July 3, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 19 వ అధ్యాయం – చంద్రగ్రహ జననం – 1

*చంద్రగ్రహ జననం – 1*

అత్రి మహర్షి సమిధలూ, దర్బా సేకరించాక అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చాడు. పాద ప్రక్షాళనం చేసుకొని లోపలికి వచ్చిన భర్తకు తాగటానికి నీళ్ళు అందించింది అనసూయ. ఆమె మొహంలోని నిరాశనూ, నిస్పృహను ఇట్టే కనిపెట్టేశాడు. అత్రి..

*”నీ మొహంలో ఆనందం లేదు ?”* అత్రి నవ్వుతూ అన్నాడు. జల పాత్ర ఆమెకు అందిస్తూ.

*”నా మొహం మీద నవ్వు నాట్యం చేయాలంటే, ఏం జరగాలో తమకు తెలుసుగా స్వామీ !”* అనసూయ కంఠస్వరంలో ఆవేదనా, వినయం రెండూ పెనవేసుకున్నాయి.

అత్రి మహర్షి అర్థం చేసుకున్నాడు. బరువుగా నిట్టూర్చాడు. మౌనంగా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు అనసూయను ఎగాదిగా చూశాడు. తన భార్య అనసూయ అందాల రాశి ! చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం ! అర్థ చంద్రుడి ఆకారంలో నుదురు ! ఆ నుదురు మీద మళ్ళీ పున్నమి చంద్రుడిలాగా గుండ్రటి తిలకం ! తిలకానికి ఇరువైపులా వంకీలు తిరిగిన చక్కటి కనుబొమ్మలు ! ఆ కనుబొమ్మల గట్ల కింద జంట సరోవరాల్లా మిలమిలలాడే పెద్ద కళ్ళు ! చిగురుటాకుల్లాంటి పెదవులు. ఆమె సౌందర్య సర్వస్వాన్ని కళ్ళకు కట్టుతున్న చీరకట్టు… ‘ఇంకా పిల్లలు పుట్టలేదు’ అని చాటుతున్నట్లు, ‘సంతాన లేమి’ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తున్న సన్నటి నడుము…

*”ఏమిటి స్వామి అలా చూస్తున్నారు ?”” భర్త చూపుల్ని గమనించిన అనసూయ అడిగింది.

అత్రి క్షణకాలం అయోమయంలో పడిపోయాడు. ‘”నిన్నే ! నువ్వు పతివ్రతవు. నేను సతీవ్రతుణ్ణి ! పరస్త్రీని కన్నెత్తి చూడను. నా అర్ధాంగినే చూస్తాను. అనసూయా ! రోజురోజుకీ నీ సౌందర్యం తరగడం లేదు. పెరుగుతోంది !”.*

అనసూయ కళ్ళల్లో ఆనందం మెరుపు తీగలా తళుక్కుమని, అంతలోనే అంతర్థానమైంది. ఆ స్థానాన్ని మళ్ళీ ఆవేదన ఆక్రమించింది.

*”సౌందర్యానికి సాఫల్యతా, సార్ధకతా ఉండాలి స్వామీ !”” అంటూ అనసూయ లోనికి వెళ్ళబోతూ తిరిగింది. పొడుగాటి వాలు జడ ఆమె నడుమును, తీగను చుట్టుకున్న పాములా చుట్టుకుంది. అత్రి కళ్ళు చెదిరాయి.

*”అనసూయా ! ఇలారా !”* పిలిచాడాయన.

భర్త పిలుపు పగ్గంలా పనిచేస్తూ అనసూయను అత్రి వైపుకు లాగింది. దగ్గరగా వచ్చి నిల్చుని, తన మొహంలోకే చూస్తున్న అనసూయ చెయ్యి పట్టుకొని, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అనసూయ భర్త కళ్ళల్లోకి దీనంగా చూసింది. “స్వామీ.. సంతానం ఆశించడానికి ఇంక నోములూ, వ్రతాలూ ఏవీ మిగల్లేదు.””

