Sri Rama Navami: శ్రీరామనవమి అనేగానే అందరికీ ముందు పానకం గుర్తొస్తుంది. ఆలయాల్లో రాములవారి కళ్యాణం జరిగినప్పుడు వడపప్పు, చలిమిడి, శనగలతో పాటు పానకం కూడా నైవేద్యంగా ఇస్తారు. భక్తులకు కూడా ఈ ప్రసాదాన్ని పంచి పెడతారు. అసలు పానకం లేనిదే శ్రీరామనవమి పండగ జరగదు. అసలు ఈ పానకానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందంటే..
పానకం ఎందుకంటే?
శ్రీ మహా విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన రోజునే సీతారాముల కళ్యాణం జరిగింది. వేసవి కాలంలో మండుటెండలో సీతాదేవి స్వయంవరానికి వెళ్లినప్పుడు కూడా రాములవారికి పానకం ఇచ్చారట. అందుకే శ్రీ రాముడికి ఇష్టమైన పానకాన్ని ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున నైవేద్యంగా పెడతారు. పైగా రాముడికి బెల్లం అంటే చాలా ఇష్టమట.
పానకంలో ఔషధ గుణాలు
ఈ కథ పక్కన పెడితే ప్రతి శ్రీరామనవమి రోజున పానకం ఇవ్వడానికి మరో శాస్త్రీయ కారణం కూడా ఉందట. శ్రీరామనవమి వచ్చే సరికి ఎండలు మండిపోతాయి. ఈ వేడి ప్రభావాన్ని తగ్గించడానికి బెల్లం పానకాన్ని ప్రసాదంగా ఇస్తారట. బెల్లంలో ఉండే ఐరన్ ఎండ వేడిమిని తట్టుకునే శక్తిని ఇస్తుందట. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేలా చేయడంలో కూడా ఇది సహాయపడుతుందట. శరీరంలో వేడిని తగ్గించేందుకు కూడా పానకం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
రాముల వారికి ఇష్టమైన ప్రసాదం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి దీనికి పండుగ వేళ చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ పానకాన్ని తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం ఏం పట్టదు. చాలా తక్కువ పదార్థాలతోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. రాముల వారికి ఇష్టమైన పానకాన్ని ఎలా తయారు చేయాలంటే..
పానకం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
బెల్లం, మిరియాల పొడి, శొంఠి, యాలకులు, నీళ్లు, నిమ్మరసం
తయారు చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో 5 చెంచాల తురిమిన బెల్లం వేసి మిక్స్ చేయాలి. బెల్లం కరిగిపోయిన తరువాత కొద్దిగా మిరియాల పొడి, శొంఠి, యాలకుల పొడి, నిమ్మరసం వేయాలి. అయితే ఇందులో కొందరు తులసి ఆకులను కూడా కలుపుకుంటారు.
