June 29, 2024
SGSTV NEWS
Spiritualsripada charitamrutam

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1  sripada srivallabha charitamrutam

శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం
       అధ్యాయము 1

    వ్యా ఘ్రేశ్వర శర్మ    వృత్తాంతము

శ్రీ మహా గణాధిపతికి, శ్రీ మహా సరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవీదేవతా గణములకు ప్రణామాంజలులు సమర్పించి, శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీదత్త ప్రభువు యొక్క నవావతరణ ( శ్రీపాద శ్రీవల్లభుడు) వైభవము ను వర్ణింపదలచినాను

శ్రీ దత్తప్రభువు  అతి ప్రాచీనుడు,నిత్యనూతనుడు,ఈ కలియుగములో శ్రీపాదశ్రీవల్లభస్వామిగా  ఆంధ్రదేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీపీఠికాపురమను  గ్రామము నందు అవతరించెను.వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండితవరేణ్యులకే అసాధ్యమయిన పరిస్థితులలో ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము దివ్యాజ్ఞ ప్రకారమనియు,దివ్యాశీస్సులు వలననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకోనుచున్నాను
నా పేరు శంకరభట్టు. కర్ణాటక దేశస్తుడను .సమర్థుడను,భరద్వాజ గోత్రోద్భవుడను,శ్రీకృష్ణభగవానుని దర్శనార్ధము ఉడిపి క్షేత్రమునకు వచ్చితిని బాలకృష్ణుడు నెమలిపించముతో, ముగ్ధమనోహరముగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరీ దర్శనార్ధము పోవలసినదని ఆజ్ఞాపించెను.

ఉడిపి బాలకృష్ణుడు

నేను  శ్రీకన్యకాపరమేశ్వరీ దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్య స్నానములు చేసితిని. ఒకానొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్ధము గుడిలో ప్రవేశించితిని పూజారి నిష్ఠగా పూజ చేయుచుండెను . నా చేతిలోని ఎర్రరంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ చేయుచుండెను. అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండెను .”శంకరా ! నీ హృదయము నందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురవపురమునకు పోయి అందు గల శ్రీపాద శ్రీవల్లభస్వామిని  దర్శించి జన్మసార్థక్యమును  పొందుము. అతడు నా సోదరుడు. మా యిద్దరికీ గల సోదర,సోదరీ బంధము దేశకాలములకు అతీతమైనది. శ్రీపాద దర్శన మాత్రముననే నీ మనస్సునకు,ఆత్మకు,సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని ” చెప్పెను .

అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యకాపరమేశ్వరీ పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు దానికి స్వప్న దూరంలోనే యున్న మరుత్వమలై అనుగ్రామమునకు వచ్చితిని .శ్రీ హనుమంతుడు సంజీవినీ పర్వతమును తిరిగి హిమాలయమునకు తీసుకొని పోవునపుడు దానిలో నుండి ఒక ముక్క జారీ క్రిందపడినదనియు దానిని మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని .
మరుత్వమలై గ్రామమునందు ఆ కొండ గలదు. చూడచక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కలవు. అది సిద్ధపురుషులు అదృశ్యరూపమున తపస్సు చేయు పర్వతభూమిని తెలిసికొంటిని. నా అదృష్ట రేఖ బాగున్నయెడల ఏ మహా పురుషుడనయినా దర్శింపలేకపోవుదునాయని గుహలను దర్శించుకుంటిని. ఒక గుహ వద్ద మాత్రము ఒక పెద్దపులి ద్వారము వద్ద నిలబడియున్నది .నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినది భయవిహ్వలుడైయిన నేను ఒక్కసారిగా శ్రీపాదా! శ్రీవల్లభా ! దత్తప్రభు !అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్దపులి సాధు జంతువు వలే నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి  బయటకు వచ్చెను .

ద్వారము వద్ద పెద్దపులి

నాయనా ! నీవు ధన్యుడవు  మరుత్వమలై ప్రాంతమంతయును శ్రీపాద శ్రీవల్లభ నామమును ప్రతిధ్వనించింది. శ్రీదత్త ప్రభువు యీ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించెనని,మహాసిద్ధ పురుషులకు,మహాయోగులకు,జ్ఞానులకు ,నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావున యిచ్చటకు రాగలిగితివి .ఇది తపో భూమి  .సిద్ధభూమి .నీ కోరిక సిద్దించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శనభాగ్యము కలుగును. ఈ గుహ ద్వారమున నున్న యీ పెద్దపులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను .

