SGSTV NEWS
Spiritual

Dussehra: ఒంగోలులో అర్దరాత్రి దసరా సంబరాలు ప్రారంభం…అమ్మవారి కళారాలు ఊరేగింపు



రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు నగరానికే ప్రత్యేకమైన అమ్మవారి కళారాల ఊరేగింపు భక్తుల కోలాహలం, డప్పు వాయిద్యాలు, వివిధ రకాల వేషధారణల నడుమ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా దుర్గాష్టమి, నవమి రోజున నగరంలోని ఆరు దేవస్థానాల నుంచి అమ్మవారి కళారాలను నగరంలో ఊరేగించటం సాంప్రదాయంగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అమ్మవార్ల కళారాల ఊరేగింపు కమనీయంగా సాగుతోంది. ఎరుపు రంగులో అంకమ్మపాలెంలోని కాళికమ్మ, పసుపువర్ణంలో బాలాజీరావుపేట కనకదుర్గమ్మ, తెలుపువర్ణంలో బీవీఎస్‌ హాలు దగ్గరున్న నరసింహస్వామి కళారాలు భక్తుల జయజయధ్వానాలు, నృత్యాల నడుమ బయల్దేరి నగరంలోని వివిధ ప్రధాన రహదారుల ద్వారా కొనసాగుతున్నాయి. మైసూరు, కలకత్తాల తరువాత ఒంగోలు నగరంలో మాత్రమే ఈ కళారాల ప్రదర్శన జరగుతోంది. 5వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్టు భక్తులు చెబుతుండటం విశేషం. అసలు కళారం అంటే ఏమిటి…? తెలుసుకుందాం.


దసరా పండుగ సందర్బంగా ఒంగోలులో జరిగే అమ్మవారి కళారాల ఊరేగింపునకు ఓ ప్రత్యేకత ఉంది. మైసూరు, కలకత్తాల తరువాత ఒక్క ఒంగోలులోనే ఈ విధమైన కళారాలను ప్రదర్శిస్తారు. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కళారాల ఊరేగింపుగా ప్రసిద్ధి. నాలుకనే రణభూమిగా చేసుకుని, రక్తబీజుడిని కడతేర్చిన అమ్మవారు అదే రౌద్ర రూపంతో ఊరేగింపునకు బయల్దేరుతుంది. అదే కళారం ఊరేగింపు.


దుష్టశిక్షణ చేయటానికి అమ్మవారు రౌద్రరూపిణిగా అవతరించిందనే దానికి సంకేతంగా ఎరుపు వర్ణం, సకల శుభాలను కలిగించే మాతృమూర్తికి చిహ్నంగా పసుపువర్ణంలో అమ్మవారి కళారాలు దర్శనమిస్తాయి. అమ్మవారితో పాటు నరసింహస్వామి కళారం కూడా బయలుదేరుతుంది. హిరణ్యకశిపుని సంహారం తర్వాత అమ్మవారి ఆదేశం మేరకు శాంతమూర్తిగా మారిన నరసింహస్వామికి చిహ్నంగా స్వామి వారు తెలుపువర్ణ కళారం ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ధరించిన వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. పౌరాణిక పద్యాల ఆలాపనలు ప్రజలను రంజింపజేశాయి. డప్పు వాయిద్యాలు, డీజే వాయిద్యాలకు అనుగుణంగా యువత నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. దుర్గాష్టమి రోజున మూడు కళారాలు ఒంగోలు నగరంలోని పలు వీధులగుండా అర్దరాత్రి బయలుదేరి ఉదయానికి స్థానిక మస్తాన్‌ దర్గా సెంటర్‌కు చేరుకున్నాయి. ఆ సందర్భంగా మూడు కళారాలకు భక్తులు నీరాజనాలర్పించారు.

