అధ్యాయము 7
ఖగోళముల వర్ణనము
శ్రీపాద శ్రీవల్లభ చరితామృత మహిమఉదయముననే తిరుమలదాసు తన అనుష్ఠానమును ముగించుకుని యిట్లు చెప్పసాగెను. “నాయనా! శంకరభట్టూ! శ్రీపాద శ్రీవల్లభుల దివ్య చరిత్రము అమృతము. అశృతము. అపూర్వము. అతర్క్యము. నీ యందు శ్రీపాద శ్రీవల్లభుల వారికి అపారమైన అనుగ్రహము ఉన్నందువలననే వారి చరితమును గ్రంథస్థము చేయు భాగ్యము నీకు కలిగినది. మహా పండితులకు కూడా అలభ్యమైన ఈ మహా భాగ్యము నీకు లభ్యమగుట కేవలము శ్రీవారి సంకల్పమే.”
శ్రీపాదులు ఒకే సమయములో అనేక స్థలములందు దర్శనమొసంగుట
నరసావధానులు మరణావస్థ నుండి బయటపడిన తదుపరి అతనిలోని ఆకర్షణశక్తి క్షీణించెను. అతడు గతములో ధ్యానములో కూర్చొని ఏ మనుష్యుని అయిననూ ధ్యానించినచో ఆ మనుష్యుడు ఎంత దూరములో నున్నను అచ్చటనుండి బయలుదేరి నరసావదానుల కడకు వచ్చితీరేవాడు. ఆ శక్తి యిపుడు క్షీణించెను. గతములో అతనిని చూచి భయపడినవారు, ప్రశంసలతో ముంచెత్తినవారు యిపుడు అతనికి ఏ మాత్రము భయపడుటలేదు. అవసరమని తోచిన యెడల విమర్శలతో అతనిని బాధించుచుండిరి. అతని ఆర్ధిక స్థితి కూడా క్షీణించ సాగెను. రెండు పూటలా భోజనము లభించు వనరులు కూడా క్షీణించసాగెను. తన దుస్థితికి విలపించుచు అతడు వీధిలోనికి వచ్చెను. శ్రీ బాపన్నావధానులు గారు, తమ మనుమని ఎత్తుకుని తమ గృహమునకు పోవుచుండిరి. రాజశర్మగారింటి నుండి ఒక వీధి మలుపు తిరిగిన బాపనార్యుల యింటికి పోవు వీధి వచ్చును. శ్రీచరణులు తమ యింటివద్ద కంటే తాత గారి యింతివద్దనే ఎక్కువ కాలక్షేపము చేయుచుండెడివారు. శ్రీ నరసింహవర్మ గారింతికిని, శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారింటికిని, యథేచ్చగా పోవుచుండెడివారు. నరసావధానులు శ్రీపాడులవారితో మాట్లాడవలెనని తలచెను. ముద్దుల మూటగట్టు ఆ దివ్య శిశువును ఒక్కసారి ఎత్తుకుని ముద్దాడ వలెనని వానికి తోచెను. నరసావధానులు బాపనార్యులతో పాటు అటు పోవుచున్న శ్రీవల్లభుల వారిని చూచెను. నరసావదానుల వంక శ్రీవల్లభులు చూచి చిరునవ్వు నవ్విరి.ఆ చిరునవ్వు సమ్మోహకముగా నుండెను. తదుపరి నరసావధానులు వెచ్చములు తీసుకొనదలచి శ్రేష్ఠి యింటికి పోయెను. అచ్చట శ్రీపాదవల్లభులు శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠిగారి ఒడిలో నుండెను. శ్రీపాదులు నరసావధనులు వంక దృష్టి సారించి విలాసముగా నవ్విరి. నరసావధానుల వెచ్చములు తీసుకొని యింటికి వచ్చి, అచ్చటనుండి నరసింహవర్మ గారింటికి పోయెను. ఆ సమయమున శ్రీ వర్మగారింట్లో శ్రీవల్లభులు వర్మగారి భుజములపై నెక్కి కూర్చొని యుండుటను చూచిరి. శ్రీవల్లభులు నరసావధానులను చూచి విలాసముగా నవ్విరి. ఈ విధముగా ఒకే సమయములో శ్రీ వల్లభులు మాతామహుల యింటను, వర్మగారింటను, శ్రేష్ఠిగారింటను ఉండుటను గమనించిరి. ఇది కలయా? వైష్ణవమాయయా? అని నరసావధానులు మీమాంసలో పడెను.
ఊరిలోని జనులు తనను పరిపరి విధములుగా ఆడిపోసుకొనుచుండిరి. పాదగయా క్షేత్రములోని స్వయంభూ దత్తుని విగ్రహము మాయమగుటకు తానే కారణమని నిందించుచుండిరి. గంయములేని యాత్రికుని వలె నరసావధానులు వీధుల వెంట తిరుగాడెను. పిచ్చివాని వలె యింటికి చేరెను. నరసావధానులు భార్య పిచ్చివాని వలె నున్న తన భర్తను చూచి మిగుల దుఃఖించెను. తన బాధను వెళ్ల గ్రక్కుకొనుటకు పూజా మందిరమునకు వెళ్ళెను. ఆమె చూచిన దృశ్యము ఆశ్చర్యకరము. వారి పూజామందిరములో శ్రీపాద శ్రీవల్లభులుండిరి. ఆ భార్యాభర్తల ఆనందమునకు అంతు లేకుండెను. తోటకూర వండి అన్నము పెట్టేదామని శ్రీపాదుల వారిని వారు ఎన్తూ బ్రతిమలాడిరి. అందులకు శ్రీపాదుల వారు ఒప్పుకొనలేదు. కాల కర్మ కారణములు ఒకేసారి కలసివచ్చినపుడు అలభ్యయోగము కలుగుచుండును. వివేకి అయినవాడు దానిని గుర్తించి లబ్ధి పొందును. అవివేకి దానిని గుర్తించక నష్టపోవును. ఎట్టకేలకు శ్రీపాదులు వారి యింట భోజనము చేయుటకు అంగీకరించిరి. అయితే అది ఈ జన్మమున మాత్రము కాదు. మరుజన్మములో వారు శ్రీ నృసింహసరస్వతి నామమున పుణ్యభూమి మహారాష్ట్రము లో జన్మిన్చేదమనియూ, అప్పుడు తప్పక వారింటికి వచ్చి తోటకూరతో వండిన భోజనమును స్వీకరిన్చేదననియూ వాగ్దానము చేసెను. శ్రీ గణేశ చతుర్థిన అవతరించిన తనలోని గణేశ అంశతో గజానన నామమున ఒకానొక మహాత్ముడు కొన్ని శతాబ్దముల తదుపరి తన జన్మస్థానమునకు దగ్గరలోనే జన్మించునని వారు తెలిపిరి. సూర్య చంద్రాదుల గతులను మార్చుట అయిననూ సాధ్యము కావచ్చునేమో గాని, ఎత్తి పరిస్థితులలోనూ శ్రీపాదుల వారి వాగ్దానములను మార్చుట ఎవరికినీ సాధ్యము కాదు. వారి ఆదేశములను అనుసరించియే పంచభూతములతోసహా సృష్టియండలి సమస్త జీవులునూ వ్యవహరించవలసి యుండును. వాగ్దానా పరిపాలనము నందు వారు ధృడవ్రతులు, సత్యవ్రతులు, జగములు కదలిననూ, యుగములు మారిననూ వారి లీలలు మాత్రము నిత్య సత్యములుగను, అత్యంత నవీనముగాను యుండును. ఆ పూజా మందిరములో నున్న శ్రీపాదులు వారు నరసావదానులకును, అతని ధర్మపత్నికిని హితోపదేషములు చేసిరి. ఈ హితోపదేషములు దత్త భక్తులన్దరకునూ ఎంతో ప్రయోజనకరమైనవి. నరసావధానులకును, శ్రీవల్లభుల వారికిని ఈ ప్రకారముగా సంభాషణ జరిగినది.
