హిందూ సంప్రదాయంలో ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం జరిగినా కలశం తప్పనిసరిగా ఉంటుంది. కలశం ఉంటే ఆ పూజకు ఒక ప్రత్యేకమైన పవిత్రత వస్తుంది. కానీ, పూజలో కలశం ఎందుకు పెడతారు? దాని ప్రయోజనాలేంటి? పూజ పూర్తయ్యాక ఏం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చాలామందికి తెలియదు. కలశం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సనాతన ధర్మంలో ఏ పూజ లేదా వ్రతం అయినా కలశం లేకుండా పూర్తి కాదు. కలశాన్ని కేవలం ఒక వస్తువుగా కాకుండా, అది దైవిక శక్తి, సృష్టికి ఒక పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. కలశాన్ని పూజలో ఉంచడం వల్ల ఆ ప్రదేశం శుభ్రమవుతుంది. పవిత్రత పెరుగుతుంది. అది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
కలశం అంటే సృష్టికి ప్రతీక
కలశం విశ్వానికి, సృష్టికి చిహ్నం. దానిలో పోసే నీరు జీవానికి మూలం. కుండను భూమికి, దానిపై ఉంచే కొబ్బరిని మన మనస్సుకు ప్రతీకగా భావిస్తారు. కలశంపై ఉంచే మామిడి ఆకులు సృష్టిలోని సకల జీవులను సూచిస్తాయి.
సమస్త దేవతలు కలశంలోనే ఉంటారు
కలశంలో దేవతలు ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. కలశం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు ఉంటారని నమ్మకం. కలశం నోటి వద్ద రుద్రుడు, మెడ వద్ద శక్తి, మధ్యలో సర్వదేవతలు ఉంటారు. అలాగే, కలశంలో పవిత్ర నదులైన గంగ, యమున, గోదావరి వంటి వాటి జలాలు ఉంటాయని భావిస్తారు. అందుకే పూజ చేసే ముందు కలశాన్ని ప్రతిష్ఠిస్తారు.
కలశం ప్రయోజనాలు
కలశం ఉంటే ఆ స్థలంలో సానుకూల శక్తి పెరుగుతుంది. అది చెడు శక్తులను దూరం చేసి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కలశం సంపద, ఐశ్వర్యానికి గుర్తు. దీనిని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఆ ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోతుంది.
పూజ పూర్తయ్యాక ఏం చేస్తారు?
పూజ పూర్తయ్యాక కలశం లోని నీటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ నీటిని ఇల్లంతా చల్లుకుంటారు. కుటుంబసభ్యులు ఆ నీటిని తాగుతారు. ఇది శరీరంలోని వ్యాధులను నయం చేస్తుందని, మనసుకు ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు. మిగిలిన నీటిని మొక్కలకు పోస్తారు. ఇది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. కలశంపై ఉన్న కొబ్బరిని ప్రసాదంగా స్వీకరించి, పంచుకుంటారు. పూజలో ఉపయోగించిన కలశం మట్టిది అయితే, దానిని నదిలో నిమజ్జనం చేస్తారు. లోహంతో చేసినది అయితే, దానిని శుభ్రం చేసి మళ్లీ వాడుకోవచ్చు. ఈ విధంగా కలశం మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతుంది
