అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు..నైవేద్య ప్రియుడు కూడా! ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని నివేదనలు శ్రీవారికి జరుగుతాయి. కానీ అన్నిటికంటే అటు శ్రీవారికీ, ఇటు భక్తులకు ప్రియమైనది లడ్డూ ప్రసాదమే!
తిరుమల వెళితే దర్శనంతో సమానంగా పవిత్రంగా భావించేదీ.. ఈ లడ్డూనే! ఎవరు తిరుపతికి వెళ్లినా.. ప్రసాదం ఎక్కడ అని ఆత్రంగా వెతికేదీ ఈ లడ్డూ కోసమే! ఎవరు తిరుమలకు వెళ్లొచ్చినా.. ఇంటికి వచ్చి..దీపారాధన చేసి..నైవేద్యం పెట్టేది ఈ లడ్డూనే! అమెరికాలో ఉన్నా..ఎవరు ఇండియా నుంచి వస్తున్నా అడిగేది ఈ లడ్డూ కోసమే! ఎప్పుడు తెలుగు గడ్డకు వచ్చినా.. తిరుమలకు గబగబా మెట్లెక్కి శ్రీవారిని దర్శించి..ఆ స్వామి వర ప్రసాదంగా కళ్లకద్దుకుని తినేది ఈ లడ్డూనే! విశ్వరూపధారి అయిన తిరుమల గోవిందుడు.. మన ఇంటికి వచ్చేది ఈ లడ్డూ రూపంలోనే! ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు.. కోట్లాది భక్తుల ఎమోషన్! ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
“తిండిమొండయ్య నైవేద్య ప్రియుడంటూ..”
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, కైంకర్య ప్రియుడే కాదు..నైవేద్య ప్రియుడు కూడా! ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని నివేదనలు శ్రీవారికి జరుగుతాయి. కానీ అన్నిటికంటే అటు శ్రీవారికీ, ఇటు భక్తులకు ప్రియమైనది లడ్డూ ప్రసాదమే! అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే.. “తిండిమొండయ్య నైవేద్య ప్రియుడంటూ..” కలియుగ దైవాన్ని ఆటపట్టించేవాడుట! తిరుమల వైభవం గురించి చెప్పాలంటే.. ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే! తిరుమల లడ్డు. ఆ లడ్డూ ప్రసాదం మాధుర్యానికి 310 ఏళ్లు నిండింది. అమృత పదార్ధంగా భక్తిరస మాధుర్యాన్ని పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డూ ఇప్పుడు చర్చగా మారింది. లడ్డూ లోని నెయ్యి కల్తీ వ్యవహరం వివాదాస్పదంగా మారింది.
ప్రసాదంలో నాణ్యతను పెంచేందుకు శ్రీకారం
తిరుమల శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో నెయ్యి కాంట్రవర్సీకి తెరతీసింది. వెంకన్న భక్తులకు అత్యంత ప్రీతి పాత్రమైన లడ్డు ప్రసాదం నాణ్యత పై ఈ మధ్య కాలంలో భక్తుల నుంచి వస్తున్న విమర్శలపై దృష్టి పెట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యతను పెంచేందుకు శ్రీకారం చుట్టింది. శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యతను శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉండగా, గత కొద్ది రోజులుగా నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు, విమర్శలకు టీటీడీ చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. తిరుమలలో ప్రక్షాళన షురూ చేసిన కూటమి సర్కార్ లడ్డూ తయారీలో నాణ్యతకు పెద్ద పీట వేసింది. తిరుమల వెంకన్న లడ్డు నాణ్యత పట్ల వస్తున్న విమర్శలు, అందుతున్న ఫిర్యాదులపై ఫోకస్ పెట్టింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో నాణ్యత లేదని గుర్తించిన టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. నెయ్యి సరఫరాలో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టింది. సమూల మార్పులు చేయాలన్న సీఎం ఆదేశాలతో కొరడా జూలిపిస్తున్న టీటీడీ యంత్రాంగం లడ్డు తయారీకి వినియోగించే ముడి సరుకుల నాణ్యతపై దృష్టి పెట్టింది. సరుకుల్లో నాణ్యత లేదని, కల్తీ నెయ్యి విషయాన్ని పోటు సిబ్బంది నుంచి తెలుసు కుంది. లడ్డు రుచి, నాణ్యత లేకపోవడానికి నెయ్యి కారణమని గుర్తించి చర్యలకు ఉపక్రమించింది.
