February 3, 2025
SGSTV NEWS
SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha పురాణం




శ్రీ గణేశపురాణం – ఆరవ అధ్యాయము

ఉపాసనాఖండము మొదటి భాగము
భృగురాశ్రమ ప్రవేశం

సోమకాంత మహారాజు భృగుమహర్షి ఆశ్రమమును ప్రవేశించుట.

తరువాతి వృత్తాంతాన్ని సూతమహర్షి యిలా కొనసాగించాడు :

“ఓ మహర్షులారా! ఇలా భృగుమహర్షి తనయుడైన చ్యవనుడు మహారాణి సుధర్మ యొక్క దుఃఖపూరితములైన, వేదనాభరితములైన దీనవాక్కులను విని, వారి దుఃఖానికి కరుణాళువైన కారణంచేత, తానుకూడా దుఃఖితుడై చేతనున్న నీటికడవను శీఘ్రంగా నింపుకుని ఆశ్రమానికి వేగముగా వెళ్ళాడు! తండ్రియైన భృగుమహర్షి కుమారుని చెంతకు బిలిచి, అతనిని ఆలస్యమెందుకైందని కారణం అడిగాడు.

“నాయనా! చ్యవనకుమారా! మార్గమధ్యంలో ఏదైనా అపూర్వమైన వస్తువునుగాని చూచావా ఏమి? కడవతో నీరు ముంచి తీసుకు రావటానికి యింత ఆలస్యం ఎందుకైంది?” అని ప్రశ్నించాడు. అందుకు ఆ ఋషికుమారుడిలా బదులిచ్చాడు.

“ఓతండ్రీ! సౌరాష్ట్రదేశములో దేవనగరమనే నగరాన్ని సోమకాంతుడనే పేరుగల మహారాజు పాలించేవాడు.

చిరకాలము రాజ్యభోగాలననుభవిస్తూ, వైభవంగా ధర్మబద్ధమైన, ప్రజారంజకమైన పాలనను నిర్వహించాడు. ఇలా ఉండగా, ఆకస్మికంగా ఆతనికి దారుణమైన కుష్ఠువ్యాధి సంప్రాప్తమైనదట! అంతటి అనారోగ్యంతో ఉన్న ఆతడు రాజ్యపాలనను చేయలేక తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి, తన భార్య,మంత్రుల సహితుడై మన సరోవరతీరానికి వచ్చిఉన్నాడు. అతని భార్యయైన సుధర్మ అతిలోక సౌందర్యవతి! అత్యంత కుసుమకోమలి! ఇటువంటి రాజుతో దాంపత్యమెలా సంభవించిందని ప్రశ్నించుచుండటంవల్ల ఆమె ప్రత్యుత్తరం వింటుండగా క్షణకాలం ఆలస్యమైంది. జాలిని గొలిపే ఆమె యొక్క దీనాలాపములకు నా హృదయం వికలమైంది. ఇక అక్కడ ఉండలేక వెంటనే కడవతో నీరు నింపుకొని తిరిగివచ్చాను!” అంటూ జరిగిన వృత్తాంతాన్ని, చ్యవనుడు తండ్రికి వివరించాడు!

ఆ తరువాత కధాగమనాన్ని సూతుడు యిలా వివరించసాగారు :-

ఓ మహర్షులారా! ఈ రీతిగా తన కుమారుని వద్దనుంచి సోమకాంతమహారాజు యొక్క వృత్తాంతాన్ని, విన్న భృగుమహర్షి యిలా అన్నాడు.”కుమారా! నీవు నా ఆజ్ఞానుసారం వెంటనే వెళ్ళి వాళ్ళను ఇక్కడకు తీసుకొని రావలసింది! వారిని చూడాలని నాకూ కుతూహలంగా వున్నది. అలా రావటానికి వారికి వీలుకాకపోతే నేనే వారికి దర్శనమిస్తాను!” తండ్రి ఆజ్ఞననుసరించి సుధర్మను, రాజపరివారాన్నీ, వెంట తీసుకురావడానికై చ్యవనకుమారుడు ఆ సరోవరతీరాన్ని చేరుకున్నాడు. అప్పటికి సుబల, జ్ఞానగమ్యులనే మంత్రులు కూడా కందమూలములను సేకరించుకొని వచ్చారు. ఆ ఋషికుమారుడు రాజపత్నియైన సుధర్మవద్దకు వెళ్ళి యిలా అన్నాడు.

“ఓసాధ్వీ! మా త్రండిగారైన భృగుమహర్షి మిమ్మల్నందర్నీ తమ ఆశ్రమానికి రావలసినదిగా ఆహ్వానించారు!” ఆ వాక్యం చెవినపడగానే సుధర్మకు అమృతపానంచేత పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది!

అమితమైన సంతోషంతో భర్తతోనూ, ఇరువురు మంత్రులతోనూ, ఋషికుమారుని అనుసరించి వెంట నడచివెళ్ళింది.

ఆ భృగుమహర్షి ఆశ్రమమంతా వేదఘోషలతో ప్రతిధ్వనిస్తోంది!అనేక వృక్షాలతోనూ లతలతోనూ, పక్షుల కిలకిలారావాలతోకూడి సుందర మనోజ్ఞ దృశ్యంగా కనబడింది. అపూర్వమైన ఆ ఆశ్రమ వాతావరణంలో పరస్పరం శత్రుత్వం వహించే జంతువులు కూడా తమ స్వాభావికమైన శత్రుత్వాలను వీడి సంచరిస్తున్నాయి.