అంతటా నేను పెద్దపులి రూపములో నున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని.ఆ పెద్దపులి వెంటనే ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై  అంతయును ప్రతిధ్వనించింది. సుశ్రావ్యముగా “శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ” అని ఆలాపించినది. నేను యీ వింత దృశ్యమును పరికించుచుంటిని పెద్దపులి యొక్క రూపము నందలి అణువులన్నియును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యెను.  అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున కాంతి దేహముతో  ఆ దివ్యపురుషుడు వెడలిపోయెను. నా ఎదుట నున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోకి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా  గుహలోనికి ప్రవేశించితిని .
వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలిసిన పవిత్ర ద్రవ్యములను,పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచూ అతడు పదార్ధములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను.

ఆ  వృద్ధ తపస్వి యిట్లు వచించెను. “లోకములో యజ్ఞయాగాది సత్కర్మలు అన్నియును లుప్తమయి పోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ది పొందిన మానవుడు పంచ భూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించిననూ మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న, అరిష్టములు,అనిష్టములు సంభవించును.  మానవుడు ధర్మమార్గమున విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను. లోకహితార్ధము నేను యి యజ్ఞమును చేసితిని యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు యి యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీదత్తావతారులైన  శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్యయోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయునూ ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి యిటివంటి  అలభ్యయోగమును కలిగించును”  అని వచించెను. 

నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, “సిద్ధవరేణ్యా! నేను పండితుడను గాను, యోగిని కాను, సాధకుడను కాను,అల్పజ్ఞుడను,నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినది  కోరితిని”. అందులకు ఆ మహాపురుషుడు సమ్మతించిరి.
“సిద్ధవరేణ్యా! నేను శ్రీకన్యకాపరమేశ్వరీ  మాత దర్శనము చెసుకొన్నపుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. శ్రీవల్లభులు తమ సోదరులని చెప్పినది. తమ సోదర, సోదరీబంధము కాలాతీతమైనది తెలిపినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ములు వారి దర్శనము కలిగినది. ఇంతకూ వ్యాఘ్రరూప మహాత్ములు  ఎవరు? శ్రీవల్లభుల వారికీ శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవి గల సోదర సోదరీ బంధమును కాలాతీతమనుటలో అర్థమేమిటి  ? అసలు శ్రీదత్తప్రభువు ఎవరు? ఈ నా సంశయములు ఉత్తర మొసంగి నన్ను ధన్యులు చేయవలసినది ” ప్రార్ధించితిని.

ఆ వృద్ధ తపస్వి యిట్లు  చెప్పనారంభించెను. నాయనా ! ఆంధ్రదేశము నందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి గాంచిన ఆత్రేయపుర గ్రామము నందు శ్రోత్రియమైన ఆశ్యపసగోత్రము నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వరశర్మ   అని నామకరణమును చేసిరి. తండ్రి మహాపండితుడైనను యితడు మాత్రము పరమశుంఠ అయ్యెను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననూ సంధ్యావందనము కూడా చేయజాలదయ్యెను.”వ్యాఘ్రేశ్వరశర్మా అహంభో అభివాదమే”అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను హిమాలయములందు మహాతపస్వులు ఉందురనియూ,వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ,అతడు విని యుండెను. తిలదానములు పట్టుటకును,అభావమేర్పడినపుడు ఆబ్దికములకు పోవుట తప్ప ఎవరునూ యితనిని పిలువకపోవుట వలన యీతనిలో ఆత్మన్యూనతా భావమేర్పడెను.

   ఒకానొక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది దానిలో దివ్యమయ కాంతితో విరాజిల్లుచున్న దివ్యశిశువు కన్పించెను.అతడు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. అతని శ్రీచరణములు భూమిని తాకగానే యీ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను.ఆ దివ్యశిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చెను.”నేనుండగా భయమెందులకు ? ఈ గ్రామమునకు నాకునూ ఋణానుబంధము కలదు.ఋణానుబంధములేనిదే కుక్క అయిననూ మన వద్దకు రాలేదు .నీవు హిమాలయ ప్రాంతమైన బదరీ అరణ్య భూమికి పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యెను.