అర్దరాత్రి సంబరాలు ప్రారంభం…
ఒంగోలు నగరంలోని మూడు ప్రధాన దేవాలయాలనుంచి దుర్గాష్టమి రోజు అర్ధరాత్రి మూడు కళారాలు బయలుదేరుతాయి. భేరీనాదాలూ, చిత్ర విన్యాసాలూ, విచిత్ర వేషధారణలూ ఆ కోలాహలానికి తోడవుతాయి. ఎంత సందడి ఉన్నా.. నగరోత్సవానికి ప్రధాన ఆకర్షణ అమ్మవారి కళారాలే. నాలుక చాచిన ఆ ముఖచిత్రాలను చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. దసరా సమయంలో దేశంలో మైసూరు, కలకత్తా నగరాల తరువాత ఒక్క ఒంగోలు నగరంలోనే ఇలాంటి ఉత్సవం జరుగుతుందని సగర్వంగా చెబుతారు స్థానికులు.


పురాణ కథనం ప్రకారం
శుంభునిశుంభులు, మధుకైటభులు.. ఒకరా ఇద్దరా, ఎంతోమంది రాక్షసులు నేలకొరిగారు. రక్తబీజుడి వంతు వచ్చింది. అతని ఒంట్లోంచి పడే ప్రతి రక్తపుచుక్క నుంచీ మరో రక్తబీజుడు పుడతాడు. పరమేశ్వరుడు అతనికా వరం ఇచ్చాడు. మహాకాళి ఆ లోకకంటకుడిని ఎలా సంహరిస్తుందా అని ముక్కోటి దేవతలూ ఆకాశంలోంచి ఉత్కంఠతతో చూడసాగారు. అమ్మ తన నాలుకను భీకరంగా చాచింది. జిహ్వ పెరిగి పెద్దదై రక్షక్షేత్ర మైంది. ఆఖరి చుక్క వరకూ ఆ రాక్షసుడి రక్తాన్ని పీల్చేసుకుంది మహాకాళి. అసుర సంహారం తర్వాత కూడా ఆమెలోని రౌద్రాంశ శాంతించలేదు. దేవతలు, మునులు స్తుతించడంతో శక్తిస్వరూపిణి కాస్త కరుణించింది. నాలుక బయటకు చాచిన తన శిరస్సును ఎవరైతే ఘనంగా ఊరేగిస్తారో, భక్తితో పూజిస్తారో ఆ గ్రామానికి కానీ, నగరానికి కానీ ఎటువంటి దుష్టశక్తుల భయం ఉండదని అభయమిచ్చింది. ఒంగోలులో నగరోత్సవం ఐదు వందల ఏళ్ల నాడు ప్రారంభమైనట్టు స్థానికులు చెబుతారు. అప్పట్లో అమ్మవారి శిరస్సు ఆకారాన్ని అట్టలతో రూపొందించి.. గూడు బండ్లు కట్టి ఊరేగించే వారు. వందేళ్ల కిందటి నుంచి అట్టల స్థానంలో రాగి రేకునూ, ఇతర లోహాల మిశ్రమాన్ని వాడటం మొదలు పెట్టారు. ఇవి చాలా బరువుగా ఉంటాయి. వాహనం మీద అలం కరించడం, శిరస్సు కదులుతున్నట్లుగా తిప్పడం కష్టమైన పనే. ఓ ప్రత్యేక బృందం ఈ బాధ్యత తీసుకుంటుంది.



