July 2, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 14 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 5

*సూర్యగ్రహ జననం – 5*

ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ, సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ, ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ, కశ్యపుని తల్లి కళా, తండ్రి మరిచీ, ప్రసూతి దక్ష ప్రజాపతులూ, నారద మహర్షీ, ఇతర బ్రహ్మ మానస పుత్రులైన అత్రీ, అంగిరసుడూ, కర్దముడూ, పులహుడూ, పులస్త్యుడూ, భృగువూ, వసిష్ఠుడూ, క్రతువూ, వాళ్ళ పత్నులూ…. కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు.

కశ్యపుడు శ్రీమహావిష్ణువుకు నమస్కరిస్తూ యిలా అన్నాడు. “పరమ పురుషా ! మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే ! సార్థక నామధేయం అనుగ్రహించి, ఆశీర్వదించండి !”*

*”కశ్యపా ! ఈ పుత్రుణ్ని నీకు ప్రసాదించింది. కేవలం మీ దంపతుల కోసమే కాదు. సమస్త విశ్వం కోసమూ ! నవగ్రహ దేవతలలో ఆద్యుడూ, అధికుడూ అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు ! జ్యోతిర్మండలంలో, నక్షత్రాల కలయికతో రూపొందిన ద్వాదశ రాశులలో నెలకొకరాశిలో నెలకొంటూ సంచరిస్తూ వుంటాడు…””

*”ద్వాదశ రాశులా !”* కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు..

*”ఔను కశ్యపా !”” బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. “”మా జనకులు శ్రీమహావిష్ణు దేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఆకారాలలో స్థిరపడి వున్నాయి !””

“”ద్వాదశ రాశులలో ద్వాదశ మాసాలలో ద్వాదశ నామ ధేయాలతో అదితి కశ్యపుల అనుంగు సుతుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు…”” అంటూ శ్రీమహావిష్ణువు బ్రహ్మనూ, శివుణ్నీ సాభిప్రాయంగా చూశాడు. *”పరమేష్ఠీ పరమేశ్వరులూ, నేనూ చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తాం !”*

*”చాలా సంతోషం. ప్రారంభించండి !”* పరమ శివుడు అన్నాడు..

అదితి లేచి, శ్రీమహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ని చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ని చూస్తున్న లక్ష్మి దేవి ముఖం కమలంలా వికసిస్తోంది !

*”లక్ష్మీ ! బాలసూర్యుణ్ని ఆ వేదిక మీద పడుకో బెట్టు !”* అన్నాడు విష్ణువు.

లక్ష్మి బాలుణ్ని నుదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకో బెట్టింది. శ్రీమహావిష్ణువు బాలుణ్నే చూస్తూ నామ నిర్దేశం ప్రారంభించాడు. “”ధాత ! ఆర్యముడు…**

అందర్నీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడి పక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.

*”మిత్రుడు !”* ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు.

*”శక్రుడు !”” విష్ణువు నాలుగవ నామధేయాన్ని ప్రకటించాడు. నాలుగవ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు.

విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూశాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్ధం చేసుకుంటూ, బాలసూర్యుడికి తన వంతుగా నాలుగు నామధేయాలు ప్రకటించాడు.

“వరుణుడు ! అంశుమంతుడు ! భగుడు ! వివస్వంతుడు !”* బాలసూర్య రూపాలు మరో నాలుగు ప్రత్యక్షమయ్యాయి.

పరమశివుడు బాలసూర్యుడికి మరొక నాలుగు పేర్లు ప్రసాదించాడు. *”పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !”” బాలసూర్యుని రూపాలు ఇప్పుడు పండ్రెండు కనిపిస్తున్నాయి.

పండ్రెండు రూపాలూ ఒకదాని పక్కన ఒకటి – వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళూ, చేతులూ ! చిరునవ్వుల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు ! తామరరేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు ! ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టినీ లాగి పట్టింది.

నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వల్లె వేశాడు. “ధాత! ఆర్యముడు ! మిత్రుడు ! శక్రుడు ! వరుణుడు ! అంశుమంతుడు! భగుడు ! వివస్వంతుడు ! పూషుడు ! సవిత్రుడు ! త్వష్ట ! విష్ణువు !”*

త్రిమూర్తులూ, దేవతలూ, మానస పుత్రులూ, వాళ్ళ పత్నులూ, నారదుడూ, కశ్యపుడు, ఆయన పత్నులూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు.

*”త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు ! వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం !”* మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు.

“సకల ప్రాణుల్నీ సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి ! ఉన్నతమైన ఆ కోరికతో – ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్నీ, అర్హతనూ సంపాందించుకుంది ! ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహసార్వభౌముడిగా అందరి అర్చనలూ అందుకుంటాడు!”* విష్ణువు అన్నాడు.

*”తథాస్తు!”* అన్నారు శివుడూ, బ్రహ్మా.

అదితి ఆనందబాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తోంది. పన్నెండు ముద్దుల మూటలను చూస్తుంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. పన్నెండుగుర్నీ ఒకేసారి ఎత్తుకుని, వక్షానికి హత్తుకుని, బొజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్నీ ఆవరించి కుదిపి వేస్తోంది.


శ్రీ గురు దత్తా

సేకరణ.. ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via