నరసావధానులకు, వారి పూజామందిరమందున్న శ్రీపాద శ్రీవల్లభులకు మధ్య సంభాషణ – నరసావధానులకు శ్రీపాదుల వారి ఉపదేశములు.
ప్రశ్న : నీవెవరవు? దేవతవా? యక్షుడవా? మాంత్రికుడవా?
ఉత్తరం : నేను నేనే! పంచభూతాత్మకమైన యీ సృష్టిలోని ప్రతీ అణువణువునందునూ అంతర్లీనముగా నున్న ఆద్యశక్తిని నేనే!పశుపక్ష్యాదులు లగాయితూ సమస్త ప్రాణికోటి యండుననూ మాతృస్వరూపముగాను, పితృస్వరూపముగానూ ఉన్నది కూడా నేనే! సమస్త సృష్టికిని గురుస్వరూపము కూడా నేనే!
ప్రశ్న : అయితే నీవు దత్తప్రభువు యొక్క అవతారమా?
ఉత్తరం : నిస్సంశయముగా నేను దత్తుడనే! మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా మాత్రమే నేను సశరీరుడనై వచ్చితిని. వాస్తవమునకు నేను నిరాకారుడను, నిర్గుణుడను.
ప్రశ్న : అయితే నీకు ఆకారమూ లేదు, గునములూ లేవు. అంతేకదా!
ఉత్తరం : ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే! గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే! సాకార, నిరాకారములకు, సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను, వాటికి అతీతుడను కూడా!
ప్రశ్న : అన్నీ నీవే అయినపుడు జీవులకు కష్ట సుఖములు ఎందుకు?
ఉత్తరం : నీలో, నీవూ నేనూ కూడ ఉన్నాము. అయితే నీలో ఉన్న నీవు జీవుడవు. నీలో ఉన్న నేను మాత్రము పరమాత్మను. నీకు కర్తృత్వ భావన ఉన్నంతవరకు నీవు నేనుగా కాలేవు. అంతవరకు సుఖదుఃఖములు, పాప పుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు. నీలోవున్న ‘నీవు’ క్షీణదశకు వచ్చి నీలో ఉన్న ‘నేను’ ఉచ్ఛ దశను అందుకొన్నప్పుడు మాత్రమే నీవు దగ్గరయ్యెదవు. నాకు దగ్గరయ్యే కొలదీ నీ బాధ్యతా తగ్గిపోవును. నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు.
ప్రశ్న : జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్పుచున్నారు. జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమన వచ్చునని మరికొందరు చెప్పుచున్నారు. జీవుడే దేవుడని మరికొందరు అనుచున్నారు. దీనిలో ఏది నిజాము?
ఉత్తరం : నీవు వేరుగాను, నేను వేరుగాను ఉన్నంత మాత్రమున నష్టమేమి లేదు. నీలోని అహంకారము నశించి మనమిద్దరమూ ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును. సమస్తమునూ, నా అనుగ్రహము వలననే కలుగుచున్నదనియూ, నీవు కేవలము నిమిత్తమాత్రమైన తత్త్వమని తెలుసుకొనిన యెడల నీవు ఆనంద స్థితిలో ఉండవచ్చును. మోహము క్షయము నోన్డుతయే మోక్షము గనుక నీవు ద్వైతస్థితిలోనూ మోక్ష సంసిద్ధిని పొందగలవు. నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచున్నపుడు, నీలోని అహంకారము నశిన్చినపుడు, నీలోని మోహము క్షయమగును. విశిష్టమైన ఈ అద్వైత స్థితి యందు నీకు ఆనందము సిద్ధించును. మొహములేదు గనుక ఇది కూడ మోక్షమే. నీలోని అహంకారము పూర్తిగా నశించి, కర్తృత్వ భావన సంపూర్తిగా దహింపబడినపుడు ‘నీవు’ అనునది మిగులక ‘నేను’ అనునది మాత్రమే ఉందును గనుక మనస్సుచేత ఎంతమాత్రమూ తెలియరాని ఆ స్థితిలో నీవు బ్రహ్మానందములో నుందువు. కావున అద్వైతస్థితి లో నున్ననూ నీవు మోక్షము నొందగలవు. నీవు ద్వైతములో నున్ననూ, విశిష్టాద్వైతములో నున్ననూ, అద్వైతములో నున్ననూ బ్రహ్మానంద స్థితి మాత్రము ఒక్కటే! అది మనస్సునకు వాక్కునకు అందరానిది. కేవలము అనుభవైకవేద్యము మాత్రమే.
ప్రశ్న : అవధూత స్థితిలో నున్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచున్డురు గదా! మరి నీవు కూడా అవధూతవా?
ఉత్తరం : కాదు. నేను అవధూతను కాదు. నేను బ్రహ్మము, మరియు బ్రహ్మమే సర్వస్వమూ అనునది అవధూత అనుభవము. కాని నేను బ్రహ్మము. నేనే సర్వస్వమూ అనియెడి స్థితి నాది.
ప్రశ్న : అయిన యీ స్వల్పభేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు.
ఉత్తరం : సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచు, బ్రహ్మానంద స్థితి ననుభవించుచున్నాడు. అతనిలో వ్యక్తిత్వము లేదు. వ్యక్తిత్వము లేనపుడు సంకల్పము లేదు. యీ సృష్టి యొక్క మహాసంకల్పములో, మహాశక్తిలో నేను ఉన్నాను. జీవులనియెడి మాయాశక్తి రూపములో కూడా నేనున్నాను. నాలో లీనమైన అవధూతను నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించినయెడల జన్మకు రావలసినదే! సంకల్పముతో కూడిన సత్య జ్ఞానానందరూపము నాది, సంకల్పము నశించిన సత్య జ్ఞానానందరూపము వారిది.
