మనదేశంలో అత్యధికంగా పూజలను అందుకునే దైవం శివయ్య.. అంతేకాదు ఆ సేతు హిమాచలంలో కొండ కోనల్లో, పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా చిన్న పెద్ద విశిష్టమైన పురాతనమైన శివాలయాలు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. అయితే శివయ్య భక్తులు తమ జీవితంలో తప్పనిసరిగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవాలని కోరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడని నమ్మకం. ఎందుకంటే ఈ క్షేత్రాల్లో శివుడు స్వయంగా వెలసినట్లు శివ పురాణంలో వివరించబడింది.
శివయ్య భక్తులు తప్పనిసరిగా చూడాలనుకునే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఇవే.. ప్రాముఖ్యత ఏమిటంటే
దేశవ్యాప్తంగా అనేక పురాతన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శివుని ఆలయాలు ఉన్నాయి. ఏడాది పొడవునా ఈ ఆలయాలను భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. వీటిల్లో శివయ్య ద్వాదశ పవిత్ర జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాలను సందర్శించిన భక్తునిపై శివుని ఆశీస్సులు ఉంటాయని.. అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ 12 పుణ్యక్షేత్రాల్లో శివుడు స్వయంభువుగా వెలసినట్లు శివ పురాణంలో ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థాపించబడ్డాయి. ఈ జ్యోతిర్లింగక్షేతాలు ఎక్కడ ఉన్నాయి.. దర్శనంతో ఎటువంటి కష్టాలు తొలగిపోతాయి తెలుసుకుందాం..
సోమనాథ్: గుజరాత్‌లోని కథియావర్ ప్రాంతంలో సముద్ర తీరంలో సోమనాథ ఆలయం ఉంది. ఈ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భూమిపై మొట్టమొదటి జ్యోతిర్లింగంగా కూడా పరిగణిస్తారు. ఈ శివలింగాన్ని చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని పురాణాల కథనం. చంద్రుడిని సోమదేవుడు అని కూడా పిలుస్తారు, అందుకే ఈ జ్యోతిర్లింగానికి సోమనాథుడు అని పేరు వచ్చింది.
మల్లికార్జున స్వామి: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ నది ఒడ్డున శ్రీశైల పర్వతంపై నిర్మించబడిన ఈ ఆలయం కైలాసానికి సమానమైనదిగా పరిగణించబడుతుంది. ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని , పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామిని సందర్శించడం ద్వారా శారీరక, దైవిక , భౌతిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మహాకాళేశ్వరుడు: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున జ్యోతిర్లింగం ఉంది. దక్షిణ ముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ నిర్వహించే భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉజ్జయినిని రక్షించేది ఆయనే అని ప్రజలు నమ్ముతారు.
ఓంకారేశ్వరుడు: ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున ఉన్న మాంధాత పర్వతంపై ఉంది. దీనిని సందర్శించడం ద్వారా నాలుగు పురుషార్థాలను పొందవచ్చు. ఈ జ్యోతిర్లింగం ఓంకార ఆకారంలో ఉంటుంది.. అందుకే దీనిని ఓంకారేశ్వర అని పిలుస్తారు.
కేదార్‌నాథ్: ఈ జ్యోతిర్లింగం కేదార్‌నాథ్ అనే హిమాలయ శిఖరంపై ఉంది. హిమాలయా పర్వత ఒడిలో అలకనంద, మందాకిని నదుల ఒడ్డున ఉంది. ఇది నర నారాయణుల తపస్సు స్థలం. వారి ప్రార్థనల మేరకు శివుడు ఇక్కడ తాను నివసిస్తానని అంగీకరించాడు. ఈ బాబా కేదార్‌నాథ్ ఆలయం బద్రీనాథ్‌కు వెళ్లే మార్గంలో ఉంది.
భీమశంకరం: భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని సహ్యాద్రి అనే పర్వతంపై ఉంది. ఈ ఆలయం సమీపంలో భీమ అనే నది ప్రవహిస్తుంది. అందుకే దీనికి భీమశంకర్ జ్యోతిర్లింగం అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్న శివలింగం చాలా మందంగా ఉంటుంది. కనుక మోటేశ్వర మహాదేవ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి.
విశ్వనాథుడు: ఈ జ్యోతిర్లింగం కాశీలో ఉంది. హిమాలయాలను విడిచిపెట్టి శివుడు కాశీలో తన శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడని చెబుతారు. వరద సమయం ఈ నగరాన్ని ప్రభావితం చేయదని చెబుతారు. అందుకే కాశీ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతారు.
త్రయంబకేశ్వరుడు: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ కు పశ్చిమాన 30 కి.మీ దూరంలో గోదావరి నదికి సమీపంలో ఉంది. గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయం నల్ల రాళ్లతో నిర్మించబడింది. ఈ జ్యోతిర్లింగానికి దగ్గరగా ఉన్న పర్వతం బ్రహ్మగిరి అనే పర్వతం. గోదావరి నది ఈ పర్వతం నుంచే ప్రారంభమవుతుంది. శివుని పేర్లలో ఒకటి త్రయంబకేశ్వర్ కూడా.
వైద్యనాథుడు: ఈ శివలింగం బీహార్‌లోని సంతల్ పరగణాలోని దుమ్కా అనే జిల్లాలో ఉంది. రావణుడు తపస్సు శక్తితో శివుడి ఆత్మ లింగాన్ని లంకకు తీసుకెళ్తున్నాడని మార్గంలో అడ్డంకి కారణంగా శివుడు ఇక్కడ ప్రతిష్టించబడ్డాడు. అమృత మథనం తర్వాత ధన్వంతరిని, అమృతాన్ని ఈ లింగంలో దాచిరనీ.. ఈ లింగాన్ని స్పర్శించిన భక్తులకు వ్యాధులు నయం అవుతాయని విశ్వాసం.
రామేశ్వరం: ఈ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథ్ పురం అనే ప్రదేశంలో ఉంది. లంకపై దాడి చేసే ముందు రాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. దీనిని రాముడు స్థాపించినందున ఈ జ్యోతిర్లింగానికి రాముడి పేరు మీద రామేశ్వరం అని పేరు వచ్చింది.
నాగేశ్వరం: ఈ జ్యోతిలింగం గుజరాత్‌లోని ద్వారకాపురి నుంచి 17 మైళ్ల దూరంలో ఉంది. ఈ జ్యోతిలింగానికి దేవుని కోరిక మేరకు పేరు పెట్టారని చెబుతారు. పూర్తి విశ్వాసం, నమ్మకంతో ఈ స్వామిని దర్శించుకుంటే భక్తుల కోరిన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయని చెబుతారు.
ఘృష్ణేశ్వరుడు: ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్ర రాష్ట్రంలోని దౌలతాబాద్ నుంచి 12 మైళ్ల దూరంలో ఉన్న బెరుల్ గ్రామంలో స్థాపించబడింది. దీనిని కుసుమేశ్వరుడు అని కూడా పిలుస్తారు. సంతానం లేనివారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని విశ్వాసం
