June 29, 2024
SGSTV NEWS
Navagraha Purana

నవగ్రహ పురాణం – 48 వ అధ్యాయం
బుధగ్రహ జననం – 11



క్షణంలో బ్రహ్మ నారద సహితంగా చంద్రమందిరం వద్ద ప్రత్యక్షమయ్యాడు. అధర్మమనీ, హితవు పలికాడు.. ఉశనుడితోనూ, వృషపర్వుడితోనూ సంప్రదించాడు. చంద్రుడు చేసినది ధర్మవిరుద్ధమైన కార్యమనీ, అధర్మకార్యాన్ని సమర్ధించడం ఇంకా అల్పకారణంతో దాయాదులు మారణకాండకు సిద్ధపడడం మంచిదికాదన్నాడు.

ఇంద్రుడితోనూ, బృహస్పతితోనూ మాట్లాడాడు. ఆవేశపడవద్దని సూచించి, చంద్ర మందిరంలోనికి వెళ్ళాడు.

బ్రహ్మదేవుడిని చూడగానే తారా, చంద్రుడూ చేతులు జోడించి నమస్కరించారు.

*”మీరిద్దరూ ధర్మాన్ని విస్మరించి, కామానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒకరికి భర్తా, ఒకరికి గురువూ అయిన బృహస్పతికి మానసిక క్షోభ కలిగించారు. మీరు ఇద్దరూ చేసిన లైంగిక అపచారానికి సుఖమే అనుభవించారు. అనుభవానికి వచ్చిన సుఖంతో, అంది ఆనందంతో సంతృప్తి చెందండి!”* బ్రహ్మ ఆగి, ఇద్దర్నీ చూశాడు.

చంద్రుడు తదేకంగా బ్రహ్మనే చూస్తున్నాడు. ఎందుకో… విచిత్రంగా ఆయన చేస్తున్న హిత వాక్యాలు తనకు తానే చెప్పుకుంటున్నట్టు అనిపిస్తోంది చంద్రుడికి.

ఎందుకో తనకు తెలీదు గానీ, బ్రహ్మవాక్కులు సహేతుకంగా, సమంజసంగా అనిపిస్తున్నాయి తారకు.

బ్రహ్మ చూపులు తార మీద వాలాయి. గర్భంలో శిశువును దాచుకున్న తార బొద్దుగా ఉన్న తామర మొగ్గను గుర్తుకు తెస్తోందాయనకు

*”బృహస్పతితో నీ కళ్యాణం ఏకోన్ముఖం, ఆనందం ద్విముఖం’ అంటూ ఆనాడు నిన్ను ఆశీర్వదించాను. ఆ దీవెన అంతరార్థం నీకు ఇప్పటికి అవగాహన అయి ఉంటుంది. విధి నీకు ప్రసాదించిన భర్తను చేరుకో. చంద్ర బంధాన్ని ఒక మధుర స్వప్నంలా భావించి, విస్మరించు. నీ భర్తను సేవించు : తరించు !””

తార మౌనంగా బ్రహ్మ పాదాలకు నమస్కరించింది. బ్రహ్మ దీవిస్తూ అన్నాడు. “పతి సమాగ ప్రాప్తిరస్తు !”*

*”చంద్రా ! తార నీ గురుదేవుని ఆస్తి. క్షేమంగా, భద్రంగా నీ చేత్తో ఆయనకు అప్పగించు. అదే ప్రాయశ్చిత్తంగా నిన్ను ప్రక్షాళన చేస్తుంది.”* చంద్రుడు మౌనంగా నమస్కరించాడు. మెల్లగా తార వైపు తిరిగాడు. తార కళ్ళు తదేకంగా అతన్నే చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో నీళ్ళు తొణుకుతూ, ఘనీభవించడానికి సిద్ధమవుతున్నట్టున్నాయి

