June 29, 2024
SGSTV NEWS
Andhra PradeshSports

చీర కట్టుకుని, పూలు పెట్టుకుని మగవాళ్లు ప్రత్యేక పూజలు.. ఎందుకో తెలుసా..

హోలీ సందర్భంగా మగవాళ్లు ఆడవాళ్లుగా మారి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ వింత ఆచారం ఏంటో.. ఎందుకు ఇలా చేస్తున్నారు.. అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భిన్నత్వంలో ఏకత్వం అని మన దేశానికి పేరుంది. ఎందుకంటే వివిధ రకాల జాతులు, సంస్కృతులు, కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు మనదేశంలో ఉన్నన్ని ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఏ పండుగ జరిగినా దానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పుకునే గ్రామంలో వింతకే కనువిప్పు కలిగేలా పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం మగవాళ్లు ఆడవాళ్లలాగా అందంగా ముస్తాబవడమే. ఆపాద మస్తకం అందంగా సింగారించుకుని, పట్టు చీర కట్టుకుని, జడ అల్లుకుని, పూలు పెట్టుకుని కట్టు మొదలు బొట్టు వరకు అడుగడుగునా సాంప్రదాయం ఉట్టిపడేలా ముస్తాబవుతారు. రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ వింతైన ఆచారం మరెక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే కనిపించడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సంతేకుళ్లూరు గ్రామంలో సరికొత్తగా కనిపించే ఈ సాంప్రదాయాన్ని తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని సాధారణంగా చిన్న, పెద్దా, ముసలి, ముతక అందరూ రంగులు పూసుకుంటారు. అయితే ఈ ఊళ్లో మాత్రం మగవాళ్లు లుంగీలు తీసేసి పట్టు చీర కట్టుకుని రతీ మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా జరుపుకోవడం ఏళ్ల తరబడి సాంప్రదాయంగా వస్తోందని చెబుతున్నారు గ్రామస్తులు. ఇలా చేయడం వల్ల తమకు ఏమైనా దోషాలుంటే తొలగిపోతాయని విశ్వసిస్తున్నారు. హోలీ అనగానే రంగులు, కామదహనం మనకు గుర్తుకు వస్తుంది. ఈ కామదహనం రోజు ఇలా విచిత్ర వేషధారణలో పూజించడం వల్ల ఏవైనా అరిష్టాలు ఉంటే తొలగిపోతాయని, దేవుని సంపూర్ణ అనుగ్రహం తమకు లభిస్తుందని నమ్ముతారు.

ఈ రకమైన ఆచారాన్ని ఒక వ్రతంలా, నోములా చేసుకుంటారు. ఉదయాన్నే లేచి మగవాళ్లే స్వయంగా తమ చేతితో రకరకాల పిండి వంటలు వండి, కుటుంబ సభ్యులతో కలిసి మేళ తాళాలతో గ్రామంలోని వీధుల గుండా ఆటపాటలతో అందరినీ కలుపుకుని సమీపంలోని దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ రీతీమన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా మొక్కులు చెల్లిస్తే తాము కోరుకున్న కోర్కెలు శీఘ్రంగా తీరుతాయని భావిస్తారు. ఒక వేళ హోలీ పండుగ రోజు ఇలా చేస్తామని అనుకుని మొక్కు చెల్లించకుంటే ఆ ఇంట్లోని పురుషులకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు గ్రామస్థులు. అందుకే హోలీ పండుగ రోజు ఇలా అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటించి కుటుంబం మొత్తం అనంతమైన రంగులతో తమ జీవితాన్ని గడిపేందుకు ఇలా చేస్తున్నారు.

Also read





Related posts

Share via