2020 నుంచి ఆగిపోయిన కైలాస మానస సరోవర్ యాత్రను పునఃప్రారంభించేందుకు భారత్, చైనాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత అధికారులు రూపొందిస్తున్నారు.
కైలాస మానస సరోవర యాత్ర.. ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. జీవన్ముక్తి యాత్ర. జీవన సాఫల్యయాత్ర. అదో ఆధ్యాత్మిక ప్రయాణమే అయినా.. అంతుచిక్కని రహస్యం దాగుందేమో అనిపిస్తుంది ఆ ప్రయాణంలో. వైజ్ఞానిక ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచే ఓ మార్మిక గ్రంథాలయం..! కైలాస, మానస సరోవరం. పరమపావణమైన ఆ ప్రదేశం భూమికి, స్వర్గానికి వారధి అని హిందువుల నమ్మకం. ఈ అనంత విశ్వానికే కేంద్రకం ఆ కైలాస పర్వతం అని జైనుల నమ్మకం. కాదూ.. ఈ విశ్వాన్ని నడిపించే నావ లాంటిది అని బౌద్ధుల విశ్వాసం. అసలు కైలాస మానస సరోవరాలను చూడ్డం కాదు.. వాటి గురించి చదవడమూ అంత తేలికైన విషయం కాదంటారు జగ్గీ వాసుదేవ్ లాంటి వారు.
మానస సరోవర యాత్రకు అనుమతి
ఎంత చదువుకున్నా, ఎంత తెలివివంతుడవైనా.. ఆ మార్మికమైన ప్రపంచంలోకి అడుగుపెడితే.. అంతా అయోమయంగా అనిపించి, మళ్లీ అఆల అభ్యాసాన్ని మొదలు పెట్టాలేమో అనిపించే ఓ భావన కలుగుతుందని చెబుతుంటారు. అలాంటి కైలాస మానస సరోవర యాత్ర ఐదేళ్లుగా నిలిచిపోయింది. కారణం.. కరోనా అని చెప్పాల్సి వచ్చినా చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కూడా ఒకటి. 2020లో చివరిసారిగా కైలాస పరిక్రమణ, మానస సరోవర యాత్రకు అనుమతి ఇచ్చింది చైనా. మళ్లీ ఇన్నాళ్లకు.. చైనాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జరిపిన చర్చల ఫలితంగా.. యాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అన్నీ అనుకూలిస్తే.. వచ్చే మే, జూన్ నెల నుంచే యాత్ర మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు..! రెండు దేశాల మధ్య పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ కొన్ని ఉన్నాయి అవి పూర్తైన వెంటనే కైలాస యాత్ర మొదలు కావచ్చు. ఇంతకీ.. కైలాస మానస సరోవర యాత్రకు ఏ రూట్ నుంచి అనుమతి ఇస్తున్నారు? ఎన్ని మార్గాలున్నాయి. ప్రాణం పోయినా సరే.. ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని, మానస సరోవరంలో స్నానాన్ని చేసి రావాలనేంత కోరిక దేనికి? తెలుసుకుందాం..
కైలాస మాసన సరోవర యాత్రకు మూడు దారులు
కైలాస మాసన సరోవర యాత్రకు ప్రధానంగా మూడు దారులు ఉన్నాయి. ఒకటి.. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లి లిపులేఖ్ పాస్ మీదుగా మాసన సరోవరం చేరుకోవడం. రెండో మార్గం.. సిక్కింలోని నాథులా పాస్ మీదుగా మానస సరోవరం వెళ్లడం. ఈ రెండు మనదేశం నుంచి జరిగేవి. ఇవికాక.. నేరుగా భూటాన్ రాజధాని లాసా వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ రూట్ ద్వారా మానస సరోవరం చేరుకోవడం మరోమార్గం. ఈ రూట్స్ గురించి మరింత డిటైల్డ్‌గా తెలుసుకుందాం..
