SGSTV NEWS online
Famous Hindu TemplesSpiritual

శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించిన లింగం- ఒక్కసారి దర్శిస్తే ముక్తి ఖాయం- ఎక్కడుందో తెలుసా?


రావణుడు, రాముడి చేతిలో మరణించి, మోక్షం పొందిన చోటు ఇదే – 56 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్న రామలింగేశ్వరుడు – అక్కడికి ఎలా వెళ్లాలంటే?



Mukthi Ramalingeshwara Swamy : రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అనేక ప్రాంతాల్లో శివలింగాలు ప్రతిష్టించాడు. అందులో ప్రధానమైనది రామేశ్వరం. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. అయితే శ్రీరాముడు ఇంకా అనేక ప్రదేశాల్లో కూడా శివలింగాలు ప్రతిష్టించాడు. రాముడు ప్రతిష్టించిన లింగం కాబట్టి ఈ శివుడు రామలింగేశ్వరుడు అనే పేరుతో పూజలందుకుంటారు. అలాంటిదే ఒక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఆ క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పినాకిని నది తీరాన గల ప్రసిద్ద క్షేత్రం ముక్తి రామేశ్వరం. ఈ క్షేత్రంలో శ్రీరాముల వారు ప్రతిష్టించిన శివలింగం ఉండటం వలన ఈ ప్రాంతానికి రామేశ్వరమని, రావణాసురుడు శ్రీరాముని బాణాల చేత వధింపబడి ముక్తి పొందడం వలన ఈ ప్రాంతానికి ముక్తి రామేశ్వరం అని పేరు వచ్చింది అని చెబుతారు.

ఆలయ స్థల పురాణం
రావణ వధ అనంతరం బ్రహ్మ హత్య దోష నివారణకు రాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. అందుకోసం శ్రీరాముడు హనుమని కాశీ నగరానికి పంపించి శివలింగాన్ని తీసుకురమ్మని పంపిస్తాడు. అయితే హనుమంతుడు సకాలంలో రాకపోవడంతో రాముడే స్వయంగా శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్టించాడట. ఆ లింగాన్ని’సైకత లింగం’ అని అంటారు.

హనుమాన్ క్షేత్రం కూడా!
తరువాత, హనుమంతుడు కాశీ నుంచి శివలింగం తీసుకుని వచ్చాడు. అయితే స్వామి సేవలు సరిగ్గా నెరవేర్చలేకపోయానని హనుమంతుడు విచారించాడు. హనుమ విచారాన్ని పోగొట్టడానికి శ్రీరాముడు హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని సైకత లింగానికి ఎదురుగా కొద్ది దూరంలో ప్రతిష్ఠించారు. అందుకే ఈ దేవాలయాన్ని రామలింగేశ్వర స్వామి క్షేత్రం అని, హనుమాన్ క్షేత్రం అని కూడా పిలుస్తారు. రావణుడు శ్రీరామచంద్రుని చేతిలో మరణించి మోక్షం పొందినందున ఈ ప్రదేశం ముక్తి రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది.

ఆలయ చరిత్ర
సుందర పినాకిని నది తీరంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన ఈ దేవాలయం అద్బుతమైన కట్టడాలు, సుందరమైన గాలి గోపురంతో విరాజిల్లుతోంది. అలాగే ఆలయ గోడలపై చిత్రించి ఉన్న అద్భుతమైన చిత్రాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. గర్భాలయంలో 56 అడుగుల ఎత్తు గల సుందర రూపంతో రామలింగేశ్వరుడు దర్శనమిస్తాడు.

ఇతర ఆలయాలు
రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో రాజ రాజేశ్వరి దేవాలయం కూడా ఉంది . జగద్గురు ఆది శంకరాచార్యులు ఈ దేవాలయంలో శ్రీ చక్ర యంత్రాన్ని ప్రతిష్టించాడు. ఆలయ ఆవరణలో గణపతి, ఆంజనేయుడు, నవగ్రహాలు, దక్షిణామూర్తి, వంటి ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి.

పూజోత్సవాలు
రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి రోజూ త్రికాల పూజలు యధావిధిగా జరుగుతాయి. ప్రతి సోమవారం స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజూ రుద్రాభిషేకాలు జరుగుతాయి. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుంది. అలాగే కార్తిక మాసంలో నెల రోజులు ఆలయం భక్త జనసంద్రంగా మారుతుంది. జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం ముక్తి రామేశ్వరం.

ఎలా చేరుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. అలాగే కడప నుంచి ప్రొద్దుటూరుకు బస్సులో కానీ ప్రయివేటు వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. మనం కూడా ముక్తి రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. తరిద్దాం.



Related posts