అత్రి చిరునవ్వు నవ్వాడు. *”అన్ని సేవలూ చేసేశావు కదా ! ఇక… నీ పతి దేవుడి సేవలో మునిగిపో !!”*

*”స్వామి …”*

*”అనసూయా ! నన్ను తన మానస పుత్రుడుగా సృష్టించినపుడు – ఆ సృష్టి కర్త ఏమన్నాడో తెలుసా ? తన మానస పుత్రులైన మా మూలంగా లోకంలో ప్రజా సృష్టి ఇబ్బడిముబ్బడిగా జరుగుతుందన్నాడు. అలా జరగాలన్నది ఆయన ఆకాంక్ష ! ఆయన ఆదేశం ! బ్రహ్మదేవుల వాక్కు వృధా పోదు కదా ! ఆ బ్రహ్మ సంకల్పించాలి. ఈ బ్రహ్మ మానసపుత్రుడికి అర్ధాంగి అనసూయ ద్వారా చక్కటి సంతానం కలగాలి ! అంత వరకూ మన ఆతృత ఆగాలి.”*

*”అంతేనంటారా, స్వామీ !”* అనసూయ మాటల్లో అనుమానం తొంగి చూసింది.

*”అనసూయా ! నువ్వు మహాపతివ్రతవు ! నీ ఆశ నెరవేరకుండా ఉండదు !”*

*”పతివ్రతలు నిరంతరమైన ఆవేదనలో మునిగిపోయి ఉండాలేమో అని భయమేస్తోంది స్వామీ…””

*”అనసూయా !”*

*”అవును స్వామీ… ఆ మహాపతివ్రత శీలవతిని చూస్తుంటే !”” అనసూయ అంది. అత్రి ప్రశ్నార్థకంగా చూశాడు. *”శీలవతి అంటే… ఆ ఉగ్రశ్రవుడి భార్యే కదా !”*

*”ఔను… ఇందాక భిక్ష కోసం వచ్చింది పాపం !”* అనసూయ జాలిగా అంది. ”కుష్ఠురోగి అయిన భర్తను బుట్టలో పెట్టి, ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకొని మోస్తూ కాళ్ళు అరిగేలా తిరుగుతూ భిక్షాటనం చేస్తూ భర్తను పోషిస్తూ సేవించుకుంటోంది.

*”విన్నాను. ఆ ఉగ్రశ్రవుడు ఉగ్రస్వరూపుడనీ, కుష్ఠువ్యాధితో శరీరమూ, అకారణ ఆగ్రహంతో మనసూ పూర్తిగా పాడైపోయిందనీ ఆశ్రమ వాటికలో అందరూ అనుకుంటూ ఉంటారు !”*

*”అంతే కాదు స్వామీ ! శీలవతి భర్త వృద్ధుడు కూడా ! శీలవతిది నూత్న యవ్వనం ! భర్తది పండబారిన వృద్ధాప్యం ! ముసలితనానికి తోడుగా ముదిరిపోయిన వ్యాధి ! అతని శరీరం నుంచి దుర్గంధం చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. అయినా, ఆ శీలవతి నిజంగానే సార్ధక నామధేయురాలు ! రోగగ్రస్థుడై, దుర్వాసన వేస్తూ, కృశించిపోతున్న భర్తనే దైవంగా భావించి సేవిస్తున్న ఆదర్శపత్ని ఆమె !”* అనసూయ ఉద్వేగంతో అంది.

*”ఔను ! శీలవతి గుణవతి, సౌందర్యవతి అని అందరూ అంటూ ఉంటారు. ఆ ఉగ్రశ్రవుడే పరమదుర్మార్గుడు. అనారోగ్యమూ, అసహాయతా అతనిలో ఆగ్రహాన్ని పుట్టించాయి. వృద్ధాప్యము, అసూయనూ, ఆ ఇల్లాలి పట్ల అనుమానాన్ని పుట్టించింది ! అందుకే దుర్మార్గుడు ఆ సాధ్విని ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనివ్వడు ! భిక్షాటనకు వెళ్ళినప్పుడు కూడా ఆమె శిరస్సు మీద తిష్ఠ వేస్తున్నాడు !”* అత్రి వివరించాడు.

*”చూశారా ! అష్టకష్టాలూ, అసంతృప్తులూ కేవలం పతివ్రతలకే !”* అనసూయ చిన్నగా నవ్వింది.

*”ఔను ! బంగారం అందమైన ఆభరణంగా మారే ముందు దానికీ నిప్పుల్లో కాలడం, సుత్తి దెబ్బ తినడం అనే కష్టాలుంటాయి !”* అత్రి నవ్వుతూ అన్నాడు.

*”అయితే, శీలవతి అందమైన ఆభరణంగా మారుతుందంటారా?”* అనసూయ ప్రశ్నించింది.

*”శీలవతే కాదు. నువ్వు కూడా!”” అత్రి నవ్వుతూ అన్నాడు.

శ్రీ గురు దత్తా

సేకరణ. ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via