SGSTV NEWS
Andhra Pradesh

పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి…. బ్రాహ్మణ చైతన్య వేదిక విజ్ఞప్తి*

అమరావతి:
పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పద మృతి పట్ల పోలీస్ శాఖ కఠినంగా విచారణ చేపట్టాలని, కుట్ర కోణం దాగుంటే దోషులు ఎంతటి వారైనా సరే శిక్షలు పడేలా కేసు నమోదు చేయాలని *బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.* బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం శ్రీధర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లు బాధా తప్త హృదయంతో ఉపవాస దీక్షలు (లెంట్ డేస్) ఉన్న సమయంలో రాజమండ్రి బాప్టిస్ట్ చర్చికి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పదంగా మరణించడం పట్ల కుట్ర కోణం ఏమైనా దాగుందా అని రాష్ట్ర ప్రజలు, క్రిస్టియన్ సమాజం చర్చ జరుగుతున్న సమయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రిణి అనిత వెంటనే స్పందించి కేసు నమోదు చేయించి డిఎస్పి స్థాయి ఉన్నతాధికారిని విచారణ చేపట్టేందుకు నియమించటం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సమగ్ర విచారణ చేయమని ప్రకటన చేయడం మంచి పరిణామమని, అధికార దాహంతో రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే సమాజంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు కోసం ఏమైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారేమోనని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నరని, ఈ నేపథ్యంలో అటువంటి కుట్ర కోణం ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని శ్రీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మృతిని పోలీస్ శాఖ సమగ్రంగా విచారణ చేయాలని పోలీసుల్ని డిమాండ్ చేశారు.


సమాజంలో దేవాలయ అర్చకులు, పురోహితులు గాని, చర్చి పాస్టర్లు ఫాదర్లు గాని, మసీదు ఇమాము మౌజములు గాని ప్రజలలో భక్తి భావం పెంపొందించేలాగా చేయడాన్ని వాళ్లు తమ వృత్తిగా ఎంచుకున్నారని, ప్రజల్ని సమాజంలో ఆధ్యాత్మిక చింతనలో, మరియు సేవా దృక్పథంతో ఉండేలా చేయటంలో వీరి పాత్ర ఎంతో ప్రధానమైనదని, అటువంటి వారికి ఇబ్బంది వచ్చిన, అన్యాయం జరిగిన, ఇటువంటి దుర్ఘటనలు జరిగిన మన సమాజంలో ప్రజలు వారి అండగా ఉంటారని, ఇటువంటి ఘటనలపై మతాలకతీతంగా ప్రజలు అనుకూల దృక్పథంతో, సానుకూల ధోరణితో ఉండాలని శ్రీధర్ పిలుపునిచ్చారు. గత రెండు కరోనా కష్టకాలంలలో అర్చకులు, పురోహితులు పాస్టర్లు ఫాదర్లు, ఇమాములు, మౌజములకు నిత్యవసర సరుకులు, ఆహార పదార్థాలను బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా తాము అందించామని, అదే దృక్పథంతో పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల కూడా తాము ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ స్పందన తెలియజేస్తున్నట్లు, పాస్టర్ కుటుంబానికి బ్రాహ్మణ చైతన్య వేదిక అండగా ఉంటుందని శ్రీధర్ తెలియజేశారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో మతసామరస్యంతో, మత సౌబ్రాతుత్త్వంతో కలిసి ఉండటమే మన ప్రజాస్వామ్య ద్యేయమని శ్రీధర్ తెలియజేశారు.

Also read

Related posts

Share this