ప్రశ్న : విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా! బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానయినపుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము?
ఉత్తరం : వేయించిన విత్తనములు మొలకెత్తక పోవుట సృష్టి ధర్మము. ఆ వేయించిన విత్తనములనే మొలకెత్తింపజేయుట సృష్టి కర్త యొక్క శక్తి సామర్థ్యములు. అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్యనిరూపణ చేయుటకు గదా గతములో ఏర్పడినది.
ప్రశ్న : దత్తప్రభూ! శ్రీపాదా! వివరించవలసినది.
ఉత్తరం: భూత, భవిష్యవర్తమానములు, అవస్థాత్రయము, సృష్టి స్థితి లయము మొదలయిన త్రయములనన్నింటిని అతిక్రమించి నాన్నగారు అత్రి మహర్షిగా ప్రఖ్యాతులయిరి. సృష్టి యందలి ఏ జీవియండును, ఏ పదార్తమునండునూ అసూయాద్వేషములు లేశమాత్రమూ లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది. బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగాను, అతీతముగాను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపమును దర్శించవలెనని అత్రిమహర్షి ఘోర తపస్సు చేసిరి. ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి యందలి ప్రతీ ప్రాణినీ, ప్రతీ పదార్ధమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించ వలసినదిగా అనసూయా మాత తపమాచరించినది. కర్మ సూత్రముననుసారించి జీవులకు సుఖదుఃఖములు కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లునూ, స్వల్ప పుణ్యములకు మహా ఫలితములు కలుగవలెననెడి సత్సంకల్పములో అనసూయామాత ప్రార్థన చేసెడిది. కఠినమైన లోహముచే చేయబడిన శనగల ఆకారమున నున్న లోహపు ముక్కలను తన తపోబలముచే జీవంతములైన, తినుటకు యోగ్యమైన శనగలుగా అమ్మ మార్చివేసినది. ఖనిజము సంపూర్ణ నిద్రా స్థితిలోనున్న చైతన్యము. వృక్షములు, వృక్ష సంబంధ పదార్థములు అర్ధ నిద్రా స్థితిలోనున్న చైతన్యము, జంతువులూ పూర్ణ చైతన్యములో నున్న స్థితి. ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి, తరువాత తరుగుల్మాదులుగా జనించి, ఆ తదుపరి జంతుజన్మలనెత్తి, ఆఖరున మానవజన్మ నెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడై తనలోని నిద్రాణ స్థితిలోనున్న పరమాత్మ శక్తిని మేల్కొలిపి మోక్షమునొందవలెను. ప్రకృతిలోనున్న పరిణామక్రమము యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయ వచ్చుననునది అమ్మ నిరూపించినది. త్రిమూర్తుల రూపములో నున్న చైతన్యము జాగృతావస్థలో నున్నది. గనుక దానిని నిద్రావస్థ లోనికి మార్చి ఆ ఆకారములను పసిబిడ్డల రూపములోనికి మార్చివేసినది. త్రిమాతల శక్తులు ఏకమై అనఘాదేవిగా రూపొందినది. నేను దత్తాత్రేయుడుగా జనించి అనఘాదేవిని అర్ధాంగిగా స్వీకరించుట జరిగినది. శ్రీపాద శ్రీవల్లభ అవతారమునందు నా వామభాగమున అనఘాదేవియు, కుడి భాగమున దత్తాత్రేయుడు గలిగిన అర్ధనారీశ్వర రూపమున జనిన్చితిని. ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువునకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్ధ్యములుండునని నీవు గ్రహించవలెను.
ప్రశ్న : శ్రీపాదా! సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా?
ఉత్తరం : తప్పకుండా పోగొట్టగలను. అయితే అది మరుజన్మకు వాయిదా వేయుచున్నాను. వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తరువాత మాత్రమే! తోటకూర విషయము చాలా చిన్న విషయము. అయిననూ నీవు దానియందు ఎంత మోహమును పెంచుకొన్నావు? అమ్మగాని, నాన్నగారుగాని, తాతగారు గాని ఎవరినీ ఏమియూ యాచించి అడుగరు. పసిపిల్లవాడినయిన నేను ఎంతటి ఆహారమును తీసుకొందును? నేను మనసుపదినపుడు నీవు తోటకూరను వెంటనే యిచ్చి ఉండవలసినది. ఇప్పుడు కాలాతీతమైనది. నీ మనస్సులోని మాలిన్యములు హరించుటకు ఈ జీవితకాలము చాలదు. ప్రతీ మానవునికిని పుణ్యఫల రూపముగా ఆయువు, ఐశ్వర్యం, అందము, ప్రఖ్యాతి మొదలయినవి సిద్ధించును. పాపఫలరూపముగా అల్పాయువు, దారిద్ర్యము, అనాకారితనము, కుఖ్యాతి మొదలయినవి సిద్ధించును. నీ పుణ్యఫలములో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయమును పోసితిని. నీ పుణ్యభాగము చాలా ఖర్చయినది. పాపభాగము ఎక్కువ మిగిలినది. నీవు దరిద్రమును అనుభవించియే తీరవలెను. అయినను, నీవు స్వయంభూదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకపోయినను, అవస్థ పడకుండా రెండుపూటలా అన్నము లభించునట్లు అనుగ్రహించుచున్నాను.
ప్రశ్న : శ్రీపాదా! వర్ణ వ్యవస్థ ప్రకారము నడచుకొనవలెనని శాస్త్రము చెప్పుచున్నది గదా! మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనము చేయవచ్చునని తీర్మానించిరి. ఇది తప్పుకాదా?
ఉత్తరం : సత్యఋషీశ్వరుల నిర్నయములో దోషము నెంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను. తాతగారు ఎవరనుకొంటివి? వారు సాక్షాత్తు భాస్కరాచార్యులవారు. విష్ణుదత్తుడు, సుశీల అను దంపతులు స్వార్థమనునది ఏమిటో ఎరుగని పరమపవిత్రులు. వారిని నా తల్లిదండ్రులుగా జన్మింప జేయవలసినదని కాల కర్మ దేవతలను నేను ఆదేశించితిని. నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నృశింహ స్వామికి పరమభాక్తులు. సింహాచలంబునందు జరిగిన యజ్ఞయాగాదులలో విశేషమైన అన్నదానములు చేసిన పవిత్రులు. నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమపద్ధతిలో సంపుటి చేయుచుంటిని. ఆ మూడు కుటుంబములతోను నాకు గల ఋణానుబంధము ఒక జన్మలో తీరెడిది కాదు. ఒక అవతారములో పరిసమాప్తమగునది కూడకాదు. నా వరద హస్తము తరతరములవరకు వారి మీద నుండును. నా యొక్క ఛత్రఛాయలో వారు నిశ్చింతగా నుందురు.
