SGSTV NEWS
Spiritual

Atla Taddi 2025:  అట్లతద్ది.. అచ్చ తెలుగమ్మాయిల పండగ పూజా విధానం.. వ్రత మహత్యం



ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే తదియ తిథిని అట్ల తద్ది పండగగా జరుపుకుంటారు. దక్షినాది వారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు అట్లతద్ది పండగను జరుపుకుంటే.. ఇదే పండగను ఉత్తరాదివారు కర్వా చౌత్ గా జరుపుకుంటారు. వారికీ ఇప్పుడు కార్తీక మాసం కృష్ణ పక్షం తదియ తిథి. ఈ నోముని వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాస్సు కోసం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని జరుపుకుంటే.. పెళ్ళికాని స్త్రీలు మంచి భర్త రావాలని జరుపుకుంటారు. ఈ ఏడాది అట్లతద్ది అక్టోబర్ 8వ తేదీ న అట్లతద్ది నోముని జరుపుకోనున్నారు.


తెలుగింటి మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే నోము అట్లతద్ది. రేపే అట్లతద్ది. ఈ సందర్భంగా అట్లతద్ది నోము విశిష్టత.. చదవాల్సిన కథ..పూజా విధానం, మొదలైన విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.. అట్లతద్ది ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం బహుళ కృష్ణ పక్షంలోని తదియ తిథిరోజున జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ తదియ తిథి అక్టోబర్ 9 వ తేదీ గురువారం వచ్చింది. ఈ రోజున మహిళలు ఉపవాసం ఉంది.. గౌరీ దేవిని చంద్రుడిని పూజిస్తారు. పెళ్లి కాని యువకులు మంచి జీవిత భాగస్వామి రావాలని.. పెళ్ళైన స్త్రీలు భర్త దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ నోముని జరుపుకుంటారు.


అట్లతద్ది నాడు చేయాల్సిన పనులు ఏమిటంటే..
అట్లతద్దికి ముందురోజు కాళ్ళు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ముత్తైదువులకు గోరింటాకు పంచి పెడతారు. ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు.

ఇక తెల్లవారుజామున నిద్ర లేచి.. స్నానపానాదులు ముగించి చుక్క ఉండగానే బెండకాయ చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగులతో అన్నం తింటారు. విస్తరి ముందే నీరుతాగుతారు. తర్వాత ఇక సాయంత్రం పూజ ముగిసేవరకూ ఏమీ తినరు. మంచి నీళ్ళు కూడా తాగాకుండా ఉపవసరం ఉంటారు.


అన్నం తిన్న తర్వాత స్త్రీలు యువతులు రెండు గ్రూపు గా ఏర్పడి అట్లతద్దోయ్.. ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్.. మూడట్లోయ్… అంటూ ఆటపాటలతో గడుపుతారు. ఊయల ఊగుతారు.

అట్లతద్ది పూజ విధానం..


ఈ రోజున నోము నోచుకునే స్త్రీలు 11 మంది ముత్తయిదువలను ఆహ్వానించి వారిని కూడా ఉపవాసం ఉంచుతారు. అట్లతద్ది నోము నోచుకునే స్త్రీలతోబాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు.

గౌరీదేవికి ఇష్టమైన కుడుములు, పాలతాలికలు, పులిహోర, అట్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

పూజ కోసం తోరణాలను రెడీ చేస్తారు. చేతులకు చామంతి, తులసిదళం, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలు కట్టుకుంటారు.

పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి పూజ చేస్తారు.

ఒక పళ్ళెంలో బియ్యం పోసి.. బియ్యంపిండితో చేసిన కుడుముల పెట్టి.. అందులో పసుపు కుంకుమలు వేస్తారు. పుష్పాలతో అలంకరిస్తారు. దీనిని కైలాసంగా భావిస్తారు.

ముందుగా గణపతికి పూజ చేసి తర్వాత లలితా సహస్రనామం, గౌరీ అష్టోత్తరం చదివి.. అనతరం అట్లతద్ది వ్రత కథ చదువుతారు.

ఒక్కొక్కరికీ 11 అట్లు చొప్పున .. గౌరీదేవివద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొకటి పెట్టి, తాంబూలంతో వాయనం ఇస్తారు.

అట్లతద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు.. ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెటు బట్ట ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు పెడతారు.

వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అదే విధంగా అందుకుంటారు.

వాయనం ఇచ్చేటప్పుడు.. ఇచ్చే స్త్రీ ఇస్తినమ్మ వాయనం అని అంటే.. పుచ్చుకునే స్త్రీ పుచ్చుకుంటినమ్మ వాయనం అంటుంది. అంతేకాదు అందించానమ్మా వాయనం.. అంటే అందుకున్నానమ్మా వాయనం అంటూ మళ్ళీ ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం అని అంటే.. ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం అంటూ వాయినం అందుకుంటారు.

