July 1, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 33 వ అధ్యాయం – గురుగ్రహ జననం – 3



గురుగ్రహ జననం – 3*

తారా బృహస్పతుల దాంపత్య జీవితం ప్రారంభమైంది.

నిర్వికల్పానంద నవగ్రహ పురాణం కథనం కొనసాగిస్తూ ఇలా అన్నాడు. “”గురు గ్రహం అనబడే బృహస్పతి జన్మ వృత్తాంతం ఆలకించారు. ఆ బృహస్పతికి సమకాలికుడూ, సముడూ అయిన శుక్రుడి జన్మ గాథ వినండి.*

*”నవ గ్రహాలలో ఆరవ గ్రహమైన శుక్రుడు బ్రహ్మ మానస పుత్రులలో ప్రముఖుడైన భృగుమహర్షి కుమారుడు. ‘శుక్రుడు’ అన్నది ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఒక మహత్తరమైన కారణంతో ఆయనకు ‘శుక్రుడు’ అనే సార్ధక నామధేయం ఏర్పడింది….” అంటూ ఆగాడు నిర్వికల్పానంద.  ‘”ఈ రహస్యం మాకు తెలీదు ! శుక్రుడు – ‘శుక్రుడే’ అనుకుంటున్నాం ! ఆ పేరు రావడానికి కారణం ఏమిటి గురువు గారు ?” సదానందుడు అడిగాడు. నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. “అంత తొందర ఎందుకు, సదానందా ! శుక్రుడి చరిత్రను సంపూర్ణంగా ఆకర్ణిస్తారు గదా ! ఆ క్రమంలో ఆ ‘రహస్యగాథ’ తెలుస్తుందిలే ! శుక్రుడి తండ్రి భృగుమహర్షి అని చెప్పాను కదా ! ఆయన భార్య పులోమ. ఆమెను పౌలామి అని కూడా అంటారు. పులోమ అసుర వంశానికి చెందింది. భృగు మహర్షిని వివాహం చేసుకున్నాక, ఆమె గర్భవతి అయింది. మొదటి నుంచీ ఆమె మీద మనసు పడిన రాక్షసుడు (పులోముడు) భృగువు లేని సమయంలో సూకర రూపం ధరించి, పులోమిని అపహరించుకుపోయాడు. ఆ రాక్షసుడు పరిగెడుతున్న సమయంలో నిండు చూలాలైన పులోమకు ప్రసవం జరిగిపోయింది. పురుష శిశివు ఆమె గర్భం లోంచి నేల మీదకు పడిపోయాడు. ఆ శిశువే చ్యవనుడు…” కథ చెప్తున్న నిర్వికల్పానంద ఆగాడు.
*”చ్యవనుడంటే… సుకన్య భర్త. చ్యవన మహర్షేనా గురువు గారూ ?”* చిదానందుడు అడిగాడు.

‘“ఔను… ఆ చ్యవనమహర్షి గాథ అటుంచి ఆ భృగుపత్ని పులోమను గురించి వినండి. ఆమె మహామహిమ కలిగిన వనిత. ఆమోఘమైన తపశ్శక్తి ఆమెది. భృగుపత్నిగా ఆమె అలవరచుకున్న పతిభక్తి ఆమె శక్తిని ఇతోధికంగా పెంచింది. భూపతనమై జన్మించిన చ్యవనుడు తపస్సులో నిమగ్నుడైపోయాడు. తదనంతరం పులోమా, భృగు దంపతులకు ‘వజ్రశీర్షుడు’, ‘శుచి’, ‘ఔర్వుడు’ అనే కుమారులు కలిగారు. అయితే ఆ పుత్రుల సాధారణ మేధోశక్తీ, సాత్వికతా పులోమను సంతోష పెట్టలేక పోయాయి. మహాశక్తి సంపన్నుడూ, కత్తివాదర లాంటి బుద్ధికుశలత కలిగిన వాడూ, కార్యదక్షతా , పట్టుదలా కలిగిన వాడూ, ముఖ్యంగా తాను ఏ కులంలో ఉద్భవించిందో, ఆ అసురకులం పట్ల చెరగని పక్షపాత ధోరణి కలిగినవాడూ అయిన అసాధారణ పుత్రుడు కావాలన్నది పులోమ చిరకాల వాంఛ…”” అంటూ వివరించ సాగేడు నిర్వికల్పానంద. 

శ్రీ గురు దత్తా

సేకరణ…. ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via