June 29, 2024
SGSTV NEWS
AstrologyYear Horoscope

ఉగాది రాశి ఫలాలు 2024: వృషభ రాశి ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది అనుకూలమే..

ఉగాది రాశి ఫలాలు 2024: వృషభ రాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర జాతక రాశి ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. తెలుగు నూతన సంవత్సరంలో నెలవారీగా, ఆరోగ్యం, కెరీర్, ప్రేమ, సంపద తదితర విషయాల్లో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.


శ్రీ కోధి నామ సంవత్సరం నందు వృషభరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా చూస్తే మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి



బృహస్పతి జన్మరాశి యందు సంచరించుట చేత, శని దశమ స్థానము నందు సంచరించుట చేత, రాహువు లాభ స్థానము యందు సంచరించుట చేత మరియు కేతువు పంచమ స్థానమునందు సంచరించుట చేత వృషభరాశి వారికి ఈ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితములు ఉన్నాయి

ఈ సంవత్సరంలో జన్మ గురుడి కారణంచేత అనారోగ్య సమస్యలు, శారీరక శ్రమ మరియు మానసిక మత్తిళ్ళు వేధించును. దశమ స్థానములో శని అనుకూల ప్రభావంచేత వృత్తి ఉ ద్యోగ వ్యాపారపరంగా అభివృద్ధి ఉన్నప్పటికి జన్మగురుని ప్రభావం చేత ప్రతీ పనియందు కష్టపడాల్సినటువంటి స్థితులు ఏర్పడును.

పంచమస్థానములో కేతువు, లాభస్థానములో రాహువు అనుకూలత వలన వృషభ రాశి వారు త్రీ క్రోధి నామ సంవత్సరంలో సంతానం వల్ల అనందము పొందెదరు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికమగును. ఉద్యోగం మార్చే ప్రయత్నం చేసినప్పటికి నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిళ్ళు పెరుగు సూచన కనబడుచున్నది. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి.

ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. జన్మ గురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు వంటివి ఏర్పడును. స్త్రీలకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. స్త్రీలకు మానసిక ఒత్తిళ్ళు, సమస్యలు కలుగు సూచన. స్త్రీలు కుటుంబ విషయాలయందు, అరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చదువుయందు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. విదేశీ విద్య కోసం చేయు ప్రయత్నాలలో ఆటంకాలు కలుగు సూచన.

సినీరంగం, మీడియారంగం వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలున్నాయి. రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వృషభరాశి వారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల గ్రహదోష నివృత్తి జరుగుతుంది. ఆదివారం రోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయి

వృషభ రాశి ప్రేమ జీవితం 2024-25
వృషభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రేమ వ్యవహారాలు చికాకుగా ఉంటాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగు సూచన. ప్రేమ వ్యవహారాల్లో అచితూచి వ్యవహరించడం మంచిది.

వృషభ రాశి వారి ఆర్థిక విషయాలు 2024-25
వృషభరాశి వారికి ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. జన్మ గురుని ప్రభావం వలన టెన్షన్లు, ఖర్చులు అధికముగా ఉండును. ఆరోగ్యవిషయాలు, కుటుంబపరంగా ధనం అధికముగా ఖర్చు అగును.

వృషభ రాశి వారి కెరీర్ 2024-25
వృషభరాశివారికి కెరియర్‌పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయి. కెరియర్‌పరంగా టెన్షన్లు అధికముగా ఉండును. అవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన.

వృషభ రాశి వారి ఆరోగ్యం 2024-25
వృషభరాశి వారికి క్రోధి నామ సంవత్సరం అరోగ్యం అంత అనుకూలంగా లేదు. జన్మ గురుని ప్రభావం వలన టెన్షన్లు, అనారోగ్య సమస్యలు అధికమగును. అరోగ్యం బాగుండటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

ధరించాల్సిన నవరత్నం: వృషభరాశివారు ధరించవలసిన నవరత్నం వజ్రం.

