనసులో వానికి గర్వము కలిగెను. అంతట పరమశివుడు ప్రత్యక్షమై తన చేతిని లీలగా కదిలించెను. హిమగిరుల నుండి మంచుపెళ్లలు విరిగి పడునట్లు చెప్పలేనంతటి విభూతి వర్షించెను. పరమశివుడిట్లనియె. “త్రేతాయుగములో భరద్వాజుడు పీఠికాపురములో సవితృ కాఠక చయనము చేయును. ఆ మహాచయనము నందు పేరుకొనిన విభూతిలోని లవలేశమును నీను చూపించితిని.” అంతట మంగళ మహర్షి గర్వము తొలగిపోయెను. శ్రోతలందరునూ అవాక్కయి శ్రీపాదులవారు చెప్పునది వినుచుండిరి. శ్రీపాదులిట్లనిరి. “ఈ పీఠికాపుర అగ్రహారములో అడుగుపెట్టుట ఎన్నో జన్మల పుణ్యఫలము. నా యీ అవతరణము సమయములో మీరు నాతోనుండుట చెప్పరానంతటి విశేషము. నా శక్తి అనుభవములోనికి రావలెనన్న మొదట నీవు తీవ్ర సాధకుడవు కావలెను. అప్పుడు మాత్రమె నా శక్తి, కరుణ, వాత్సల్యము, రక్షణ, పాప విమోచనము నీకు అనుభవములోనికి వచ్చును. నా జన్మభూమి అయిన యీ బాపనార్యుల యింట నా పాదుకలు ప్రతిష్టింపబడును. నేను పీతికాపురమున ఉదయవేళలో అమ్మ సుమతి ఒడిలో నుండి పాలను త్రాగెదను. మధ్యాహ్న సమయములో పీఠికాపురమున అమ్మ సుమతి నాకు గోరుముద్దలు చేసి అన్నము తినిపించును. రాత్రి సమయమున పీఠికాపురమున అమ్మ సుమతి ఒడిలో నుండి గోధుమతో చేసిన హల్వా తిందును. నేను పీఠికాపురమునందు ఉన్నట్లే గంధర్వపురమున నృసింహ సరస్వతి రూపమున ఉందును. మధ్యాహ్న సమయము నందు ఖచ్చితంగా గంధర్వపురమున భిక్ష చేసెదను. అంతర్నేత్ర దృష్టి కలవారలకు యివి స్పష్టముగా గోచరించును.”
మహాపురుషులు, మహాయోగులు అన్నిదేశములవారు చీమల పుట్టలవలె లక్షల సంఖ్యలో నా దర్శనార్థము నా దర్బారునకు వచ్చెదరు. వారు దత్త దిగంబర! శ్రీపాద వల్లభ దత్త దిగంబర! నృసింహ సరస్వతి దత్త దిగంబర! యనుచు తన్మయత్వముతో నృత్యము చేసెదరు. నేను కాలపురుషునకు అనుమతి యిచ్చిన తక్షణమే కాగల కార్యములు క్షణములో నెరవేరును. నా పేరిట మహాసంస్థానమొకటి ఏర్పడును. నా ప్రభావము అతిశయించిన కొలదిని యీ పీఠికాపుర క్షేత్రములో గోష్పాదమంత భూమి కూడా క్రయము పొందుటకు అవకాశము లేకుండును. నేను నా వారు అనుకున్నవారిని అవసరమైతే జుట్టుపట్టుకొని యీడ్చుకొని వచ్చి పీఠికాపురములో పడవేసేదను. ఎంతటి ధనవంతుడు అయిననూ, ఎంతటి యోగి అయిననూ నా సంకల్పము లేక పీఠికాపురములోని నా సంస్థానమునకు రాలేరు. ఇది నిశ్చయము. నా నిజతత్త్వమును గ్రహించి ఆనందించుడి. ఈ తరుణము మరిరాదు. మానవుని అవగాహనలోని సమస్త దేవతా శక్తులు నా స్వరూపమునందే ఉన్నవి.” నాకు ఎవరయినా దక్షిణ సమర్పించిన నేను దానిని నూరింతలు చేసి తరునమాసన్నమయినపుడు వారికి అనుగ్రహింతును. ధర్మమునకు విరుద్ధము కాకుండా ధనార్జన చేయవలెను. ధర్మమునకు విరుద్ధము కాకుండా కోరికలను అనుభవింపవచ్చును. సత్కర్మలనాచరించుట వలన మోహము నశించును. మోహము క్షయమయిన పిమ్మట మోక్షము లభించును.
నాయనా! శంకరభట్టూ! వింటివా! శ్రీపాదులవారి అమృత వచనములు. ఈ దివ్యోపదేశము తదుపరి ఆ మర్నాడు నరసింహవర్మ శ్రీపాదులవారిని తమ గుర్రపుబండిలో తమ భూములను చూపించ తీసుకొనిపోయిరి. వారికి పుట్లకొలది భూములు కలవు. ఆ భూములలో అనేక రకముల పంటలు పండును. కాని బీరపాదులు మాత్రము పుష్పించుట అరుదుగా నుండెను. పుష్పించిన తదుపరి పిందెలు శుష్కించిపోవుట జరుగుచుండెను. ఒకవేళ పిందెలు పెద్దవి అయి కాయలైయిన యెడల అవి వంటకు పనికిరానంతటి చేదుగా నుండెను. ఈ విషయమును శ్రీపాదులవారితో నరసింహవర్మ మనవి చేసుకొనెను. శ్రీపాదులవారు ప్రసన్నవదనులయి “మా యింటిలో వారికందరికీ బీరకాయపప్పు నందు ప్రీతి మెండు. మా యింటిలోని వారికి యిష్టము గనుక నాకు కూడా యిష్టమే! అయితే పూర్వకాలములో ఒకానొక దత్తోపాసకుడు యీ భూమిలో తపమాచరించెను. ఈ పవిత్రభూమి సాక్షాత్తు దత్తుడనయిన నా పాదస్పర్శ కోసము తపన పడుచున్నది. తన తపనను నీకు తెలియజేయుటకు తన భాషలో యీ విధముగా వ్యక్తీకరించుచున్నది. తప్పక యీ నేలతల్లి కోరికను తీర్చెదను. ఈ భూమికి నా స్పర్శ కలిగిన తరువాత యీ భూమాత తత్త్వములో మార్పు వచ్చును. మంచి రుచి కలిగిన బీరకాయలను యీ తల్లి మనకు అందించును. తాతా! నీవు నిర్భయముగా మా యింటికి యిక్కడ పండిన బీరకాయలను పంపుము. యింటివారితో పాటు నేను కూడా ఆ వంటకమును భుజించెదను.” అని పలికెను.
నాయనా! శంకరభట్టూ! చిత్రాతిచిత్రము! ఆ రోజు నుండి ఆ నేలలో బీరకాయలు విపరీతముగా కాయుచుండెను. అవి మంచిరుచిని కూడా కలిగి యుండెను.
శ్రీపాదులవారు నరసింహవర్మతో పాటు గుర్రపుబండి నుండి దిగి ఆ భూములలో కొద్ది ముహూర్తముల సమయము విహరించిరి. ఇంతలో కొంతమంది చెంచు యువతీయువకులు ఆ ప్రాంతమునకు వచ్చిరి. వచ్చిన వారందరునూ శ్రీపాదుల వారికి ప్రణమిల్లిరి. ఆ సమయమున శ్రీపాదులవారి దివ్యవదనారవిందమున పరివేష్ఠిoచి దివ్యకాంతి వలయమేర్పడెను. శ్రీపాదులు యిట్లనిరి. “తాతా! ఈ చెంచులందరునూ నరసింహావతారమునకు సంబంధించినవారు. వీరు ఆ మహాలక్ష్మిని తమ తోబుట్టువుగా భావించి ఆరాధించువారు. నీవు నరసింహస్వామికి భక్తుడవు గదా! నీవు వీరిని ఆశ్రయించిన నృశింహ దేవుని దర్శనభాగ్యమును పొందవచ్చును.”
శ్రీపాదులవారు యిట్లు పలుకుట తమను ఆటపట్టించుట కొరకని నరసింహవర్మ తలచిరి. వారిట్లు పలికిరి. “ఓ చెంచులారా! మీరు నృసింహదేవుని చూచినారా? వారి జాడ ఏదయినా తెలుపగలరా?” దానికి బదులుగా వారిట్లనిరి. “అదేమంత గొప్ప భాగ్యము! సింహపుతల, మనుష్య శరీరము గలవాడు తిక్కరేగి యీ అడవులలోనే తిరుగుచున్నాడు. వాడు మా సోదరి చెంచులక్ష్మిపై మరులుగొన్నాడు. మా చిన్నది కూడా వానిని యిష్టపడినది. వారికి మేము వివాహము కూడా చేసియున్నాము. మీరు కావలెనన్న చెంచులక్ష్మిని, నృశింహుని కూడా తెచ్చి మీ ముందు ఉంచగలము.”
