కాశీలో అణువణువు ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ఇక్కడ విశ్వనాథ ఆలయంతో పాటు అనేక ఆలయాలున్నాయి. గంగా.. గోమతి నదుల సంగమానికి సమీపంలో ఉన్న మార్కండేయ మహాదేవ ఆలయం ఇక్కడ ఉన్న పురాతన ఆలయం. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. శివుని గొప్ప భక్తుడైన మార్కండేయ మహర్షి పేరుతో ఈ ఆలయం వెలసింది. సంతానం, దీర్ఘాయుష్షు మొదలైనవాటిని కోరుకునే భక్తులకు ఈ ఆలయం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
వారాణసిలో మార్కండేయ మహాదేవ మందిరం ప్రాముఖ్యత మతపరమైన, చారిత్రక, ఆధ్యాత్మిక అనే మూడు దృక్కోణాల్లో చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం వారణాసి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ ప్రాముఖ్యత పురాణాలతో, ముఖ్యంగా మార్కండేయ పురాణం, శివ పురాణాలతో ముడిపడి ఉంది. ఈ ఆలయం శివుని ప్రధాన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భక్తులు తమ కోరికలను తీర్చమంటూ కొరుకొవడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో, మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. ఈ ఆలయంలోని ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు శాంతి, ఓదార్పునిస్తుంది.
ఆలయానికి సంబంధించిన పౌరాణిక నమ్మకాలు
ఈ ఆలయంతో ముడిపడి ఉన్న అత్యంత ప్రత్యేకమైన నమ్మకం ఏమిటంటే.. ఇక్కడ స్వామి వారికీ బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఇతర దేవాలయాలలో, పూలు, పండ్లు, స్వీట్లు మొదలైనవి సమర్పించే సంప్రదాయం ఉంది. అయితే మార్కండేయ మహాదేవ ఆలయంలో బిల్వ పత్రాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం. నిర్మలమైన హృదయంతో బిల్వ పత్రాలను సమర్పించే భక్తుల ప్రతి కోరికను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడని నమ్ముతారు. పిల్లలు కావాలని కోరుకునే భక్తులకు ఈ ఆలయం వెరీ వెరీ స్పెషల్. సంతానం కోసం తపించే భార్యాభర్తలు ఈ ఆలయంలోని మహాదేవుడికి పూజ చేసి బిల్వ పత్రాలను సమర్పిస్తే.. వారికి పిల్లలు పుడతారు. ఇక్కడ శివుడు అకాల మృత్యు భయం నుంచి ఉపశమనం ఇస్తాడు. అందుకే ఆయనను కల్ముక్తేశ్వర్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో శివుడిని పూజించి బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా అకాల మరణ భయం తొలగిపోతుందని.. దీర్ఘాయుష్షు, సంతోషకరమైన జీవితాన్ని పొందుతాడని నమ్ముతారు.
ఆలయ చారిత్రక ప్రాముఖ్యత
ప్రస్తుత మార్కండేయ మహాదేవ ఆలయం మార్కండేయ మహర్షి శివుడిని పూజించి అమరత్వం అనే వరం పొందిన ప్రదేశంలోనే నిర్మించబడిందని నమ్ముతారు. అందువల్ల, ఈ ఆలయం శివ భక్తులకు అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం గురించి మహాభారతం వంటి పురాతన గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది.
మార్కండేయ మహర్షి కథ
ఈ ఆలయం మార్కండేయ మహర్షి ప్రసిద్ధ కథతో కూడా ముడిపడి ఉంది. మార్కండేయ మహర్షి ఆయుర్దాయం స్వల్పమే.. అతనికి 16 సంవత్సరాల వయస్సులోనే మరణం అని నిశ్చయించబడింది. తల్లిదండ్రుల కోరిక మేరకు.. శివుని అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేసాడు. యమ ధర్మ రాజు తన ప్రాణాలను తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయ మహర్షి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని ఉన్నాడు. శివుడు.. మార్కండేయుడి భక్తికి సంతోషించి యమ ధర్మ రాజును ఓడించి మార్కండేయుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు. ఈ సంఘటన ఈ ప్రదేశంలో జరిగిందని నమ్ముతారు. అందుకే దేశం నలుమూలల నుంచి భక్తులు తమ కోరికలతో ఈ పురాతన ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు.
సేకరణ :ఆధురి భాను ప్రకాష్