ఆరు కళారాలు…
ఒంగోలు నగరంలో మొత్తం ఆరు కళారాల ఊరే గింపు జరుగుతుంది. దుర్గాష్టమి నాడు బాలాజీరావు పేట కనకదుర్గ, అంకమ్మపాలెం కాళికాదేవి, కొత్తపట్నం బస్టాండ్ రోడ్డు నరసింహస్వామి- అమ్మవార్ల కళారాలు ఊరేగిస్తారు. మహర్నవమి రోజున గంటపాలెం పార్వతమ్మ, కేశవస్వామిపేట విజయదుర్గాదేవి, బివిఎస్ హాలు సెంటరులోని బాలాత్రిపుర సుందరి కళారాల ఊరేగింపు జరుగుతుంది. దుష్ట సంహారంలో నర సింహ స్వామి అమ్మవారికి తోడుంటాడన్నది భక్తుల భావన. అన్నీ ఒకచోట.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభ మయ్యే కళారాల వెంట స్థానికులు కేరింతలు కొడుతూ బయల్దేరతారు. వాద్యకారులు భీకర శబ్దాలతో హోరెత్తి స్తుంటారు. నృత్యాలు చేసేవారు కాళికాంబ వేషధారణతో…. కోలాహలమంతా ఇక్కడే కొలువుంటుంది. ఇలా ఊరేగింపుగా వస్తున్న అమ్మవారిని దర్శించి, కోబ్బరికాయలు, కర్పూర నీరాజనాలు సమర్పించడం తమ అదృష్టమని భావిస్తారు మహిళలు. అమ్మవారి రాక కోసం రాత్రంతా మేల్కొని మరీ ఎదురు చూస్తారు. మరుసటి రోజు ఉదయానికి అన్ని కళారాలు ట్రంక్ రోడ్డులోని మస్తాన్ దర్గా వద్దకు చేరుకుంటాయి. టపాసులు కాలుస్తూ, ఈలలు వేస్తూ పరస్పరం స్వాగతించుకుంటారు భక్తులు. ఆ వైభవాన్ని చూడ్డానికి జనం వేలాదిగా గుమికూడతారు. దీనివల్ల ఏడాది పాటు దుష్టశక్తులు నగరానికి రాకుండా ఉంటాయనేది భక్తుల నమ్మకమని ఆలయ పూజారులు, నిర్వాహకులు చెబుతున్నారు.

ఏపిలో ఒంగోలులో మాత్రమే జరిగే ఈ కళారాల ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. దసరా పండుగ నాడు జరిగే ఈ కళారాలను చూడటానికి స్థానికులు దూరప్రాంతాల్లో ఉన్న తమ బంధువులను ఇళ్లకు ఆహ్వానిస్తారు. తమ రక్త సంబంధీకులను పిలిచి పండుగ ఆతిధ్యమిస్తారు. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. తాము పట్టిన దగ్గర నుంచి దసరా ఉత్సవాల్లో జరిగే కళారాల ప్రదర్శనలకు హాజరవుతామని స్థానిక మహిళలు చెబుతున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ఒంగోలులో అత్తవారింటికి కోడళ్ళుగా వచ్చిన మహిళలు దసరా పండుగల్లో పుట్టింటికి వెళ్ళేందుకు ఇష్టపడరు. తమ పుట్టింటి వారిని ఒంగోలులోని తమ అత్తవారింటికి ప్రత్యేకంగా ఆహ్వానించి కళారాల ఊరేగింపును చూసేందుకు అవకాశం కల్పిస్తారు. దసరా పండుగ రోజున ఒంగోలులో జరిగే కళారాల ఉత్సవాలను చూసేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో ఆశక్తి చూపిస్తారు.

మరోవైపు పలువురు కళాకారులు ధరించిన వివిధ వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి… పౌరాణిక పద్యాల ఆలాపనలు ప్రజలను రంజింపజేశాయి. డప్పు వాయిద్యాలు, డీజే వాయిద్యాలకు అనుగుణంగా కళాకారులో పాటు యువత నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. ఊరేగింపులో అమ్మవారి వేషధారణతో ఉన్న కళాకారులు రాక్షసులుగా వేషధారణ చేసిన వారిని సంహరించే ఘట్టం రక్తికట్టించారు. కళారాల ఉరేగింపులో అమ్మవారి వేషధారణలతో పాటు శివుడు, ఇతర దేవుళ్ళతో పాటు రాక్షసుల వేషధారణలతో వచ్చే కళాకారుల పట్ల ఎంతో ఆదరణ కనబరుస్తారు. ఇదే విషయాన్ని కళాకారులు ప్రస్తావిస్తూ తమకు భక్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందంటారు. అలాగే ఒంగోలులో జరిగే దసరా ఉత్సవాలకు స్థానికులే కాకండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని స్థానికులు చెబుతున్నారు.

దసరా ఉత్సవాల్లో ఒంగోలు నగరానికే హైలెట్‌గా నిలిచే కళారాల ఉత్సవాలు 5 వందల ఏళ్ళుగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతారు. అయితే అంతకు ముందు నుంచే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయని భావిస్తారు… అప్పటి నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఓ ప్రత్యేకమైన సాంప్రదాయంగా దసరా పండుగ సంబరాల్లో కళారాలను ప్రదర్శించడం గొప్పవిషయమే.

Also read

Related posts