బిల్వ ఆకు మామూలు ఆకులా కనిపించినా.. శివుడి పూజ లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. శివుడి భక్తులు ఈ ఆకు ను చాలా భక్తి తో శివలింగం పై పెడతారు. అలా పెట్టినప్పుడు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు.
బిల్వ ఆకు సాధారణంగా మూడు ఆకులు కలిసి ఉంటుంది. ఇది హిందూ మతంలో బ్రహ్మ, విష్ణు, శివుల త్రిమూర్తిని సూచిస్తుంది. అంతే కాదు ఇది ప్రకృతిలోని సత్వ, రాజస, తమస అనే మూడు గుణాలను కూడా చూపిస్తుంది. అలాగే శివుడి మూడు కళ్ళు.. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ ఆకులోని ప్రతి భాగంలో కనిపిస్తాయి. కాబట్టి ఇది కేవలం ఆకు కాదు.. ఆధ్యాత్మికంగా సమర్పించేందుకు ఒక గొప్ప గుర్తు.
పురాణ కథ
హిందూ పురాణాల ప్రకారం.. ఈ చెట్టు లక్ష్మీ దేవికి సంబంధించినదిగా భావిస్తారు. స్కంద పురాణం వంటి గ్రంథాల్లో బిల్వ ఆకును భక్తితో తాకినా పుణ్యం వస్తుందని చెబుతారు. శివుడికి సమర్పించిన బిల్వ పత్రం.. భక్తుడి జీవితంలోని చెడు కర్మలను శుభ్రం చేసే శక్తిని కలిగి ఉందని నమ్మకం. ప్రకృతి, ఆధ్యాత్మికత, భక్తి మధ్య ఉండే బలమైన బంధానికి ఇది ఒక నిశ్శబ్ద గుర్తు.
వేటగాడి కథ
ఒకసారి మహాశివరాత్రి రోజున ఒక వేటగాడు రాత్రి అడవిలో ఉన్న బిల్వ చెట్టును ఎక్కాడు. అతనికి తెలియకుండానే ఆ ఆకులను కిందకు వదిలాడు. అవి ఆ చెట్టు కింద ఉన్న శివలింగంపై పడటంతో అతని చేత తెలియకుండానే శివపూజ జరిగింది. ఆ రాత్రి ఉపవాసం ఉండటం, నిద్రపోకుండా మెలకువతో గడపడం, ఆకులను శివునికి సమర్పించడం.. ఈ మూడు శివపూజ పద్ధతులు కూడా అతనిచేత తెలియకుండానే పూర్తయ్యాయి. శివుడు అతని నిజాయితీకి మెచ్చి.. దయతో మోక్షాన్ని ఇచ్చాడని కథ చెబుతుంది.
అహంకారాన్ని వదిలేయడం..
ఈ ఆకులోని మూడు భాగాలు మనలోని గర్వం, కోరికలు, కోపాన్ని సూచిస్తాయని అంటారు. శివలింగంపై ఈ ఆకును పెట్టడం ద్వారా భక్తుడు తన లోపాలను వదిలేస్తూ.. దేవుడి దగ్గర తాను పూర్తిగా లీనమయ్యానని చెబుతున్నట్లు ఉంటుంది. ఇది స్వచ్ఛమైన మనస్సుతో చేసే ఒక లోపలి మార్పుకు గుర్తు.
పువ్వు కంటే ఆకు ఎందుకు..?
శివుడు చాలా తక్కువ వాటితోనే తృప్తి పడే దేవుడు. బంగారు అలంకారాలు, ఖరీదైన పువ్వులు ఆయనకు అవసరం లేదు. బిల్వ పత్రం గొప్ప ప్రదర్శన కాకుండా.. స్వచ్ఛమైన మనసుతో చేసే భక్తిని సూచిస్తుంది. అందుకే ఆయనకు ఈ ఆకు అంటే చాలా ఇష్టం. ఇది అందం కన్నా లోతైన ఆలోచనను.. ఆకర్షణ కంటే లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది.
నిస్వార్థ భక్తికి ప్రతీక
శివుడికి బిల్వ పత్రం సమర్పించడం అంటే భక్తులు ఎలాంటి కోరికలు లేకుండా.. కేవలం నమ్మకంతో పూజ చేయడమే. నేను నీకు పూర్తిగా చెందినవాడిని అనే భావనను ఈ ఆకు తెలియజేస్తుంది. ఇది చూడడానికి చిన్న ఆకులా కనిపించినా.. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక శక్తి దాగి ఉంటుంది.