అట్లతద్దె వ్రతకధ:


అనగనగా సునామ అని ఒక రాజకుమార్తే ఉండేది. అట్లతద్ది నోము నోచుకుంటే ఆరోగ్యవంతుడైన అందమైన భర్త వస్తాడు అని పెద్దవాళ్ళు చెప్పగా విని ఆమె కూడా తన ఈడు పిల్లలతో కలిసి అట్లతద్ది నోము పట్టింది. పగలంతా పచ్చి మంచినీళ్లు అయినా ముట్టకుండా ఉపవాసం ఉంది. అయితే సునామ అత్యంత సుకుమారి.. రాచ పిల్ల.. దీంతో పగలు నాలుగో ఝాముకే నీరసించి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇది చూసిన ఆమె అన్నగార్లు కంగారు పడి.. తమ చెల్లు ఉన్న ఉపవాసం సంగతి తెలుసుకున్నారు. చంద్రోదయం అయ్యిన తర్వాత చంద్ర దర్శనం చేసుకునే వరకూ ఏమీ తినకూడదు అన్న నియమం గురించి తెలుసుకున్నారు.

అయితే చెల్లెలి మీద ప్రేమతో అన్నయ్యలు అందరూ కలిసి చెరువులో ఉన్న చింతచెట్టు కు అద్దాన్ని కట్టి.. దానికి ఎదురుగా కొంచెం దూరంలో అరికే కుప్పకి మంట బెట్టారు. తర్వాత చెల్లెల్ని లేపి కూర్చోబెట్టి అద్దంలో కనిపించే మంటను చూపించి అదే చంద్రుడిని చెప్పారు. దీంతో అన్న మాటలను నమ్మిన చెల్లెలు చంద్రోదయమైందని భావించి ఎంగిలి పడింది. కాలం గడుస్తోంది. సునామ కు పెళ్లీడు వయసు వచ్చింది.

పెద్దవాళ్లంతా కలిసి ఆమెకు ఆమె తోటి పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడ సాగారు. అందరి పిల్లలకి పడుచు భర్త లభించారు. అయితే సునామ మాత్రం ఎన్ని సంబంధాలు చూసిన ముసలి పెళ్లి కొడుకు తప్ప పడుచు యువకుడి సంబంధం రావడం లేదు. దీంతో సునామా దుఃఖించి .. తనను ఎవరైనా వృద్ధికి ఇచ్చి పెళ్లి చేస్తారని భయపడి.. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఊరి చివరలో అడవిలోకి పారిపోయింది.

ఆ రాత్రి లోకసంచారార్థం అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు సునమా చూసి పలకరించి విషయం తెలుసుకున్నారు. అప్పుడు సునమా అట్లతద్ది నోము రోజున జరిగిన విషయం అంతా చెప్పారు.చంద్రోదయానికంటే ముందే ఎంగిలిపడ్డావు. నీ నోము ఉల్లంఘన జరిగింది. అందుకనే నోముని సంపూర్ణంగా చేసిన నీ మిత్రురాళ్లకు పడుచు మొగుళ్ళు లభించారు. నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి. కనుక ఈ ఏడాది అట్లతద్ది నోముని పూర్తిగా నియమ నిష్టలతో చేయి.. తప్పనిసరిగా మంచి భర్త వస్తాడు అని చెప్పారు. దీంతో సునామా ఇంటికి వచ్చి ఈసారి అతి శ్రద్ధగా అట్లతద్ది నోము నోచుకుంది. తర్వాత అందగాడు ఆరోగ్యవంతుడైనవరునితో పరిణయం అయింది. భార్యాభర్తలు ఇద్దరూ పార్వతిపరమేశ్వరుల అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించారు.

పూజా ఉపవాసం విధానం:


ఆశ్వయుజ బహుళ తదియ రోజున అర్ధరాత్రి నాలుగవ జామునే నిద్రలేచి కాల కృత్యాలన్నీ తీర్చుకొని.. చుక్క ఉన్న సమయంలోనే భోజనం చేసి.. అప్పటి నుంచి ఆ రోజు రాత్రి చంద్రోదయం అయ్యేవరకు కటిక ఉపవాసం ఉండాలి. చంద్ర దర్శనం తర్వాత మళ్ళీ స్నానం చేసి అట్లువేసి గౌరీదేవికి పది అట్లు నైవేద్యం పెట్టి ఒక ముత్తయిదువుకు పదట్లు వాయనం ఇచ్చి కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి. తర్వాత భోజనం చేయాలి. ఇలా పది సంవత్సరాలు చేసుకుని తదుపరి ఏడాది ఉద్యాపన చేసుకోవాలి.

Related posts