April 3, 2025
SGSTV NEWS
Andhra PradeshCrimePolitical

టీడీపీ నాయకుడు రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో రాజీనామా: ఎమ్మెల్యే కొలికపూడి


గిరిజన మహిళను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుడు అలవాల రమేశ్‌రెడ్డిపై 48 గంటల్లోగా అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీ చేశారు. తిరువూరు ఏఎంసీ మాజీ చైర్మన్ రమేశ్‌రెడ్డి ఓ గిరిజన మహిళతో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొందరు గిరిజన మహిళలు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కొలికపూడి మాట్లాడుతూ.. గిరిజన మహిళతో రమేశ్‌రెడ్డి ఫోన్ సంభాషణ అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఇలాంటి వారిని నిలువునా పాతరేసినా తప్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఆయన ఎక్కడైనా తనకు తారసపడితే చెప్పు తెగే వరకు కొడతానని పేర్కొన్నారు.



రమేశ్‌రెడ్డిపై ఎంపీ కేశినేని శివనాథ్, పార్టీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, తిరువూరు టీడీపీ పరిశీలకుడు సహా అందరికీ ఫిర్యాదు చేసినట్టు కొలికపూడి తెలిపారు. 10 రోజులు దాటుతున్నా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణం అడిగినందుకు గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడిన నాయకుడి విషయంలో పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు స్పందించకపోవడం ఏమిటని కొలికపూడి నిలదీశారు.

Also read

Related posts

Share via