November 22, 2024
SGSTV NEWS
SpiritualSri Ganesha Puranam

Sri Ganesha Puranam
శ్రీ గణేశపురాణం– మూడవ అధ్యాయము

ఉపాసనాఖండము మొదటి భాగము
ఆచార నిరూపణం
సోమకాంత మహారాజు కుమారునకు ఆచారమూ ధర్మము రాజనీతులను ఉపదేశించుట అలా రహస్య మందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని స్వర్ణమయమై, బహురత్నఖచితమై, ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా మెరిసిపోతున్న తన సింహాసనంపైన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అతని వీపుపై ప్రేమగా ఆశ్వాసం కలిగేలా తన కుడిచేతిని ఉంచి అతనితో యిలా అన్నాడు.”కుమారా!

అనేకవిధములైన ధర్మాలన్నింటిలోనూ సదాచారము మిక్కిలి విశిష్టమైనది. రాజైనవాడు దీనిని తప్పక పాటించాలి. అందు వల్లనే ఆయువూ, ఆరోగ్యమూ, కీర్తి వర్ధిల్లుతాయి. దేవతానుగ్రహమూ, వంశాభివృద్ధి కూడా కలుగుతాయి. ఆ సదాచార విశేషాలన్నీ శ్రద్ధగా విను!

సదా-చారము :-

అర్ధరాత్రి ఇంకా యామం (షుమారు రెండున్నరగంటలు) కాలం వుండగానే సూర్యోదయానికి ముందుగా బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేవాలి! వెంటనే పడుకున్న శయ్యను వీడి శుచియైన స్థానంలో కూర్చుని తన ఆచార్యుని (గురువును), దేవతలనూ, ప్రణవం (ఓంకార) సహితంగా భూమాతను ధ్యానించాలి.

భూమిపై పాదాలు ఉంచుతున్నందుకు అపరాధ క్షమాపణ కోరి, ఆ తరువాత బ్రహ్మాది దేవతలకు సైతం వరప్రదుడై, సకల ఆగమములచేతా కొనియాడబడుతున్నవాడూ, చతుర్విధ పురుషార్ధములను ప్రసాదించేవాడూ వాక్కులకూ, మనస్సుకూ అతీతుడూ ఐన గజాననునికి నమస్కరించాలి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనూ స్మరించి, మానసోపచారములు పూజచేసి ఆ పిదప బహిప్రదేశానికి చేతిలో నీటిపాత్రను తీసుకుని గ్రామానికి నైఋతిదిక్కుగా వెళ్ళాలి. బ్రాహ్మణుడైనవాడూ, క్షత్రీయుడూ ఎఱ్ఱటి ఒండ్రుమట్టినీ, వైశ్యశూద్రులు నల్లటి ఒండ్రుమట్టినీ తీసుకుని నదీతీరములో బ్రాహ్మణ గృహాలూ పుట్టలూవున్న ప్రదేశాలను విడచి దూరంగా శౌచవిధులను నిర్వర్తించాలి.

దివారాత్రములలో ఉత్తర దక్షిణ దిశలుగా మూత్రపురీష విసర్జనచేయాలి. ఆ తరువాత ఐదుసార్లు మట్టితో, నీటితో చేతులు కడుక్కోవాలి. పదిసార్లు ఎడమచేతిని, ఆ తరువాత మరో ఏడుసార్లు రెండు చేతులనూ, ఒక్కసారీ మట్టితో పాదములనూ శుద్ధిచేసుకోవాలి! వ్రతం ఆచరించేవాడు ఇందుకు రెండురెట్లూ, వానప్రస్థుడైనవాడు మూడురెట్లు, సన్యాసులు నాల్గురెట్లూ శుద్ధిచేసుకోవాలి! స్త్రీలు శూద్రులు ఇందులో సగము, పాతికవంతూ మాత్రం శుద్ధిచేసుకుంటే చాలు.

ఆ తరువాత శుద్ధాచమనం చేసి గానుగ, వేప వంటి పుల్లలను ప్రార్ధనాపూర్వకంగా (ఓవృక్షమా బలాన్నీ, ఓజస్సునూ, తేజస్సునూ, బుద్ధినీ, సంపదలను ప్రసాదించవలసింది అని ప్రార్ధించి వాటిని సేకరించి దంతధావన (పళ్ళు తోముకోవాలి) చేయాలి. ఆ తరువాత నదీ లేక చెరువులో ‘అపవిత్రః పవిత్రోవా’ అన్న మంత్రంతో మలాపకర్షణ స్నానాన్నీ, ఆతరువాత మంత్ర పూరితంగా అఘమర్షణస్నాన” అపోహిష్టానాన్ని మయోభువ” ఇత్యాది మంత్రాలతో చేసి, సంధ్యావందనాదికాలను నిర్వర్తించాలి! ఏకాగ్రచిత్తుడై గాయత్రీ మంత్ర జపం చేశాక, గురూపదిష్ట మంత్రాన్ని జపించాలి! హోమాన్ని శాస్త్రోక్తంగా ఆచరించి మంత్రదేవతా తర్పణాన్నీ, స్వాధ్యాయనము వేద శాస్త్రగ్రంధాల అధ్యయనం చేయాలి! దేవతాపూజలు చేశాక వైశ్వదేవమిచ్చి, బ్రాహ్మణులనూ అతిధులనూ కూడి భుజించాలి!
ఆతరువాత పురాణశ్రవణం చేయాలి! రాజైనవాడు ‘అభక్ష్యభక్షణం’ (తినకూడనివి తినడం), ఇతరులను నిందించటం మానాలి! ఇతరులకు ఉపకారం చేయడానికే తన మాటనూ, ద్రవ్యాన్నీ శక్తియుక్తులనూ వినియోగించాలి. దానధర్మాలు తప్పక ఆచరించాలి! తన భార్యను విసర్జించటం, ఋతుమతిగా వున్నప్పుడు సంగమించకపోవటంకూడా దోషమే! పరదాలపట్ల దోష-బుద్ధి కూడదు! మాతాపితరుల సేవ, గో, బ్రాహ్మణుల సేవ గురుశుశ్రూష అవశ్యం ఆచరించాలి!