మలయపవనాలు మందమందంగా ఆహ్లాదం గొలిపేవిగా వీస్తున్నాయి!అటువంటి ప్రశాంతమైన, సుందరమైన పవిత్ర వాతావరణంలోకి ప్రవేశించి, మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోతూన్న ఆ భృగుమహర్షి సన్నిధానం చేరుకుని ఆ రాజదంపతులు అమాత్యసహితంగా వారికి సాష్టాంగ దండప్రణామాలు ఆచరించారు.అప్పుడు రాజైన సోమకాంతుడు వినయంగా యిలా అన్నాడు.

“ఓ ఋషివర్యా! మీ దర్శనభ్యాగంచేత నేడు నా తపస్సు ధన్యమైంది. బ్రాహ్మణాశీస్సులూ నిజమైనాయి. నేచేసిన దానధర్మములు కూడా సఫలమైనాయి. ఈనాటివరకూ నాజన్మ పునీతమైంది! ఇంతటి మహద్భాగ్యాన్ని అందుకునేందుకు కారకులైన జన్మనిచ్చిన నా తలితండ్రులు అత్యంత పవిత్రులైనారు. ఎన్నో జన్మలలో సముపార్జించిన పూర్వపుణ్యం వలనగాని మీవంటి మహాత్ముల దర్శనం లభించదు.మీవంటి మహాత్ముల సందర్శనమాత్రంచేతనే సకల పాపములూ నశిస్తాయి.

ఎంతో ఉన్నతీ, మంచి అభ్యుదయమూ, శ్రేయస్సూ ఒనగూరుతాయి! ఓ మునీంద్రా! భూతభవిష్యద్వర్తమాన కాలములలో మూడింటా మీ సందర్శనం జీవులను పరమ పునీతుల్ని చేస్తుంది. ఇక నా వృత్తాంతము మీకు చెబుతాను.

రాజు తన గోడును ఋషికి విన్నవించుట :-

“ఓ ద్విజేంద్రా! సౌరాష్ట్రదేశంలోని దేవనగరానికి రాజునై చిరకాలం ధర్మపరిపాలనం చేశాను. దేవబ్రాహ్మణ పూజలతోనూ సాధువులను సత్పురుషులను ఉచితరీతిన సత్కరిస్తూనూ పరిపాలిస్తూండగా – ఏ జన్మములో చేసిన పాపంవల్లనో నాకు అతి హ్యేయమైన ఈ కుష్టువ్యాధి సోకింది. దీనికి ప్రతిగా ఏమిచేసినా నివారణ కావడంలేదు! మార్గాంతరం లేక రాజ్యాన్ని విడిచి కడు దీనులమై ఆశ్రిత కల్పతరువులైన తమను శరణువేడడానికి వచ్చియున్నాము. తమ ఆశ్రమంలో జంతువులు పరస్పరం తమతమ సహజవైరాన్ని వీడి అన్యోన్యమైత్రితో మెలుగుతూండటం చూచి ఆశ్చర్యంతో, మహిమాన్వితులైన మిమ్ములను శరణువేడి, రక్షణ కోరి ప్రార్ధింపవచ్చాము!”

సూతులవారిలా కొనసాగించారు :-

‘ఓ మహర్షులారా! సోమకాంత మహారాజుయొక్క మాటలు విన్న భృగుమహర్షి హృదయం దయతో ఆర్ద్రమైంది. ఒక్కక్షణం అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యానస్థుడై, ఆ రాజుతో యిలా అన్నాడు. “ఓ మహారాజా!విచారించకు! నీ దురవస్థకు చేయవలసిన దోషనివారణ గురించి చెబుతాను! నన్ను ఆశ్రయించిన ఏప్రాణీ దుఃఖాన్ని పొందదు! నీవు జన్మాంతరంలో చేసిన ఏపాపంవల్ల ఇట్టి దురవస్థపాలైనావో చెబుతాను!

మీరు చిరకాలపు ప్రయాణం చేయటంచేత ఆకలిదప్పులకు లోనై ఉన్నారు.కాబట్టి ముందు తృప్తిగా మీరు భోజనం కావించండి. మీ బడలిక తీరినాక భోజనానంతరం యావద్వృత్తాంతమునూ చెబుతాను!”

సూతులవారికి చెప్పసాగారు :- “ఓ మహాత్ములారా! అప్పుడు ఆ భృగుమహర్షి ఆ రాజుచేత తైలాభ్యంగన స్నానం చేయించి, రాజోచితమైన షడ్రసోపేతమైన భోజనమును భుజింపచేసాడు. అప్పుడు రాణియైన సుధర్మ, మంత్రులిద్దరూ కూడా స్నానమాచరించి, చక్కటి అలంకారాలను ధరించి మునియొక్క ఆతిధ్యంలో సేదతీరి సమకూర్చబడిన మెత్తని ప్రక్కలపై ఒడలు మరచి నిదురించారు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని “భృగురాశ్రమ ప్రవేశం” అనే ఆరవ అధ్యాయం. సంపూర్ణం.

Related posts

Share via