March 13, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Ap Cyber Scam: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!


ప్రభుత్వ స్కీమ్‌లు అందిస్తామంటూ గర్భిణులు, బాలింతల నుంచి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సభ్యులముఠా గుట్టు రట్టయింది. బాపట్ల జిల్లా పోలీసులు వారిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు ఏపీ, ఒకరు ఢిల్లీ వాసిగా గుర్తించారు. వీరు చాలా డబ్బులు కొట్టేశారని తెలిపారు.

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులనే సైబర్ కేటుగాళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఫోన్లు చేసి భయపెట్టి, బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. బాలింతలు, గర్భినీ స్త్రీలనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. బాధితులకు ఫోన్ చేసి ప్రభుత్వ పథకాలు అందుతాయని.. వారి వివరాలు తీసుకుని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటిదే జరిగింది. ఆ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారు ఆంధ్రప్రదేశ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే

గర్భిణులు, బాలింతల కోసం కేంద్ర ప్రభుత్వం ‘జనని ఆరోగ్య యోజన’ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం ద్వారా సాయం అందిస్తామంటూ బాధితుల నుంచి డబ్బులు కొట్టేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇక వీరిని విచారించగా ఊహకందని నిజాలు బయటకొచ్చాయి. రాష్ట్రంలో 16 జిల్లాల్లో బాధితులున్నారని తేలింది. ఈ బాధితులు సైబర్ నేరగాళ్ల నుంచి దాదాపు రూ.42.61 లక్షల మేర కొట్టేశారని పోలీసులు గుర్తించారు

ఏపీ వాసులే

అందులో ఒక్కొక్కరి నుంచి రూ.3000 నుంచి రూ.60,000 వరకు కొట్టేశారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు తాజాగా అరెస్టు చేసి.. వారి వివరాలు వెల్లడించారు. అందులో ఏపీలోని ఆళ్లగడ్డకు చెందిన ఆచారి రంజిత్‌సింగ్‌, ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటనారాయణ, ఢిల్లీకి చెందిన జతిన్‌ ఉన్నట్లు తెలిపారు. వీరు చదువుల్లో జీరోనే అయినా.. సైబర్‌ నేరాల్లో సిద్ధహస్తులయ్యారని పేర్కొన్నారు.

పోలీసుల ప్రకారం.. వీరు ఢిల్లీలోని ఓ రూమ్‌ను రెంట్‌కు తీసుకుని ఉండేవారు. అక్కడ నుంచే మోనిటరింగ్ చేసేవారు. గర్భిణులు, బాలింతలనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. బాధితులకు వాట్సప్‌ కాల్స్‌ చేసి.. ప్రభుత్వం నుంచి ఫోన్‌ చేస్తున్నట్లుగా నమ్మించేవారు. జేఎస్‌వై పథకం కింద రూ.70,000 వరకు సాయం అందిస్తామని.. మొత్తం డీటెయిల్స్ తీసుకునేవారు. అలా బాలింతలు, గర్భిణుల సెల్‌ నంబర్లకు ఓటీపీలు పంపించి డబ్బులు కాజేసేవారు. అక్కడ నుంచి డబ్బులను ఆన్‌లైన్‌ డెలివరీ యాప్‌ ‘బ్లింకిట్‌’లో ఖరీదైన సిగరెట్లు కొని.. వాటిని తక్కువ ధరకు అమ్మేసేవారు అని తేలింది

94 సైబర్‌ కేసులు
అంతేకాకుండా ఈ ముగ్గురు నిందితులు.. గతంలో కూడా ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు పరిహారం ఇప్పిస్తామని నమ్మించి దాదాపు రూ.4 కోట్ల వరకు దోచేశారని విచారణలో తేలింది. ఇక మొత్తంగా చూసుకుంటే నిందితులపై 6 రాష్ట్రాల్లో 94 సైబర్‌ నేరాల కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. అందువల్ల ప్రజలు ఇలాంటి సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు.

Also read

Related posts

Share via