తిరుమల వెంకన్న లడ్డుకు దాదాపు 310 ఏళ్ల చరిత్ర
భక్త కోటికి అమృత పదార్థంగా భక్తి రసం ఆధ్వర్యంలో పంచుతున్న తిరుమల వెంకన్న లడ్డుకు దాదాపు 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1715లో తిరుమలేషుడికి శ్రీవారి ప్రసాదం అందుబాటులోకి వచ్చింది. అంతటి లడ్డుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భక్తకోటికి ప్రీతిపాత్రమైన లడ్డూ నైవేద్యమంటే తిరుమలేశునికీ కూడా ఎంతో ఇష్టమైనది. ఇలా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో బూందీ ప్రసాదాన్ని ఇవ్వడం ప్రారంభించింది. ఇదో చారిత్రక ఆధారం కాగా అప్పటి నుంచే ప్రసాదాలు కూడా విక్రయించేవారన్న ప్రచారం ఉంది. పల్లవుల కాలం నుంచే ప్రసాదాల పరంపర మొదలయ్యిందని చరిత్ర చెబుతుండగా, అప్పట్లోనే శ్రీవారికి సంధి నివేదనలుగా నైవేద్య వేళలు ఖరారు అయ్యాయి. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆ రోజుల్లో కొండమీద భోజన సదుపాయం లేకపోవడంతో ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని తిరుప్పొంగం ఆ తర్వాత సుఖీయం మనోహరపడి ఇలా ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మరేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాక పోవడంతో వడకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది.
1950లో దిట్టం పరిమాణాలను ఖరారు
ఇక 1940 నుంచే భక్తుల చేతికి లడ్డూ అందింది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తరువాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచగా, 1940 నుంచి బూందీని లడ్డుగా మార్చి భక్తులకు అందజేయడం అమల్లోకి వచ్చింది. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో 1950లో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది. దిట్టం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వస్తోంది. 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్న టీటీడీ లడ్డు ప్రసాదాన్ని తయారుచేస్తోంది. ఒక లడ్డూ తయారీకి భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డూకు రూ. 48 వరకు ఖర్చు చేస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డు ధరను రూ 50 చేసింది.
దిట్టం ప్రకారం లడ్డూలు తయారీ ఇలా..
ఇక పోటులో దిట్టం ప్రకారం 5100 లడ్డూలు తయారు చేయడానికి మొత్తం 803 కేజీల ముడి సరుకు వినియోగిస్తున్న టీటీడీ ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 18 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కిలోలు వినియోగిస్తోంది. టీటీడీ తయారు చేసే లడ్డూ మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది. భక్తులకు అందజేసే ఉచిత లడ్డూ కాకుండా మూడు రకాల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. రోజూ దాదాపు 15 మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తూ మూడు నుంచి మూడున్నర లక్షల లడ్డూలను తయారు చేస్తున్న పోటులో 600 మందిని సిబ్బంది గుమగుమలాడే లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో 100 మంది కాంట్రాక్ట్ సిబ్బంది కాగా, 500 మంది శ్రీవైష్ణవులు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా చేస్తున్నారు.
నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదం
అయితే ఇప్పుడు ఈ లడ్డులో నాణ్యత లేని నెయ్యి వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. ఈ టెండరింగ్ ద్వారా నెయ్యిని ప్రొక్యూర్ చేసుకుంటున్న టీటీడీ ఏటా 5 వేలకు పైగా మెట్రిక్ టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది. నెయ్యి కొనుగోళ్లలో పలు షరతులు, నిబంధనలు విధిస్తున్న టీటీడీ నెయ్యి నాణ్యతను పరిశీలించే ప్రయోగశాలను మాత్రం ఏర్పాటు చేసుకోలేకపోయింది. దీంతో నెయ్యిలో కల్తీని గుర్తించేందుకు వీలు లేకుండా పోవడంతో తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. లడ్డు నాణ్యత రుచి వాసన లేకపోవడం భక్తుల నుంచి పలు ఫిర్యాదులు రావడంతో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం కొరడా ఝులిపించడంతో లడ్డూ నాణ్యత పై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ తో నెయ్యి దుమారం దేశానికి తాకింది. ఇందులో భాగంగానే కల్తీ నెయ్యి పై టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యిలో దాగిఉన్న వాస్తవాలను బయట పెట్టారు.
