Prabhala Theertham: జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక జగ్గన్న తోట ప్రభల తీర్థమని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఏటా కనుమ రోజు జగ్గన్న తోటలో జరిగే అతిపెద్ద పండుగలో 11 పురాతన శివాలయాల నుంచి వచ్చే ఏకాదశ రుద్రుల ప్రభలు ఒకే వేదికపై దర్శనమిస్తాయన్నారు.
తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్న కోనసీమ ప్రజల భక్తి, విశ్వాసాలను గౌరవిస్తూ……… జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. సుమారు 5 లక్షల మంది హాజరయ్యే ఈ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా చేయాలనే మంత్రివర్గ నిర్ణయంతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం అందుతుందన్నారు. కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు.
ప్రభల తీర్థం ప్రాముఖ్యత
తెలుగువారికి ముఖ్యమైన పండుగ సంక్రాంతిని కోనసీమలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వీటిల్లో జగ్గన్నతోట “ప్రభల తీర్థం” ఒకటి. కనుమనాడు కోనసీమలో అనేక చోట్ల ప్రభలు ఊరేగిస్తారు. అమలాపురానికి సమీపంలోని మొసలపల్లి ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్తారు. కొబ్బరిచోట్ల మధ్య.. ముత్యాల ముగ్గుల నడుమ ఎంతో సంబరంగా ప్రభలు ఊరేగిస్తారు. పురాణాల్లోని ఏకాదశ రుద్రులకు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగు పొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారని ప్రజల నమ్మకం. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారంటున్నారు. అలా 11 మంది ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని ప్రజల నమ్మకం.
11 మంది విశ్వేశ్వరులు
వ్యాఘేశ్వరం- విశ్వేశ్వర రుద్ర రూపం, వ్యాఘేశ్వరుడు
పెదపూడి -మహాదేవ రుద్రరూపం, మేనకేశ్వరుడు
ఇరుసుమండ-ఆనంద (త్రయంబక రుద్రరూపం) రామేశ్వరుడు
వక్కలంక- త్రిపురాంతక రుద్రుడు, విశ్వేశ్వరుడు
నేదునూరు- కాలరుద్రుడు, చెన్నమల్లేశ్వరస్వామి
ముక్కామల-కాలాగ్ని రుద్రుడు, రాఘవేశ్వరుడు
మొసలపల్లి-(నీలకంఠ రుద్రుడు, భోగేశ్వరుడు,
పాలగుమ్మి-మృత్యుంజయ రుద్రుడు, చెన్న మల్లేశ్వరుడు
గంగలకుర్రు- సర్వేశ్వర అగ్రహారం, వీరేశ్వరుడు
గంగలకుర్రు-సదాశివ రుద్ర రూపం, చెన్నమల్లేశ్వరుడు
పుల్లేటికుర్రు- శ్రీ మన్మహాదేవ రుద్రరూపం, అభినవ వ్యాఘేశ్వరుడు
వీరిలో మొదటివాడైన వ్యాఘేశ్వరస్వామి ప్రభల తీర్థానికి అధ్యక్షత వహిస్తారని అంటారు. అందుకే ఆ ప్రభ వచ్చేవరకు భక్తులు మొక్కులు తీర్చుకోకుండా వేచిచూస్తారు.
తాటి దూలాలకు టేకు చెక్కలు అమర్చి, వెదురు బొంగుల్ని ఒక క్రమపద్ధతిలో గోపురం ఆకారంలో వంచి ప్రభ నిర్మిస్తారు. మధ్య ఖాళీలను రంగురంగుల కొత్త వస్త్రాలతో అలకరిస్తారు. ఎర్రని గుడ్డను వెనక వైపు తెరలా కడతారు. ముందు, వెనక భాగాల్ని జీవాత్మ పరమాత్మల ప్రతీకలుగా పరిగణిస్తారు. పైభాగంలో ఆలయాల్లోని ఇత్తడి కలశాలను కడతారు. ఆ పైన వరి కంకులు, నెమలి పింఛాలు, పూల దండలు, ఇతర సామగ్రితో అందంగా అలంకరిస్తారు. వాటి మధ్యలో ఉత్సవ విగ్రహాలు ఉంచడానికి వీలుగా గద్దెలు ఏర్పాటు చేస్తారు. వాటిమీద ఆయా గ్రామాల్లోని శివుడి ఉత్సవ విగ్రహాలు ఉంచడం సంప్రదాయంగా వస్తుంది. అనంతరం మేళతాళాలు, మంగళ వాద్యాలతో ఊరేగింపుగా బయలుదేరతారు. భక్తులు తమ భుజాలపై.. పంట చేల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు. పరమేశ్వరుడి ప్రభ వెంట వీరభద్ర ప్రభలు తీసుకెళ్తారు. కోనసీమ ప్రభల తీర్థాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారు.
Also read
- చదువుకోమని కాలేజీకి పంపిస్తే ఏంటిదీ.. గలీజ్ పని చేస్తూ దొరికి డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్!
- చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?
- చూసి అమాయకుడు అనుకునేరు.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..
- నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పోలీస్ స్టేషన్లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!





