April 3, 2025
SGSTV NEWS
SpiritualSri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం | Sri Ganesha Puranam

శ్రీ గణేశ పురాణం  – ఏడవ అధ్యాయము

ఉపాసనాఖండము మొదటి భాగము
సోమకాంత పూర్వజన్మ కథనం
అప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని ఇలా ప్రశ్నించారు:”ఓ సూతమహర్షీ! భృగుమహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏంచేసాడు? సర్వం తెలిసి త్రికాలజ్ఞుడైన భృగువు ఆరాజు యొక్క బాధానివృత్తికై ఏ ఉపాయాన్ని చెప్పాడు? ఈ వివరాలన్నీ తెలుసుకొన కుతూహలంగా ఉన్న మాకు ఆ తరువాత జరిగిన కథాభాగమును వినిపించి తృప్తిని కలిగించు!” ఆ మాటలకు మందస్మిత వదనుడైన సూతుడిలా చెప్పసాగాడు.

“ఓ మహర్షులారా! జ్ఞానంతో పండి, సాగర గంభీరులైన మీరుఆసక్తితో అడిగిన ప్రశ్న నాకు కధాగమనంలో ముందుకు సాగడానికి మంచి ప్రేరణనిస్తోంది! శ్రోతలకుగాని, వక్తకుగాని కధపట్ల ఆసక్తివల్లనే ఆకధ ముందుకు వడివడిగా సాగుతుంది! అలాగే గ్రంధరచన చేసేవారికి అంతరాయాన్ని కలుగచేయడమూ, పుస్తకాన్ని అపహరించడమూ కూడా దోషభూయిష్టములైన కర్మలే! తెలియని విషయాన్ని గురించి తరచి ప్రశ్నించని శిష్యుడూ, జిజ్ఞాసుడై శిష్యుడు అడిగిన ప్రశ్నకు బదులివ్వని గురువూ, వీరిరువురికీ కూడా దోషం సంప్రాప్తమౌతుంది!

వీరే ఈ లోకంలోగల గ్రుడ్డివారూ, చెవిటివారూనని చెప్పవచ్చు. ఓ బ్రాహ్మణోత్తములారా! మీ అభీష్టంమేరకు తరువాతి కధా సంవిధానాన్ని తెలియజేస్తాను. శ్రద్ధాళువులై అవధరించండి!

ఆరాత్రి ఋష్యాశ్రమంలో విశ్రాంతిగా గడిపి మరునాడు ప్రాతఃకాలాన్నే లేచిన రాజు తన పరివారంతోసహా స్నానసంధ్యాదులు అనుష్ఠించుకొని, సంధ్యా జపహోమాది నిత్యక్రియలను యధావిధిగా నిర్వర్తించి, సుఖమైన ఆసనంపైన కూర్చుండి ప్రాణములకు స్వస్థత చిక్కిన, భృగుమహర్షి ఆరాజుతో యిలా అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పనారంభించాడు.

పూర్వజన్మ కధా వృత్తాంతము:

“ఓరాజా! నీవు పూర్వజన్మములో వైశ్యకులములో వింధ్యపర్వత సమీపానగల కొల్హారనగరమనే పట్టణంలో జన్మించావు.

సిరిసంపదలతో తులతూగే అత్యంత ఐశ్వర్యవంతుడు నీ తండ్రి!సుగుణాలరాశి, దానశీలముగల ‘సులోచన’ అనే పతివ్రతామతల్లి నీకు జనని! నీవు పుట్టాక బ్రాహ్మణుల ఆదేశంమేరకు కామందుడని నీకు వారు నామకరణం చేశారు.

ముదిమి వయస్సున కలిగిన ఏకైక సంతానానివి కావటంవల్ల నిన్ను అతిగారాబంతోనూ, అమితమైన ప్రేమతోనూ పెంచారు. కొంతకాలానికి కుటుంబిని అనే కన్యతో అతివైభవంగా నీకు వివాహంకూడా జరిపించారు. మంచి గుణవంతురాలై, నీపట్ల అనురాగం కలిగి, దేవతాతిధి పూజలపట్ల అంతులేని ఆసక్తి కలిగిఉండేదా సుగుణవతి! పతివ్రతాశిరోమణియైన ఆమెయందు నీకు ఏడుగురుపుత్రులూ,ఐదుగురు కుమార్తెలూ కలిగారు! తండ్రి మరణించటంతో నీతల్లికూడా సహగమనం చేయడమూ జరిగింది.ఆపైన నీకు దుష్టసాంగత్యము అలవాటై, పిత్రార్జితాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేసేశావు!

పశుప్రాయుడవై భార్య అనేక పర్యాయములు అడ్డగించినా లక్ష్యపెట్టక, స్వేచ్ఛావిహారంతో స్త్రీలోలుడవైనావు. నీవు నివాసముండే ఇంటిని సైతం నీ వ్యసనాలకై అమ్మేశావు భార్యాబిడ్డల పోషణయే చేయని నీవద్ద బ్రతుకు గడపటం దుర్భరంకాగా, పిల్లలతో నీభార్య తన పుట్టినింటికి వెళ్ళిపోయింది. ఇక నీ ఆగడాలకు అడ్డూ ఆపూ లేకపోయింది. అతిగా మద్యపానంచేసి ఒళ్ళుమరచి, మదించిన ఏనుగులా సంచరించావు! పరద్రవ్యాన్నీ, పరదారాపహరణాన్నీ జంకూగొంకూ లేకుండాచేస్తూ, జారత్వాన్నీ, దొంగతనమూ, జూదమూ మొదలైన వ్యసనాలకు బానిసవై మహాపాపివిగా, జనకంటకుడివిగా తయారైనావు. నిన్ను జూడగానే ప్రజలంతా నట్టింట్లో పామును చూచినట్లు భయవిహ్వలులై అసహ్యించుకునేవారు.