చంద్రుడు చిరునవ్వుతో తారను చూస్తూ, చేతిని చాచాడు. తార చెయ్యి కొమ్మ కోసం అన్వేషించే తీగలా సాగి, చంద్రుడి చేతిని సమీపించింది. చంద్రుడి చేతి వేళ్ళు ఆమె చేతిని పట్టుకున్నాయి. ఇద్దరి కళ్ళు ఏవో నిశ్శబ్ద సంకేతాలను నింపుకుంటున్నట్టు పరస్పరం చూస్తూ ఉండిపోయాయి. ఆ చూపుల్లో – వేయి ఆప్యాయతలు, లక్ష అనురాగాలు, కోటి అనునయాలు. చంద్రుడు కదిలాడు. తార అతనితో పాటు కదిలింది. పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న తారాచంద్రుల్ని చిరునవ్వుతో చూస్తూ అలాగే నిలబడిపోయాడు బ్రహ్మ.

తార బృహస్పతి వెనుకనే ఆశ్రమంలోపలికి నడిచింది. మహేంద్రుని రథంలోంచి దిగుతూంటే, పుంజికస్థలా, విద్యార్థులూ, తన వైపు ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళ చూపుల్ని తప్పించుకుంటూ, భర్త వెనకాలే అడుగులు వేసింది.

బృహస్పతి తిన్నగా దేవతార్చన చేసే చోటికి వెళ్ళాడు. చేతులు జోడించి, దైవానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మౌనంగా మెల్లగా వెనుదిరిగాడు. ఎదురుగా తార బొమ్మలా నిలబడి ఉంది.

*”తారా ! నీ ఇంటికి నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను…”” బృహస్పతి భావోద్వేగంతో అన్నాడు.

చంద్రుడు తనను అప్పగించిన అనంతరం తనతో మొదటిసారిగా మాట్లాడిన భర్తను దీనంగా చూసింది తార. పెనుగాలికి వణికే చిగురాకుల్లా ఆమె పెదవులు వణికాయి. కళ్ళల్లో కమ్ముతున్న అశ్రువులు చూపుల్ని మసకబారుస్తున్నాయి. తార తటాలున ముందుకు వంగి, బృహస్పతి పాదాలు తాకి నమస్కరించే ప్రయత్నం చేసింది. అయితే పూర్ణగర్భం ఆమెను అడ్డుకుంటోంది.

బృహస్పతి రెండు చేతుల్తో పట్టుకుని లేవనెత్తాడు. తార కళ్ళు ఆయన ముఖంలోకి చూశాయి. పోగొట్టుకున్న పెన్నిధిని తిరిగి పొందిన ఆనందం తాండవం చేస్తోంది ఆయన వదనంలో.

*”తప్పు చేశాను… మీకు ద్రోహం చేశాను… నన్ను… నన్ను… క్షమించండి…” తార గద్గద కంఠంతో అంది. గర్భం నునుపు చేసిన ఆమె బుగ్గల మీద కన్నీళ్ళు ఆమెలోని దుఃఖం లోతును కొలుస్తున్న కొలమానాల్లా గీతలు గీశాయి.

బృహస్పతి సున్నితంగా ఆమె బుగ్గల్ని తుడిచాడు. చిరునవ్వు నవ్వాడు. *”ద్రోహం చేసింది నువ్వు కాదు చంద్రుడు ! మనకు పీడకలలు వస్తాయి. జరిగిందంతా నీకు వచ్చిన పీడకల అనుకో తారా !”*

*”.స్వామి ..”*

*”ఈ బృహస్పతి వంశాన్ని – అంగిరస గోత్రాన్ని అభివృద్ధి చేయి !”” బృహస్పతి నిండుగా ఉన్న గర్భ చిహ్నాన్ని ప్రేమగా చూస్తూ అన్నాడు. “గర్భం ధరించి నువ్వు దూరం కావడం సహించలేక పోయాను.””

*తార కన్నీళ్ళతో చూసింది.*

తిథివార నక్షత్రాలు శుభప్రదంగా వున్న సమయంలో పూర్వాభాద్ర నక్షత్రంలో పురుష శిశువును ప్రసవించింది. బృహస్పతి ఆశ్రమంలో ఆనందం వెల్లి విరిసింది. గురుదేవులకు వంశోద్ధారకుడు జన్మించినందుకు ఇంద్రుడు సంబరపడిపోయాడు.

