Sri Lakshmi Jayanti 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీమహాలక్ష్మీ దేవిని పూజిస్తే సిరి సంపదలకు, ధనధాన్యాలకు లోటుండదని విశ్వాసం. అందరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. మానవాళికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను ప్రసాదించే ఆ సిరుల తల్లి జన్మదినం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీలక్ష్మీ జయంతి గురించి పురాణ గాథలు
బమ్మెర పోతనామాత్యుడు రచించిన శ్రీమద్భాగవతంలోని క్షీరసాగర మథనం ఘట్టంలో శ్రీలక్ష్మీ జయంతి గురించిన ప్రస్తావన ఉంది. క్షీరసాగర మథనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అపూర్వ వస్తువులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.
మరో కథనం
వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం, లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తఫః ఫలంగా భ్రుగు మహర్షి, ఖ్యాతిలకు కుమార్తెగా లక్ష్మీదేవి జన్మిస్తుంది. ఈమె విష్ణుమూర్తిని వివాహమాడింది.
లక్ష్మీదేవి జయంతి ఎప్పుడు?
పురాణాల ప్రకారం, శ్రీ లక్ష్మీ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తరఫల్గుణి నక్షత్రంలో జన్మించింది. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం. ఈ ఏడాది మార్చి 14వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజును శ్రీలక్ష్మి జయంతి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈసారి శ్రీలక్ష్మీ జయంతి శుక్రవారం రావడం మరింత శుభకరమని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభ సమయం.
శ్రీలక్ష్మీ జయంతి పూజా విధానం
శ్రీ లక్ష్మీ జయంతి రోజు సూర్యోదయంతో నిద్ర లేచి తలారా స్నానం చేయాలి. ఇంటి పరిసరాలను గోమయంతో అలికి చక్కగా ముగ్గులు పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్నచోటనే నివసిస్తుంది కాబట్టి మనం నివసించే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజామందిరంలో శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలి. అమ్మవారికి తేనె కలిపిన ఆవు పాలతో, గంగా జలంతో, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేయాలి. అనంతరం గంధం, కుంకుమలతో అమ్మవారికి బొట్లు పెట్టాలి. గులాబీలు, తామరపూలు, మారేడు దళాలతో పూజిస్తూ శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. అమ్మవారికి ప్రీతికరమైన క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించాలి. చివరగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి.
శ్రీలక్ష్మీ గణపతి హోమం
శ్రీలక్ష్మి జయంతి రోజు శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకుంటే ఆర్థిక సమస్యలు దూరమై అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రవచనం.
తాంబూల దానం
శ్రీలక్ష్మీ జయంతి రోజు కన్నెపిల్లలను, ముత్తైదువులను శ్రీమహాలక్ష్మి స్వరూపంగా భావించి చీర రవికె పసుపు కుంకుమలతో తాంబూలం ఇవ్వాలి. ఆలాగే ముత్తైదువులకు ఎరుపు రంగు గాజులు, అద్దం, దువ్వెన, గోరింటాకు, తమలపాకులు వంటి సుమంగళి ద్రవ్యాలను దానం చేయడం శ్రేష్ఠం.
లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి?
సిరులనిచ్చే లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవాల్సిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథలున్నాయి. ఆది శంకరులు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారా స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి కరుణించి ఆయన భిక్షకు వెళ్లిన ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించిందని పురాణ గాథ.
కలహాల ఇంట కనిపించని లక్ష్మీ
నిత్యం కలహాలు, గొడవలు జరిగే ఇంట, మహిళలను అవమానించే చోట, దైవారాధన జరగని ఇంట, తులసి మొక్క లేని ఇంట, అపరిశుభ్రంగా ఉండే ఇంట లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే కేవలం లక్ష్మీదేవి జయంతి రోజు మాత్రం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శాస్త్రకారుల వచనం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
సేకరణ… ఆధురి భాను ప్రకాష్