శ్రీపాదుల వారు భక్తులకు యిచ్చు అభయము
నా విషయమునకే వచ్చినచో, పెద్దగా విలువలేని తోటకూరను కూడా నీవు నాకు యీయలేకపోతివి. నన్ను భుజింపచేసిన యెడల లక్షమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టినంత పుణ్యము నీకు లభించి యుండెడిది. నీవు ఎంతో అదృష్టము పోగొట్టుకున్నావు. ఏది ధర్మమూ, ఏది అధర్మము అనునది చర్చనీయాంశమైనపుడు శాస్త్రము నాశ్రయించవలసినదే! అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా? లేదా? అను మీమాంస వచ్చినపుడు నిర్మలాంతః కరుణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేదమగును. వారి వాక్కు ధర్మసమ్మతమగును. వారు అధర్మమున తీర్పు చెబుదామనుకొన్నను ధర్మదేవత వారిని చెడు మార్గము లోనికి వెళ్ళనీయక సరైన తీర్పును చెప్పించును. హింస చేయుట పాపమని నీ శాస్త్రము చెప్పుచున్నది. శ్రీ కృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మ యుద్ధమైనదని, కౌరవపాండవ సంగ్రామము ధర్మ యుద్ధమని అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతి గాంచినది కదా! యజ్ఞము పుణ్య ఫలప్రదమే! కాని, పరమాత్మ స్వరూపుడైన శివుని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించినది. దక్షుని తల తెగిపడినది. వానికి మేక తల అమర్చ బడినది. రోగికి పైత్య ప్రకోపము ఉన్నప్పుడు వైద్యుడు నిమ్మకాయ, ఉసిరికాయ అనువాటితో వైద్యము చేయును. శరీరభాగము కుళ్ళినపుడు కత్తిపుచ్చుకుని నరికి వైద్యము చేయును. నేను కూడా అంతే! నాలో దేవతల అంశలే కాక రాక్షసాంశలు కూడా ఉన్నవి. నేను ఉన్మత్తుడిగా, పిశాచాముగా, రాక్షసుడిగా కూడా వ్యవహరించెదను. అయితే నాలో అంతర్గతముగా జీవుల యెడల ప్రేమ పొంగి ప్రవహించుచుండును. మీ స్వభావములను బట్టి, మీ కర్మల యొక్క శుభాశుభములను బట్టి నా ప్రవర్తన ఉందును. సర్వశ్య శరణాగతి చెందినా భక్తులను నేను చేయి విడువను. దూరతీరముల నున్న నా భక్తులను నా క్షేత్రములకు బలవంతముగానైనను రప్పించెదను. ఋషుల యొక్క మూలమును, నదుల యొక్క మూలమును చర్చించరాదు. ఆద్యపరాశక్తి కన్యకాపరమేశ్వరిగా వైశ్యకులములో ఆవిర్భవించలేదా? సిద్ధమునులలో వైశ్యమునులు లేరా ? బ్రహ్మ, క్షత్రియ వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్ఠలను పాటించునెడల వేదోక్త ఉపనయనమునకు అర్హులే! ఉపనయనము వలన మూడోకన్ను విచ్చుకోవలెను. అంతః కరణము పరిశుద్ధమై బ్రహ్మ జ్ఞానమునందు మనస్సు లగ్నమవవలెను. నీ మనస్సు శాక జ్ఞానమందు పూర్తిగా లగ్నమై ఉన్నది. బ్రహ్మమనునది అంగట్లో దొరికే వస్తువనుకొంతివా? ఈ జన్మమున బ్రాహ్మణుడిగా ఉన్నవాడు మరుజన్మమున ఛండాలుడుగా పుట్టవచ్చును. ఈ జన్మమున ఛండాలుడుగా ఉన్నవాడు మరుజన్మమున బ్రాహ్మణుడిగా పుట్టవచ్చును. బ్రహ్మపదార్థము కులమతములకు, దేశకాలములకు అతీతమను రహస్యమును గుర్తెరుగుము. దైవము భావప్రియుడే కాని బాహ్య ప్రియుడు మాత్రము కాదు. నీ భావమును బట్టి దైవము పని చేయుచుండును. బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను. దర్బారు చేయుచూ భక్తుల యోగక్షేమములు విచారించుచూ, వారిని అనుగ్రహించునపుడు నేను క్షత్రియుడను. ప్రతి జీవికీ, ఆ జీవి చేయు పాప పుణ్య కర్మములను బట్టి, వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమునూ నా వద్ద యున్నది. తూచి కొలచి ఎవరికి ఎంతెంత యివ్వవలసినది లెక్క చూసుకొనునపుడు నేను వైశ్యుడను. భక్తుల బాధలను, కష్టములను నా శరీరము మీదకి ఆకర్షించుకొని వారికి సుఖ శాంతులను కలుగజేయుట వలన సేవాధర్మము నెరపుట వలన నేను శూద్రుడను. జీవుల యొక్క పాపములను ప్రక్షాళన చేయునపుడు నేను చాకలిని. మరణించిన జీవులను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏ కులము వాడినో తేల్చి చెప్పవలసినది.
ప్రశ్న : శ్రీపాదా! క్షమించవలసినది. నేను అజ్ఞానిని. నీవు దత్త ప్రభువువే! సర్వజీవులకు ఆశ్రయము నీవే! అసలు యీ సృష్టి ఏ విధముగా ఏర్పదినదో తెలియజేసి నన్ను కృతార్ధుడిని చేయవలసినది.
