SGSTV NEWS online
CrimeTelangana

ఇనుప కడ్డీలే యమపాశమయ్యాయి!





సంగారెడ్డి అర్బన్,: ట్రాలీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక చదువుల తల్లిని పొట్టన పెట్టుకుంది. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీసులు ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు.సీఐ అనిల్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు 72 మంది ప్రయాణికులతో సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్ వెళ్తాంది. పట్టణ శివారుకు చేరగానే.. ప్లెక్సీలు, ఇనుపకడ్డీలతో ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటో ఒక్కసారిగా బస్సును ఢీ కొట్టింది. దాంతో ఆటోలోని ఇనుప కడ్డీలు ఎగిరి బస్సు అద్దాల్లోంచి లోపలికి చొచ్చుకెళ్లాయి.


అవి బలంగా తాకడంతో డ్రైవర్ వెనకసీట్లో కూర్చున్న నారాయణఖేడ్ మండలం ర్యాకల్కు చెందిన తిమ్మాపురం పూజ(18) తలకు తీవ్ర గాయాలయ్యాయి. 108లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది.బస్సు డ్రైవర్ సుభాష్తో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతురాలు పూజ బాసర ఐఐఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది.

సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందడం పట్ల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్, వైద్యాధికారితో మాట్లాడారు.

Also read

Related posts