SGSTV NEWS
CrimeTelangana

Nizamabad News : ఆ గ్రామంలో 54 కుటుంబాల సాంఘిక బహిష్కరణ…సెక్షన్ 163 అమలు..అసలేం జరిగిందంటే…


నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామంలో కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ, గౌడ కులస్తులకు, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)కి మధ్య ఘర్షణగా మారింది. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గ్రామంలో 163 సెక్షన్‌ విధించారు.

Village Development Committees : నిజామాబాద్ జిల్లా, ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌ గ్రామంలో కల్లు అమ్మకాలపై మొదలైన గొడవ, గౌడ కులస్తులకు, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)కి మధ్య ఘర్షణగా మారింది. ఈ క్రమంలో, శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో ఆలయంలోకి వెళ్లిన గౌడ మహిళలను వీడీసీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సంఘటనపై గౌడ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ, వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, సాంఘిక బహిష్కరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో కల్లు అమ్మకాలపై గౌడ కులస్తులు, గ్రామ కమిటీ (వీడీసీ)కి మధ్య నెలల తరబడి గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో తారాస్థాయికి చేరింది. ఆలయంలో పూజలు చేసుకోవడానికి వెళ్ళిన గౌడ కుల మహిళలను వీడీసీ సభ్యులు అడ్డుకుని, ఆలయం నుంచి బయటికి పంపారు.  ఈ సంఘటనపై గౌడ కులస్తులు నిరసనలు వ్యక్తం చేస్తూ, వీడీసీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, మానవ హక్కుల కమిషన్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ, వివాదం మరింత ముదిరింది. ఈ సమస్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గౌడ కులస్తులపై విధించిన ఆంక్షలు, సాంఘిక బహిష్కరణను నిలిపివేయాలని వారు కోరుతున్నారు. కానీ వీడీసీ సభ్యులు మాత్రం వినడం లేదు.

పిప్రి గ్రామంలోనూ..

గతంలోనూ ఇదే జిల్లాలోని ఆర్మూర్‌ మండలం పిప్రిలో ఏకంగా 54 గౌడ కుటుంబాలను బహిష్కరించారు. తమపై వీడీసీ ఆంక్షలు పెట్టి బహిష్కరించిందని గౌడ కులస్తులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లు విక్రయిస్తుండగా.. పెరిగిన ధరలకు అనుగుణంగా గిట్టుబాటు కావడం లేదని.. సీసా ధర రూ.12 ఉండగా.. అదనంగా మూడు రూపాయలు పెంచి 15 రూపాయలు చేస్తామని గౌడ కులస్తులు తేల్చి చెప్పారు. అయితే  దీనికి ఒప్పుకోకపోగా వారిని వీడీసీ బహిష్కరించారు. తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని.. తాము చెప్పినట్టు వినాలని వీడీసీ హుకుం జారీ చేసింది. అంతేకాక గ్రామంలోని దుకాణాల్లో గౌడ కులస్తులకు సరుకులు ఇవ్వకుండా, ఆటోల్లోకి ఎక్కించుకోకుండా ఆంక్షలు పెట్టి బహిష్కరించారు. అలాగే, పలువురు గౌడ కులస్తులు హోటళ్లు, కిరాణ దుకాణాలు, టిఫిన్‌ సెంటర్లు నిర్వహిస్తుండగా.. వారి వద్ద గ్రామస్తులెవరూ కొనుగోలు చేయవద్దని హుకుం జారీ చేశారు.  అయితే గ్రామంలో తాము కల్లు విక్రయిస్తున్నందుకు ఏడాదికి రూ.10లక్షలు వీడీసీకి ఇస్తున్నామని, అయినా తమను బహిష్కరించి మానసిక క్షోభకు గురి చేస్తున్న వీడీసీపై చర్యలు తీసుకోవాలని ఆర్మూర్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. మరోవైపు బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్‌ గ్రామంలో గౌడ కులస్తుల బహిష్కరణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. గ్రామాల్లో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న వీడీసీల ఆగడాలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు, జిల్లా న్యాయ సేవా సంస్థ కొరడా ఝులిపిస్తున్నా మార్పు రావడం లేదని.. కఠిన చర్యలు తీసుకుంటేనే వీడీసీ ఆగడాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని బాధితులు వాపోతున్నారు

సెక్షన్ 163 విధింపు

ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు, గ్రామస్తుల మధ్య తలెత్తిన వివాదంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే గ్రామంలో పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఏర్పడడంతో ఎస్సై పడాల రాజేశ్వర్ నివేదిక ఆధారంగా తహసీల్దార్ జె. మల్లయ్య ప్రత్యేక  ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి 21 వరకు గ్రామంలో బి.ఎన్.ఎస్.ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కాలంలో ముగ్గురికిపైగా వ్యక్తులు గుమికూడడం, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం, ఆయుధాలతో తిరగడం నిషేధించినట్లు తెలిపారు.  అయితే ప్రభుత్వ విధుల్లో ఉన్న సిబ్బంది, అంత్యక్రియల ఊరేగింపులకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవని తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎలాంటి వివాదాలు సృష్టించకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు.

Also read

Related posts

Share this