ఈ ఆలయంలోని శ్రీనివాసుని దర్శించి పూజిస్తే- వివాహం కాని వారికి త్వరగా అవుతుందని విశ్వాసం!
Sri Prasanna Venkateswara Swamy Temple : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు తిరుమల ఆనంద నిలయంలో అర్చావతారమూర్తిగా పూజలందుకుంటున్నాడు. శ్రీనివాసుని నిలువెత్తు దివ్య మంగళ దర్శనంతో భక్తులు పునీతులవుతారు. ఒక్క తిరుమలలో మాత్రమే కాకుండా శ్రీనివాసునికి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆలయాలున్నాయి. ప్రతి ఆలయంలోనూ శ్రీనివాసుడు నిలుచుని ఉన్న భంగిమలోనే దర్శనమివ్వడం తెలిసిందే! అయితే ఇందుకు భిన్నంగా ఓ ఆలయంలో శ్రీనివాసుడు కూర్చుని దర్శనమిస్తాడు. ఈ ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం- తొండమానపురం
సాధారణంగా మనం ఏ వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లిన స్వామి నిలువెత్తు గంభీర రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిత్తూరు జిల్లా తొండమానపురంలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాత్రం స్వామి ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా సుఖాసీనుడై దర్శనమిస్తాడు. అత్యంత మహిమాన్వితమైన స్వామిగా పేరు గాంచిన ఈ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం స్థల పురాణం, ఆలయ విశేషాలు తెలుసుకుందాం.
తొండమానపురం ఎక్కడుంది?
తిరుపతి నుంచి కేవలం గంటన్నర దూరంలో శ్రీకాళహస్తి మార్గంలో తొండమానపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం వెలసి ఉంది.
స్థల పురాణం
తొండమానపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి ఇలా కూర్చుని దర్శనం ఇవ్వడం వెనుక ఓ గాథ ఉంది. తిరుమలలోని ఏడుకొండలవాని ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి గతంలో ఇదే ప్రాంతంలో నివసించేవాడట. ఏడుకొండలవాడంటే అమితమైన భక్తిశ్రద్ధలు ఉన్న తొండమాన్ చక్రవర్తి ఇక్కడ నుంచి ప్రతిరోజూ తిరుమలకు వెళ్లి స్వామిని సేవించేవాడంట! కాలక్రమంలో వయోభారంతో తిరుమలకు రోజూ వెళ్లలేక పోవడంతో స్వామి దర్శనానికి దూరమయ్యానని అనుక్షణం చింతిస్తూ ఉండేవాడట! అలాగని వెళ్ళడానికి శరీరం, వయస్సు సహకరించేవి కావు. ఇలా తొండమాన్ చక్రవర్తి నిత్యం సంఘర్షణ అనుభవిస్తూ ఉండేవాడు.
ఇంట్లోనే ధ్యానం
చేసేదేమి లేక తొండమాన్ చక్రవర్తి స్వామిని తన ఇంటి నుంచి ధ్యానిస్తూ ఉండేవాడు. ఆలా ఓసారి తన ఇంట్లో కూర్చుని కోనేటి రాయుని ధ్యానిస్తూ ఉన్న సమయంలో స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తొండమాన్ చక్రవర్తి ముందు కూర్చుని దర్శనం ఇచ్చాడంట! ఆ దర్శనానికి పులకించిపోయిన తొండమాన్ చక్రవర్తి స్వామిని అక్కడ అలాగే వెలసి ఉండమని కోరుకున్నాడంట! చక్రవర్తి కోరిక మేరకు శ్రీనివాసుడు అలాగే శ్రీదేవి భూదేవి సమేతంగా కూర్చున్న భంగిమలో అక్కడే వెలియగా, తొండమాన్ చక్రవర్తి తన ఇంటిని ఆలయంగా మార్చాడని ప్రతీతి.
ఆలయ విశేషాలు
తొండమానపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా శంఖు చక్రాలు ధరించి, యోగ అభయ ముద్రలలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ గోపురం తిరుమల ఆనందానిలయం విమానాన్ని పోలి ఉండడం విశేషం. అలాగే ఈ క్షేత్రంలో సీతారామలక్ష్మణులను, ఆంజనేయస్వామిని, ఇతర దేవీదేవతలు ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు.
దర్శనఫలం
తొండమానపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వెలసి ఉన్న శ్రీనివాసుని దర్శించి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుందని, అలాగే వివాహం అయిన వారికి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని విశ్వాసం.
ఎలా చేరుకోవాలి?
తిరుపతి శ్రీకాళహస్తి మధ్య మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఇటు తిరుపతి నుంచి, అటు శ్రీకాళహస్తి నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. మనం కూడా తొండమానపురం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వెలసిన శ్రీనివాసుని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.
ఓం నమో వేంకటేశాయ!
