November 21, 2024
SGSTV NEWS
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 13 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 4



శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని, సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీమహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూశాయి.

*”ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి, దానితో రెండవ జ్యోతిని వెలిగించినప్పటికీ, మొదటి జ్యోతిలోని కాంతి తరిగిపోలేదు. అంటే అక్కడ కాంతి ‘వ్యయం’ కాలేదు. కాదు కూడా ! అది అవ్యయం ! మూలరూపాలు కూడా అంతే ! అవ్యయాలే ! వేరొక అవతారాన్ని ధరించాక మూల రూపంలో కొరత ఏర్పడదు. దాని శక్తి తగ్గదు: చేవ తరగదు !”*

*”స్వామీ !”* లక్ష్మి భావావేశంతో అంది.

విష్ణువు చిన్నగా నవ్వాడు. “”నువ్వే చూస్తావుగా దేవీ ! భవిష్యత్తులో నువ్వూ, మేమూ ఎన్నో అవతారాలు ధరిస్తాం ! కానీ మన ఈ ‘మూలరూపాలు’ ఇలాగే వుంటాయి !”*

మెరుస్తున్న శ్రీలక్ష్మి కళ్ళకి తోడుగా ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో మెరిశాయి. *”కాబట్టి, ఇక్కడ సూక్ష్మరూపంలో మీ నయన కమలాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు – అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ వున్నాడు. స్వామీ, అంతేకదా ?”*

“అంతే కదా ? లక్ష్మి ప్రశ్నకు విష్ణువు ప్రశ్న సమాధానం చెప్పింది. *”స్వామీ! మీ నయన సూర్యుడు ఎక్కడ, ఎవరికి జన్మించాడు ? ఎందుకు జన్మించాడు ?”” లక్ష్మి కుతూహలంగా అడిగింది.

*”కశ్యప ప్రజాపతి సతి అదితికి ప్రియ పుత్రుడుగా జన్మించాడు ! నరుల ఆరాధనా సౌలభ్యం కోసం అంతరిక్షంలో సూక్ష్మ రూపాలలో ఉన్న ‘నవగ్రహాలు’ స్థూలదేహాలు ధరించి అవతరించాలనీ, గ్రహదేవతలను ప్రసన్నం చేసుకుని ప్రాణులు తరించాలనీ మేం సంకల్పించాం. సూర్యుడి జననంతో మా సంకల్పానికి అంకురార్పణ జరిగింది !”* శ్రీమహావిష్ణువు కంఠంలో తృప్తి ధ్వనించింది.

*”దివ్య సంకల్పం స్వామీ, మీది !”” లక్ష్మి ఉత్సాహంగా అంది. “అయితే మిగిలిన గ్రహదేవతలు ఎప్పుడు ఎవరెవరికి జన్మిస్తారు ?”*

*”ఎప్పటి మాటో ఇప్పుడెందుకు దేవీ ?”* విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. శ్రీలక్ష్మి ఏదో అనబోయింది. అయితే, ‘నారాయణ !’ అనే నారదుడి కంఠధ్వని ఆమెకు అడ్డు తగిలింది. నారాయణ నామ ధ్వనిని వెంబడిస్తూ నారదుడు ప్రవేశించాడు.

*”నమో నమః ! నమో నమః !”* నారదుడు ఆదిదంపతులకు చేతులెత్తి నమస్కరించాడు. *”నారదా ! కుశలమా ?”” శ్రీమహావిష్ణువు పలకరింపుగా అన్నాడు.

*”సర్వకాల సర్వావస్థల్లో నా నాలుక మీద నాట్యం చేసే నీ దివ్య నామం నాకు రక్షగా వుందిగా నారాయణా ! నీది నిర్హేతుక కృప కదా ! కారణం లేకుండా కరుణించే అమృత తత్వం కదా నీది ! నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి, నీ నామస్మరణ యాగం ప్రారంభించిన వెంటనే మహత్తర సంగీత సాధనమైన ఈ ‘మహతి’ని బహూకరించావు. ఇంక ఈ నారదుని క్షేమానికి కొరత ఎక్కడ !”* నారదుడు నవ్వుతూ అన్నాడు. “ఊ ! నీ ‘కుశలము’ నకూ కొరత లేదు. ‘కౌశలము’ నకూ కొరత లేదు’ శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.*

*”నారాయణ !”*

*”రాక రాక వచ్చావు ! రాకలో ఏదైనా రహస్యముందా ?”* లక్ష్మి చిరునవ్వుతో అడిగింది.

*”చిత్తం ! ఒక శుభవార్త విన్నవించే కోరికతో వచ్చాను మాతా ?”” నారదుడు. ఉత్సాహంగా “”అయితే ఆ వార్త మాకు అందలేదనుకుంటున్నావా. నారదా ?”* శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు.

*”మీకు తెలియని దేముంటుంది ? పాపం… చెప్పనివ్వండి స్వామీ !”” లక్ష్మి మందలింపుగా అంది.

*”సరే ! మంచిమాట మాటిమాటికీ వినడం మంచిదే ! వినిపించు, నారదా !”” విష్ణువు చిరునవ్వు నవ్వాడు.

*”ధన్యోస్మి ! సాధ్వీమణి అదితికి పుత్రుడు జన్మించాడు… కశ్యప ప్రజాపతి జాతకర్మ, నామకరణ మహోత్సవాలకు సంకల్పించాడు…””

*”శుభం ! చతుర్ముఖుజ్జీ, త్రినేత్రుణ్ణి, ఇంద్రాదులనూ ఆహ్వానించు, నారదా ! సూర్య జననం అందరికీ హర్షం కలిగించేదే !”” విష్ణువు అన్నాడు. “”నారాయణ ! అలాగే !”* నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు.

శ్రీ గురు దత్తా

సేకరణ… ఆధురి భాను ప్రకాష్

Related posts

Share via