ఆ ప్రజలగోడువిన్న రాజు నిన్ను గ్రామాన్నుంచి బహిష్కరించాడు. అక్కడ అరణ్యంలోకూడా, ఆటవికుడిలా సంచరిస్తూ, జంతువులనూ, స్త్రీ బాలవృద్ధులన్న విచక్షణయే లేకుండా దారినపోయే బాటసారులనందరనూ సంహరించేవాడివి! సింహాన్ని చూసిన మృగాలలాగా, నిన్ను చూడగానే బాటసారులు భయంతో పారిపోయేవారు. అలా పరమ కిరాతకుడిలాగా అరణ్యంలో నీవు స్వైరవిహారం చేస్తూ, లేళ్ళను, చేపలను, అనేకరకాల పక్షులనూ, కుందేళ్ళనూ వేటాడి వాటియొక్క మాంసభక్షణంతో పొట్ట పోసుకునేవాడివి! బహు దుర్మార్గులైన బందిపోట్లతోకూడా స్నేహంచేసి ఎంతో ధనాన్ని అక్రమంగా బాటసారులను కొల్లగొట్టి సంపాదించావు.

నీవుండేందుకై ఒకగొప్ప భవననిర్మాణం చేశావు.నీ కూరత్వానికి జడిసి నీమామ నీభార్యాపుత్రాదులను నీవద్దకు పంపివేసాడు. ఆ సకలవైభవోపేతమైన భవనంలో అనేక విలువైన ఆభరణాదికాలు ధరించి నీ సంతానం శ్రీమంతుల మాదిరిగా సుఖించారు. నీవుమాత్రం పాపభీతి అన్నది లేకుండా దొంగలనుకూడి అమాయక బాటసారులను హత్యలు చేస్తూ, అక్రమ ధనార్జనకు పాల్పడుతూ, ఒక దొరలా నిరంకుశంగా ఉండేవాడివి.

ఇలావుండగా ఒకనాటి మధ్యాహ్నం గుణవర్ధనుడనే నామధేయంకల ఒక బ్రాహ్మణయువకుడు ఆమార్గం వెంట వెడుతూండగా, వాని వెంటపడి వాడి కుడిచేతిని గట్టిగా దొరకపుచ్చుకున్నావు.

క్రౌర్యం ఉట్టిపడుతున్న నీమొహంచూచి, భయంతో ఆ బ్రాహ్మణ యువకుడు మూర్ఛిల్లాడు. కొంత తడవుకు తేరుకొని బ్రతుకు పైగల తీపికొద్దీ అత్యంత దీనుడై నీకు నీతిబోధ చేయసాగాడు.

“ఓ దొరా! సకలైశ్వర్యాలతో తులతూగుతూ వుండికూడా నన్ను చంపాలని ఎందుకు ప్రయత్నిస్తావు? నేనా ఉత్తమమైన బ్రాహ్మణకులంలో జన్మించిన శ్రోత్రియుడను. ఈ మధ్యనే నాకు వివాహం జరిగింది! నిరపరాధిని! నీవు యిటువంటి ఘాతుకకృత్యాలను మాని యికనైనా ధర్మబుద్ధి కలవాడవుకా! ఇంతకు కొంచెంసేపటి క్రితమే నాభార్య తన పుట్టినింటికి వెళ్ళింది. ఆమె పరమ సాధ్వీమణి! సదాచారపరురాలూ కూడా! నా పితృఋణాన్ని తీర్చుకునేందుకు గాను సత్సంతతికై ఎంతో కాలానికి అతి మీద ఈమధ్యనే ఆమెను వివాహమాడాను! భర్తలేని స్త్రీజన్మ, స్త్రీరహితమైన పురుషజన్మా ఈరెండూ వ్యర్ధములేకదా! ఓ చోరశిఖామణీ!నేను వయసులో నీ కుమారుడి వంటివాడిని! ఇక నీవే నాకు తల్లివీ,తండ్రివీను! ప్రాణదాత, ఆపదనుంచి రక్షించినవాడూ ”తండ్రి” అంతటివాడని శాస్త్రాలు సైతం ఘోషిస్తున్నాయి. ఎంతటి క్రూరులైన దొంగలైనా శరణువేడి నటువంటి బ్రాహ్మణుని రక్షిస్తారుకదా! నేను బ్రాహ్మణుడను, శాంతుడను, శరణాగతుడనూ కూడాను! కనుక నన్ను హింసించుట నీకు ఏమాత్రమూ ఉచితంకాదు!

అలాకాక నామాటను చెవిని పెట్టకపోతే నీవు వేయికల్పాల పర్యంతం ఘోరనరకాలను అనుభవిస్తావు! నీ సహచరులూ, భార్యా బిడ్డలూ కూడా నీ సంపాదన అనుభవించేవారేగానీ నీ పాపఫలంలో ఏమాత్రం పాలుపంచుకొనరు! ఈ పాపాలనుభవించటానికి నీవెన్ని జన్మలో ఎత్తాల్సివుంటుంది!” అంటూ వేడుకున్నాడు.

ఇది శ్రీగణేశపురాణం ఉపాసనాఖండంలోని ”సోమకాంత పూర్వజన్మ కధనం” అనే ఏడవ అధ్యాయం. సంపూర్ణం.

Related posts

Share via