శనిగ్రహ జననం – 2
భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞ పుట్టి నింటికి వెళ్ళలేదు. వెళ్ళే ఆలోచన లేదామెకు. ఆరణ్యం వైపు నడు స్తోంది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ.
భర్తకు చెప్పిందిగానీ , చెప్పిన విధంగా మారిపోయి , ఆయన అతి ప్రకాశాన్నీ ,అత్యుష్టాన్నీ భరించ డానికి సిద్ధమైపోయి , ఆయనను తిరిగి చేరడం సంభవం కాదని ఆమెకు అప్పుడే తెలుసు.
ఇప్పుడు ఏం చేయాలి తను ? తన రాక కోసం కొన్నాళ్ళు చూశాక , తన భర్త తన కోసం అత్తగారింటికి వెళ్తారు. తాను అక్కడికి వెళ్ళ లేదన్న సంగతి తెలిసి పోతుంది.
భర్తకు భార్యగా తను అవసరం. దానికి వెయ్యింతలుగా తన బిడ్డలకు తల్లిగా తను అవసరం. అంటే సూర్య మందిరంలో తన ఉనికి అత్యవసరం.
తన సమస్యకు పరిష్కారం కోసం తనలోనే అన్వేషిస్తూ అరణ్యంలో ఒక చెట్టు నీడన కూర్చున్న సంజ్ఞ , ఆలోచనలను కొనసాగిస్తూ అప్రయత్నంగా ధ్యానంలోకి జారుకుంది.
సంజ్ఞలో నెలకొంటున్న ఏకాగ్రత ఆమె సమస్యకు పరిష్కారాన్ని వెదుకుతోంది. గంటలు గడుస్తున్నాయి. సంజ్ఞలో ఒక ఆలోచన మెరిసింది.
ముమ్ముర్తులా తనలాంటి స్త్రీ మరొకతె ఉంటే ! ముమ్మూర్తులా , రూపంలో , మాటలో , నడకలో , నవ్వులో , అన్నింటా తనను పోలిన ఒక స్త్రీ తనకు లభిస్తే !
తన ప్రతిబింబంలా ఉండే అలాంటి స్త్రీని , తన స్థానంలో సూర్య పత్నిగా , తన సంతానానికి తల్లిగా నటిస్తూ ఉండమని నియోగించి , పంపిస్తే !
భరించలేని సూర్యుడి వేడిమికి , తట్టుకోలేని ఆ అమిత కాంతికీ దూరంగా శాశ్వతంగా దూరంగా – చల్లగా , హాయిగా ఉండిపోవచ్చు !
ధ్యానంలో మునిగి , అరమోడ్పు కళ్ళతో ఉన్న సంజ్ఞ తటాలున కళ్ళు పూర్తిగా తెరిచింది. తన ప్రతిబింబం లాంటి స్త్రీ ఉంటే ,అన్న ఆలోచన ఆమెలో నరనరానా ఉధృతమైన వేగంతో ప్రవహిస్తోంది. సంజ్ఞ ఇంక అక్కడ కూర్చోలేక పైకి లేచింది.
ఆలోచనల దండయాత్రను తట్టుకోలేని సంజ్ఞ అరణ్యంలో అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోయింది. చీకట్లు ముసురు కుంటున్నాయి – వెలుపల చీకట్లు ముసురు కుంటున్నాయి. ఆమె లోపల ఏదో వెలుగు మెల్లగా , చాలా మెల్లగా విస్తరిస్తోంది. ఆ వెలుగు పూర్తిగా తనను ఆవరిస్తూ విస్తరిల్లేదాకా తను ధ్యాన నిష్ఠలో ఉండాలి. ఎలాగో తను చల్లటి ప్రకృతిలో తపస్సు చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగాగడిపివేయాలనుకుంటోంది.
సమస్య పరిష్కారం కోసం చేసే సాధన – భవిష్యత్తులో తపస్సుకు పునాది అవుతుంది !రోజులు గడుస్తున్నాయి. తనకు కావాల్సిన సమాధానం కోసం అంది రావాల్సిన పరిష్కారం కోసం ధ్యాన కాంతిలో వెదుకుతూ ఉండిపోయింది సంజ్ఞ.
