April 17, 2025
SGSTV NEWS
Hindu Temple History

ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శిస్తే కంటి జబ్బులు నయం.. ఈ నమ్మకం వెనుక రీజన్ ఏమిటంటే..

భారతదేశంలో అనేక పురాతనమైన అద్భుత ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆలయాలు వెరీ వెరీ స్పెషల్ గా నిలుస్తాయి. కొన్ని ఆలయాలను సందర్శించడం వలన కొన్ని రకాల వ్యాధులు తగ్గుతాయని విశ్వాసం. అలాంటి ఆలయంలోని అమ్మవారిని కేవలం దర్శనం చేసుకుంటే చాలు కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 51 శక్తిపీఠాలలో ఒకటిగా భక్తులతో పూజలను అందుకుంటున్న మహా మహినత్వమైన అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..


భారతదేశంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒకొక్క ఆలయం ఒకొక్క విశిష్టతను కలిగి ఉంది. ఈ ఆలయాలకు సంబంధించిన నమ్మకాల కారణంగా ఏడాది పొడవునా ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. అందులో అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఓ ఆలయంలో కొలువైన అమ్మవారిని దర్శనం చేసుకున్నంత మాత్రాన ప్రజల కంటికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుని పూజలను చేయడం వలన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.


ఈ ఆలయం ఎక్కడ ఉంది?


దేవభూమి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సరస్సు ఉత్తర చివరలో ప్రత్యేకమైన అమ్మవారిక ఆలయం ఉంది. ఈ ఆలయం పేరు నైనా దేవి ఆలయం. ఈ ఆలయం శివుడి అర్ధాంగి సతీదేవి 51 శక్తిపీఠాలలో ఒకటి.

సతీ దేవి కళ్ళు పడిన ప్రాంతం


పురాణాల ప్రకారం.. శివుడు ఆత్మాహుతి చేసుకున్న తన భార్య సతీదేవి మృతదేహంతో కైలాసానికి వెళుతున్న సమయంలో .. విష్ణువు తన సుదర్శన చక్రంతో అమ్మవారి శరీరాన్ని ఖండ ఖండాలుగా ఖండించాడు. అప్పుడు అమ్మవారి శరీర భాగాలు భూమి మీద వేర్వేరు ప్రదేశాల్లో పడిపోయాయి. ఆ భాగాలు పడిన ఆ ప్రదేశాలలో సతీ దేవి శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. అలా.. సతీ దేవి కళ్ళు పడిన ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ఇక్కడ ఉన్న ఆలయంలోని అమ్మవారు రెండు కళ్ల రూపంలో కొలువై ఉన్నారు. నయనం అంటే కళ్ళు కనుక.. ఇక్కడ అమ్మవారిని నైనా దేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారి పేరుమీదనే నైనిటాల్ నగరం ఏర్పడింది.



నైనా దేవి ఆలయంపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంది. ఎవరైనా కంటికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ నైనా దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. అమ్మవారి ఆశీస్సులతో కంటి సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి. ఇక్కడ అన్ని రకాల కంటి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు నైనా దేవిపై ఉన్న ప్రత్యేక విశ్వాసం కారణంగా, ఏడాది పొడవునా ఈ ఆలయం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది.

తనయుడు గణేశుడి కూడా దర్శనం
ఈ నైనా దేవి ఆలయంలో గర్భగుడిలో కళ్ళు రూపంలో అమ్మవారు కొలువై ఉన్నారు. తల్లితో పాటు తనయుడు విఘ్నాలకధిపతి గణేశుడు, అమ్మవారి మరో రూపం కాళీకా దేవి కూడా ఉన్నారు.

వార్షిక పండుగ నైనా దేవి మహోత్సవం
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నంద అష్టమి రోజున నైనా దేవి మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు ఎనిమిది రోజుల పాటు సాగుతాయి. ఈ సమయంలో ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో భక్తుల దర్శనం కోసం నైనా దేవి డోలాన్ని( ఉయాల) ఆలయ ప్రాంగణంలో ఉంచుతారు. ఆ తర్వాత మూడు లేదా ఐదు రోజుల తర్వాత.. దోలాను మొత్తం నగరం చుట్టూ ఊరేగిస్తూ తిరుగుతారు. అనంతరం రాత్రినైనిటాల్ సరస్సులో నిమజ్జనం చేస్తారు. సమీపంలోని మైదానంలో నైనా దేవి జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు నైనిటాల్ కు చేరుకుంటారు

Related posts

Share via