November 22, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 52 వ అధ్యాయం…శనిగ్రహ జననం – 3

శనిగ్రహ జననం – 3*

ఛాయా ! నువ్వు నా ప్రతి బింబమన్న సంగతి భవిష్యత్తులో బైటపడకుండా ఉండాలంటే , మనకు సంబంధించిన – అంటే నాకు సంబంధించిన విషయాలు అన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి ! రక్తగతం కావాలి ! అంది సంజ్ఞ.ఒక్కసారి వింటే చాలు… అవి నాకు రక్తగతం అయిపోతాయి !”ఛాయ నవ్వుతూ అంది.

తనలాగే తక్షణం ప్రతిస్పందిస్తూ , సూటిగా మాట్లాడుతున్న ఛాయను తృప్తిగా చూస్తూ ఇలా అంది సంజ్ఞ.
నేను విశ్వకర్మ కుమార్తెను. ఆయన వసుపుత్రుడు , దేవశిల్పి… సంజ్ఞ పరిచయ ప్రసంగం ప్రారంభించింది.
నువ్వు కాదు , సంజ్ఞ నేను !ఛాయ అడ్డు తగుల్తూ, చిరునవ్వుతో అంది. నేను విశ్వకర్మ పుత్రికను ! నాకు సంబంధించిన విషయాలు చెప్పు !సంజ్ఞ అర్థం చేసుకున్నట్లు నవ్వింది. నిన్ను విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతీ , అది దంపతుల పుత్రుడు సూర్యునికి కన్యాదానం చేశారు.నీకు నీ భర్త సూర్యుడి వల్ల వైవస్వతుడూ ,
యముడూ అనేఇద్దరు కుమారులు, ‘యమి’ అనే కుమార్తె కలిగారు.

నీ భర్త శరీరం నుండి నిరంతరం వెలువడే వేడినీ , వెల్తురునీ భరించలేక నువ్వు కొన్ని రోజుల క్రితం నీ పుట్టింటికి వెళ్ళావు. అర్ధమవుతోంది కదా !ఛాయ నవ్వింది. సందేహానికి అవకాశం లేకుండా ! అంటే నువ్వు వెళ్ళావని భావం. సరే… చెప్పు !ఆయన వేడిమినీ , వెలుగునూ తట్టు కోవడానికి అవసరమైన మానసిక శక్తినీ ,శారీరకసంసిద్ధతనూసమకూర్చుకుని , సూర్యమందిరానికి తిరిగి వెళ్తున్నావు !వెళ్ళి , నీ స్థానంలో సూర్యపత్నిగా రాణిస్తూ , నీ బిడ్డలను నా బిడ్డలలాగే చూసు కుంటాను ! ఛాయ నవ్వింది.

ఏకాంతంలో ఆయనతో ఏ విధంగా మసలుకోవాలో నీకు వివరిస్తాను ! తదనంతరం నువ్వు సూర్య మందిరానికి వెళ్ళు ! అంటూ చెప్పసాగింది సంజ్ఞ….

సంజ్ఞా ! ద్వారం ముందు నిలుచున్న ఛాయను చూడగానే ఆశ్చర్యానందాలతో అన్నాడు సూర్యుడు.స్వామీ !ఛాయ అప్రయత్నంగా అంది , సంజ్ఞ బోధించిన నటనావిన్యాసాన్ని గుర్తుచేసుకుంటూ.

నువ్వు వెళ్ళిపోయాక మందిరం కాంతి విహీనం అయిపోయింది , సంజ్ఞా !సూర్యుడు ఆమె వైపు అడుగులు వేస్తూ అన్నాడు.

ఛాయ చిరునవ్వుని బలవంతాన ఆపుకుంది. నిజంగా సూర్యుడు అమాయకుడే ! కాంతి ఆయన ఆస్తి ! సంజ్ఞ వెళ్ళిపోయాక మందిరంలో కాంతి మాయమైందట !

మీ కోసం , నా బిడ్డల కోసం వచ్చేశాను స్వామీ…ఛాయ భావ స్ఫోరకంగా అంది. మీ కోసం… పూర్తిగా , పూర్తిగా మారిపోయి , నూతనంగా వచ్చాను స్వామీ !

నిజంగా !”సూర్యుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఆశగా ఆమెనే చూస్తూ రెండు చేతుల్నీ ఎడంగా చాచాడు. ఛాయ వేగంగా వచ్చి , ఆయన చేతుల మధ్య ఇమిడి పోయింది.
సూర్యుడిలోని అనురాగం ఆమెను దగ్గరగా తీసుకుంది. తన్మయత్వంతో ఉండిపోయాడు సూర్యుడు ! ఔను ! సంజ్ఞ తాను చెప్పినట్టు తనను పరివర్తింప జేసుకుని , సర్వసిద్ధంగా తన లోగిలిలోకి , తన కౌగిలిలోకి తిరిగి వచ్చింది. తనవేడిమినీ , వెలుగునూ భరించే శక్తిని సమీకరించుకుని వచ్చింది. అందుకే తన గాఢపరిష్వంగంలో ఆమె శరీరం కంపిస్తోంది.

సంజ్ఞా ! సూర్యుడు తన ఛాతీ మీద ఆనిన ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు.

స్వా… మీ…

ఇంక ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళకూడదు !

…అలాగే…

ఇంకెప్పుడూ నాకు ‘దగ్గరగా ఉంటూ, దూరంగా ఉండకూడదు ! సూర్యుడి కంఠంలో భావోద్వేగం వణికింది.ఛాయ సూర్యుణ్ణి చుట్టిన తన చేతులతో ఆయనకు సమాధానం చెప్పింది. అమ్మా ! చిన్న బాలిక పిలుపు ఛాయను హెచ్చరించింది. యమి పిలుపు ఛాయా సూర్యుల్ని విడదీసి దూర దూరంగా జరిపింది.యమి వాళ్ళ వైపు పరుగెట్టుకు వస్తోంది.

అమ్మా !రెండు కంఠాలు ఒకేసారి పిలిచాయి. యమిని దగ్గరకు తీసుకుంటూ , చూసింది ఛాయ. వైవస్వతుడూ , యముడూ నవ్వుతో అమ్మను చూస్తున్న ఆనందంతో , వికసిస్తున్న ముఖాలతో వేగంగా వస్తున్నారు.

ఛాయా ! నా భర్తని నీ భర్తగా చూసుకున్నట్టే , నా బిడ్డల్ని నీ బిడ్డలుగా జాగ్రత్తగా , ప్రేమగా , భద్రంగా చూసుకోవాలేం !సంజ్ఞ పదేపదే చెప్పిన మాట ఛాయ చెవుల్లో గింగురుమంది.

సూర్యుడి సాహచర్యమనే అదృష్టాన్ని అందిచ్చిన అక్క సంజ్ఞను తలచుకుంటూ ఛాయ ముగ్గురు పిల్లల్నీ ఒకేసారి దగ్గరగా తీసుకొని , ముగ్గురి బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.కాలం గడిచిపోతోంది. ఛాయ సంజ్ఞ పాత్రలో పూర్తిగా లీనమైపోయింది. సూర్యుణ్ణి తన భర్తగా స్వీకరించి , అతనితో సుఖిస్తూ , సంజ్ఞ సంతానాన్ని తన సంతానంగా చూసుకుంటూ

హాయిగా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండిపోయింది.సూర్యుడు ప్రస్తుత సంజ్ఞ , సత్య సంజ్ఞ కాదనీ , ఛాయ అనీ లేశమాత్రం కూడా సందేహించకుండా ఆనందంగా ఉన్నాడు.

ఇలా ఉండగా – నారదుడు శ్రీమహావిష్ణువు దర్శనానికి వెళ్ళాడు. లక్ష్మీ విష్ణువులకు వందనాలు అర్పించాడు.
నారదా , నువ్వు ఇక్కడికి వస్తే బాగుండేదని నాకు అనిపించింది. సంకల్పం కలిగింది ; సన్నిధికి వచ్చావు ! అన్నాడు శ్రీమహా విష్ణువు నవ్వుతూ.

నారాయణ ! నేను రావాలని మీరనుకున్నారు. అందుకేనేమో రావాలని నాకు అనిపించింది ! నారదుడు నవ్వాడు.

ఎవరికైనా , ఏదైనా వర్తమానం అందజేయాలా , స్వామీ?
నవగ్రహాలలో సప్తమ గ్రహం జన్మించాలి కదా ! నువ్వు కల్పించుకుంటే గానీ సంకల్పం ఫలించేలా లేదు సుమా ! విష్ణువు నవ్వుతూ అన్నాడు.

నారాయణ ! నారాయణ ! మీరు సంకల్పిస్తే , మరొకరు కల్పించు కోవడం దేనికి ? వృధా ప్రయాస !

లేదు నారదా ! నువ్వు కల్పించుకోవాలి. సప్తమ గ్రహం సూర్యపుత్రుడుగా సంభవించాలి అన్నాడు విష్ణువు.

సూర్య పుత్రుడిగానా ? ఇప్పటికే సూర్యుడికి ఇద్దరు పుత్రులు న్నారుగా… నారాయణా !

ఆ ఇద్దరూ సూర్యుడికి భార్య వల్ల కలిగిన పుత్రులు నారదా ! మన ఏడవ గ్రహం భార్య కాని భార్య ద్వారా సూర్యుడికి జన్మించాలి ! శ్రీహరి వివరించాడు.

నారాయణ ! భార్య కాని భార్యకా ? నారదుడు ఆశ్చర్యంగా అన్నాడు.
సూర్యుడి శరీర ఉష్టాన్నీ , కాంతినీ భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ‘ఛాయ’ అనే నామధేయంతో మందిరానికి పంపింది. ఛాయ సూర్యుడికి పత్నిగా , సంజ్ఞ సంతానానికి తల్లిగా నటిస్తూ జీవిస్తోంది. సంజ్ఞ బిడ్డల పోషణలో పూర్తిగా లీనమై పోయిన ‘ఛాయ’కు తల్లి కావాలన్న తలంపే లేదు !

నువ్వు సూర్యమందిరానికి వెళ్ళి , ఆమెకూ స్వీయ సంతతి ఉండాలని రెచ్చగొట్టు. సూర్యుణ్ణి ప్రార్థించి సంతానాన్ని పొందమంటూ ప్రేరేపించు. తద్వారా మన నవగ్రహాలలోని సప్తమ గ్రహం ఆవిర్భవిస్తాడు !ఆజ్ఞ ! కానీ… చిన్న సందేహం. సంజ్ఞ ఏమైంది ? పుట్టినిల్లు చేరిందా ? నారదుడు అడిగాడు.లేదు ! పుట్టినింటికి వెళ్తే రహస్యం బట్టబయలు కాదా ? సంజ్ఞ అరణ్యంలో తపస్సులో మునిగిపోయిందిలే ! నువ్వు వెళ్ళు – సూర్య మందిరానికి ! అన్నాడు శ్రీమహావిష్ణువు….

Related posts

Share via