Kartika Purnima 2025 Date and Time ఈ కార్తీక మాసం అంతా హర హర మహాదేవ శంభో శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది. అంతే కాకుండా 365 ఒత్తులతో దీపారాధన చేసి పరమేశ్వరుడిని కొలిచి భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. అలాగే అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలగించి.. ఆ దీపాలను పున్నమి వెలుగుల్లో నదిలో వదిలే సన్నివేశాన్ని ప్రత్యక్షంగా చూసి తరించాల్సిందే. ఇక.. రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళ పూజలు, లక్షపత్రి పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలా ప్రత్యేకపూజలు, వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడతాయి. వనభోజనాలు మరో విశిష్ట కార్యంగా చెప్పుకోవచ్చు.
Karthika Pournami 2025 Date and Time Purnima Tithi కార్తీక మాసం ప్రతీ రోజూ శుభప్రదమైనదే. ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి, ద్వాదశి, సోమవారాలు మరింత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుల్లో చేసే పూజలు, ఆచరించే ఉపవాసాలు ఇంకా పవిత్రమైనవిగా విశ్వసిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజును అత్యంత విశిష్టమైదిగా పూజలు, నోములు ఆచరిస్తారు. ఈ రోజున ఉదయాన్నే నదులు, కాలువలు, బావి వద్ద లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట నేతిదీపాలు వెలిగిస్తారు. కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు. భోళాశంకరుడిని, శ్రీమహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. చాలా మంది కార్తీక పురాణం చదువుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి 2025 తేదీ, తిథి, పూజకు శుభ సమయం వంటి విషయాలు తెలుసుకుందాం..
Kartika Purnima 2025 Tithi
కార్తీక పౌర్ణమి 2025 తిథి
హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి ( Kartika Purnima 2025 Tithi) నవంబర్ 4 రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం నవంబర్ 5వ తేదీ సాయంత్రం కు ముగుస్తుంది. నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం 6.48 గంటల వరకు పౌర్ణమి ఉంటుంది. అంటే ఈ ఏడాది పౌర్ణమి ఘడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయ తిథి ప్రకారం నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి 2025 ( Karthika Pournami 2025 ) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి కుదరకపోతే పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత 365 వత్తులతో దీపారాధన చేయడం, ఉపవాసం ఆచరించడం, శివకేశవులను పూజించడం మంచిది. అంతే కాకుండా కార్తీక పౌర్ణమి (Karthika Pournami) రోజు కార్తీక నోములు (Karthika Nomulu 2025) నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతారు.
కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేయాలనుకునే వాళ్లు నవంబర్ 5వ తేదీన ఉదయం 4.52 గంటల నుంచి 5.44 గంటల లోపు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక పౌర్ణమి 2025 రోజు పూజ చేయడానికి ఉదయం 7.58 గంటల నుంచి 9.00 గంటల వరకు అనుకూలంగా ఉందట. అలాగే.. సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సాయంత్రం 5.15 గంటల నుంచి 7.05 గంటల వరకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. (గమనిక ఆయా ప్రాంతాలు, పద్ధతులు, పరిస్థితులు బట్టి స్వల్ప మార్పులు ఉండొచ్చు). ఈ సమయంలో శివుడికి, శ్రీమహావిష్ణువు పూజ చేసి నక్షత్రం దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించవచ్చు.
కార్తీకమాసం సోమవారాలు- తేదీలు
తొలి కార్తీక సోమవారం : అక్టోబర్ 27
రెండో కార్తీక సోమవారం : నవంబర్ 3
మూడో కార్తీక సోమవారం : నవంబర్ 10
నాలుగో కార్తీక సోమవారం : నవంబర్ 17