లోకాలోక వర్ణన
ఉత్తరం : తాతా! స్వర్గము నందు 88 వేల మంది గృహస్థమునులు కలరు. వారు పునరావృత్తి ధర్మమూ కలవారు. ధర్మమును తిరిగి ప్రచారము చేయు నిమిత్తము బీజ భూతులై ఉన్నారు. పరమాత్మ యొక్క అనిర్వాచ్యమైన శక్తిలోని ఒకానొక స్వల్పాంశము జగత్తును సృష్టించుటకు బ్రహ్మగా ఏర్పడెను. పరమాత్మ నుండి క్రమముగా ఏర్పడిన జలము సర్వవ్యాప్తము గా ఉండెను. పరమాత్మ తేజమువలన ఆ జలమునందు స్వర్ణమయములైన అనేక కోట్ల అండములేర్పడెను. ఆ అండములలో మనము నివసించుచున్న బ్రహ్మాండము కూడా ఒకటి. అండము యొక్క లోపలి ప్రదేశము చీకటితో నిండియుండగా పరమేశ్వరుని యొక్క తేజస్సు మూర్తిత్వము నొంది అనిరుద్ధుడను నామముచే విఖ్యాతమాయెను. ఆ అండమును తన తెజోమహిమచే ప్రకాశింప జేసినందున హిరణ్యగర్భుడని, సూర్యుడని, సవిత అని, పరంజ్యోతి అని, అనేక శబ్దములచే వేదములలో వ్యవహరింపబడెను. త్రేతాయుగమునందు పీఠికాపురములో సవితృకాఠక చాయనమును భరద్వాజ మహర్షి నిర్వహించెను. అనేక కోట్ల బ్రహ్మాండముల నిండియున్న దత్తాత్రేయ తేజస్సును ఉద్దేశించి సవితృకాఠక చయనము చేయబడినది. సత్యలోకముననువైన నిరామయ స్తానమను యుక్త స్థానమున్నది. త్రిఖండ సోపానములో వసురుద్రాదిత్యులని పిలువబడు పితృదేవతలుందురు. వీరు నిరామయ స్థాన సంరక్షకులుగా ఉందురు. కారణ బ్రహ్మలోకము అనునది చతుర్ముఖ బ్రహ్మ నివాస స్థానమై ఉన్నది. అది విద్యాస్థానమనియూ మూలప్రకృతి స్థానమనియూ పేరుగాంచిన శ్రీనగరము ఆపైన నున్నది. దానికి పైభాగమున మహాకైలాసమును, ఆపైన కారణ వైకుంఠమును కలవు. సత్యలోకములో పురాణపురమనునది విద్యాధర స్థానము. తపోలోకములో అంజనావతీపురము నందు సాధ్యులు అనువారు ఉందురు. జనలోకములో అంబావతీపురము నందు సనకసనందనాది ఋషులు ఉందురు. మహర్లోకములోజ్యోతిష్మతీ పురము నందు సిద్ధాదులుందురు. సువర్లోకమని పిలువబడు స్వర్గలోకములో అమరావతీ పురమునందు దేవేంద్రాది దేవతలుందురు. ఖగోళమునకు సంబంధించిన గ్రహ నక్షత్రాదులు గల భువర్లోకములో రధంతర పురమందు విశ్వకర్మ అను దేవశిల్పి గలదు. తాతా! భూలోకమందు రెండు భాగములు కలవు. మానవులు నివసించు దానిని భూగోళమని అందురు. ఇది గాక మహాభూమి అనునది మరియొకటి కలదు. ఇది భూగోళమునాకు అయిదు కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరమున దక్షిణముగా నున్నది. మర్త్యలోకమనగా భూలోక, భువర్లోకములు. దీనిలో మహాభూమి కూడా చేరియే యున్నది. పాతాళమనగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళములనునవి. స్థూలముగా వీటిని స్వర్గ మర్త్య పాతాళములని అందురు.
మనము నివసించెడి ఈ భూగోళమునకు దిగువనున్న మహాభూమి అనునది మధ్య భాగము నందు మిర్రుగా నుండి చక్రాకారముగా నున్నది. అందువలన ఉపరిభాగమునందు సూర్య చంద్రుల ప్రకాశము నిరంతరము ప్రకాశించుచున్నది. సదా వెలుతురూ ఉండుటచే అచ్చట కాల నిర్ణయము లేదు. ఈ మహాభూమి మీదనే సప్త సముద్రములును, సప్తద్వీపములును కలవు. జమ్బూద్వీపమనునది దీనియందే కలదు. భూలోకము, భువర్లోకము రెండును చేరి మర్త్యలోకమని పిలువబడుచున్నది. భూలోకము నందు మహాభూమి అనియు, భూగోళమనియు రెండు విధములు కలవు.
సృష్ట్యాది యందు సమస్తమునూ జలములో నిండి యుండెను. ప్రజాపతి సృష్టి చేయదలచి తపమొనరించగా నీటి మీద పుష్కరపర్ణము దర్శనీయమాయెను. ప్రజాపతి వరాహరూపమును పొందినవాడై పుష్కర పర్ణ సమీపమున మునగగా దిగువన ఉన్న మహాభూమిని పొండినవాడాయెను. ఆ మహాభూమి నుండి కొద్దిగా తడిమట్టిని స్వీకరించి తన కోరలచే కొట్టి వేరుచేసి నీటి పైభాగమునకు తెచ్చెను. ఆ మృత్తును పుష్కరపర్ణము నందుంచగా తదుపరి అది పృథివీ నామము పొందెను. తాతా! దీనినే భూగోళమని పిలిచెదరు. మహాభూమి నుండి భూగోళము మధ్య 5 కోట్ల బ్రహ్మాండ యోజనముల దూరము కలదు. మహాభూమి అనునది 50 కోట్ల యోజన విస్తీర్ణము కలిగి యున్నది. జంబూ ద్వీపమనునది మహాభూమియందే కలదు. దానిలో నవఖండములు ఉన్నవి. దైవఖండము నందు దేవతలు నివసిన్చేదారు. గాభాస్త్య ఖండము నందు భూతములుండెదరు. పురుషఖండము నందు కిన్నెరులు, భరతఖండము నందు మానవులు, శరభఖండము నందు సిద్ధులు, గాంధర్వ ఖండము నందు గంధర్వులు, తామర ఖండము నందు రాక్షసులు, శేరుఖండము నందు యక్షులు, ఇందు ఖండము నందు పన్నగులు ఉండెదరు. మహాభూమిలోని జంబూద్వీపమునకు దక్షిణముగా నున్న భరత ఖండములోని భరతపురమున వైవస్వతమనువు, భూ ఋషులతోడను, మానవుల తోడను కొలువుదీరి యుండును. మహాభూమి మీద జంబూద్వీపమున్నటులనే భూగోళము మీద కూడా జంబూ ద్వీపము కలదు. శ్రీపాద శ్రీవల్లభ అవతారము నేను శ్రీ పీఠికాపురములో అవతరించుటకు ముందే 100 సంవత్సరముల క్రితము మహాభూమి మీద వచ్చినది. మహాభూమి మీద నున్న జంబూ ద్వీపము లక్ష బ్రహ్మాండ యోజనముల విస్తీర్ణము కలిగియున్నది. జంబూద్వీపమునందలి భారత ఖండమున మాత్రమీ వైవస్వతమనువు ఉన్నాడు. మిగతా ఖండములలో దేవయోనులయిన వారు ఉన్నారు. మహాభూమి యందలి జంబూద్వీపమున శీతోష్ణాదులు హెచ్చుగానుండక ఆహ్లాదకరముగా నుండును. నీరెండ వంటి సదా వెల్తురుండును గాని పగలురాత్రి అను భేదము లేకుండా ఉందును. మహాభూమి యందలి జంబూద్వీపము లక్ష యోజన విస్తీర్ణము కలదు. లవణ సముద్రము లక్ష యోజనములు, ప్లక్ష ద్వీపము రెండు లక్షల యోజనములు, ఇక్షుర సముద్రము రెండు లక్షల యోజనములు, కుశ ద్వీపము నాలుగు లక్షల యోజనములు, సురాస సముద్రము నాలుగు లక్షల యోజనములు, క్రౌంచ ద్వీపము ఎనిమిది లక్షల యోజనములు, సర్పిస సముద్రము ఎనిమిది లక్షల యోజనములు, శాక ద్వీపము పదహారు లక్షల యోజనములు, దధిస సముద్రము పదహారు లక్షల యోజనములు, శాల్మలీ ద్వీపము ముప్పదిరెండు లక్షల యోజనములు, క్షీర సముద్రము 32 లక్షల యోజనములు, పుష్కర ద్వీపము 64 లక్షల యోజనములు, శుద్ధ జల సముద్రము 64 లక్షల యోజనములు, చాలాచాల పర్వతము 128 లక్షల యోజనములు, చక్రవాళ పర్వతము 256 లక్షల యోజనములు, లోకాలోక పర్వతము 512 లక్షల యోజనములు, తమోభూమి 1250 లక్షల యోజనములు విస్తీర్ణము కలిగి యుండును. లోకాలోక పర్వతమును దాటి సూర్యరశ్మి వెళ్ళుటకు వీలులేదు. అందువలన లోకాలోక పర్వతమునకును అండభిత్తికిని నడుమనుండేది ప్రదేశము ఎల్లప్పుడునూ చీకటితో కూడి యుండును. అండభిత్తి అనునది కోటి యోజనముల మందము కలిగి యుండును. వరాహావతారము గాని, నరసింహావతారము గాని భూమి పట్టేంతటి అవతారములు కావు. వరాహమనగా సూకరము కాదు. ఖడ్గ మృగము. ఒకే కోర కలిగినది.
