SGSTV NEWS
Spiritual

Mahanavami 2025: మహానవమి.. ఈ పూజ చేయనిదే నవరాత్రులు పూర్తికావు.. శుభసమయం ఇదే..



శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించే నవరాత్రి వేడుకలు రేపటితో మహానవమి రూపంలో ముగుస్తున్నాయి. ఈ పవిత్రమైన రోజున సిద్ధిదాత్రి దేవిని పూజించడం వలన సకల సిద్ధులు లభిస్తాయని నమ్మకం. ఈ మహానవమి రోజున హవన యాగం, కన్యా పూజకు సంబంధించిన శుభ సమయాలు ఎప్పుడు? ఈ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి? పూర్తి నవరాత్రి ఫలితాన్ని ఒక్క రోజులో ఎలా పొందాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


నవరాత్రిలో తొమ్మిదో రోజును మహానవమిగా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం నవమి తిథి మంగళవారం (అక్టోబర్ 30న) సాయంత్రం 6:06 గంటలకు ప్రారంభమై.. రేపు అంటే అక్టోబర్ 1న సాయంత్రం 7:01 గంటలకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో నవరాత్రిలో మహానవమి వేడుకలను రేపు జరుపుకోనున్నారు. ఈ రోజున కొంతమంది దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూపాన్ని పూజిస్తే, మరికొందరు సిద్ధిదాత్రిని పుజిస్తారు.


మహానవమి పూజ తర్వాత హవన యాగం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలా చేయడానికి ఉత్తమ సమయం ఉదయం 6:20 నుంచి 11:40 గంటల మధ్య. ఈ సమయంలో హవన యాగం చేయడం, దుర్గాదేవి స్వరూపంగా భావించి బాలికలను పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఇలా పూజిచడం వలన అమ్మవారి అనుగ్రహంతో ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.

బాలికలను పూజించడానికి శుభ సమయం మహానవమి నాడు కన్యా పూజకు మొదటి శుభ సమయం రేపు ఉదయం 5:01 నుంచి 6:14 వరకు. రెండవ శుభ సమయం మధ్యాహ్నం 2:09 నుంచి 2:57 వరకు ఉంటుంది.


పూజ విధానం రేపు తెల్లవారుజామున నిద్ర లేచి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసి ధ్యానం చేయాలి. తర్వాత ఇంట్లోని పూజ గదిలో దుర్గాదేవిని పూజించాలి. వీలయితే దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి, కొబ్బరికాయ, ఎర్ర కండువా, ఎర్రటి పువ్వులను సమర్పించి అమ్మవారిని పూజించండి. పూజ తర్వాత, అమ్మ అనుగ్రహం కోసం దుర్గా చాలీసా పారాయణం చేసి, మీ కోరికలను అమ్మవారికి తెలియజేయండి.

ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తొమ్మిది మంది బాలికలను పూజించాలి. వారికి అమ్మవారికి సమర్పించిన ఆహారాన్ని ప్రసాదంగా పెట్టి, తర్వాత పండ్లు, దక్షిణను ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా సిద్ధిదాత్రి ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో ఆనందం, శాంతి లభిస్తుంది.

నవరాత్రిలో ఎనిమిది రోజుల్లో దుర్గాదేవికి పూజ చేయలేని వారు, మహానవమి నాడు దుర్గదేవి స్వరూపాన్ని పూజించడం ద్వారా మొత్తం నవరాత్రి చేసినట్లే దుర్గాదేవి ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు

Related posts