ప్రాతఃకాలం… సంజ్ఞ ధ్యానం ఆపి , సరోవరం వైపు బయలుదేరింది. ఆమెలో సర్వకాలాలలో సర్వా వస్థల్లో మెదులుతూ ఉండే అంశం ఒక్కటే – తనకు ఇప్పుడు అత్యవసరంగా తనలాంటి స్త్రీ ఒకతె కావాలి !
సంజ్ఞ సరస్సు గట్టున నిలుచుని , అందంగా వికసిస్తున్న కన్నె తామరలను చూస్తూ ఉండి పోయింది. సరస్సులో నీరు నిర్మలంగా , నిశ్చలంగా ఉంది. తామర ప్రక్కనే తన ప్రతిబింబం నీటిలోంచి తన వైపు చూస్తోంది.
సంజ్ఞ అప్రయత్నంగా చిరునవ్వు నవ్వింది. నీటిలో ప్రతిబింబం చిరునవ్వు నవ్వింది.గాలికి కదిలి పోతూ , స్థాన భ్రంశం చెందుతున్న పైటను సర్దుకుంది సంజ్ఞ.
సరస్సులో ప్రతిబింబం పైట సర్దుకుంది. తనలాగే ఉన్న ‘నీటిలో నీడ’ తాను ఏంచేస్తే, అది చేస్తోంది ! ఉన్నట్టుండి సంజ్ఞ గుండె వేగంగా స్పందించడం ప్రారంభించింది.
తనలాగే , ముమ్మూర్తులా తనలాగే ఉన్న స్త్రీ తన ముందే ఉంది ! తనతోనే ఉంది ! అయితే దానికి – తన ప్రతిబింబానికి వ్యక్తిత్వం లేదు. తను ఉంటే అది ఉంటుంది ; తను కదిలితే కదుల్తుంది. అంతే !
అంతేనా ?! ఆ ప్రతిబింబానికి ప్రాణం పోస్తే ? ప్రత్యేకమైన ఉనికినీ , వ్యక్తిత్వాన్నీ దానికి ఆపాదింపచేస్తే ! తనలోని అన్ని లక్షణాలనూ , గుణ గణాలనూ , అందులోకి ఆవాహనం చేస్తే !
సంజ్ఞలో ఏదో ఉత్సాహం ఉప్పెనలా పొంగుతోంది. ఔను ! సమస్యకు సమాధానం దొరికింది ! తన శక్తితో తన నీడకు ప్రతిబింబానికి ప్రాణం పోస్తుంది ! దానికో – పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది !దానిలో జ్ఞానేంద్రియాలూ , కర్మేంద్రియాలూ తమ ‘వ్యాపారాలు’, క్రియలు నిర్వర్తించేలా చేస్తుంది !
తనకు ఆ శక్తి ఉంది. విశ్వకర్మ పుత్రికగా తనకు కొన్ని అపూర్వ శక్తులు జన్మసిద్ధంగా లభించాయి. అవసరం వస్తే , తాను కోరిన రూపాన్ని ధరించగలదు. తన ఛాయా రూపాన్ని నిజరూపంగా ఆవిష్కరించగలదు. నీడలోకి సర్వ ఇంద్రియాలనూ , మనస్సునూ , వాక్కునూ, ఆవాహనం చేయ గలదు. ఆ సర్వేంద్రియాలకూ ప్రాణప్రతిష్ఠ చేయగలదు !
సంజ్ఞ ఆవేశంగా సరస్సులోకి దిగి , స్నానం చేసింది. వెలికి వచ్చి , తాను తపసు చేసిన చోటికి బయలుదేరింది. సరోవరం వద్దకు వచ్చినప్పుడు తన వెనక వైపున ఉంటూ తనను అనుసరించిన నీడ , ఇప్పుడు ముందు నడుస్తూ , తనకు దారి చూపుతోంది !
సంజ్ఞ ఆగింది. ఆలోచిస్తూ , సరోవరంలోని నీటిని చేతిలోకి తీసుకుంది. వెను దిరిగింది. తనలాగా నిలుచున్న నీడను చూస్తూ ఏదో సంకల్పించింది. చేతిలోని నీటిని నీడ మీద చల్లింది..