బదరీ అరణ్య ప్రాంతము

వ్యాఘ్రేశ్వరశర్మ బదరీ అరణ్య ప్రాంతమునకు చేరెను.మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను.అయితే ఆటను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను.కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యములో సంచరించసాగెను.అతడు తన సంచారములో ఊర్వశీకుండము అనుచోట పుణ్యస్నానము చేసెను.తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను.ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు  పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్ధించెను.ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను.  ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను.ఆ మహాత్ముడు యిట్లు వచించెను.”వ్యాఘ్రేశ్వరా ! నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పుణ్యజన్మార్జితా పుణ్యస్వరూపము.కాలప్రభోధితుడవై నీవు యిచ్చటకు రాగలిగితివి.ఊర్వశీకుండము నందు స్నానమాచరించగలిగితివి.నరనారాయణులు తపోభూమికి ఆకర్షింపబడితివి.ఇదంతయూ శ్రీ పాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమీ!” అని పలికెను. 



వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై “గురుదేవా! శ్రీ పాద శ్రీవల్లభులు ఎవరు ? వారి అనుగ్రహము నా యెందేట్లు కలిగినది?” అని ప్రశ్నించెను నాయనా! వారు సాక్షాత్తూ దత్తప్రభువులు.త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సావిత్రకాఠక  చయనము   అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురము నందు నిర్వహించెను.దానికి  శివపార్వతులను ఆహ్వానించెను.భరద్వాజునకు యిచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రము నందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు,జ్ఞానులు,యోగులు  అవతరించునట్లు సావిత్రకాఠక చయనము  శ్రీ పీఠికాపురమున జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినవి. దేశమునందలి యితర భాగములందు లుప్తమైయినను, కల్కి అవతారభూమి అయిన “శంబల ” గ్రామము నందు పైంగ్య బ్రాహ్మణమును, సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడియున్నవి.కలియుగము అంతమై సత్యయుగము వచ్చినపుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాదాసరివల్లభులు శ్రీపీఠికాపురమునకు భౌతికరూపములో వచ్చెదరు.  అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినపుడు,పుణ్య కర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినపుడు మాత్రమే దత్తభక్తి కలుగును.  దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినపుడు ఏ యుగమందయిననూ, ఏ కాలమునందయిననూ శ్రీపాదశ్రీవల్లభులు భౌతికరూపములో దర్శన,స్పర్శన సంభాషణా భాగ్యము నిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమునీ పైన కలిగినది. నేను నా గురుదేవులయిన మహావతార బాబాజీ దర్శనార్ధము పోవుచున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు, మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము నభ్యసించుచు,ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని ఆదేశించి సంజీవినీ పర్వతప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను.


వ్యాఘ్రేశ్వరశర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ  పద్ధతులు కానీ, ఆత్మజ్ఞాన ప్రబోధకములయిన మాటలు గాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లు ఆలోచించసాగెను.  “గురుదేవులు  నన్ను ప్రేమతో ఒరే! వ్యాఘ్రమా! అని పిలిచెడివారు. నా యొక్క గురుబంధువులందరునూ వ్యాఘ్రాజినము పై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్రచర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చునది అయినపుడు,వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను? పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్ధము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు  వ్యాఘ్రేశ్వరుడు.  గావున నా యొక్క ఆత్మవ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన యెడల ఆత్మజ్ఞానమును పొందినట్లే ” అని తలపోసెను.

సంవత్సర కాలము యిట్టే గడచిపోయెను. గురుదేవులు ప్రతీ గుహ వద్దకు వచ్చి శిష్యులు యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి.  వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద  వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగదృష్టితో  పరిశీలించిరి.  వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా  వ్యాఘ్రరూపముచే  ధ్యానము చేయుట వలన ఆ రూపమును పొందెనని గ్రహించిరి. వాణి నిష్కల్మష  హృదయమునకును, ఆత్మశుధ్ధికిని  సంతసించిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి.  “శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ” అను దానిని మంత్రముగా వల్లెవేయమనిరి.వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్రరూపములతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను.
కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున రావలెను. శ్రీవల్లభుల భక్తజనసందోహంతో  “నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు. నేను యిప్పుడే తిరిగి వచ్చెదను ” అని పలుకుచూ కాంతిమయ శరీరముతో నీటిపై నడవసాగిరి.  వారు నడుచునపుడు అడుగుపెట్టబోవు ప్రతీచోట తామరపద్మ ముదాయించుచుండెను. వారు యివలి ఒడ్డునకు రాగానే “శ్రీపాదరాజం శరణం  ప్రపద్యే ” అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని  చూచిరి.   వ్యాఘ్రేశ్వరుడు  శ్రీపాదశ్రీవల్లభుని దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను.  శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తెలియాడుచూ కురవపురమునకు చేరిరి. అందరునూ ఆశ్చర్యచకితులై  చూచుచుండిరి.

దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్తాగా  అవతరించిరి. ధర్మశాస్త అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్పస్వామిగా అవతరించినపుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహినియైనట్లే  వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్నస్వరూపమని కొందరు భావించిరి.

శ్రీవల్లభులు కురువపురం చేరుసరికి,వారు వ్యాఘ్రము  నుండి  క్రిందకు డిగ్రీ దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది. దాని నుండి దివ్యమయకాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలెను. తన పూర్వ జన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును శ్రీ వల్లభులు తమ ఆసనముగా చేసుకొనవలసినదని ప్రార్ధించెను. దానికి శ్రీచరణములు అంగీకరించిరి. ప్రేమపొంగులు వార శ్రీవల్లభులు యిట్లు సెలవిచ్చిరి. “నాయనా! వ్యాఘ్రేశ్వరురా !నీవు ఒకానొక జన్మమున మహాబలిష్టడవైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులుతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి,నిరాహారముగా ఉంచి ప్రజల వినొదార్ధము ప్రదర్శనలు యిప్పించుట  మొదలయిన క్రూరకర్మలను చేయచుంటినవి. అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆదుష్కర్మ అంతయును హరించినట్లు చేసితిని. చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపము సిద్దించునట్లు వరము నను గ్రహించుచుంటిని.  హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక మంది సిద్ధపురుషుల దర్శనాశీస్సులను పొందెదవు. యోగమార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవు గాక! అని ఆశీర్వదించిరి.
నీవు యింతకు పూర్వము చూచినది సాక్షాత్తూ  ఆ వ్యాఘ్రేశ్వరూనే.  అతడు హిమాలయములందుండును. మహాయోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా యితడు వ్యాఘ్రరూపమున కావలి కాయుచుండును.  మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము కానీ,వార్తాహరుల అవసరము గాని లేదు. కాని వినోదార్ధము  వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. యిదంతయునూ శ్రీదత్తప్రభువు లీల .
నాయనా ! శంకరభట్టు! సృష్టికి పూర్వకాలమున ఆదిదంపతులుండిరి. భార్య గర్భవతి అయినపుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినపుడు పరమేశ్వరుడు ఆమెనేదయినా  కోరిక కోరుకొమ్మని అడిగెను. అపుడు శర్వాణి, “ప్రభూ ! స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించితిని. పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవమన్నది ఎలాగున ఉండునో నాకు తెలియదు. కనుక అనుగ్రహించవలసినదీ అని కోరెను. శంకరుడు “తధాస్తు ” అనెను. వెంటనే శర్వాణి పురుషరూపము ధరించెను. అదియే మహావిష్ణు స్వరూపము.  గర్భస్తుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను.అపుడు ఆ మహావిష్ణువు యొక్క నాభి యందు కమలము ఉద్భవించెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి సేయదొడంగెను.

   శ్రీ  మహావిష్ణువు

శ్రీ  మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణీ రూపమును సృజించెను. దైవ రహస్యములు, దైవలీలలు అనూహ్యముగా ఉండును. శ్రీ మహావిష్ణువు, పార్వతీ దేవి యిద్దరునూ యీ విధముగా అన్నా, చెల్లెలు  అయి ఉన్నారు.
ఒకానొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీమహా విష్ణువునకు రక్షాబంధనమును కట్టెను. “అన్నా! శ్రీభోళాశంకరులు సాధ్యాసాధ్యములు,ఉచితాసుచితములను పరిశీలించకుండా వరములనిచ్చెదరు. అసుర సంహారార్ధము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగల్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ళ పవిత్రప్రేమకు నిదర్శనముగా రక్షాబంధనపర్వము వెలయును  గాక ” అనెను. శ్రీమహావిష్ణువు  “తధాస్తు ” అనెను.

