SGSTV NEWS
Spiritual

Magha Pournami 2025: మహా శక్తివంతం.. మాఘ పూర్ణిమ పర్వదినం.. ఈ రోజున అస్సలు చేయకూడని పనులివే..



మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. మహా కుంభమేళాలో ఇదే రోజున పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు కోట్లాదిగా తరలివెళ్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ పర్వదినం వస్తోంది. ఈరోజున దేవతలు గంగానదిలో స్నానమాచరించేందుకు భువిపైకి వస్తారని నమ్ముతారు. మతపరంగా ఎంతో ముఖ్యమైన ఈ రోజున పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..


మాఘ పూర్ణిమ.. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆర్థిక బాధలు తొలగి అష్టైశ్వర్యాల సిద్ధి కలుగుతుందని చెప్తారు. పౌర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం అర్పించండి. ఆ తర్వాత పూజా కైంకర్యాలను నిర్వహించుకోండి. వీలైతే ఏదైనా దేవాలయాన్ని సందర్శించడం వల్ల శుభం కలుగుతుంది. ఈ రోజున చేసే గంగా స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ, ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కాబట్టి వీలైనవారు నదీ స్నానం చేసుకుని శివకేశవులను ఆరాధించుకోవచ్చు.


ఈ రోజున అస్సలు చేయకూడని పనులివే..
మాఘ పౌర్ణమి రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లో జీవహింస చేయరాదు. ఇనుప వస్తువులు, నల్లని బట్టలు, వెండి, పాలు, ఉప్పు, సూదులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు బయటకు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల శని, చంద్ర దోషాలు వస్తాయని చెప్తారు. వీలైతే వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిని తీసుకోకుండా ఉండాలి. మీ భోజనం మీరే వండుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఇతరులను మోసగించడం, దూషించడం, శారీరకంగా, మాటలతో గానీ హింసించడం వంటివి చేయకూడదు. ఇతరులను అకారణంగా నిందించకూడదు. నల్ల దుస్తులు ధరించకూడదు. రాత్రి ఎక్కువ సమయం వరకు మేలుకుని ఉండకూడదు. ఇక భార్య భర్తల కలయికకు ఇది అనువైన రోజు కాదని గుర్తుంచుకోవాలి.

పౌర్ణమి రోజున ఇవి చేయండి..
ఈ రోజు కచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించడానికి ప్రయత్నించండి. ఇది ఎంతో శ్రేష్ఠమైనదిగా నమ్ముతారు. అవసరంలో ఉన్నవారికి, పేదవారికి అన్న, వస్త్ర దానాలు చేయడం చాలా మంచింది. విష్ణు మూర్తిని పూజించడం, పౌర్ణమి వెన్నెల్లో విష్ణు సహస్రనామం జపించడం ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజు చేసే ఉపవాసం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.


ఆహారం..
ఈ రోజున ఆహారం దానం చేసిన వారికి జీవితంలో ధనానికి, తిండికి లోటు ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవి వారింటిని ఐశ్వర్యంతో నింపుతుందని నమముతారు.

సౌందర్య సాధనాలు..
పౌర్ణమి రోజున సౌందర్య సాధనాలను దానం చేయడం వల్ల భర్త పిల్లల ఆయుష్షు పెరుగుతుందని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటారు

Related posts

Share this