SGSTV NEWS online
Spiritual

Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత

Sabarimala: అయ్యప్ప స్వామి అనగానే అందరికీ
ముందుగా గుర్తొచ్చేది శబరిమల దేవాలయం. అయ్యప్ప మాలలు ధరించినవాళ్లు స్వామివారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా శబరిమలలోని 18 మెట్లను ఎక్కాల్సిందే. అదికూడా 41 రోజుల పాటు దీక్ష చేసి.. తలపై ఇరుముడి పెట్టుకుని శబరిమల 18 మెట్లు ఎక్కితేనే ఆ అయ్యన్ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ నేథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లే ఎందుకు ఉన్నాయి? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటి? ఒక్కో మెట్టుకు ఉన్న ప్రాధాన్యతేంటి.. వంటి వివరాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం..

కేరళ రాష్ట్రంలో పత్తినంతిట్ట జిల్లాలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఎక్కే 18 పవిత్ర మెట్లను ‘పదునెట్టాంబడి’ అని పిలుస్తారు. ఈ 18 మెట్లకు హిందూ పురాణాల్లో, ఆధ్యాత్మిక సాధనలో అత్యంత విశిష్టమైన స్థానం కలదు. మండల దీక్ష చేపట్టి, ఇరుముడి ధరించిన భక్తులు మాత్రమే ఈ మెట్లను అధిరోహించడానికి వీలుంటుంది. ఈ 18 మెట్లు మానవుడు దైవత్వాన్ని చేరుకోవడానికి అనుసరించాల్సిన ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తాయని భక్తుల విశ్వాసం.
తొలి ఐదు మెట్లు (1 – 5):

శబరిమల 18 మెట్లలో తొలి ఐదు మెట్లు పంచేంద్రియాలకు సంకేతం. అంటే.. కళ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అని. అయ్యప్ప భక్తుడు ఈ ఐదు ఇంద్రియాలపై అదుపు సాధించడం ద్వారానే మొదటి అడుగు వేయాలని సూచిస్తాయి.

తర్వాతి 8 మెట్లు (6 – 13):

తర్వాత 6 నుంచి 13 వ మెట్టు వరకు ఎక్కాలి. ఇవి అష్టరాగాలు. అంటే.. ఎనిమిది రకాల దుర్గుణాలుట లేదా అష్ట మదాలకు సంకేతం. అవేంటంటే.. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, అసూయ, డాంబికం, అహంకారం. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు భక్తులు ఈ దుర్గుణాలను విడిచిపెట్టాలని భావిస్తారు.

తర్వాతి 3 మెట్లు (14 – 16):

ఇక 14 నుంచి 16వ మెట్టు వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఇవి సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలకు ప్రతీక. ఈ గుణాల ప్రభావం నుండి బయటపడాలని సందేశాన్నిస్తాయి.

చివరి 2 మెట్లు (17-18)

ఈ మెట్లు విద్య, అజ్ఞానానికి సూచన. అజ్ఞానాన్ని విడిచిపెట్టి, జ్ఞానాన్ని పొందిన తర్వాతనే భక్తుడు స్వామి సన్నిధానాన్ని చేరుకోగలడని ఈ మెట్లు తెలియజేస్తాయి.

ఇలా శబరిమల 18 మెట్లు ఎక్కడం అనేది.. భక్తుడు తనలో ఉన్న దుర్గుణాలు, లోపాలను అధిగమించి, పరిపూర్ణతను సాధించడానికి చేసే కఠినమైన ప్రయాణంగా భావిస్తారు.

18 మెట్లే ఎందుకు?

మణికంఠుడు.. అయ్యప్ప స్వామిగా శబరిమలలో కొలువైయ్యేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్లిన స్వామి.. జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి.

శబరిమల 18 మెట్ల పేర్లు ఇలా:

అయ్యప్ప స్వామి సన్నిధానంలో సోపానాలను స్వర్ణం, వెండి, రాగి, ఇత్తడి, కంచు వంటి పంచలోహాలతో నిర్మించారు. ఈ 18 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కో పేరు ఉంటుంది. ఆ పేర్లేంటంటే.. 1. అణిమ 2. లఘిమ 3.మహిమ 4. ఈశ్వత 5. వశ్యత 6. ప్రాకామ్య 7. బుద్ధి 8. ఇచ్ఛ 9. ప్రాప్తి 10. సర్వకామ 11. సర్వ సంపత్కర 12. సర్వ ప్రియకర 13. సర్వమంగళాకార 14.సర్వ దుఃఖ విమోచన 15. సర్వ మృత్యుప్రశమన 16. సర్వ విఘ్ననివారణ 17.సర్వాంగ సుందర 18.సర్వ సౌభాగ్యదాయక.

Related posts