  ఈ  వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినపుడు మోహినీ అవతారమును  ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధముగా ఉండునని ఉహించుటకు వీలు కాదు, మోహినీ శంకరులను జన్మించిన సంతానమే ధర్మశాస్త. ఇతడే కలియుగములో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త జననాంతరము  మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరహస్యమున్నది. ధర్మశాస్త ఎవరో కాదు, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే మహావిష్ణు రూపములో బ్రహ్మ,రుద్రులు  కూడా ఏకమవుట వలన దీనిని త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షీ నామముతో పరమేశ్వరి అవతరించినపుడు,పరమేశ్వరుడు సుందరేశ్వరునిగా అవతరించినపుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికినీ వివాహము జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వరిగా అవతరించినపుడు వివాహము జరుగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపమున అవతరించారో అదే రూపములో దివ్యజ్యోతిర్లోకములలో వారు సృష్ట్యాది నుండియూ  ఉన్నారు. వారు  1320 లో శ్రీ పీఠికాపురములో అవతరించి క్రీ ।।శ।।1350 లో కురువపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీలలు సప్తర్షులకే అవగతము కానప్పుడు మనమెంత?” అని వచించెను. అప్పుడు నేను స్వామీ! ఇప్పుడు క్రీ ।।శ।। 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలము ఇంక 14 సంవత్సరములు మాత్రమే యీ భూమి పై ఉండెదారా ? ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తీయా? అని ప్రశ్నించితిని. అప్పుడు సద్గురుదేవులు  “నాయనా! శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట. జనన, మరణములు లేనిది వారి లీల దేశకాలా బాధితము.


 కన్యకాపురాణము

శ్రీకృష్ణ పరమాత్మ సమకాలీకుడైన ఉగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒకరాజ్యమును పరిపాలించుచుండెను.  అతడు వైశ్యకులస్థుడు.  ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములు నడుపుతూ, కొందరు రాజ బంధువుల కుటుంబములతో ఆంధ్రదేశము నందలి బృహత్ శిలానగరము నందుండిరి. బృహత్ శిలానగరమును రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమ శ్రేష్టియను నతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమ శ్రేష్టి దంపతులు ధర్మపరాయణులు, సద్వర్తునులు వారు అనేక యజ్ఞయాగాది సత్కర్మలనాచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేస్థికి అత్యంత హితుడు.

జగన్మాత శ్రీ కన్యకాపరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను. శ్రీ పాదశ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపచేసెను. అతనికి విరూపాక్షుడను నామకరణము చేయబడెను. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్నుని గావించుకొనెను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళి రూపమున వానిని అనుసరించెను. గోకర్ణక్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడెను. నాయనా! గోకర్ణ క్షేత్రమునకు, దేవతా రహస్యములతో కూడిన సంబంధమున్నది. రావణ వధ జరిగిననూ,రావణుని యొక్క ఒకానొక అంత కలియుగములో కామమదోన్మత్తుడైన రాజుగా జన్మించెను. అంబ తన భద్రకాళికా రూపమును కలియుగములో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో బాటు, రాజకుటుంబములోని బంధువులు కొందరు తమ ఆర్యావర్తభూమి యందలి సంప్రదాయానుసారంగా అగ్నికి ఆహుతి అయి తమ స్వాభిమానమును తెలియజేసిరి. శ్రీ కన్యకాపరమేశ్వరి తన ప్రభువయిన నగరేశ్వరుని చేరుకొన్నది.

అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమ శ్రేష్టి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే వయస్సు (పాలు),పసిడి (బంగారము) శ్రీ కుసుమ శ్రేష్టి స్వీకరించెడివారు. వారికీ “పైండా ” గృహ నామమును కలిగినది. “నీవు శ్రీపీఠికాపురము దర్శించినపుడు వారి వంశీకుడైన మహాత్ముని కలిసికొనగలవు. నీవు కురువపురమునకు పొమ్ము. శ్రీ వల్లభుల దర్శనము చేసుకొమ్ము ” అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరముతో అంతర్ధానమయిరి.

     శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము

Related posts

Share via