లిపులేఖ్ పాస్, నాథులా పాస్
లిపులేఖ్ పాస్ మీదుగా వెళ్తే ఒక వ్యక్తికి దాదాపు లక్షా 60 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ఖర్చు తగ్గిందని చెబుతున్నారు. ఎందుకు తగ్గిందో తరువాత చెప్పుకుందాం. ఈ యాత్రకు 60 మంది యాత్రికులను ఒక గ్రూప్‌గా చేసి, ఇలాంటి 18 గ్రూపులను పంపిస్తారు. యాత్ర పూర్తి చేయడానికి ఒక్కో గ్రూపునకు 24 రోజులు పడుతుంది. యాత్ర చేసే వాళ్లు ముందుగా ఢిల్లీ చేరుకుని, మూడు రోజులు ఉండి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. రెండో మార్గం.. నాథులా పాస్ మీదుగా వెళ్తే దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. యాత్రకు 21 రోజులు పడుతుంది. 50 మంది యాత్రికుల చొప్పున 10 బ్యాచ్‌లుగా ఈ రూట్‌లో తీసుకెళ్తారు. సేమ్.. ఈ మార్గం ద్వారా యాత్రకు కూడా ఢిల్లీకి వచ్చి, మూడు రోజులు ఉండాల్సి ఉంటుంది.
లిపులేఖ్ పాస్ ద్వారా ఖర్చు, సమయం ఆదా!
ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి వెళ్తే ఈసారి ఖర్చుతో పాటు సమయం కూడా తగ్గుతుంది. దానికి కారణం ఏంటో చెప్పుకుందాం. ఘటియాబ్‌గఢ్ నుంచి లిపులేఖ్ వరకు 80 కిలోమీటర్ల పొడవున గ్రీన్‌ఫీల్డ్ రోడ్ నిర్మించింది భారత ప్రభుత్వం. అంతకుముందు ఈ రూట్ ఎలా ఉండేదంటే.. పితోరాగఢ్ నుంచి ఘటియాబ్‌గఢ్‌కు చేరుకున్న తర్వాత లిపులేఖ్ పాస్‌కు 79 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. అందుకు ఐదు రోజులు పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ఢిల్లీ నుంచి నేరుగా లిపులేఖ్ పాస్ వెళ్లొచ్చు. అందుకే, ఈసారి సమయం, ఖర్చు ఆదా అవుతుంది.
కైలాస యాత్ర ప్రాణాలతో చెలగాటమే?
కైలాస మానస సరోవర యాత్రలో.. ఒకానొక సమయంలో దాదాపు 19వేల 500 అడుగుల ఎత్తైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి వాతావరణంలో అనూహ్య మార్పులు రావచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి.. యాత్ర అయితే మొదలవుతుంది గానీ పూర్తి అవుతుందన్న గ్యారంటీ లేదు. శారీరకంగానే కాదు.. మానసికంగా దృఢంగా ఉండాల్సిందే ఎవరైనా. యాత్రలో భారత సరిహద్దుకు అవతల చనిపోతే.. దహన సంస్కారాల కోసం ఏ యాత్రికుల మృతదేహాన్ని తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉండదు. ఒకవేళ టిబెట్ భూభాగంలో చనిపోతే.. తమ మృతదేహాన్ని అక్కడే దహనం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. యాత్ర ఇంత కఠినంగా ఉంటుందని తెలిసినా.. ఎందుకని ప్రాణాలకు తెగించి మరీ వెళ్తుంటారు? ఏముంది ఆ కైలాస మానస సరోవరంలో..?
కైలాస మానస సరోవర యాత్ర దేనికి?
కైలాస మానస సరోవర యాత్ర దేనికి? ప్రథమ గణనాయకుడు అక్కడ కొలువై ఉన్నాడనా..? ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత కోసమా? లేదూ.. అత్యంత స్వచ్ఛమైన ప్రకృతి అందాలను చూడ్డానికా? ట్రెక్కింగ్, లాంగ్‌జర్నీ అంటే ఇష్టం కాబట్టా? ఏమో.. ఏటా కైలాస మానస సరోవరం యాత్రకు వేలాది మంది వెళ్తుంటారు. వాళ్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో లక్ష్యం. కాని, ఓ వ్యక్తి ఉన్నారు. మొదట ఆయనకు ఏ లక్ష్యమూ లేదు. ఎందుకంటే.. ఆయన ఓ అధికారి. ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే కైలాస మాసన సరోవర్ యాత్రకు ఓ లైజనింగ్ ఆఫీసర్. సింపుల్‌గా అతని డ్యూటీ గురించి చెప్పాలంటే.. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ మీదుగా టిబెట్‌లో ఉన్న కైలాస మానస సరోవర్‌ను చూపించి తిరిగి ఢిల్లీకి తీసుకురావడం. మొత్తం 23 రోజుల ట్రిప్. ఆ తరువాత ఇంటికెళ్లిపోవచ్చు. అదొక్కటే ఆయన లక్ష్యం. కాని, మూడో రోజుకే అర్థమైంది. ప్రయాణం తన చేతుల్లో లేదని. వివిధ కారణాల వల్ల 17 రోజుల పాటు ఒకేచోట ఉండాల్సి వచ్చింది.
యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ అనుభవాలు
ఒకవిధంగా స్ట్రక్ అయిపోయారు. సముద్రమట్టానికి 16వేల అడుగుల ఎత్తున ఉన్న ఓ పర్వత గ్రామం అది. మహా అయితే.. రోజుకు గంట రెండు గంటలే కరెంట్. నో సిగ్నల్స్, నో ఫోన్స్. ఆకాశంవైపు చూస్తూ హెలికాప్టర్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూడ్డం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. 23 రోజుల్లో అయిపోయావాల్సిన యాత్ర 49 రోజులు పట్టింది. ఢిల్లీ చేరుకునే క్రమంలో తనలో ఏదో తెలియని అంతర్మథనం. లైజనింగ్ అధికారి అన్నాం గానీ అతని క్వాలిఫికేషన్ చెప్పలేదు కదూ. అతనో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. అందరితోపాటే పరిక్రమణ చేస్తున్నా.. తానూ ఓ పోలీస్ అనే విషయాన్ని, తానొచ్చింది యాత్రికులను చూసుకోడానికి మాత్రమేనన్న విషయాన్ని మరిచిపోయాడు. మనసులో ప్రకంపనలు, తనకే తెలియని ఓ పాజిటివ్ ఎనర్జీ. అందరితోపాటు ఆ ఐపీఎస్ అధికారి కూడా కైలాస పరిక్రమణ చేశారు. అదో అద్భుత అనుభవమే గానీ.. దాని అర్థం చెప్పలేకపోతున్నాడు. మనసులో ఏదో తెలియని వైరాగ్య భావన. జీవితం అంటే ఇంతేనా అనే భావన. కాదు.. జీవితమంటే ఇది కాదు. మరేంటి? ఏమో.. తను చదివిన చదువు కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది? పోనీ పంథా ఏమైనా మారాలా, నన్ను నేను మార్చుకోవాలా అనే ప్రశ్న. అసలు నేను నేనులా ఉన్నానా? ఏమైంది నాకు అనే మరో ప్రశ్న. ఆ కైలాస పర్వతాన్ని చూసినప్పుడు.. శివుడంటే ఇతనేనా అనే ప్రశ్న. కాదు.. శివుడు పర్వతంగా ఎందుకు ఉంటాడు అని మరో ప్రశ్న. దేవుడు అంటే ఓ స్థిరత్వం, ఓ నిశ్చితత్వం అనే భావన. అంతలోనే.. కాదేమో దేవుడంటే పూరిపూర్ణత అంటూ తనలో తనకే వచ్చిన ఓ సమాధానం. ఆ సమయంలో అన్నీ మరిచిపోయాడతను. గతం మీద ధ్యాస లేదు. భవిష్యత్తు మీద చింత లేదు. ఇప్పుడేంటి? నేనేంటి? ఇవే ఆలోచనలు. అకస్మాత్తుగా ఏదో యోగ నిద్రలోకి వెళ్లినట్టుగా ఓ భావన. ఓహో దేవుడు అంటే ఇదేనేమో అనే జ్ఞానోదయం. ఓ ఏడాది తరువాత ఉద్యోగానికి రాజీనామా చేశాడా ఐపీఎస్ ఆఫీసర్. ఆయన అనుభవించిన ఓ ఆధ్యాత్మిక భావన ఇది. అతనెవరో కాదు.. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.
కైలాస పర్వతంపై రహస్య ఆధ్యాత్మిక రాజ్యం..!
