చుట్టూ ప్రైవేటు సైన్యం.. చేతుల్లో ఆయుధాలు ముఠాలు చెప్పినట్లు చేయకపోతే పస్తులే నరక కూపాలుగా దక్షిణాసియా దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లు
చెర వీడిన బాధితుల అనుభవాల – అమరావతి
చుట్టూ ప్రైవేటు సైన్యం.. వారి చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు.. వారు చెప్పినట్లు చేయకపోతే చీకటి గదుల్లో పడేస్తారు. విద్యుత్తు షాక్ లు ఇచ్చి హింసిస్తారు. తిండి పెట్టకుండా పస్తులుంచుతారు. విచక్షణారహితంగా కొడతారు. భారీ వాటర్ క్యాన్లు చేతిలో పెట్టి ఆరేడు గంటల పాటు గుంజీలు తీయిస్తారు. తప్పించుకొని పారిపోదామంటే.. పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఎన్ని ఇబ్బందులున్నా రోజుకు 19-20 గంటల పాటు పనిచేయాల్సిందే. కాదూ కూడదంటే వారు పెట్టే చిత్రహింసలు భరించాల్సిందే. విదేశాల్లో ఉద్యోగాల పేరిట అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాలు విసిరిన వలలో చిక్కుకుపోయి.. మయన్మార్, కాంబోడియా, థాయ్లాండ్, వియత్నాం, లావోస్ తదితర దేశాల్లో చైనీయుల ఆధ్వర్యంలోని సైబర్ నేరాల కాంపౌండ్లో బందీలుగా మారిన భారతీయుల అనుభవాలివి.
మయన్మార్లోని కాంపౌండ్లో చిక్కుకున్న కొంతమంది బాధితుల్ని భారత విదేశాంగ శాఖ విడిపించి, రెండు రోజుల కిందట ఇండియాకు తీసుకొచ్చింది. వారిలో 22 మంది ఆంధ్రప్రదేశ్ వారున్నారు. అక్కడి కాంపౌండ్లో తాము పడిన బాధలను సీఐడీ సైబర్ నేరాల విభాగం ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా, డీఎస్పీ రవికిరణ్ కలిసి వారు సోమవారం మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో మీడియాకు వివరించారు.
ప్రధానాంశాలివి.
అడవుల్లోంచి సరిహద్దులు దాటించి..
విదేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, కాల్సెంటర్ ఉద్యోగాలున్నాయని, రూ. లక్షల్లో జీతమంటూ ఇన్స్టాగ్రామ్, వాట్సప్, టెలిగ్రామ్ తదితర యాప్లో ప్రకటనలిచ్చి మమ్మల్ని ఉచ్చులోకి లాగారు. కొందరం ఇక్కడి ఏజెంట్ల ద్వారా వెళ్లాం. పర్యాటక వీసా, విమాన టికెట్ పంపించి తొలుత థాయ్లాండ్ తీసుకెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో దిగాక చైనా హ్యాండ్లర్లు మమ్మల్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మా వద్దనున్న పాస్పోర్టులు, ఫోన్లు లాగేసుకున్నారు. అక్కడి నుంచి 12-13 గంటల పాటు ప్రయాణించి, దట్టమైన అటవీ ప్రాంతాల ద్వారా సరిహద్దులు దాటించి మయన్మార్కు తీసుకెళ్లారు. ఎత్తైన ప్రహరీ గోడలతో జైళ్ల మాదిరిగా ఉండే కాంపౌండ్లోకి తరలించారు. వాటిచుట్టూ పెద్దఎత్తున ప్రైవేటు సైన్యముంటుంది.
అమెరికాలోని ప్రవాస భారతీయులే లక్ష్యం
అమ్మాయిల ఫొటోలతో ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి డేటింగ్ యాప్లో నకిలీ ఖాతాలు తెరిపించారు. అమెరికాలోని ప్రవాస భారతీయుల్ని గుర్తించి ఆ ఖాతాలతో వల విసిరేవాళ్లం. ఎవరైనా రిప్లై ఇస్తే హనీట్రాప్ లోకి దించి పెట్టుబడుల పేరిట వారి ఖాతాలు మొత్తం ఖాళీ చేయించేవారు. ఒక్కొక్కరిని కనీసం 500 నుంచి 10 లక్షల డాలర్ల మేర మోసగించాలని లక్ష్యం విధించేవారు. మయన్మార్లోని మయవాడీ కేకే పార్క్ ప్రాంతంలో ఏడెనిమిది సైబర్ నేరాల కాంపౌండ్లు ఉన్నాయి. ఒక్కోచోట ఒక్కో తరహా నేరాలు చేయిస్తుంటారు. కాంబోడియా, వియత్నాం, థాయ్లాండ్లోనూ ఇలాంటి కాంపౌండ్ లు ఉన్నాయి. వాటిల్లో 10 వేల మందికి పైగా భారతీయులు ఇప్పటికీ బందీలుగా ఉన్నారు. శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్తో పాటు ఆఫ్రికా దేశాలకు చెందినవారు వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు.

నేరాలపై శిక్షణ.. కాదంటే శిక్ష
చైనీయుల ఆధీనంలోని ఆ కాంపౌండ్లోల్లోకి చేరాక కొన్ని టాస్క్ లు అప్పగించి డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, హనీ ట్రాప్ సహా పలురకాల సైబర్ నేరాలు చేయించేవారు. తాము అలాంటి పనులు చేయలేమని చెబితే చిత్రహింసలకు గురిచేసేవారు. తుపాకులతో బెదిరించేవారు. తప్పించుకోవాలని చూస్తే కాల్చి పడేసేవారు. వారు చెప్పిన ఫోన్నంబర్లకు వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మెసేజ్ లు పంపించడమే మా పని. ఎవరైనా స్పందిస్తే, వారి నుంచి డబ్బులు కాజేయడమంతా చైనా ముఠాలే చూసేవి. నెలకు రూ. లక్షకు పైగా వేతనం చెల్లిస్తామని చెప్పి తీసుకెళ్లారు. మొదట్లో మూణ్నెల్ల పాటు శిక్షణ పేరిట రూపాయి వేతనమూ ఇవ్వలేదు. తర్వాత పనితీరు బాగాలేదంటూ జీతం ఆపేశారు. కేవలం తిండి, వసతి మాత్రమే కల్పించారు. వెళ్లిపోతామని అడగ్గా, రూ.20 లక్షలు కట్టాలని బెదిరించేవారు. ఒకసారి ఆ కాంపౌండ్ ల్లోకి వెళ్తే, తప్పించుకోవడం అసాధ్యం. ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు. కుటుంబ సభ్యులతోనూ వారానికి ఒక్కసారే మాట్లాడించేవారు. అదీ వారు చెప్పినట్లే మాట్లాడాలి.
సైబర్ బానిసలుగా మార్చి, వెట్టిచాకిరీ
దక్షిణాసియా దేశాల్లోని సైబర్ నేరాల కాంపౌండ్లో చిక్కుకున్న భారతీయుల్లో 1,586 మందిని కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబరు నుంచి మూడు విడతల్లో ఇండియాకు తీసుకొచ్చింది. వారిలో 120 మంది ఏపీకి చెందినవారు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి వెళ్లగా, మరికొందరు ఏజెంట్లకు రూ.2-3 లక్షలు చెల్లించి వెళ్లారు. మోసగించిన 30 మంది ఏజెంట్లను అరెస్టు చేశాం. విదేశాల్లోని ఏజెంట్లపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీచేశాం. విదేశీ ఉద్యోగాల ప్రకటనలపై యువత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివి గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలి.
Also Read
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..
- Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!





