మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయంలోని నాగచంద్రేశ్వర ఆలయం సంవత్సరానికి ఒకసారి అది కూడా నాగ పంచమి నాడు మాత్రమే తెరుచుకుంటుంది. ప్రపంచంలో శివుడు సర్పపై అధిష్టించిన ఏకైక ఆలయం ఇదే. నాగ పంచమి నాడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి నిర్వహిస్తారు. నాగ పంచమి తరువాత ఈ ఆలయ తలుపులు మళ్ళీ మూసివేస్తారు. మళ్ళీ ఏడాది వరకూ ఈ ఆలయం తలుపులు తెరచుకోవు.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్ష ఐదవ రోజున నాగ పంచమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి జూలై 29 న వచ్చింది. ఏడాది పొడవునా మూసివేసి.. ఒక్క నాగ పంచమి నాడు మాత్రమే భక్తుల కోసం తెరిచి ఉండే ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఇది సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఎందుకు తెరిచి ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ సముదాయంలోని నాగచంద్రేశ్వర ఆలయం నాగపంచమి నాడు మాత్రమే తెరవబడుతుంది. ఈ ఆలయం అద్భుతాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరవబడతాయి. నాగపంచమి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతి నిర్వహిస్తారు. ఆ తర్వాత, ఆలయ తలుపులు మళ్ళీ మూసివేయబడతాయి. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా నాగ దోషం నుంచి కాల సర్ప దోషం నుంచి కూడా బయటపడవచ్చని చెబుతారు. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.
ఆలయ ప్రత్యేకతలు: నాగచంద్రేశ్వర ఆలయం మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం శిఖరంపై ఉంది. ఇక్కడ ప్రతిష్టించబడిన సర్పదేవుడి విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. ఈ విగ్రహాన్ని నేపాల్ నుంచి భారతదేశానికి తీసుకువచ్చారని చెబుతారు. ఇప్పటి వరకూ శ్రీ మహా విష్ణువు సర్పంపై అధిష్టించి ఉన్నట్లు ఉండటం చూసి ఉంటారు.
అయితే ప్రపంచంలో శివుడు సర్పాన్ని పీఠంగా చేసుకుని కూర్చున్న ఏకైక ఆలయం ఇదే. ఈ అద్భుతమైన విగ్రహంలో సర్ప రాజు తక్షకుడు తన పడగను విస్తరించి.. శివుడు, పార్వతి దేవి తన తనయులతో కలిసి కూర్చుని ఉన్నారు. నాగ పంచమి శుభ సందర్భంగా నాగచంద్రేశ్వర స్వామి త్రికాల పూజ నిర్వహిస్తారు.
ఏడాదికి ఒకసారి మాత్రమే తెరవడానికి కారణం: పురాణాల ప్రకారం ఒకప్పుడు సర్ప రాజు తక్షకుడు శివుని ఆశీస్సులు పొందడానికి తీవ్రమైన తపస్సు చేసాడు. శివుడు రాజు తపస్సుకు చాలా సంతోషించి అతనికి అమరత్వం అనే వరం ప్రసాదించాడు. దీని తరువాత రాజు తక్షక సర్పం శివుని సమీపంలో అంటే మహాకాళ అడవిలో నివసించడం ప్రారంభించాడు. అయితే తక్షకుడు తన ఏకాంతాన్ని ఎవరూ భంగపరచకూడదని కోరుకున్నాడు. ఈ కారణంగానే నాగచంద్రేశ్వర ఆలయ తలుపులు నాగ పంచమి రోజున మాత్రమే తెరవబడతాయి
