October 17, 2024
SGSTV NEWS
CrimeUttar Pradesh

Road Accident: మానవత్వం మరిచి.. పాలు పట్టుకుని వెళ్లిపోయారు!

Road Accident: యూపీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో లారీ  డ్రైవర్ మరణించారు. స్థానికులు మాత్రం దాన్ని పట్టించుకోకుండా ప్రమాదంలో దెబ్బతిన్న పాల ట్యాంకర్ నుంచి పాలు పట్టుకొని వెళ్లిపోయిన ఘటన ఇప్పుడు వైరలవుతోంది.

గాజియాబాద్: మూగజీవాలు, పక్షులు మరణించినప్పుడు సాటి జీవులు సానుభూతిగా వాటి కళేబరాల వద్దకు చేరడం చాలా సార్లే చూసుంటాం. సోషల్ మీడియా జమానా మొదలయ్యాక అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు చాలానే వైరలవుతున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ జీవాలకు మిగిలినవి అండగా ఉండడమూ గమనిస్తూనే ఉంటాం. కానీ, యూపీలో జరిగిన ఓ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

పోలీసుల ప్రకారం.. గాజియాబాద్ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పాల ట్యాంకర్ను వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఝార్ఖండ్కు చెందిన లారీ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (45) అక్కడికక్కడే మృతిచెందారు. క్లీనర్కు తీవ్ర గాయాలయ్యాయి. మేరఠ్ వెళ్తుండగా దిల్లీ-మేరఠ్ ఎక్స్ప్రెస్వేపై ఏబీఈఎస్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన జరిగింది

ప్రమాదంలో లారీ నుజ్జునుజ్జయ్యింది. ట్యాంకర్ సైతం దెబ్బతినడంతో పాలు బయటకు వచ్చాయి. గమనించిన స్థానికులు వాటిని పాత్రలు, బాటిళ్లలో నింపే పనిలో పడ్డారు. అక్కడే పడి ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని గానీ, గాయపడిన క్లీనర్ న్నుగానీ ఎవరూ పట్టించుకోలేదు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరలైంది. స్థానికులపై నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్నారు. మానవత్వం మరిచారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు.

Also read

Related posts

Share via