SGSTV NEWS online
Spiritual

Sankranthi 2026: మీకు తెలియని
సంక్రాంతి రహస్యం.. హరిదాసులు, గంగిరెద్దుల వెనక ఉన్న అసలు కథ..



Sankranthi 2026:సంక్రాతి పండుగ అంటేనే మన కళ్లముందు కదిలే అద్భుతమైన దృశ్యం.. తల మీద అక్షయపాత్రతో వచ్చే హరిదాసు, గజ్జెలతో ఆడుతూ వచ్చే గంగిరెద్దుల కోలాహలం. ఆధునిక కాలంలో మనం ఎంత బిజీగా ఉన్నా, పండగ రోజుల్లో వీరు గుమ్మం ముందుకు వస్తే వచ్చే ఆ ఆనందమే వేరు. కేవలం వేడుక కోసం మాత్రమే కాకుండా… ఈ సంప్రదాయాల వెనక ఎంతో లోతైన పురాణ చరిత్ర, ఆధ్యాత్మిక సందేశం దాగి ఉన్నాయి. అసలు వీరు పండుగ నాడే ఎందుకు వస్తారు ? దీని వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన కళాత్మక రూపం ఉంది. పల్లెటూళ్లలో తెల్లవారుజామునే వినిపించే ‘హరిలో రంగ హరి’ కీర్తనలు, డోలు సన్నాయి వాయిద్యాల మధ్య గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు నిండుదనాన్ని ఇస్తాయి.

హరిదాసు: నడయాడే నారాయణుడు

హరిదాసును సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు స్వరూపంగా లేదా నారద ముని అంశగా ప్రజలు భావిస్తారు.

వేషధారణ వెనక అర్థం: హరిదాసు తల మీద ఉండే

రాగి పాత్రను ‘అక్షయపాత్ర’ అంటారు. ఇది సూర్యభగవానుడు ధర్మరాజుకు ఇచ్చిన పాత్రకు సంకేతం. అంటే ఇందులో వేసే కొద్దిపాటి బియ్యం లేదా ధాన్యం ఆ దేవుడికి చెందుతుందని అర్థం.

అహంకారం వీడాలి: హరిదాసు ఎవరినీ చేయి చాచి

అడగడు. తన తల మీద ఉన్న పాత్రను వంచడు. ఎవరైనా బియ్యం వేయాలంటే వారు తమ చేయిని హరిదాసు తల కంటే పైకి ఎత్తి ఆ పాత్రలో వేయాలి. అంటే, దానం చేసేవాడు తన ‘అహంకారాన్ని’ వదిలి దైవానికి సమర్పించుకోవాలని ఇది చెబుతుంది. ధనుర్మాసం అంతా ఇలా ఊరంతా తిరిగి సేకరించిన ధాన్యంతో పండగ రోజున విష్ణుమూర్తికి నైవేద్యం పెడతారు.

గంగిరెద్దులు: పురాణ గాథ

గంగిరెద్దుల సంప్రదాయం వెనక ఒక ఆసక్తికరమైన శివపురాణ గాథ ఉంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని కోసం తపస్సు చేసి, శివుడు తన గర్భంలోనే ఉండాలని కోరుకుంటాడు. దీంతో లోకాలన్నీ అంధకారమయ్యాయి. అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించి, గంగిరెద్దుల మేళాన్ని ఏర్పాటు చేశాడు.

శివుడిని రక్షించిన విన్యాసం: నందిని గంగిరెద్దుగా,

బ్రహ్మదేవుడిని సన్నాయి వాయిద్యకారుడిగా మార్చి గజాసురుని దగ్గరకు వెళ్లారు. అక్కడ గంగిరెద్దు చేసిన విన్యాసాలకు మెచ్చిన గజాసురుడు, “ఏం కావాలో కోరుకో” అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడిని విడిచిపెట్టమని కోరగా, రాక్షసుడు తన తప్పు తెలుసుకుని శివుడిని విముక్తుడిని చేశాడు. ఆ విజయోత్సవానికి గుర్తుగానే సంక్రాంతి నాడు గంగిరెద్దులను అలంకరించి ఊరేగిస్తారు.

సాంఘిక ప్రాముఖ్యత:

ఈ కళాకారులు కేవలం వినోదం కోసమే రారు. సమాజంలో ఒకరికొకరు తోడ్పడాలనే సందేశాన్ని ఇస్తారు. పాత బట్టలు, ధాన్యం, దక్షిణ వంటివి వారికి దానం చేయడం ద్వారా మనలోని లోభగుణాన్ని వదులుకుంటాం. గంగిరెద్దు ఇంటికి వస్తే ఆ సంవత్సరం పంటలు బాగా పండుతాయని, పశుసంపద పెరుగుతుందని రైతుల నమ్మకం.

Related posts