నారదుడి మూలంగా ఆనోటా ఈ నోటా పడిన తారకు శిశుజనన వార్త చంద్రునికి తెలిసిపోయింది. నామకరణ మహోత్సవానికి ఇంద్రాదులతో బాటు బ్రహ్మా, నారదుడూ విచ్చేశారు. అంగిరసుడూ, శ్రద్ధా పౌత్రుడిని చూసి, దీవించడానికి వచ్చారు.

*”నాయనా, బృహస్పతి… బాలునికి నామ నిర్ణయం చేశావా ?”” అంగీరస మహర్షి కుమారుణ్ణి ప్రశ్నించాడు.

ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్తున్నట్టు, ద్వారం ముందు నుంచి చంద్రుడి కంఠం బిగ్గరగా వినిపించింది. *”నా పుత్రుడికి నామ నిర్ణయం చేసే అధికారం బృహస్పతులు వారికి ఎక్కడిది ? ఆ బాలుడు, నా కుమారుడు !”*

బాలకుణ్ణి వొడిలో పడుకోబెట్టుకుని కూర్చున్న తారా, పక్కన కూర్చుని ‘జాతకర్మ’ నిర్వహిస్తున్న బృహస్పతీ అదిరిపడి చూశారు.

‘”ఆవేశంగా లోపలకి వస్తున్న చంద్రుణ్ణి చూస్తూ, లేచి నిలబడ్డాడు. ఆయన కళ్ళు నిప్పుకణికల్లా అయ్యాయి. “గురుద్రోహీ ! అవతలకి నడు ! అర్ధాంగిని అపహరించుకు వెళ్ళావు. ఇప్పుడు నా వంశాంకురాన్ని దోచుకోవాలని వచ్చావు. తగిన శిక్ష అనుభవిస్తావు నువ్వు !”*

చంద్రుడు ఎగతాళిగా నవ్వాడు. *”ఆచార్యా ! ఆ బాలుణ్ణి మీ వంశాంకురంగా భావిస్తే, ఈ చంద్రుడి వంశాన్ని మీ వంశంగా చెప్పుకున్న దౌర్భాగ్యాన్ని మూటకట్టుకుంటారు. బాలుడు ఈ చంద్రుడికి జన్మించిన వాడు !””

*”ముమ్మాటికీ కాదు ! ఆ శిశువులో ప్రవహిస్తోంది ఈ బృహస్పతి రక్తం !””

*”మీ ఇష్టం ! ఆ అపోహలోనే ఉంటే నేనెందుకు కాదంటాను ? నా కుమారుణ్ణి నేను తీసుకెళ్తాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు !”” అంటూ చంద్రుడు ముందుకు రాబోయాడు.

*”ఆగు చంద్రా ! అక్కడే ఆగు !”* బృహస్పతి హుంకరించాడు.

ఇంద్రుడు ఆవేశంతో కూర్చున్న చోటి నుండి లేచాడు. *”గురుదేవా ! మీరు శాంతించండి. ఆ గురుద్రోహికి ఈ మహేంద్రుడు గుణపాఠం చెప్తాడు !””

“ఇంద్రా, చంద్రా ! ఆశ్రమాన్ని యుద్ధరంగం చేయకండి

!”* బ్రహ్మదేవుడు ఇద్దర్నీ వారిస్తూ అన్నాడు.

*”బృహస్పతీ ! నువ్వు కూడా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి !”*

*”పితామహా ! ఇది నా వంశానికి సంబంధించిన అంశం. చంద్రుడు…”*

*”చంద్రుడు కానీ, నువ్వు కానీ – ఆ శిశువు ఎవరి శిశువో చెప్పలేరు. గర్భం ధరించిన స్త్రీ మాత్రమే తాను ఏ పురుషుడి వల్ల గర్భాన్ని ధరించిందో చెప్పగలదు… అంటూ బ్రహ్మ సాభిప్రాయంగా అందర్నీ కలియజూశాడు.

సకల నవగ్రహ దేవతాయై నమః


Related posts

Share via