మరుక్షణం ఆ నీడ తన రూపంతో , తనలాగా రక్తమాంసాలతో నిలుచుంది ! తనను తాను నిలువుటద్దంలో చూసుకుంటున్న అనుభూతి కలుగుతోంది సంజ్ఞకు !
🌿lప్రశ్నార్థకంగా తననే చూస్తున్న ఆ ప్రతిరూపాన్ని సంజ్ఞ చిరు నవ్వుతో చూసింది.నువ్వు నా ప్రతిరూపానివి ! సంజ్ఞ అంది. ఆమెను సరస్సు వద్దకు లాగుతూ. నీటిలో మన ప్రతిబింబాలను చూడు ! అంది.
ఓహ్ ! ఇద్దరం ఒక్కలాగే ఉన్నాం ! ప్రతిరూపం ఉత్సాహంగా అంది. సంజ్ఞ చిరునవ్వుతో తల ఊపింది.నా పేరు ? ప్రతిరూపం అడిగింది. తనకంఠస్వరాన్ని విన్న సంజ్ఞ అబ్బురపడకుండా ఉండలేకపోయింది.
నువ్వు నా ప్రతిబింబానివి ! నా నీడవు ! అంటే , నా ఛాయ అయిన కారణంగా నీకు ‘ఛాయ’ అని పేరు పెడుతున్నాను. నా పేరు సంజ్ఞ !నాకు ప్రాణప్రతిష్ఠ చేశావు ! ఎందుకు ? ఛాయ ప్రశ్నించింది.
నువ్వు నా ప్రతిరూపానివి. నా స్థానంలో , నా భర్త అయిన సూర్యుడి పత్నిగా , నా బిడ్డలైన వైవస్వతుడికీ యముడికీ యమికీ తల్లిగా నటించాలి ; ఆ నటనలో జీవించాలి. నేను ఈ అరణ్యంలో తపస్సులో మునిగిపోతాను.
ఛాయ నవ్వింది. నేను నీలాగా ఉన్నాను ! నీ భర్త వద్దా , సంతానం ముందూ నీలాగే ఉంటాను ! అలా ఎంతకాలం ఉండాలి. శాశ్వతంగా !”సంజ్ఞ అంది. శాశ్వతంగా నా భర్తతో సుఖిస్తూ , శారీరక , మానసిక ఆనందాలు పొందుతూ ఉండిపోవచ్చు నువ్వు. అయితే ఒక నిబంధన..
ఏమిటది ?ఛాయ అడిగింది.
నా భర్తను నీ భర్తగా స్వీకరించినట్టే , నా బిడ్డలను నీబిడ్డలుగా స్వీకరించి ప్రేమాభిమానాలతో పెంచాలి !
నువ్వు నా ప్రాణదాత్రి సంజ్ఞా ! ఈ శరీరం , ఈ మనస్సు – అన్నీ నీవే ! నీ మాట జవదాటను. నీ భర్తకు భార్యగా , నీ బిడ్డలకు తల్లిగా , నటించడం కాదు – జీవిస్తాను !ఛాయ నవ్వుతూ అంది.సంజ్ఞ ఛాయ వైపు ప్రేమగా చూసింది. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తోంది , ఛాయా ! నా పోలికలతో , నా కవలగా జన్మించిన నా చెల్లెలివేమో అనిపిస్తోంది !
నాకూ అలాగే అనిపిస్తోంది సంజ్ఞా ! నువ్వు నా అక్కవి ! నేను నీ చెల్లిని ! ఇద్దరం ఒకే పోలికతో పుట్టాం అని.నాకు నిజంగా అనుభూతి కలుగుతోంది. ఛాయ చిరునవ్వుతో అంది.సంజ్ఞ ప్రేమగా ఛాయ చేతిని పట్టుకుంది. రా , ఛాయా , వెళ్దాం ! నేను తపస్సు చేసే ప్రశాంత స్థలంలో కూర్చుని మాట్లాడుకుందా ! ఇద్దరూ అన్యోన్యంగా నడుస్తున్నారూ. సంజ్ఞ ఛాయా ఎదురెదురు గాకూర్చున్నారు.
….