ఈ పలుకులు పలికిన తదుపరి ఆ చెంచు యువతీయువకులు వడివడిగా పరుగెత్తుకొనిపోయిరి. నరసింహవర్మ దీనిని అంతటిని వింతగా చూచుచుండెను. ఇంతలో తమ భూములకు అడ్డుపడి ఒక యువతియును, యువకుడును వచ్చుచుండుతను గమనించిరి. అదృష్టవశమున నేను కూడా ఆ దారి వెంబడి పోవుచుంటిని. శ్రీపాదులవారు నన్ను తమవద్దకు రమ్మనిరి. నేను వారి దరినిచేరగా వారు “సుబ్బయ్య శ్రేష్ఠి ! దూరమునుండి ఆ వచ్చువారు ఎవరనుకొంటివి? ఆ వచ్చువారు బిల్వమంగళుడును, చింతామణియును. కొద్దిపాటి చితుకులను ప్రోగుచేయుము. మనము చితుకుల మంట వేయుదుము. అప్పుడు జరుగు తమాషాను చూడవచ్చును.” అని పలికిరి.
నరసింహ వర్మకును, నాకునూ ముచ్చెమటలు పోయుచుండెను. ఆ వచ్చిన వారు బిల్వమంగళుడును, చింతామణియే! సందేహము లేదు. వారిరువురును గురువాయుర్ క్షేత్రము నందలి శ్రీకృష్ణదేవుని దర్శనము చేసుకొనిన తదుపరి భాగ్యవశమున కురూరమ్మ అనెడి మహాయోగినిని దర్శించిరి. ఆమె అప్రయత్నముగా వీరిని శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించెను. ఆమె ఆశీ: ప్రభావమున వీరిలో భక్తి, వైరాగ్య బీజములు పడినవి. మంగళగిరి క్షేత్రము నందలి నృసింహుని దర్శించుకొని పీఠికాపురమున శ్రీపాదులవారి దర్శనార్థము వచ్చుచుండిరి. శత వృద్ధురాలైన ఆ మహాతల్లి మహాయోగిని కనుక ఆమె ఆశీర్వచన ప్రభావమున వారికి శ్రీపాదుల వారి దర్శనము యిచ్చటనే లభించినది! ఇది ఆశ్చర్య కర విషయము. వారిరువురు మంగళగిరిలో యిట్లు ప్రార్థించిరి. “మహాయోగిని కురూరమ్మ దీవెన ఫలించి దత్తభిన్న స్వరూపులయిన శ్రీపాదుల వారి దర్శనము మాకు కలుగనెడల నృశింహ దేవుడవయిన నీ దర్శనము భౌతికముగా పొందగోరుచున్నాము.”
చితుకులమంట ప్రజ్వరిల్లుచుండగా బిల్వ మంగళుడును, చింతామణియు తమ శరీరములకు దహన సంస్కారములు జరుగు చున్నంత బాధను అనుభవించిరి. కొంతసేపటికి వారి శరీరములనుండి వారిని పోలిన నల్లటి ఆకారములు బయటకు వచ్చి ఆ మంటలోపడి రోదించుచూ ఆహుతి అయిపోయినవి. ఆ నల్లటి ఆకారములు ఆహుతి అయిన తరువాత వారిద్దరునూ స్పృహ లోనికి వచ్చిరి. ఇంతలో చెంచులు తమ తోబుట్టువు చెంచులక్ష్మితో అచ్చటకు వచ్చిరి. నృశింహ దేవుని రెక్కలు విరిచికట్టి చెంచులు నృశింహ దేవుని శ్రీపాదుల ముందుంచిరి.
ఇటువంటి చిత్రాతిచిత్రములు ఏ యుగములలోనూ జరుగలేదు. శ్రీపాదులవారి అవతార కార్యక్రమములో లీలలు, చమత్కారములు, కోకొల్లలు.అనూహ్యములు. శ్రీపాదులవారిట్లు ప్రశ్నించిరి. “పూర్వయుగములందలి నృశింహుడవు నీవేనా? ఈ చెంచులక్ష్మి నీ భార్య యేనా? హిరణ్య కశ్యపుని వధించి ప్రహ్లాదుని రక్షించినది నీవేనా?” దానికి శ్రీ నృశింహదేవుడు ఔనని ముమ్మారు పలికెను. చెంచులక్ష్మియు, శ్రీనృశింహదేవుడును జ్యోతి స్వరూపముతో శ్రీపాదులవారి శరీరములోనికి ప్రవేశించిరి. చెంచులు అంతర్ధానమైరి. బిల్వ మంగళుడు మహాభక్తుడై బిల్వ మంగళ మహర్షిగా రూపొందెను. చింతామణి మహా యోగినిగా మారిపొయినది. చిత్రాతి చిత్రమైన యీ లీలలు జరిగిన నరసింహవర్మ గారి భూములయందు ఒక గ్రామము వేలయుననియూ, దానిని “చిత్రవాడ” అని వ్యవహరించెదరని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. వారు సత్య సంకల్పులు. సిద్ధ సంకల్పులు.