ద్వీపములు, ద్వీపాధిపతులు, ద్వీపాధిదేవతల వివరణ
మహాభూమి యందలి జంబూ ద్వీపమును స్వాయంభువ మనువు ప్రథమ చక్రవర్తిగా పాలించగా అతని ఏడుగురు కుమారులు ఏడు ద్వీపములకు అధిపతులయిరి. ప్లక్ష ద్వీపమును మేధాతిధి, శాల్మల ద్వీపమును వపుష్మంతుడు, కుశాద్వీపమును జ్యోతిష్మంతుడు, క్రౌంచ ద్వీపమును ద్యుతిమంతుడు, శాకద్వీపమును హవ్యుడు, పుష్కర ద్వీపమును సవనుడు పరిపాలించిన ప్రథమ చక్రవర్తులు. ప్లక్ష ద్వీపమునందలి చాతుర్వర్ణములు ఆర్యక, కురర, విందక, భావిన అనునవి. వారికి చంద్రాకృతిలో నుండు విష్ణువు ఆరాధ్యదైవము. శాల్మల ద్వీపమునందు కపిలవర్ణ, చారణక వర్ణ , పీతవర్ణ, కృష్ణవర్ణ అను నాలుగు వర్ణములు వారుందురు. వారు విష్ణు ఆరాధకులు, కుశ ద్వీపమునందు దమి, శుష్మిణ, స్నేహ, మందేహ, అను నాలుగు వర్ణముల వారుందురు. వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. క్రౌంచ ద్వీపమునందు పుష్కర, పుష్కల, ధన్య, పిష్య అను వర్ణముల వారుందురు. వారికి రుద్రుడు ఆరాధ్య దైవము. శాక ద్వీపము నందు మంగ, మాగధ, మానస, మంద అను వర్ణముల వారుందురు. వారు సూర్య భగవానుని ఆరాధించెదరు. పుష్కర ద్వీపమునందు మాత్రము చాతుర్వర్ణములు లేవు. అందరును దేవతల వలె రోగములు గాని, శోకములు గాని లేకుండా ఆనందముగా నుందురు.
వీరికి బ్రహ్మ ఆరాధ్య దైవము. మన భూగోళము నందలి జంబూ ద్వీపములో భారతవర్షము, కింపురుష వర్షము, హరివర్శము, కేతుమాల వర్షము, ఇలావృత వర్షము, భద్రాశ్వ వర్షము, రమ్యక వర్షము, హిరణ్యాక వర్షము, కురువర్శము అనునవి కలవు. తాతా! మహాభూమియందు ఖండవిభాగములు గల జంబూ ద్వీపమున్నటులనే భూగోళమున వర్ష విభాగములతో కూడిన జంబూ ద్వీపము కలదు. మహాభూమి గుండ్రముగా నుండి మధ్యలో తాబేటి పెంకువలె మిర్రుగా నుండును. దీనినే భూమండలమని పిలచెదరు. భూగోళము మాత్రము నిమ్మపండు వలె నుండును. మహాభూమి మేరు రేఖను చుట్టి బ్రహ్మాండము యొక్క అండభిత్తి వరకు వ్యాపించి యుండును. భూగోళము మాత్రము జ్యోతిశ్చక్ర సమమధ్యమందు నిలచియున్నది. మహాభూమియందు నడిమధ్యన గల మేరురేఖను చుట్టుకొని జంబూ ద్వీపమున్నది. దానిని చుట్టి సప్త సముద్ర ద్వీపాదులున్నవి. భూగోళము నందలి ఉత్తరార్ధ గోళము దేవభాగమని, దక్షిణార్ధ గోళమును అసురభాగమని అందురు. మహాభూమి యందలి సమమధ్య ప్రదేశమున మేరువు దివ్యముగా ప్రకాశించుచున్నది. జీవులను పరిపాలించెడి మనువులకిది నివాస స్థానము. భూగోళము పరిపాలితులయిన జీవులకు స్థానము. మహాభూమి యందు చుట్టూ చేరియుండే చక్రవాళ పర్వతాగ్రము నందు జ్యోతిశ్చక్రము అమర్చబడి యున్నది. భూగోళము మాత్రము దీనికి భిన్నముగా నున్నది. సప్తకక్ష్యావృతమైన జ్యోతిశ్చక్రము దీనికి ప్రతి దినమును ఒక ప్రదక్షిణము చేయుచున్నది. మహాభూమి యందు శీత, వాతాతపములు అల్పములు. సదా పగలుగా నుండి చీకటి అనునది లేక కాలవ్యత్యాసము లేక యుండును. భూగోళము నందు దీనికి వ్యతిరిక్తముగా నున్నవి. మహాభూమి అనునది పుణ్య ఫలానుభవమున మాత్రమీ పొందదగినది. స్థూల శరీరములో పొందరానిది, భూగోళము పుణ్యము సంపాదించుకొనుటకు తగిన కర్మభూమి. స్థూల శరీరులు ఉండవలసిన భూమి. మహాభూమి మీద మను ప్రళయము తప్ప చిన్న ప్రళయములు అనునవి ఉండవు. భూగోళము మీద యుగ ప్రళయములు, మహా యుగ ప్రళయములు, మను ప్రళయములు జరుగుచుండును.
