కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి.
కృత్తివెన్ను: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. లారీ కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు, కంటైనర్ పుదుచ్చేరి నుంచి భీమవరం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు మరో నలుగురు ఉన్నారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. మృతులను కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన గండి ధర్మవర ప్రసాద్ (27), అమలాపురానికి చెందిన పేసింగు కనకరాజు (34), కాట్రేనికోనకు చెందిన చింతా లోవరాజు (32), మాగపు సోమరాజు (30), ఎస్ యానాంకు చెందిన రేవు నాగభూషణం (26), తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అయ్యప్పన్ (42)గా గుర్తించారు.
ప్రమాద సమయంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి వైపు వెళ్తున్న లారీలో డ్రైవర్తో పాటు 10 మంది ప్రయాణికులున్నారు. కంటైనర్లో డ్రైవర్తో పాటు ఓ ప్రయాణికుడున్నారు. కర్రల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేపలు పట్టేందుకు వెళ్తూ వీరంతా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థికసాయం: మంత్రి కొల్లు రవీంద్ర
ఈ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మత్స్యకారులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి ప్రకటించారు.