దీనులైనవారికి అన్నవస్త్రాలనిచ్చి ఆదరించాలి సాధువులను సగౌరవంగా సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. ప్రాణం పోయినా సత్యవచనాన్ని మాత్రం వీడకూడదు! సాధుసత్పురుల సేవాఫలితం అనంతమైనది. దానివల్ల భగవదనుగ్రహం తప్పక లభిస్తుంది. శ్రద్ధాభక్తులతోనూ అనన్య మనస్సుతోనూ వారిని సేవించాలి. ఇక రాజ్యపాలన విషయంలో రాజెప్పుడూ ఏమరుపాటు చెందకూడదు. దోషులను అపరాధానుసారమే నిష్పక్షపాతంగా దండించాలి.

తనయందు విశ్వాసపాత్రులుగాని వారిని విశ్వసించకూడదు. ఒకప్పుడు శత్రువుగా ఉండినవాడిని కూడా గ్రుడ్డిగా విశ్వసించడం దగ్గరగా మసలనీయడం చేయకూడదు!అలాగే తన శక్త్యానుసారం దానములు చేయాలి. దానం చేయనప్పుడు సంపద క్షీణించి రాజు దరిద్రుడౌతాడు.

సమర్ధవంతమైన పాలనకై గూఢచారులనే నేత్రాలను కలిగి సదా అప్రమత్తుడై వుండాలి. సరియైన దండనీతిని పాటించినప్పుడే ప్రజలు ధర్మవర్తనులై భయభక్తులతో మెలుగుతారు. అలా జరగనప్పుడు రాజ్యంలో అరాజకత్వం చెలరేగుతుంది.

రాజైనవాడు బహిశ్శత్రువులతోపాటు తన అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరింటినీ జయించాలి.

వృత్తిచ్ఛేదము, సంతానచ్ఛేదము, దేవతాచ్ఛేదము కూడనివి! ఆరామములను, నీడనిచ్చే వృక్షాలను ఎన్నడూ నరకరాదు!సర్వ కాలములలో దానధర్మములు విరివిగా చేయాలి. త్యాగబుద్ధి గలిగి ప్రజలకు ఆదర్శప్రాయుడై జీవించాలి.మిత్రద్రోహమూ, స్త్రీలకు రహస్యాలు చెప్పడం ఎన్నడూ చేయకూడని పనులు! తాను ప్రసన్నత, సహృదయతతో ప్రజానీకము యొక్క భృత్యులయొక్క అభిమానాన్ని ఆదరాన్ని చూరగొనాలి!

బ్రాహ్మణులను ఋణ విముక్తుల్ని చేయటం, గోవులను సంరక్షించటం విధిగా ఆచరించాల్సినవి. ఎల్లవేళలా దేవబ్రాహ్మణ పూజలు చేయటం ధర్మజ్ఞుడైన రాజు ఆచరించాల్సిన ధర్మములు” అంటూ ఇంకా అనేక రాజనీతులను, ధర్మ సూక్ష్మాలనూ సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠునకు ఉపదేశించాడు. ఆ తరువాత ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించి మంత్రులు సమకూర్చిన సకలసంబారములతోనూ సమస్త రాజలాంఛనాలతోనూ ఎల్ల రాజలోకమూ, పురప్రముఖులూ చూస్తుండగా పూజించి, నిర్విఘ్నతకై గణపతిని,ఇష్టదేవతారాధనను సల్పి సమంత్రకంగా వేదవిదులైన బ్రాహ్మణోత్తముల మంత్రఘోషలమధ్య మహావైభవంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు.

మంత్రులతో “ఓ అమాత్యవరులారా! ఇతడు నా కుమారుడూ,వారసుడూను మీరంతా నాయందు చూపినట్లే అభిమానాన్నీ, అనురాగాన్నీ, ఈతనికీ పంచివ్వండి! నా ఆజ్ఞవలెనే ఇతని ఆజ్ఞను కూడా మీరూ, మీతోపాటూ మన రాజ్యంలో అందరూ నిర్వర్తించవలసింది!” అని ఆదేశించి, తన కుమారుణ్ణి వారికి అప్పగించాడు.

అనంతరం బ్రాహ్మణ సమారాధనతో ద్విజులనూ, దానధర్మాలతో సమస్త ప్రజలనూ సంతృప్తిపరిచాడు సోమకాంతమహారాజు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండములోని ” ఆచారనిరూపణం ” అనే మూడవ అధ్యాయం సంపూర్ణం.

శ్రీ గణేశ పురాణం.. Sri Ganesha Puranam శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam…రెండవ అధ్యాయము

Related posts

Share via