మహాభూమిని ధాత్రి, విధాత్రి అను పేర్లతో పిలిచెదరు. భూగోళమును మహీ, ఉర్వి, క్షితి, పృథ్వి, భూమి అని పిలిచెదరు. తాతా! పాతాళలోకముల గురించి చెప్పుచున్నాను వినుము. అతలము నందు పిశాచ గణములు, వితలమునందు గుహ్యకులు, సుతలమునందు రాక్షసులు, రసాతలము నందు భూతములు, తలాతలము నందు యక్షులు, మహాతలము నందు పితృదేవతలు, పాతాళము నందు పన్నగులు ఉందురు.
లోకనివాసులు, లోకాధిపతులు, ఖండముల వివరణ
వితలమునందుండు కుబేరుడు నవనిధులకు అధిపతి, యితడే బ్రహ్మాండమునకు కోశాధిపతి అయి ఉన్నాడు. ఉత్తరదిక్కునకు అధిపతి అయి ఉన్నాడు. వితలము నందలి అలకాపురమునందు యితడుండును.
అదే వితలమునందు మేరువుకు పశ్చిమ దిశలో యోగినీపురమున మయుడు నివసించును. ఇతడు రాక్షసులకు శిల్పి. త్రిపురాసురులకు ఆకాశములో చాల ఎత్తున విహరించగల త్రిపురములను నిర్మించి ఇచ్చినవాడు.
సుతలములోని వైవస్వతపురమును యమధర్మరాజు పరిపాలించుచుండును. ఇతడు దక్షిణ దిక్కునకు అధిపతి. ఈ పట్టణ ప్రవేశమునకు ముందు అగ్నిహోత్రపు నది కలదు. దీనినే వైతరణి అని అందురు. పున్యవంతులకు సులభముగా దాట వీలు కలుగును. పాపాత్ములకు కడుంగడు కష్టతరము.
రాసాతలమునందు పుణ్యనగరమనునది కలదు. దానికి నిఋతి అను దైత్యుడు అధిపతి. ఇతడు నైఋతి దిక్కునకు అధిపతి. తలాతలము నందలి ధనిష్ఠాన పురమున పిశాచ గణములతో కూడి భేతాళుడుండును. మహాతలములో కైలాస నగరములో సర్వభూత గణములతో కాత్యాయనీ పతియైన ఈశానుడు కలదు. ఇతడు ఈశాన్య దిక్కునకు అధిపతి.
పాతాళమునందు వైకుంఠనగరము కలదు. అందులో శ్రీమన్నారాయణమూర్తి పాతాళాసురులతోను, వాసుకి మొదలయిన సర్పశ్రేష్ఠులతోనూ, శేషశాయియై విరాజిల్లుతున్నాడు. దీనినే శ్వేతద్వీపగతమైన కార్యవైకుంఠము అని అందురు.
ఆఖరిదైన పాతాళ లోకము నందు త్రిఖండ సోపానము కలదు. ప్రథమ ఖండమందు అనంగ జీవులుందురు. ద్వితీయ ఖండము నందు ప్రేత గణములుందురు. తృతీయఖండము నందు యాతనా దేహమును పొందియున్న జీవులు దుఃఖాక్రాంతులై ఉందురు.
సప్తసముద్రములును, సప్తద్వీపములును, మహాభూమి యందు కలవు. దాని మధ్య నుండునది జంబూద్వీపము. ఇది తొమ్మిది ఖండములుగా విభజించబడియున్నది. దక్షిణము నందున్న దానికి భారత ఖండమని పేరు. దీనిలో భరతపురము నందు స్వాయంభువమనువు ఉండును. అనేకులైన పుణ్య జీవులు, ఋషులు స్వాయంభువమనువు పరిపాలనలో ఉందురు. వారు లోకములను పరిపాలించుచు ధర్మాధర్మములను పాలించుచుందురు. మహాభూమి మీద నుండు సప్తద్వీపములను చుట్టుకొని చరాచర, చక్రవాళ, లోకాలోక పర్వతములనునవి స్వర్గలోకము వరకు వ్యాపించి యుండును. ఇవి ఎంత మాత్రము వెలుతురును తన గుండా ప్రసరింపనీయని పొరలు.
మహాభూమికి దిగువన ఏడు అధోలోకములు కలవు. వీటినే సప్తపాతాళములని అందురు. అతలలోకమనునది పిశాచాములకు నివాసము. వితలలోకము నందలి అలకాపురిలో కుబేరుడుండును. వితలలోకమునండలి యోగినీపురములో రాక్షసులతో కూడి మయుడు అనువాడుండును. సుతలమునందు బలి చక్రవర్తి తన పరిజనులయిన రాక్షసులతో నివసించును. వైవస్వతపురము నందు యమధర్మరాజుండును. ఇందలి నరకాదులందు పాపజీవులు యాతనలను పొందుదురు. రాసాతలములోని పుణ్యపురమనునది నైఋతి స్థానము. దీనిలో భూతాది వర్గములుండును. తలాతలమునందలి ధనిష్ఠాపురములో భేతాళుడుండును. తలాతలము నందలి కైలాసపురములో రుద్రుడుండును. మహాతలమనునది పితృదేవతలకు నివాసము. పాతాళము నందు శ్వేతద్వీపవైకుంఠము కలదు. దీనిలో నారాయణుడుండును. మేరువునంటి పెట్టుకొన్న అధోభాగమందు అనంగజీవులు, ప్రేత గణములు, యాతనాదేహములు ఉందురు. నిరాలంబ సూచ్య గ్రహ స్తానమను దానిలో మహాపాతకులుందురు. భోజనానంతరము ‘రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్దినాం ఉదకం దత్తం అక్షయ్య ముపతిష్ఠతి’ అని ఉత్తరాపోశనలోఉదాకప్రదానము వీరికే చేయబడుచున్నది.
లోకముల పేర్లు, వాటి విస్తీర్ణతల వివరణ
భూలోకమునందు గల భూగోళము, మహాభూమి వేరువేరు అని చక్కగా గ్రహింపుము. భూగోళ బిందువుకి ఉపరి ప్రదేశమున ఊర్ధ్వ ధ్రువ స్థానము వరకు గల ప్రదేశములో మేరురేఖయందు ప్రకాశించునది సూర్యలోకము. ఇది సూర్యదేవత ఉండులోకము. సూర్యగ్రహమండలము ఎంతమాత్రమూ కాదు. ఇదే విధముగా చంద్రలోకము, అంగారకలోకము, బుధ లోకము, గురులోకము, శుక్రలోకము, శనైశ్చరలోకము, రాశ్యధిదేవతాలోకము, నక్షత్ర దేవతాలోకము, సప్త ఋషి లోకము, ఊర్ధ్వ ధ్రువ లోకము అనునవి కలవు. ఇవేకాక ఇంకా అనేక అవాంతర లోకములు కలవు.
భూమధ్య బిందువు నుండి సూర్యలోకము లక్ష బ్రహ్మాండ యోజనములలో కలదు. ఇది సూర్యగ్రహాది దేవతయయిన సూర్యుడుండు లోకము. భూమధ్య బిందువు నుండి చంద్రలోకము రెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, అంగారక గ్రహము మూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, బుధలోకము అయిదు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, గురులోకము ఏడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శుక్రలోకము తొమ్మిది లక్షల బ్రహ్మాండ యోజనములలోను, శనిలోకము పదకొండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, రాశ్యధిదేవతా లోకము పన్నెండు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, నక్షత్ర దేవతా లోకము పదమూడు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, సప్తర్షి లోకము పదునాల్గు లక్షల బ్రహ్మాండ యోజనములలోను, ద్రువలోకము పదునైదు బ్రహ్మాండ యోజనములలోను కలవు. ఇదే విధముగా భూమధ్య బిందువు నుండి రకరకములయిన దూరములలో స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము కలవు. భూమధ్యబిందువు నుండి బ్రహ్మాండమును చుట్టిన గోడ అనగా అండభిత్తి వరకు 24 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూమధ్య బిందువు నుండి అండభిత్తి బయటకు 25 కోట్ల 50 లక్షల బ్రహ్మాండ యోజనముల దూరమున్నది. భూలోక, భువర్లోక, సువర్లోకములు ప్రళయకాలమందు నశించును. సువర్లోకమునకు పైన మహర్లోకము కొంత నశించి కొంత నిలచియుండును. ఆ పైన నుండు జనలోక, తపోలోక, సత్యలోకములు బ్రహ్మ జీవితాంతమున గాని నశింపవు. స్వర్గమనగా సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకములును మరియు అండభిత్తి వరకు.
దత్తుడు అనగా ఎవరు?
నరసావధానులు తాతా! నీకు అనుభవములోనికి రావలెనన్న కొన్ని లక్షల జన్మలు కావలసి వచ్చును. కోటానుకోట్ల బ్రహ్మాండములంతటా వ్యాపించి యుండి దానిని అతిక్రమించియున్న ఏకైక తేజోమహారాశియే దత్తుడని తెలియుము. ఆ దత్త ప్రభువే సాక్షాత్తు నీ ఎదుటనున్న శ్రీపాద శ్రీవల్లభుడని తెలియుము.
శ్రీచరణుల హితబోధను విన్న నరసావధానులును, అతని భార్యయును నిర్ఘాంతపోయిరి. ఏడాది వయస్సు ఉన్న ఈ పసికందు యింతటి మహత్తర విషయములను సాధికారముగా చెప్పుటయునూ, తానే సాక్షాత్తు దత్తుడనని తెలియజేయుటచే నరసావధానులును, అతని భార్యయు వెక్కి వెక్కి ఏడువసాగిరి. కనీసము ఆ దివ్య శిశువు శ్రీచరణములు స్ప్రుశించగోరిరి. దానికి శ్రీవల్లభులు నిరాకరించిరి. నరసావధానులు దంపతులు తాము కూర్చున్న చోటు నుండి కించిత్తు కూడా కదలలేకపోయిరి.
శ్రీపాదుల వారు “నేను దత్తుడను. కోటానుకోట్ల బ్రహ్మాండములనంతా వ్యాపించియున్న ఏకైక తత్త్వమును, దిక్కులనే వస్త్రముగా కలవాడను. దిగంబరుడను. ఎవరయితే త్రికరణ శుద్ధిగా దత్త దిగంబరా! శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! నరసింహ సరస్వతి దిగంబరా! అని కీర్తన చేయుదురో అచ్చట నేను సూక్ష్మ రూపములో సదా ఉందును. మా మాతామహులయిన శ్రీ బాపనార్యులు పరదేశము నుండివచ్చి పాదగయా క్షేత్రము నందు శ్రాద్ధాది కర్మలు నిర్వహించు కొనువారికి ఉచితముగా భోజన, వసతి సౌకర్యములు కలిగించు చుండగా, నీ స్వయంభూదత్తుడేడి? అదృశ్యమాయెనుగా? అని ఆక్షేపించితివి. ఆ దత్తుడను నేనే! నేను జన్మించిన పవిత్ర గృహమున విడిది చేయువారు తప్పక పవిత్రులగుదురు. వారి పితృదేవతలకు పుణ్య లోకములు ప్రాప్తించును. బ్రతికి యుండిన జీవులనే కాక చచ్చిన జీవులయొక్క యోగక్షేమములను చూడవలసిన ప్రభువును నేను. నాకు చావుపుట్టుకలు రెండునూ సమానమే! అయిననూ నీవు స్వయంభూదత్తుని ఆరాధించిన దానికి ఫలితము ఇదా? అని వ్యధ చెందుచున్నావు. నీ మీద పడిన అపవాదు పోవునటుల స్వయంభూదత్తుడు త్వరలోనే కన్పించును. ప్రతిష్ఠ కూడా జరుగును. నీకు ఆయుర్దాయమిచ్చితిని. దత్త ధ్యానములో నుండుము. మరుజన్మమున కటాక్షించెదనని అభయమిచ్చుచున్నాను. ఈ జన్మమున నా పాదుకలను స్పర్శచేసేంతటి మహాపుణ్యము నీకు లేనేలేదు. కోటానుకోట్ల బ్రహ్మాండమును సృజించి, రక్షించి, లయము చేయు ఏకైక ప్రభువునైన నేను నా వరద హస్తముతో నిన్ను ఆశీర్వదించుచున్నాను.” అని పలికిరి. మహాభాయంకర శబ్దముతో శ్రీ చరణుల శరీరమునందలి అణుపరమాణువులు విఘటనము చెంది, శ్రీపాదులు అదృశ్యులయిరి.
నాయనా! శంకరభట్టూ! శ్రీపాదులు స్వయముగా తమ నామము చివర దిగంబర నామమును చేర్చి జపించుటలోని మర్మమును యీ రకముగా తెలియజేసిరి. వారు సర్వ వ్యాపకతత్త్వము. నిరాకారమైన ఆ తత్త్వము సాకారముగా ఎట్లు ఆవిర్భవించునో మన ఊహకందని విషయము. పసిబాలకరూపమున కపట వేషమును ధరించి వచ్చిన ఆ జగత్ప్రభువు పసితనము నుండియూ చేయు లీలలకు అంతమెక్కడ ?
శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము!
Sripada Srivallabha Charitamritham
Chapter 7
Description of celestial bodies
Sripada Srivallabha Charitamrita Mahima
ఇవి కూడ చదవండి….
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము -1 | sripada srivallabha charitamrutam
sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం -2
sripada charitamrutam Chapter-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -3
sripada charitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -4
sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -5
sripada charitamrutam Teluguశ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, అధ్యాయం -6