ప్రక్షాళన షురూ చేసిన ఈవో శ్యామలరావు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు తీసుకునే ముందు సీఎం చంద్రబాబు రెండు విషయాలపై దృష్టి పెట్టమని చెప్పారన్న శ్యామల రావు తెలిపారు. లడ్డు, నెయ్యి నాణ్యత పై చాలా ఫిర్యాదులు ఉన్నాయని సీఎం చెప్పారన్నారు. నెయ్యిలో నాణ్యత దారుణంగా ఉన్నట్లు గుర్తించామన్న ఈవో నాణ్యమైన ఆవు నెయ్యి వాడాలని పోటు సిబ్బంది కూడా చెప్పారన్నారు. కల్తీకి చెక్ చేసేందుకు టీటీడీలో ల్యాబ్ లేదన్న ఈవో, ల్యాబ్ లేకపోవడం, క్వాలిటీ చెక్ చేసేందుకు కూడా బయటకు పంపక పోవడం వల్ల ఇప్పటిదాకా కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి రాలేదన్నారు. ఈ ఏడాది మార్చి 12 న టెండర్ పొందిన AR డెయిరీ సప్లై చేసిన 4 ట్యాంకర్ల నెయ్యి బాగా లేదని తేలిందన్నారు. టీటీడీ మొదటిసారి నెయ్యి ని టెస్ట్ కోసం NDDB ల్యాబ్‌కు పంపామన్న ఈవో జూలై 6, 12 తేదీల్లో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని టెస్ట్ కోసం పంపామని వివరించారు. టోటల్ ప్యూరిటీ టెస్ట్ లో 20.32 శాతం అడల్ట్రెషన్ ఉన్నట్లు తేలిందని, విజిటేబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తేలిందన్నారు ఈవో. వాల్యూవ్స్ లో చాలా తేడాలున్నాయని, AR డయిరీ కి పెనాల్టీ వేయడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అపచారం జరిగిందంటున్న అర్చకులు..!
మరోవైపు లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగించడం భక్తుల్ని కాదు, అర్చకులను సైతం కలచి వేసింది. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వల్ల అపచారం జరిగిందన్న తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గత ఐదేళ్లలో ప్రసాదాల నాణ్యత, సరైన ప్రమాణాల్లో నైవేద్యం సమర్పించలేదన్నారు. కల్తీ నెయ్యితోనే శ్రీవారికి అన్న ప్రసాదాలను తయారు చేయడం మహా అపచారమన్నారు. కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదాలను తమ చేతులతోనే నైవేద్యంగా పెట్టాల్సి వచ్చిందని బాధ కలిగించిందంటున్న రమణ దీక్షితులు ఆలయంలో జరిగే తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నించామంటున్నారు. గత ఐదేళ్లు పరిచారకులు, అర్చకులు సహకరించకపోయినా ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చిందన్నారు. కల్తీ నెయ్యితో శ్రీవారి నైవేద్యాలు లడ్డు ప్రసాదాలు తయారు కావడం మహా అపచారం అన్నారు. ఇక భక్తుల్లోనూ ఇదే అభిప్రాయం శ్రీవారి లడ్డుపై ఉంది. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలు చేశారంటే కచ్చితంగా వాస్తవం ఉంటుందని భక్తకోటి అభిప్రాయపడుతోంది.
ఏఆర్ డయిరీపై ఆరోపణలు..!
ఇలా తిరుమల శ్రీవారి లడ్డులోని నెయ్యి పై అధికారపక్షం ఆరోపణలు ప్రతిపక్షం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా తమిళనాడులోని ఏఆర్ డయిరీ పై వచ్చిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మార్చి 12న టెండర్ పొందిన ఏఆర్ డైరీ మొత్తం పది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేయగా అందులో ఆరు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ వినియోగించింది. మరో నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపింది. జూలై 6, 12 తేదీల్లో టీటీడీకి ఏ ఆర్ డయిరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో అడల్ట్రేషన్ గుర్తించింది. NDDB ల్యాబ్ రిపోర్టు ను టీటీడీ బయటపెట్టడంతో తమిళనాడు సర్కార్ కూడా దిండిగల్‌లోని సదరు డైయిరీ పై దాడులు చేయడం కొసమెరుపు..!