ఈసారి మార్చి 6వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వస్తోంది. ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్థినాడు వచ్చే ఈ వ్రతం గణపతికి ప్రీతికరమైనది. ఈ చతుర్థి రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, కష్టాలు వెంటనే తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ వ్రతానికి ఉన్న అపార శక్తిని అనుభవించడానికి ఒక్కసారి ఆచరించి చూడండి, మంచి మార్పును ఖచ్చితంగా చూస్తారు. వినాయకుడిని పూజించిన వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సులభంగా ప్రసాదిస్తానని స్వయంగా గణపతే వరం ఇచ్చాడని నమ్మకం. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కొన్ని నియమాలు పాటించాలి. చతుర్థి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆడవారు తలస్నానం చేసి, ఇంటి గడపలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి, కాళ్లకు పసుపు రాసుకొని, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని, మెడలో నల్లపూసలు ధరించి ఈ వ్రతాన్ని చేయాలి.
పూజకు కావాల్సిన సామాగ్రి:
ఎర్రటి మందార లేదా గులాబీ పూలు, గరిక పోచలు, అక్షింతలు, కొబ్బరికాయ, అరటి పండ్లు లేదా దానిమ్మ పండ్లు, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, తమలపాకులు, ముడుపు కట్టడానికి ఎర్రటి కాటన్ వస్త్రం, వినాయకుడి చిత్రపటం లేదా విగ్రహం. పూజ గదిలో వినాయకుడిని ప్రతిష్టించి, గంధం రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఎర్రటి పూలతో గణపతిని అందంగా అలంకరించాలి. మందార పూలు లేకపోతే గులాబీ పూలను వాడవచ్చు. గణపతి చిత్రపటానికి గరిక మాల వేయాలి. మాల వేయలేని వారు 21 గరిక పోచలను వినాయకుడి పటం ముందు ఉంచవచ్చు. ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ రెండు దీపాలు వెలిగించి, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది.
కోరికలు నెరవేరేందుకు..
ముఖ్యంగా, ఈ పూజలో ముడుపు కట్టడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. ఒక తెల్లటి లేదా ఎరుపు రంగు కాటన్ వస్త్రాన్ని గణపతి ముందు పరచి, దానికి పసుపు రాసి, మనసులో కోరికలు తలుచుకుంటూ మూడు గుప్పిళ్ల బియ్యాన్ని పోయాలి. ఆ తర్వాత రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, 11 రూపాయల నాణేలను దక్షిణగా పెట్టి, కోరికలను మరోసారి తలుచుకొని మూడు ముడులు వేసి కట్టాలి. ఈ ముడుపును గణపతి ముందు పెట్టి, ధూపం సమర్పించి, కొబ్బరికాయ పగలగొట్టాలి. చివరగా హారతి ఇచ్చి, సంకటహర చతుర్థి వ్రత కథను చదివి, మూడు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవాలి.
ఉపవాసం ఎలా..
వ్రతం చేసే ఆడవారు పగలు ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం కాకుండా పాలు, పండ్లు, సగ్గుబియ్యం తీసుకోవచ్చు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మరలా తలస్నానం చేసి, పూజ గదిలో దీపం వెలిగించాలి. ఉదయం కట్టిన ముడుపులోని బియ్యంతో పొంగలి తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ముడుపులోని వక్కలు, ఖర్జూరాలు ప్రసాదంగా స్వీకరించాలి. చిల్లర నాణేలను బీరువాలో పెట్టుకోవచ్చు లేదా గణపతి దేవాలయంలో వేయవచ్చు. సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం విరమించాలి. పూజలో నివేదించిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి.
తులసి ఆకులను వాడరాదు
ఈ వ్రతాన్ని ఆచరించడం కష్టమని భావించేవారు కనీసం ఒక పూట ఉపవాసం ఉండి, సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి, దగ్గరలోని గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించవచ్చు. వినాయక చవితి నాడు తప్ప, ఈ పూజలో తులసి ఆకులను వాడరాదు. కుడుములు, ఉండ్రాళ్లు, అరటి పండ్లు, పాయసం, నువ్వులు, 21 మోదకాలు వంటి నైవేద్యాలను కూడా సమర్పించవచ్చు.
ఈ రోజున శుక్రవారం కలిసి రావడంతో, గణపతితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి, తులసికి ప్రదక్షిణాలు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు గణపతి దేవాలయానికి వెళ్లి 12 గుంజీలు తీయడం వల్ల విద్యలో ఆటంకాలు తొలగి, విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులు గణపతి పాదాల వద్ద గరికను సమర్పించి నమస్కరించడం ద్వారా వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. జాతకంలో అదృష్టం లేని వారు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టి నమస్కరిస్తే జాతక దోషాలు తొలగి అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయి. పితృ దోషాలు ఉన్నవారు రావిచెట్టుకు పూజ చేయడం కూడా శ్రేయస్కరం.
Also read
- సంకటహర చతుర్థి శుక్రవారం ప్రత్యేకం.. జాతక దోషాలు తొలగి అదృష్టం, ఐశ్వర్యం లభించాలంటే..!
- నేటి జాతకములు..6 మార్చి, 2026
- వావివరసలు మరిచి చెల్లెపై కన్నేసి…
- 27న పెళ్లికి ముహూర్తం.. ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి
- Pitru Dosham: ఇంట్లో అకస్మాత్తుగా సమస్యలా?.. అది మీ పూర్వీకుల శాపం కావచ్చు, వెంటనే ఈ ఆలయాలను దర్శించండి!






Tirumala: గత ఐదేళ్లుగా ఈ మహాపాపం జరుగుతూనే ఉంది.. టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న రమణదీక్షితులు