మహాశివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ. ఈ పండుగను భగవంతుడు శివునికి అంకితం చేశారు. శివుడు ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా భావించబడతాడు. ఈ రోజున భక్తులు శివుని ప్రత్యేకంగా పూజించి ఆయన కృప పొందాలని ఆరాధిస్తారు. అయితే మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 లేదా 27 అనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. మహాశివరాత్రి ఎప్పుడనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శైవ సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు తన దివ్య నృత్యాన్ని చేశారని నమ్ముతారు. ఈ నృత్యం సృష్టి, సంరక్షణ, వినాశనాన్ని సూచిస్తుంది. కొంతమంది పురాణాల ప్రకారం శివుడు పార్వతీ దేవితో వివాహం చేసుకున్న రోజు ఇదే అని చెబుతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. మహాదేవుని ఆశీస్సులు పొందేందుకు రాత్రంతా మేల్కొని శివనామస్మరణ చేస్తారు. చాలా మంది భక్తులు ఆలయాలను సందర్శించి శివునికి అభిషేకం చేస్తారు.
2025 లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘ మాసంలోని క్రిష్ణ పక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:54 గంటలకు ముగుస్తుంది. నిషిత కాల పూజ (అర్ధరాత్రి పూజ) ఫిబ్రవరి 27 న 12:09 AM నుండి 12:59 AM వరకు జరుగుతుంది. ఈ రోజు రాత్రి అర్ధరాత్రి నిషిత కాల పూజ జరుపుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
భక్తులు శివలింగాన్ని పాలు, తేనె, గంధం, బిల్వపత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. శివుని సేవ చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగి శాంతి కలుగుతుందని నమ్ముతారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శివాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో శివుడి ఊరేగింపు, హోమాలు, రుద్రాభిషేకం, కీర్తనలు జరుగుతాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భజనలు చేస్తారు.
మహాశివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. పండ్లు, పాలు, తేనె వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం ఉపవాస విరమణ చేస్తారు. ఈ పండుగ శివభక్తులకు ఎంతో శక్తిని ఇస్తుంది. భక్తి, విశ్వాసంతో శివుని సేవ చేస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున మనస్సును శుభ్రంగా ఉంచుకుని భగవంతుని ధ్యానం చేయడం ఎంతో మంగళకరం