ఇలాంటి ఆధ్యాత్మిక చింతన చాలామందిలో కలిగింది. అదేం మాయో తెలీదు గానీ.. ఆధ్యాత్మిక చింతన లేని వారిలో సైతం తెలియని భక్తి వైరాగ్యం పుట్టిస్తుందా ప్రాంతం. ఆ కైలాస పర్వతంపై ఒక రహస్యమైన ఆధ్యాత్మిక రాజ్యం ఏదో ఉండే ఉంటుందనేది చాలామంది భావన. దాన్నే కొందరు శంబాలా అంటుంటారు. అదో మర్మదేశం. అందరూ వెళ్లడానికి సాధ్యం కాని ఓ అదృశ్య ప్రాంతం. అచ్చంగా కల్కి సినిమాలో చూపించినట్టు. ఈ ప్రపంచంలో ఎన్నో పర్వతాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. వాటన్నింటినీ అధిరోహించినా.. కైలాస పర్వతాన్ని మాత్రం చిట్టచివరి వరకూ ఎవరూ అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతాన్ని అధిరోహిద్దామని ప్రయత్నించిన వారు అదృశ్యమయ్యారు. ఎంతోమంది చనిపోయారు కూడా. ఆ రహస్యమేంటో అంతుబట్టక.. కైలాస పర్వతారోహణను నిషేధించారు.
అన్ని మతాలకు పూజ్యనీయం.. ఆ పర్వతం!
నిషేధించడానికి కారణం అదొక్కటే కాదు. అత్యంత పవిత్రమైన కైలాసంపై కాలు మోపడం అపరాధం అనే భావన ఏర్పడింది. ఈ భావన ఒక్క హిందువులకే కాదు. ఆ మాటకొస్తే కైలాస, మానస సరోవరాలు కేవలం హిందువులకే పూజ్యనీయం కాదు. జైనులు, బౌద్ధులు, జైనం-బౌద్ధం కంటే ముందే పుట్టిన టిబెట్‌లోని బాన్ మతస్తులు సైతం ఆ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా కొలుస్తారు. దవళవర్ణంలో మెరిసిపోయే ఆ కైలాసం మీదే నీలకంఠుడు తపస్సు చేస్తూ ఉంటాడని హిందువుల నమ్మకం. టిబెటన్ బౌద్ధారాధకుల దృష్టిలో మాత్రం.. ఆ కైలాస పర్వతంపై చక్రసంవర, డెమ్ చోగ్ అనే బౌద్ధ బిక్షువులు ఇప్పటికీ నివసిస్తున్నారని నమ్ముతారు, ఆరాధిస్తారు. ఇక జైనులకు సంబంధించి రిషభదేవుడు ఆ కైలాస పర్వత ప్రాంతంలోనే విముక్తి పొందారని చెబుతారు. జైన గ్రంథాల్లో కైలాస పర్వతం గురించి చాలా వివరించి చెప్పారు. అందుకే, ఈ పర్వతాన్ని అష్టపద అని పిలుస్తుంటారు జైనులు. ఇక బౌద్ధ మతానికంటే పురాతనమైన బాన్ మతం ఉంది టిబెట్‌లో. ఆ తెగ వాళ్లు కూడా కైలాస పర్వతాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా కొలుస్తారు. ఇన్ని దేశాలకు, ఇన్ని మతాల వారికి పరమ పవిత్రం కాబట్టే.. అసలక్కడ ఏం ఉందో చూడ్డానికి వెళ్తుంటారు యాత్రికులు.
కైలాస పర్వతం పాదాల చెంత పవిత్ర సరస్సు
ఇక్కడి మానస సరోవరం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు.. ఈ మానస సరోవరం. సముద్రమట్టానికి 4వేల 500 మీటర్ల ఎత్తులో.. కైలాస పర్వతం పాదాల దగ్గర ఉంటుంది. మానస సరోవరంలో చేసే పవిత్ర స్నానంతో ఏడు జన్మల పాపాలు తొలగి, మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. వేదం ప్రకారం.. మనిషి అంతిమ లక్ష్యం మోక్షం. ఒక్కస్నానంతోనే ముక్తి లభిస్తుందనుకున్నప్పుడు.. ఇక ప్రాణాలను ఎందుకని లెక్కచేస్తారు? బొందితో కైలాసం అనే నానుడి ఎలాగూ ఉంది. పైగా.. భూమికి, స్వర్గానికి మధ్య వారధి లాంటిది ఆ ప్రదేశం అనే నమ్మకమూ ఉంది. అందుకే, ప్రాణాలకు తెగించి మరీ.. జీవితంలో ఒక్కసారైనా కైలాస మానస సరోవరం చూడాలనుకుంటారు. ఐదేళ్ల తరువాత చైనా అంగీకరించడంతో.. దాదాపుగా ఈ వేసవి నుంచే యాత్ర మొదలవుతోంది కూడా.