ప్రార్థించాల్సిన దైవం: వృషభరాశివారు ప్రార్థించవలసినటువంటి దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణుని ఆరాధన వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి వారికి నెలవారీ ఫలితాలు 2024-25
ఏప్రిల్‌: ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అనుకోని సమస్యలు కలుగును. శారీరక శ్రమ. ధనలాభము. శుభకార్యాలపరంగా ధన వ్యయం. మానసిక ఒత్తిడి కలుగును.

మే: ఈ మాసం వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. కొన్ని విషయాలలో మోసపోవుదురు. ప్రయాణములయందు జాగ్రత్త అవసరం. ద్రవ్యహాని. భయాందోళన. శ్రమకు తగిన ఆదరణ ఉండదు. వృత్తి వ్యవహారములయందు అనుకోని బాధ్యతలు మీదపడే అవకాశముంది.

జూన్‌: ఈ మాసంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు పైఅధికారులు మన్ననలు పొందగలుగుతారు. కొన్ని వ్యవహారములు ముందుకు సాగుతాయి. మానసిక ఆందోళనలు వెంటాడుతూ ఉన్నప్పటికి శుభకార్య ప్రయత్నములు సఫలమగును.

జూలై: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమకు తగిన ఫలితము రాదు. కుటుంబమునందు బాధ్యతలు పెరుగుతాయి. చికాకులు, ఇబ్బందులు కలుగును. కొన్ని శుభపరిణామములు కనిపించును.

ఆగస్టు: ఈ మాసం వృషభ రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. శుభకార్య ప్రయత్నములు సఫల మగును. ప్రేమ వ్యవహారములు అనుకూలించు సూచనలు. పుత్ర, సోదరిపరంగా గొడవలు. వ్యాపారస్తులకు కొంత అనుకూల సమయం. ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశము.

సెప్టెంబర్‌: ఈమాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తిపరంగా అనుకూలం. రిటైల్‌, హోల్‌సేల్‌ వ్యాపారస్తులకు కొంత అనుకూలం. ప్రభుత్వపరమైన లబ్ధి. స్థ్రీ మూలకంగా లాభం. వివాహము కాని వారికి వివాహ అనుకూలత.

అక్టోబర్‌: ఈ మాసం వృషభ రాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఆర్థికపరమైన సమస్యలు. గౌరవ మర్యాదలకు భంగం. ప్రేమ సమస్యలు ఉ౦డవచ్చు. శ్రమ అధికం. కొంత మానసిక ఒత్తిళ్ళు పెరుగును. ఆరోగ్యం అనుకూలంగా లేదు. పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త అవసరం.

నవంబర్‌: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు తగ్గును. దైవపరంగా యాత్రలు చేయుదురు. కాంట్రాక్టు వ్యాపారం చేసేవారిని అనుకోని నష్టము వాటిల్లే అవకాశం. దూరప్రయాణములు అనుకూలించును.

డిసెంబర్‌: ఈ మాసం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. బంధువులతో విరోధము. మనోవిచారము. మిత్రులతో విభేదాలేర్పడు సూచన. దూరపు బంధువులతో సమాగమనము. ధనవ్యయము. వివాహము కానివారికి అనుకూల సమయం.

జనవరి: ఈ మాసం వృషభ రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. శస్త్ర చికిత్స జరిగే అవకాశముంది. విద్యార్థులకు అనుకూలం. ఆదాయము పెరుగగలదు. ధైర్యం లోపించును. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి. ధనవ్యయంచే ఇబ్బంది కలుగవచ్చును.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వివాహ, గృహ ప్రవేశ శుభకార్యాలు ముందుకు సాగుతాయి. వ్యాపారంలో దృష్టి సారించినచో వృద్ధి రేటు పెరుగును. పూర్వపు ఆస్తుల గురించి బంధుమిత్రులతో వివాదములు ఏర్పడే అవకాశం.

మార్చి: ఈ మాసం వృషభ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమగును. ఇంటికి సంబంధించిన పనులు ఆలస్యమగును. వర్తకులకు కొంత శుభ సమయం. రాజకీయ నాయకులకు కొంత గుర్తింపు కలుగును.

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via