Nimishambhika Devi Temple : ఆలయానికి ఎవరు వెళ్లినా బాధలు తొలగించమని, సంతోషాన్ని ఇమ్మనే కోరుకుంటారు. అలాంటి భక్తులను అనుగ్రహించడంలో ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు ముందుటుంది…
సమస్యలు లేని మనుషులుంటారా? ఆలయానికి వెళ్లి కోర్కెలు కోరుకోని భక్తులుంటారా?. చేసే పూజలు, ఉపవాసాలు, నోములు, మొక్కులు అన్నీ సమస్యల నుంచి బయపడేందుకే. అయితే నిముషంలో కోరుకుంటే మీరు ఊహించనంత తక్కువ సమయంలో తీర్చేసే అమ్మవారి గురించి తెలుసా? ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు..హైదరాబాద్ బోడుప్పల్ లో ఉంది ఆ ఆలయం.
నిముషాంబ దేవిని దర్శించుకుని ఆలయంలో 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల విశ్వాసం. అప్పులు ఉన్నవారు , చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు అమ్మను భక్తిపూర్వకంగా దర్శించకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారని నమ్మకం.
ముఖ్యంగా పెళ్లికానివారు ఈ ఆలయానికి వెళ్లి మొక్కుకుంటే త్వరలోనే పెళ్లి జరిగిపోతుందట
చిలుకూరు బాలాజీ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుని మొక్కుకుంటారు..అది నెరవేరితే 108 ప్రదక్షిణలు చేస్తారు
అలానే..
నిముషాంబ దేవి ఆలయంలో ముందుగా 16 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కుకుంటే ఆ కోర్కె 21 రోజుల్లో తీరిపోతుందట. ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి
ఇక్కడ అమ్మవారికి భారీ నైవేద్యాలు కూడా అవసరం లేదు. కేవలం నిమ్మకాలు నివేదిస్తే చాలు ఆనందపడిపోతుంది..భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలను తీసుకెళ్లి ఇంట్లో ఉంచితే అన్నింటా శుభ ఫలితాలు సాధిస్తారు, ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
మొక్కుకున్నవారు అయితే నిముషాంబ దేవికి గాజులు, వస్త్రాలు, నిమ్మకాయలు సమర్పిస్తారు.
నిముషాంబ దేవికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. ప్రముఖ ఆలయం కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్నం సమీపం గంజాం దగ్గర కావేరీ నది ఒడ్డున కొలువైంది.
నిముషాంబ దేవి పుట్టుకకు ఓపురాణ కథ చెబుతారు
పూర్వం ముక్తకుడు అనే రుషి లోకకళ్యానార్థం యాగాన్ని తలపెట్టాడు. శివుడి అంశతో జన్మించిన ఆ రుషి చేస్తున్న యాగాన్ని చెడగొట్టేందుకు రాక్షసులు ప్రయత్నించారు. చివరకు ఆ రుషి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యే క్షణంలో పార్వతీదేవి ప్రత్యక్షమై అసురుల్ని వధించింది. అంతా నిముషంలో జరిగిపోయింది. అప్పుడు రుషులంతా…అప్పటివరకూ ఉన్న కష్టాన్ని నిముషంలో తీర్చేసిన అమ్మవారిని నిముషాంబగా స్తుతించారు.
కర్ణాటకలో ఉన్న నిముషాంబ ఆలయంలో భలిభోజనం ప్రత్యేకం. నిత్యం కాకులకు ఆహారం పెడతారు. గోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మండప పైకప్పు నుంచి వేలాడుతున్న ఒక భారీ గంట కనిపిస్తుంది. ఈ గంటను భక్తులు అస్సలు మోగించకూడదు. కేవలం కాకులకు నైవేద్యంగా బలి భోజనాన్ని బలి పీఠంపై ఉంచినప్పుడు మాత్రమే ప్రధాన అర్చకుడు ప్రతిరోజూ నిర్ణీత సమయంలో ఈ గంట మోగిస్తాడు.
నిమిషాంబ దేవి అవతరించిన ప్రదేశం గంజాం..అయితే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ అమ్మవారికి ఆలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల భక్తులు దర్శించుకునేందుకు వీలుగా హైదరాబాద్ సమీపం బోడుప్పల్‌లోని కూడా ఓ ఆలయం ఉంది. భక్తివిశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థిస్తే చాలు కోర్కెలు వెంటనే ఫలిస్తాయి. ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ఆంటంకాలు వైనా కానీ అమ్మవారి దర్శనంతో తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
శ్రీ మాత్రే నమః
