శ్రీ రామ నవమి పండగ హిందువులు జరుపుకునే పండగలలో ఒకటి. దీనిని లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు.. ఏడవ అవతారమైన శ్రీ రాముడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్ష తొమ్మిదవ రోజున అంటే నవమి తిధి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది శుక్ల పక్షం నవమి తిధి విషయంలో గందరగోళం నెలకొంది. ఈ రోజున శ్రీ రామ నవమి పండగను ఎప్పుడు జరుపుకోవాలి తెలుసుకుందాం..
శ్రీ రామ నవమి హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ. దీనిని శ్రీరాముని జన్మదినోత్సవంగా మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకంగా కూడా జరుపుకుంటారు. ఈ పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఇది సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు, రామాయణం పఠిస్తారు, భజనలు చేస్తారు రామయ్యని కీర్తిస్తూ కీర్తనలు చేస్తారు. ఊరూవాడా సీతారాముల కళ్యాణం చేస్తారు. శ్రీరాముడు ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాడు. ఆయనను మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. శ్రీ రామ నవమి పండుగ అంటే శ్రీ రాముడి ఆదర్శాలు మనమూ పాటించాలని.. సత్యం, న్యాయం మార్గాన్ని అనుసరించాలని ప్రతి ఒక్కరినీ ప్రేరేపిస్తుంది. 2025 లో శ్రీ రామ నవమి పండుగ ఎప్పుడు జరుపుకుంటారో ఈ రోజు తెలుసుకుందాం..
ఈ సంవత్సరం శ్రీ రామ నవమి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని శుక్ల పక్ష నవమి తిధి ఏప్రిల్ 5న సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిధి మర్నాడు ఏప్రిల్ 6న సాయంత్రం 7:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మతంలో ఉదయతిథిని పరిగణలోకి తీసుకుంటారు కనుక ఉదయతిథి ప్రకారం ఈసారి శ్రీ రామనవమి 2025 ఏప్రిల్ 6న జరుపుకోనున్నారు.
శ్రీ రామ నవమి ప్రాముఖ్యత
శ్రీ రామ నవమి పండుగ హిందూ మతంలో చాలా పవిత్రమైనది. ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది శ్రీరాముని జన్మదినం. జీవితంలో సద్గుణాలను స్వీకరించాలానే సందేశాన్ని ఈ పండగ ఇస్తుంది. ధర్మాన్ని స్థాపించడానికి.. అధర్మాన్ని నాశనం చేయడానికి మానవుడిగా శ్రీ మహా విష్ణువు దాల్చిన ఏడవ అవతారం శ్రీరాముడిని భావిస్తారు. ఈ రోజున భక్తులు రామాయణం, రామచరితమానాలను పఠిస్తారు. శ్రీ రామ కథ వింటారు. దేవుడిని స్మరిస్తారు.
రాముడంటే ఒకటే మాట, ఒకే బాణం..రాముడంటే సీతకు ప్రాణం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే రామాయణం. లోక కళ్యానమే శ్రీ సీతా రాముల కళ్యాణం . ఈ పండుగ మన జీవితంలో సత్యం, ధర్మాన్ని అనుసరించాలని మనకు బోధిస్తుంది. రామ నవమి వివిధ వర్గాలను అనుసంధానించడానికి.. సమాజంలో ప్రేమ, శాంతి, సామరస్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ఈ రోజున వివిధ ప్రదేశాలలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను పెట్టుకుని శకటాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు
